28న కలెక్టర్ల సదస్సు..! పూర్తి చేయాల్సిన లక్ష్యాలపై కేసీఆర్‌ దృష్టి | CM KCR Will hold Conference With District Collectors On 28th | Sakshi
Sakshi News home page

28న కలెక్టర్ల సదస్సు..! పూర్తి చేయాల్సిన లక్ష్యాలపై కేసీఆర్‌ దృష్టి

Published Sun, Nov 27 2022 3:50 AM | Last Updated on Sun, Nov 27 2022 2:59 PM

CM KCR Will hold Conference With District Collectors On 28th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు సోమవారం ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్లతో సదస్సు నిర్వహించనున్నారు. రాష్ట్రమంత్రులు, అన్నిశాఖల కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. సోమవారం సమావేశానికి సంబంధించి శనివారం ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) కలెక్టర్లకు మౌఖికంగా సమాచారమిచ్చినట్లు తెలిసింది. కేసీఆర్‌ సీఎంగా రెండో పర్యాయం ప్రమాణ స్వీకారం చేసి డిసెంబర్‌ 13తో నాలుగేళ్లు పూర్తి కానున్నాయి. వచ్చే ఏడాది గరిష్టంగా నవంబర్‌ లేదా అంతకుముందే రాష్ట్ర శాసనసభ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేయడానికి కొద్ది సమయమే మిగిలింది. మిగిలిన ఈ కాలంలో 
దృష్టి సారించాల్సిన ప్రాధాన్యత అంశాలు, పూర్తి చేయాల్సిన లక్ష్యాలపై సదస్సులో జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిశానిర్దేశం చేయనున్నట్టు తెలిసింది. పలు కీలక నిర్ణయాలతో పాటు ఆదేశాలు సైతం జారీ చేయనున్నట్టు తెలుస్తోంది.  

తక్కువ సమయమే..
రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో కేసీఆర్‌ రోజువారీ సమీక్షలు, సమావేశాలతో పాలన యంత్రాంగాన్ని పరుగులు పెట్టించారు. 2020లో కోవిడ్‌–19 మహమ్మారి ప్రారంభమైన తరువాత పాలనావ్యవహారాలు కాస్త మందగించాయి. కోవిడ్‌–19 పూర్తిగా తగ్గుముఖం పట్టినా పాలన యంత్రాంగం మళ్లీ పూర్వపు క్రియాశీలస్థితికి రాకపోవడానికి వరుసగా రాష్ట్రంలో హుజూర్‌నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్, హుజూరాబాద్, మునుగోడు స్థానాలకు ఉపఎన్నికలు రావడమూ ఓ కారణంగా చెబుతున్నారు. ఎన్నికలకు దీంతో తక్కువ సమయమే ఉండటం ప్రభుత్వానికి కీలకంగా మారింది. రాష్ట్రంలో అసంపూర్తిగా మిగిలిపోయిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పూర్తి చేయడంతోపాటు ఇంకా మిగిలిన హామీలను నెరవేర్చి లబ్ధిదారులకు చేరువ కావడానికి కలెక్టర్ల సదస్సును ఉపయోగించుకోనున్నట్లు సమాచారం.  

ఎన్నికలకు ముందే డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు పంపిణీ
రాష్ట్రంలో చేపట్టిన 2.91 లక్షల డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి అసెంబ్లీ ఎన్నికలకు ముందే లబ్ధిదారులకు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నిర్మాణం పూర్తైన 62 వేల ఇళ్లను వచ్చే జనవరి 15లోగా పంపిణీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. ఆలోగా లబి్ధదారులను ఎంపిక చేయడంతోపాటు మిగిలిన ఇళ్ల నిర్మాణం పూర్తికి ముఖ్యమంత్రి గడువు నిర్దేశించే అవకాశం ఉంది. ధరణి పోర్టల్‌పై వచ్చిన ఫిర్యాదులు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. గతంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో సైతం ధరణి సమస్యలపై విస్తృతంగా చర్చించి నిర్దేశిత గడువులతో సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేసినా అకాల వర్షాల కారణంగా అది వాయిదా పడింది. పోడు భూముల సమస్య, గొత్తికోయల దాడిలో ఎఫ్‌ఆర్‌వో మరణించడం తదితర పరిణామాల నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారానికి కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తారని సమాచారం. ధరణి సమస్యలు, పోడు వ్యవహారంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించి కీలక ఆదేశాలను జారీ చేయనున్నట్టు తెలుస్తోంది. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలతో దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు, మరో విడత పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణ, వర్షాకాలం ధాన్యం కొనుగోళ్లు, యాసంగి సాగు వంటి అంశాలపై కలెక్టర్ల సదస్సులో చర్చించే అవకాశం ఉంది.  

కొత్త పథకాలపై ఆదేశాలు ? 
గత శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇంకా నెరవేర్చని వాటిపై కేసీఆర్‌ ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా సొంత జాగాలో ఇళ్లను కట్టుకునేవారికి రూ.3 లక్షలను ప్రోత్సాహకంగా అందించడం, ఉద్యోగాల భర్తీ మరింత వేగవంతం చేయడం వంటి అంశాలపై దృష్టి పెట్టనున్నారు.

ఇదీ చదవండి: ఆ ‘35’పై టీఆర్‌ఎస్‌ స్పెషల్‌ ఫోకస్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement