తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకో అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణలో తాను సాధించిన గొప్ప గురించి చెప్పుకోవచ్చు. అభ్యంతరం లేదు. కాని ఆయన ఆంధ్ర ప్రదేశ్ గురించి అనవసర ప్రస్తావన తెస్తున్నారు. తెలంగాణలో 24 గంటల కరెంటు ఉందట. ఏపీలో లేదట. దానిని ఆయన చీకటితో పోల్చుతున్నారు. అది నిజమా?కాదా? అన్నదాని గురించి ఆయన పట్టించుకోకుండా మాట్లాడుతున్నట్లుగా ఉంది. తెలంగాణలో వచ్చే ఎన్నికలలో ఏదో గట్టి పోటీ రాబోతోందన్న అనుమానంతో ఆయన స్పీచ్ లు ఇస్తున్నట్లు అనిపిస్తుంది.
ఏపీలో ఎక్కడా విద్యుత్ సమస్యలేదు. ఎప్పుడైనా కొద్దిపాటి సాంకేతిక అవాంతరాలు వచ్చినా వెంటనే విద్యుత్ వచ్చేస్తోంది. ఈ మేరకు ఏపీ ప్రభు,త్వం, విద్యుత్ శాఖలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఆ మాత్రం ఇబ్బంది తెలంగాణలో అయినా ఉంది. ఆ మధ్య ఆంగ్ల పత్రికలలో వచ్చిన కథనం ప్రకారం హైదరాబాద్ శివార్లలో కరెంటు కోతలు ఎక్కుగా చేయాల్సి వచ్చింది. అయితే కేసీఆర్ తెలంగాణలో విద్యుత్ సమస్య తీర్చడానికి ప్రయత్నించలేదని ఎవరూ అనడం లేదు. కాని తన ఘనత కోసం ఏపీని అవమానించినట్లుగా మాట్లాడడం మాత్రం సరికాదు. గద్వాల వద్ద జరిగిన సభలో తుంగభద్ర ఆవల, ఈవల అంటూ ఏదో చెప్పారు. ఆయన చెప్పారో లేదో, ఈనాడు పత్రికలో కార్టూన్ వేసి సంతోషపడిపోయారు.
కేసీఆర్ గారు ఒకసారి నిజంగానే తుంగభద్ర ఆవల ఉన్న కర్నూలు లేదా భద్రాచలం ప్రాంతంలో ఉన్న ఏపీ సరిహద్దు గ్రామాలలో పర్యటించి కొన్ని విషయాలు అడిగితే తెలంగాణకు, ఏపీకి ఉన్న తేడా తెలుస్తుంది. ఏపీలో ప్రభుత్వ స్కూళ్లు ఆధునిక వసతులతో కళకళలాడుతున్నాయి.. మరి తెలంగాణలో ఆ పరిస్థితి ఉందా? ఏపీని పరిశీలించాక ఇప్పుడు ఆరంబించారు. మంచిదే. కాని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎన్నడైనా ఏపీలో ప్రభుత్వ స్కూళ్లు చూడండి.. తెలంగాణలో స్కూళ్లు చూడండి.. అని ఏమైనా వ్యాఖ్యానించారా?లేదే! ఏపీలో అమ్మ ఒడి కింద ప్రతి విద్యార్ధికి 15 వేల రూపాయలు ఇస్తున్నారు. తెలంగాణలో ఇస్తున్నారా? తెలంగాణలోని సరిహద్దు గ్రామాలవారు కొందరు తాము కూడా ఏపీలో ఉంటే బాగుండు అని అనుకున్నారని వార్తలు వచ్చాయి. అంతమాత్రాన తెలంగాణ వెనుకబడిపోయిందని ఎవరైనా అంటే ఒప్పుకుంటారా!
ప్రభుత్వ స్కూళ్ల పిల్లలకు ఏపీలో ఇప్పటికే పుస్తకాలు, బాగ్‌లు, డ్రెస్‌లు, కిట్లు ఇచ్చేశారు. మరి తెలంగాణలో ఇచ్చారా అని ఎవరైనా అడిగితే సమాధానం ఇస్తారా? కరోనా సమయంలో ఏపీలో చేపట్టిన కార్యక్రమాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఆకర్షితులై తెలంగాణ నుంచి తరలివచ్చారు. చెక్ పోస్టులు పెట్టి ఆపవలసి వచ్చింది. అందువల్ల తెలంగాణలో కరోనా నివారణ చర్యలు చేపట్టలేదని అనగలమా? ఏపీలో చేయూత కింద మహిళలకు 18500 రూపాయలు చొప్పున ఏటా ఇస్తున్నారు. ఆ స్కీమ్ తెలంగాణలో ఉందా? ఏపీలో కొత్తగా పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు మొదలైనవి నిర్మాణం అవుతున్నాయి. తెలంగాణలో సముద్రమే లేదు కనుక అవి వచ్చే అవకాశం లేదు.
ఏపీలో అవి వచ్చా యి మీకేమున్నాయని ఎవరైనా అంటే అర్థం ఉంటుందా?. కడపలో జిందాల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు జరుగుతోంది. తెలంగాణలో బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కేసిఆర్ ఎందుకు చెప్పలేకపోతున్నారు. విద్యుత్ రంగానికి సంబంధించి ఏపీలో అత్యధిక ఉత్పత్తి జరుగుతోంది. కాని వేసవిలో తీవ్రమైన ఎండల కారణంగా డిమాండ్ బాగా పెరుగుతోంది. అలాంటప్పుడు బహిరంగ మార్కెట్‌లో ఏపీ కూడా కొంటోంది. తెలంగాణకూడా తన అవసరాల కోసం అదే పని చేస్తోంది. దానికి అనుగుణంగా ప్రజల నుంచి విద్యుత్ చార్జీలు వసూలు చేస్తున్నారు. కాకపోతే తెలంగాణలో ఈనాడు వంటి మీడియాను కేసీఆర్ కంట్రోల్ చేయగలుగుతున్నారు కనుక అక్కడ విద్యుత్ లేదా ఆర్టీసీ చార్జీలు పెరిగితే తప్పనిసరి పరిస్థితి అని, అనివార్యమని ఈనాడు రాస్తోంది. అదే ఏపీలో అయితే చార్జీలతో జనాన్ని ఏపీ ప్రభుత్వం బాదుతోందని తప్పుడు వార్తలు రాస్తున్నారు.
ఏపీలో ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వంలో విలీనం చేసుకున్నారు. తెలంగాణలో ఎందుకు చేయలేకపోయారు. తమది ధనిక రాష్ట్రమని కేసీఆర్ తరచూ చెబుతుంటారు.. అయినా సుమారు ఐదు లక్షల కోట్ల అప్పు ఎందుకు చేశారని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటాయి. లక్ష కోట్ల వ్యయంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఎంత ఉపయోగం జరుగుతోందని కూడా అవి ప్రశ్నిస్తున్నాయి. అంతమాత్రాన అవన్ని నిజం అయిపోయినట్లు అనుకుందామా!. వీటిని ఆంధ్ర నేతలు ఎవరైనా ప్రశ్నిస్తున్నారా? అంతెందుకు! ఇంత గొప్ప తెలంగాణ రాష్ట్రం ఏపీకి విద్యుత్ బకాయిల కింద ఇవ్వవలసిన ఏడువేల కోట్ల రూపాయలు ఎందుకు ఇవ్వడం లేదు? ఏదో ఒక వివాదం పేరుతో బకాయిపెడుతోందే. కేంద్రం కూడా ఏపీకి తెలంగాణ బకాయిపడిందని చెప్పినా చెల్లించడం లేదు.
చదవండి: చంద్రబాబు.. సీఎం జగన్‌కు మరో ఆయుధం ఇచ్చినట్టేనా?
అంతేకాదు. ఉమ్మడి ఆస్తులకు సంబంధించి సుమారు లక్షనలభైవేల కోట్ల ఆస్తులు ఏపీకి రావల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం సుప్రింకోర్టును ఆశ్రయించింది. అయినా జాతీయ పార్టీ పెట్టానని చెప్పుకునే కేసీఆర్ ఆ సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదు? ఈ మధ్య మంత్రి హరీష్ రావు కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏపీ వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీ వారికి మాటలు ఎక్కువ,చేతలు తక్కువ అన్నట్లు మాట్లాడితే మాజీ మంత్రి పేర్ని నాని దానిని తిప్పికొట్టారు. ఇప్పుడు కేసీఆర్ అనవసర పోలిక తీసుకు వచ్చి వివాదం సృష్టించుకుంటున్నారు.
ఒకవేళ ఏపీలో పరిస్థితి బాగోలేదని ఆయనకు సమాచారం ఉంటే స్వయంగా వచ్చి చూసి తెలుసుకుంటే మంచిదికదా! ఎవరో చెవిలో చెప్పిన మాట విని కేసీఆర్ ఇలా వ్యాఖ్యానించడం వల్ల రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అయితే ఒక్క విషయంలో మాత్రం ఎవరైనా ఒప్పుకోవాలి. కేసీఆర్ మాటలు మాత్రం గొప్పగా ఉంటాయన్నది వాస్తవం. కొసమెరుపు ఏమిటంటే కేసీఆర్ కుమారుడు, మంత్రి కేటిఆర్ సిరిసిల్లలో తిరుమల, తిరుపతి దేవస్థానం నిధులతో ఆలయాలను పునర్మించారని చెబుతూ ముఖ్యమంత్రిని జగనన్న అంటూ సంభోదించి అభినందించారు.. అలాగే టీడీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని ప్రశంసించారు. మరి దీని గురించి కేసీఆర్ ఏమంటారో!
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ ఛైర్మన్
Comments
Please login to add a commentAdd a comment