సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని ఇప్పట్నుంచే సమాయత్తం చేయడంపై టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. మునుగోడు ఉప ఎన్నికలో సాధించిన విజయంతో ఉత్సాహంగా ఉన్న ముఖ్య నేతలకు, సాధారణ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేయాలని నిర్ణయించారు. ఈనెల 15న తెలంగాణ భవన్‌లో శాసనసభ, పార్లమెంటరీ పార్టీ, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గం సంయుక్త సమావేశాన్ని నిర్వహించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశం సాయంత్రం వరకు సాగే అవకాశం ఉంది.
మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా క్షేత్రస్థాయిలో వెలుగు చూసిన పార్టీ అనుకూల, ప్రతికూల అంశాలను పరిగణనలోకి తీసుకుని.. నియోజకవర్గాల వారీగా టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయడమే ప్రధాన ఎజెండాగా ఈ భేటీ ఉంటుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనూ పార్టీ ఇన్‌చార్జిలను నియమించడం, మంత్రులకు అదనపు బాధ్యతలు అప్పగించడం వంటి కీలక నిర్ణయాలను ఈ సమావేశంలో కేసీఆర్ ప్రకటించే అవకాశముందని చెబుతున్నారు. పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్లు.. జిల్లా పరిషత్‌ల చైర్మన్లు తదితరులను నియోజకవర్గ ఇన్‌చార్జిలుగా నియమించి, ఆయా ప్రాంతాల్లో పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నట్లు తెలుస్తోంది.
ఇన్‌చార్జిల నియామక కసరత్తు పూర్తి
తమ సొంత నియోజకవర్గంతో పాటు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి జిల్లాలోని మరో నియోజకవర్గం గెలుపు బాధ్యతలను మంత్రులకు అప్పగించనున్నారు. నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని అనుసరించాల్సిన ఎన్నికల వ్యూహంలో మంత్రులు, కొత్తగా నియమితులయ్యే పార్టీ ఇన్‌చార్జిలే కీలకంగా వ్యవహరిస్తారని సమాచారం. కాగా ఇన్‌చార్జిల నియామకానికి సంబంధించిన కసరత్తును కేసీఆర్ ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే అదే నియోజకవర్గానికి చెందిన నేతలను కాకుండా ఇతర ప్రాంతాల వారిని ఇన్‌చార్జిలుగా నియమించే అవకాశముంది.
మునుగోడు ఫీడ్‌బ్యాక్ ఆధారంగానే..
మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేసీఆర్.. మండలాలు, గ్రామాల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను మోహరించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నిక సందర్భంగా కేసీఆర్‌తో పాటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో క్షేత్ర స్థాయిలో రాజకీయ పరిస్థితులపై కొంత ఫీడ్ బ్యాక్ లభించింది. గ్రామాలు, పట్టణాల్లో యువత, విద్యార్థులు, ఉద్యోగులు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో పాటు వివిధ సామాజిక వర్గాలు.. అధికార టీఆర్‌ఎస్ పార్టీ, ప్రభుత్వ పనితీరుపై ఏ విధమైన అభిప్రాయంతో ఉన్నారో తెలిసింది.
స్థానిక నేతలు, కేడర్ పనితీరు, సమన్వయం, ప్రత్యర్థి పార్టీల బలాలు, బలహీనతలు వంటి అనేక అంశాలపై ఒక అవగాహన ఏర్పడింది. ఈ ఫీడ్‌బ్యాక్‌ను లోతుగా విశ్లేషించిన కేసీఆర్.. దాని ఆధారంగానే రాబోయే రోజుల్లో క్షేత్ర స్థాయిలో పనిచేయాల్సిన విధానంపై పార్టీ నేతలకు పలు సూచనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్‌తో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని సూచించనున్నట్లు సమాచారం. కాగా ప్రభుత్వ పథకాలను మరింత సమర్ధవంతంగా అమలు చేయడం, సొంత జాగాలో ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయడం, దళితబంధు పురోగతి వంటి అంశాలు కూడా ఈ భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.
ఎరలు, దాడులపై అప్రమత్తం!
‘ఎమ్మెల్యేలకు ఎర’ ఎపిసోడ్ ప్రజల్లోకి బలంగా వెళ్లిందని భావిస్తున్న కేసీఆర్.. భవిష్యత్తులోనూ ఎరలు, ఈడీ, ఐటీ సంస్థల దాడులతో పార్టీ ముఖ్య నేతలను లొంగదీసుకునేందుకు బీజేపీ చేసే ప్రయత్నాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ సూచించవచ్చని చెబుతున్నారు. ప్రలోభాలకు లొంగకుండా గట్టిగా నిలబడే నేతలకు పార్టీ అండగా ఉంటుందనే భరోసాను కూడా ఈ సందర్భంగా కేసీఆర్ ఇవ్వనున్నారు. బీజేపీ ప్రలోభాలను తట్టుకుని నిలబడిన ఎమ్మెల్యేలకు భద్రత పెంచడం, వ్యక్తిగతంగా తన వెంట పర్యటనకు తీసుకెళ్లడం వంటి అంశాలను వివరించనున్నారు. మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇళ్లు, వ్యాపార సంస్థలపై జరిగిన దాడులను ప్రస్తావించే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
వరుస పర్యటనలు, సభలు సమావేశాలు
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో తన వరుస పర్యటనలు, సభలు, సమావేశాలకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా కేసీఆర్ ప్రకటించే అవకాశముంది. క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేసేందుకు కలెక్టరేట్ల ప్రారంభం, పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభం, సభలు, సమావేశాలు విస్తృతంగా నిర్వహించేలా షెడ్యూల్ రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఇలావుండగా మంగళవారం నాటి కీలక భేటీ దృష్ట్యా.. అదేరోజు మునుగోడు నియోజవర్గంలో పలువురు మంత్రులతో నిర్వహించ తలపెట్టిన సమీక్ష సమావేశం వాయిదా పడే అవకాశముంది.
చదవండి: ఎడారి గోసకు.. ఏదీ భరోసా!
Comments
Please login to add a commentAdd a comment