సాక్షి, హైదరాబాద్: వరుసగా మూడోసారీ గెలిచి అధికారం చేపట్టేందుకు టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటినుంచే టీఆర్‌ఎస్‌ను సన్న ద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో పార్టీలో సంస్థాగత లోపాలను చక్కదిద్దడంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఒకసారి మాత్రమే గెలిచిన, ఒక్కసారి కూడా గెలవని నియో జకవర్గాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. వీటితోపాటు ఎస్సీ, ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గాలు, బీజేపీ లోక్‌సభ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పార్టీ పరిస్థితిని మదింపు చేస్తున్నారు.
గెలవని 17 చోట్ల..: రాష్ట్ర అవతరణ తర్వాత 2014, 2018లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సొంత బలంతో అధికారంలోకి వచ్చింది. మొత్తం 119 అసెంబ్లీ సెగ్మెంట్లకు నియోజకవర్గాలకు గాను ఇప్పటివరకు 17 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కసారి కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలవలేదు. ఇందులో హైదరాబాద్ నగరంలో ఎంఐఎంకు పట్టున్న ఏడు నియోజకవర్గాలతోపాటు ప్రస్తుతం బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న గోషామహల్ ఉంది. వీటితోపాటు హైదరాబాద్‌లోని ఎల్‌బీ నగర్, మహేశ్వరం, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక, ఇల్లందు, అశ్వారావుపేట, వైరా, సత్తుపల్లి, భద్రాచలం, మధిర నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేల్లో భద్రాచలం ఎమ్మెల్యే పోదెం వీరయ్య మినహా మిగతా అందరూ టీఆర్‌ఎస్‌లో చేరారు.
36 నియోజకవర్గాల్లో చేరికలతో..
టీఆర్‌ఎస్ 2014లో 63 చోట్ల, 2018లో 88 చోట్ల గెలిచింది. ఈ రెండుసార్లు కూడా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో పాక్షిక ఫలితాలనే రాబట్టగలిగింది. ఈ క్రమంలోనే రాజకీయ పునరేకీరణ పేరిట 2014 నుంచి ఇప్పటివరకు 36 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. మరోవైపు ఈ రెండు ఎన్నికల్లో కలుపుకొని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు 52 నియోజకవర్గాల్లో ఒక పర్యాయం, 51 సెగ్మెంట్లలో వరుసగా రెండు పర్యాయాలు విజయం సాధించారు. ప్రస్తుతం మొత్తం 119 అసెంబ్లీ స్థానాలకుగాను టీఆర్‌ఎస్‌కు 104 మంది సభ్యుల బలముంది. 65 లక్షల మంది పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఇలా శాసనసభలో, బయటా టీఆర్‌ఎస్ అత్యంత బలంగా ఉన్నా.. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సంస్థాగత లోపాలు తలెత్తినట్టు పార్టీ పెద్దలు గుర్తించారు. రాజకీయ పునరేకీకరణ పేరిట ఇతర పార్టీల నేతల చేరికతో పలుచోట్ల తాజా, మాజీ ఎమ్మెల్యేలు, నేతల నడుమ ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఇది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేసీఆర్ ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ సీట్లపై..
రాష్ట్రంలో 31 ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో 19 స్థానాలు ఎస్సీ, 12 స్థానాలు ఎస్టీలకు రిజర్వు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మల్లు భట్టి విక్రమార్క (ఎస్సీ –మధిర), ఎస్టీ ఎమ్మెల్యేలు సీతక్క (ములుగు), పోదెం వీరయ్య (భద్రాచలం) మినహా రిజర్వుడ్ కేటగిరీలో ఎన్నికైన ఎమ్మెల్యేలంతా ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు. అయితే ఈ రిజర్వుడ్ నియోజకవర్గాలపై బీజేపీ ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించిందనే అంచనాల నేపథ్యంలో.. ఆయా సెగ్మెంట్లపై పట్టుజారకుండా ప్రత్యేక వ్యూహం అమలుకు టీఆర్‌ఎస్ కసరత్తు చేస్తోంది. దళితబంధు, గిరిజనులకు పది శాతం రిజర్వేషన్లు, ఆత్మగౌరవ భవనాల నిర్మాణం వంటి అంశాలపై సంబంధిత వర్గాల్లో విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించింది.
ఆ ఎంపీ సీట్ల పరిధిలోనూ నజర్..
రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు ఉండగా నాలుగు చోట్ల బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ లోక్‌సభ సెగ్మెంట్ల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పనితీరు, సంస్థాగత బలం తదితరాలపై టీఆర్‌ఎస్ ప్రత్యేకంగా వివరాలు సేకరిస్తోంది. ఈ నియోజకవర్గాల వారీగా టీఆర్‌ఎస్, ఇతర పారీ్టల బలాబలాలపై ఐప్యాక్ సంస్థ పూర్తిస్థాయి నివేదిక అందజేసింది. ఈ మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సర్వే, నిఘా సంస్థల ద్వారా అందుతున్న వివరాల అధారంగా.. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవడానికి వ్యూహాలను టీఆర్‌ఎస్ సిద్ధం చేసుకుంటోంది.
ఇదీ చదవండి: రేవంత్ రెడ్డి (పీసీసీ చీఫ్) రాయని డైరీ
Comments
Please login to add a commentAdd a comment