‘శత’క్కొట్టిన కరణ్ షిండే
ఆంధ్ర తొలి ఇన్నింగ్స్ 448/9
హైదరాబాద్‌తో రంజీ మ్యాచ్
సాక్షి, హైదరాబాద్: కెప్టెన్ షేక్ రషీద్ (372 బంతుల్లో 203; 28 ఫోర్లు) డబుల్ సెంచరీ , తో చెలరేగడంతో హైదరాబాద్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 147 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఎలైట్ గ్రూప్ ‘బి’లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న పోరులో ఓవర్‌నైట్ స్కోరు 168/2తో శుక్రవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు ఆట ముగిసే సమయానికి 143 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది.
కరణ్ షిండే (221 బంతుల్లో 109; 12 ఫోర్లు) సెంచరీతో ఆకట్టుకోగా... షేక్ రషీద్ ద్విశతకంతో విజృంభించాడు. తాజా రంజీ సీజన్‌లో వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న రషీద్ ఈసారి పూర్తి సాధికారికతతో బ్యాటింగ్ చేయగా... హైదరాబాద్ బౌలర్లు అతడిని కట్టడి చేయలేకపోయారు. ఆరంభంలో ఆచితూచి ఆడిన రషీద్... పరిస్థితులను ఆకలింపు చేసుకున్న అనంతరం ఎడాపెడా బౌండరీలతో స్కోరు బోర్డును ముందుకు నడిపించాడు.
ఈ క్రమంలో మూడో వికెట్‌కు కరణ్ షిండేతో కలిసి రషీద్ 236 పరుగులు జోడించి జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించి పెట్టాడు. హనుమ విహారి (0) డకౌట్ కాగా... వికెట్ కీపర్ కోన శ్రీకర్ భరత్ (33; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి 4 వికెట్లు... చామా మిలింద్, రక్షణ్ రెడ్డి చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం యరా సందీప్ (73 బంతుల్లో 33 బ్యాటింగ్; 4 ఫోర్లు, 1 సిక్స్), లలిత్ మోహన్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment