రోజూ కొన్ని గంటల పాటు నడుచుకుంటూ పట్టణానికి వెళ్లి కూరగాయలు అమ్మే యాంగ్మీలా ఇప్పుడు ఒక స్టార్టప్‌కు యజమానురాలు. ఎంతోమంది గ్రామీణ మహిళలకు ఉపాధిని, స్ఫూర్తిని ఇస్తున్న ఉత్తేజం.
మణిపూర్‌లోని ఫరుంగ్ గ్రామానికి చెందిన యాంగ్మీలా ప్రతిరోజూ ఉదయం తన ఊరి నుంచి ఉఖ్రుల్ పట్టణానికి కూరగాయల బుట్టను మోసుకుంటూ ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లేది. వాటిని అమ్మి ఎండలో తిరిగి ఇంటికి వచ్చేది. తాను నడిచి వెళ్లే దారి మామూలు దారి కాదు. కొండల దారి.
ఆర్థిక ఇబ్బందుల వల్ల 21ఏళ్ల వయసులో కూరగాయలు అమ్మడం మొదలుపెట్టింది యాంగ్మీలా. అప్పటికే ఆమెకు ఒక మగబిడ్డ. భర్త తనను విడిచి వెళ్లాడు. బిడ్డతోపాటు అనారోగ్యంతో బాధ పడుతున్న తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత ఉండడంతోకష్టాన్నే నమ్ముకుంది యాంగ్మీలా. వయసు పైబడుతుండడంతో యాంగ్మీలాకు నడక భారమైంది.
‘ఇలా ఎంతకాలం! వేరే మార్గం లేదా?’ అని ఆలోచించింది మనసులో. ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనతో మొదటగా పాత బట్టల వ్యాపారంలోకి అడుగు పెట్టింది. ఆ తరువాత కోళ్ల పెంపకం చేపట్టింది. మిఠాయిల దుకాణం నడిపింది. ఉసిరి, మామిడి, ఆపిల్... మొదలైన వాటిని ప్రాసెస్ చేసి మిఠాయిలు తయారు చేసేది. ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన శిక్షణ శిబిరంలో సాల్గొన్న తరువాత ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారంలోకి అడుగు పెట్టింది.
మిర్చి, వెల్లుల్లి, వంకాయలు, వెదురు చివుళ్లు... మొదలైన వాటితో సేంద్రియ ఊరగాయల తయారీని ప్రారంభించింది. తన స్టార్టప్‌కు ‘షిరిన్ ప్రొడక్ట్స్’ అని పేరు పెట్టింది. ‘షిరిన్’ అనేది నాగా పదం. ‘పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ అభివృద్ధి’ అనేది దీని అర్థం.
జర్మన్ ఎన్జీవో ‘జీఐజెడ్’ నుంచి ఈ స్టార్టప్‌కు 1.2 లక్షల గ్రాంట్ లభించింది. ఆర్‌బీఐకి సంబంధించిన ‘రంగ్ దే’ అనే లెండింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి రెండు లక్షల రుణం తీసుకుంది. ‘షిరిన్ ప్రొడక్ట్స్ చుట్టుపక్కల ప్రాంతాలలోనే కాకుండా మణిపూర్ రాజధాని ఇంఫాల్, అస్సాం, నాగాలాండ్, దిల్లీలలో కూడా అమ్ముడవుతున్నాయి.
ఫేస్‌బుక్, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది యాంగ్మీలా.
‘ఒకే ఉద్యోగితో మా కంపెనీ ప్రారంభం అయింది. మొదట్లో డోర్ టు డోర్ అమ్మకాలు చేసేవాళ్లం. ఇప్పుడు నా దగ్గర పన్నెండు మంది వర్కర్లు పనిచేస్తున్నారు. వారికి నేనే శిక్షణ ఇచ్చాను’ అంటుంది యాంగ్మీలా. ఎమ్మెస్సీ చేసిన ఆమె కుమారుడు షంగ్రీఫా ఇప్పుడు వ్యాపారంలో తల్లికి సహాయంగా ఉంటున్నాడు.
‘సింగిల్ మదర్‌గా ఆమె ఎలాంటి కష్టాలు పడిందో ఊహించుకోవచ్చు. అయితే ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. కష్టపడాలి, ఎప్పుడూ ఏదో చేయాలనే తపన ఆమెకు విజయాన్ని చేరువ చేసింది. వ్యాపారం మీద ఎంత శ్రద్ధ పెట్టిందో నా చదువు, భవిష్యత్ మీద కూడా అంతే శ్రద్ధ పెట్టింది. ఆమెను చూసి గర్వపడతాను. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి భయపడని ధైర్యవంతురాలైన మహిళ మా అమ్మ’ తల్లి గురించి గర్వంగా చెబుతాడు షంగ్రీఫా.
‘అస్సాం ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవార్డ్’ తో సహా ఎన్నో అవార్డ్‌లు అందుకున్న యాంగ్మీలా ఎంతోమంది గ్రామీణ మహిళలకు స్ఫూర్తిని ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment