పుదుచ్చేరి: రంజీ ట్రోఫీ దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్‌లో ఆంధ్ర జట్టు వరుసగా మూడో ‘డ్రా’ నమోదు చేసింది. పుదుచ్చేరి జట్టుతో ఆదివారం ముగిసిన ఎలైట్ గ్రూప్ ‘బి’ ఆరో రౌండ్ లీగ్ మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది.
తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించినందుకు ఆంధ్ర జట్టుకు మూడు పాయింట్లు లభించాయి. ఓవర్‌నైట్ స్కోరు 248/5తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఆంధ్ర జట్టు 82.4 ఓవర్లలో 6 వికెట్లకు 319 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
ఓవర్‌నైట్ స్కోరు 86 పరుగులతో బ్యాటింగ్ కొనసాగించిన కరణ్ షిండే (171 బంతుల్లో 119 నాటౌట్; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శశికాంత్ (39; 4 ఫోర్లు) తన ఓవర్‌నైట్ స్కోరు వద్దే అవుటయ్యాడు.
ఆ తర్వాత త్రిపురాణ విజయ్ (15; 2 ఫోర్లు), పృథ్వీరాజ్ (14 బంతుల్లో 12 నాటౌట్; 1 ఫోర్, 1 సిక్స్) సహకారంతో కరణ్ శతకం సాధించాడు. ఆంధ్ర నిర్దేశించిన 363 పరుగుల విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పుదుచ్చేరి 46 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 152 పరుగులు చేసింది.
ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో రెండు జట్లు ఆటను ముగించాయి. ఇక పుదుచ్చేరి ఓపెనర్లు గంగా శ్రీధర్ రాజు (148 బంతుల్లో 75 నాటౌట్; 9 ఫోర్లు), జై పాండే (131 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు) అజేయ అర్ధసెంచరీలు చేశారు.
ఎనిమిది జట్లున్న గ్రూప్ ‘బి’లో ఆంధ్ర జట్టు 6 మ్యాచ్‌లు పూర్తి చేసుకుంది. 3 మ్యాచ్‌ల్లో ఓడిపోయి, 3 మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకుంది. 7 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. ఈనెల 30 నుంచి విజయనగరంలో జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో రాజస్తాన్‌తో ఆంధ్ర తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment