అక్షిత సచిదేవా
మాన్సీ జైన్
ఇరాగుహ
ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన కార్టియర్ ఫెలోషిప్‌ను ఈ యేడాది ముగ్గురు భారతీయ మహిళలు దక్కించుకున్నారు. ఆ ముగ్గురూ ఢిల్లీ వాసి అయిన అక్షితా సచిదేవా, బెంగళూరు వాసులైన మాన్సీ జైన్, ఇరా గుహ లు. మన దేశం నుంచి వీరు మాత్రమే ఎంపిక అవడంలోని ప్రత్యేకత సామాజికంగా ప్రభావవంతమైన పారిశ్రామికవేత్తలుగా వీరికున్న గుర్తింపు.
ప్రపంచంలోని అత్యంత కీలకమైన సవాళ్లను పరిష్కరిస్తున్న వేలాది మంది మహిళా పారిశ్రామికవేత్తలను గుర్తించి, వారిలో 33 మందిని ఎంపిక చేసిన కార్డియర్ ఉమెన్స్ ఇనిషియేటివ్ మీట్ ఇటీవల చైనాలో జరిగింది. ఇందులో ముగ్గురు యువ భారతీయ మహిళా వ్యాపారవేత్తలు తమ వ్యాపారాల ద్వారా ప్రభావ వంతమైన గుర్తింపు పొందారు.
మాన్సీ జైన్..
‘డిజిటల్‌పానీ’ అనే సాఫ్ట్‌వేర్ ల్యాట్ ఫారమ్ వ్యవస్థాపకురాలు మాన్సీ జైన్. ఇది మురుగునీటి శుద్ధి కార్యకలాపాలను నిర్వహించడానికి వీలు కల్పిస్తుంది. ఫలితంగా కలుషితమైన నీటిని సమర్థవంతంగా శుద్ధి చేయవచ్చు. తిరిగి ఉపయోగించుకోవచ్చు. డిజిటల్‌పానీ రోజుకు 90 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. భారత దేశంలోని అగ్రశ్రేణి కంపెనీలలోని దాదాపు 50 యూనిట్లలోని నీటిలో అధిక నాణ్యత, అనుకూలమైన సౌకర్యాలుగా మార్చి తన శక్తిని నిరూపించింది.
అక్షితా సచిదేవా..
ఏఐ ఆధారిత సాంకేతికత ‘కిబో’ను ఉపయోగించి అంధత్వం ఉన్న వ్యక్తులకు సమగ్ర విద్య, ఉపాధినిప్రోత్సహించడానికి ట్రెస్టిల్ ల్యాబ్‌లను స్థాపించింది బెంగళూరుకు చెందిన అక్షితా సచిదేవా. 60 భాషల్లో ప్రింట్, హ్యాండ్ రైటింగ్, డిజిటల్ కంటెంట్‌ను డిజిటైజ్ చేస్తుంది, అనువదిస్తుంది, ఆడియోలోకి మారుస్తుంది. జూలై 2019 నుండి కిబో 650 సంస్థలను కలుపుకొని 25 దేశాలలో 1.5 లక్షల మందికి పైగా వ్యక్తులు సాధికారత సాధించేలా చేసింది. కంటెంట్‌ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి అక్షిత చేసిన కృషికి అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి.
ఇరాగుహ..
స్త్రీల పీరియడ్ సమస్యలను పరిష్కరించడానికి, ల్యాస్టిక్ శానిటరీ ప్యాడ్‌ల నుండి వ్యర్థ కాలుష్యాన్ని తగ్గించడానికి మెనుస్ట్రువల్ కప్‌ను రూపొందించి, పేటెంట్ రైట్స్ పొందింది ఇరాగుహ. సామాజిక కార్యక్రమాల ద్వారా గ్రామీణ కుటుంబాలలోని మహిళలు మెనుస్ట్రువల్ కప్‌ని ఉపయోగించడం ద్వారా మిలియన్ల డాలర్లను ఆదా చేసింది. అలాగే, లక్షల టన్నుల కంటే ఎక్కువ వ్యర్థాలను నివారించింది. వినూత్నమైన పీరియడ్ ట్రాకర్ యాప్‌ను అభివృద్ధి చేయడం ద్వారా కెనడా ప్రభుత్వం నుండి అవార్డును అందుకుంది.
సామాజిక వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్న ఈ ముగ్గురు యువపారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి తమ మద్దతును ప్రకటించింది కార్టియర్ ఫెలోషిప్. కోట్లాది మంది వీక్షకుల ముందు అవార్డులు అందుకున్న వారిలో ఈ ముగ్గురు ప్రత్యేకంగా నిలిచారు. తమ వ్యాపారాల ద్వారా సమాజంలో తీసుకు వస్తున్న మార్పులను పంచుకుని, అందరికీ ఆదర్శంగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment