అనుకున్న పని సాధించాలంటే.. కృషి, పట్టుదల చాలా అవసరం. సంకల్పం బలంగా ఉండి.. లక్ష్యం వైపుగా అడుగులు వేస్తే తప్పకుండా సక్సెస్ నీ సొంతం అవుతుందని చెప్పడానికి నిదర్శనమే 'టట్యానా బకల్‌చుక్' (Tatyana Bakalchuk). బహుశా ఈ పేరు చాలామందికి తెలిసుండకపోవచ్చు. కానీ ఈమె రష్యాలో అత్యంత సంపన్న మహిళలలో ఒకరు. ఈమె గురించి, ఈమె సాధించిన సక్సెస్ గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
వైల్డ్‌బెర్రీస్
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, రష్యాలో ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజంగా ఎదిగిన 'వైల్డ్‌బెర్రీస్' (Wildberries) నేడు ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం వ్యాపారవేత్త టట్యానా బకల్‌చుక్. ఈమె రష్యాలో అత్యంత సంపన్న మహిళ. ఈమె నికర విలువ 7.4 బిలియన్ డాలర్లు. భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 6,34,65,84,10,000.
60వేల బ్రాండ్‌లు
అమెజాన్ కంపెనీలో పోలిస్తే.. వైల్డ్‌బెర్రీస్ రష్యాలోనే అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలర్. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా దుస్తులు, ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలు వంటి సుమారు 60వేల బ్రాండ్‌లను విక్రయిస్తున్నారు.
రష్యాలోని అతిపెద్ద ఈ కామర్స్ దిగ్గజాన్ని స్థాపించిన టట్యానా బకల్‌చుక్ 2004లో నిరాడంబరమైన జీవితాన్ని గడిపిన ఓ ఇంగ్లీష్ టీచర్. ఈమె తన ప్రసూతి సెలవుల సమయంలో కుటుంబానికి మద్దతుగా నిలబడటానికి కేవలం రూ. 32వేలతో చిన్న వ్యాపారం ప్రారంభించింది. ఆ సమయంలో ఆమె భర్త వ్లాడిస్లావ్ బకల్చుక్, అతని స్నేహితుడి సహకారం కూడా తీసుకుంది.
అపార్ట్మెంట్ నుంచి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్
మొదట వీరి వ్యాపారం చిన్న అపార్ట్మెంట్ నుంచి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌గా వృద్ధి చెందింది. ఆ సమయంలో ఆమె జర్మన్ రిటైలర్ ఒట్టో సహకారం పొందింది. ఆన్‌లైన్‌లో దుస్తులను ఫోటో తీయడం, జాబితా చేయడం, స్వయంగా లాజిస్టిక్స్ చేయడం, పంపడానికి ప్రజా రవాణాను ఉపయోగించడం వంటి వాటితో ఈమె బిజినెస్ ఎదిగింది.
ప్రారంభంలో కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ.. పట్టు వదలకుండా, 2008 ఆర్థిక సంక్షోభాల సమయంలో కూడా ఈమె తన వ్యాపారాన్ని వదిలిపెట్టలేదు.2020లో మహమ్మారి సమయంలో సకాలంలో ఇంటి డెలివరీలను నిర్ధారించడానికి ఆమె 12,000 మంది అదనపు కార్మికులను నియమించింది. దీంతో కంపెనీ ఒక్కసారిగా గణనీయమైన వృద్ధి సాధించింది.
99 శాతం వాటా
కంపెనీలో టాట్యానా 99 శాతం వాటాను కలిగి ఉంది. మిగిలిన 1 శాతం వాటా ఆమె భర్తకు చెందినది. ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు రష్యాలో మాత్రమే కాకుండా.. జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ వంటి ప్రదేశాలలో కూడా సేవలు అందిస్తోంది. వేలకోట్లు సంపద ఉన్నప్పటికీ.. టాట్యానా అద్దె ఇంట్లోనే నివసిస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: రూ. 10వేల అప్పుతో రూ.32000 కోట్ల సామ్రాజ్యం: ఎవరీ 'రవి మోదీ'?
టట్యానా బకల్‌చుక్ వ్యాపార ఆవాహన.. రష్యా అధ్యక్షుడు 'వ్లాదిమిర్ పుతిన్' (Vladimir Putin)ను ఆకర్షించింది. దీంతో ఆయన అంతర్జాతీయ స్విఫ్ట్ చెల్లింపు నెట్‌వర్క్‌కు దేశీయ ప్రత్యామ్నాయాన్ని సృష్టించే పనిని ఆమెకు అప్పగించారు. ఓ టీచర్‌గా జీవితం ప్రారంభించి, కుటుంబానికండగా నిలబడాలనే ఉద్దేశ్యంతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించి.. నేడు ప్రపంచంలోని గొప్ప వ్యాపారవేత్తల సరసన నిలిచిన టట్యానా బకల్‌చుక్ ప్రశంసనీయం, ఎంతోమందికి ఆదర్శప్రాయం.
Comments
Please login to add a commentAdd a comment