single mother
-
కేవలం రూ. 500తో మొదలై, కష్టాలను ‘పచ్చడి’ చేసింది!
రోజూ కొన్ని గంటల పాటు నడుచుకుంటూ పట్టణానికి వెళ్లి కూరగాయలు అమ్మే యాంగ్మీలా ఇప్పుడు ఒక స్టార్టప్‌కు యజమానురాలు. ఎంతోమంది గ్రామీణ మహిళలకు ఉపాధిని, స్ఫూర్తిని ఇస్తున్న ఉత్తేజం.మణిపూర్‌లోని ఫరుంగ్ గ్రామానికి చెందిన యాంగ్మీలా ప్రతిరోజూ ఉదయం తన ఊరి నుంచి ఉఖ్రుల్ పట్టణానికి కూరగాయల బుట్టను మోసుకుంటూ ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లేది. వాటిని అమ్మి ఎండలో తిరిగి ఇంటికి వచ్చేది. తాను నడిచి వెళ్లే దారి మామూలు దారి కాదు. కొండల దారి.ఆర్థిక ఇబ్బందుల వల్ల 21ఏళ్ల వయసులో కూరగాయలు అమ్మడం మొదలుపెట్టింది యాంగ్మీలా. అప్పటికే ఆమెకు ఒక మగబిడ్డ. భర్త తనను విడిచి వెళ్లాడు. బిడ్డతోపాటు అనారోగ్యంతో బాధ పడుతున్న తండ్రిని చూసుకోవాల్సిన బాధ్యత ఉండడంతోకష్టాన్నే నమ్ముకుంది యాంగ్మీలా. వయసు పైబడుతుండడంతో యాంగ్మీలాకు నడక భారమైంది. ‘ఇలా ఎంతకాలం! వేరే మార్గం లేదా?’ అని ఆలోచించింది మనసులో. ఏదైనా వ్యాపారం చేయాలనే ఆలోచనతో మొదటగా పాత బట్టల వ్యాపారంలోకి అడుగు పెట్టింది. ఆ తరువాత కోళ్ల పెంపకం చేపట్టింది. మిఠాయిల దుకాణం నడిపింది. ఉసిరి, మామిడి, ఆపిల్... మొదలైన వాటిని ప్రాసెస్ చేసి మిఠాయిలు తయారు చేసేది. ఒక స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన శిక్షణ శిబిరంలో సాల్గొన్న తరువాత ఫుడ్ ప్రాసెసింగ్ వ్యాపారంలోకి అడుగు పెట్టింది.మిర్చి, వెల్లుల్లి, వంకాయలు, వెదురు చివుళ్లు... మొదలైన వాటితో సేంద్రియ ఊరగాయల తయారీని ప్రారంభించింది. తన స్టార్టప్‌కు ‘షిరిన్ ప్రొడక్ట్స్’ అని పేరు పెట్టింది. ‘షిరిన్’ అనేది నాగా పదం. ‘పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ అభివృద్ధి’ అనేది దీని అర్థం.జర్మన్ ఎన్జీవో ‘జీఐజెడ్’ నుంచి ఈ స్టార్టప్‌కు 1.2 లక్షల గ్రాంట్ లభించింది. ఆర్బీఐకి సంబంధించిన ‘రంగ్ దే’ అనే లెండింగ్ ప్లాట్‌ఫామ్ నుంచి రెండు లక్షల రుణం తీసుకుంది. ‘షిరిన్ ప్రొడక్ట్స్ చుట్టుపక్కల ప్రాంతాలలోనే కాకుండా మణిపూర్ రాజధాని ఇంఫాల్, అస్సాం, నాగాలాండ్, దిల్లీలలో కూడా అమ్ముడవుతున్నాయి.ఫేస్బుక్, ఇతర ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది యాంగ్మీలా.‘ఒకే ఉద్యోగితో మా కంపెనీ ప్రారంభం అయింది. మొదట్లో డోర్ టు డోర్ అమ్మకాలు చేసేవాళ్లం. ఇప్పుడు నా దగ్గర పన్నెండు మంది వర్కర్లు పనిచేస్తున్నారు. వారికి నేనే శిక్షణ ఇచ్చాను’ అంటుంది యాంగ్మీలా. ఎమ్మెస్సీ చేసిన ఆమె కుమారుడు షంగ్రీఫా ఇప్పుడు వ్యాపారంలో తల్లికి సహాయంగా ఉంటున్నాడు.‘సింగిల్ మదర్‌గా ఆమె ఎలాంటి కష్టాలు పడిందో ఊహించుకోవచ్చు. అయితే ఎప్పుడూ వెనక్కి తగ్గలేదు. కష్టపడాలి, ఎప్పుడూ ఏదో చేయాలనే తపన ఆమెకు విజయాన్ని చేరువ చేసింది. వ్యాపారం మీద ఎంత శ్రద్ధ పెట్టిందో నా చదువు, భవిష్యత్ మీద కూడా అంతే శ్రద్ధ పెట్టింది. ఆమెను చూసి గర్వపడతాను. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి భయపడని ధైర్యవంతురాలైన మహిళ మా అమ్మ’ తల్లి గురించి గర్వంగా చెబుతాడు షంగ్రీఫా.‘అస్సాం ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవార్డ్’ తో సహా ఎన్నో అవార్డ్లు అందుకున్న యాంగ్మీలా ఎంతోమంది గ్రామీణ మహిళలకు స్ఫూర్తిని ఇస్తోంది. -
నో బ్యూటీ పార్లర్.. నా అందం, ఆనందం రహస్యం అదే! నటి
ఈ విషయం వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. నీనా గుప్తాకు బ్యూటీ పార్లర్లకు వెళ్లే అలవాటు లేదు. ‘అవునా!! గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారు తరచూ పార్లర్ లకు వెళ్తుంటారు కదా! అందమే కదా అసలు ఎవరికైనా ఆనందం?’ అని మీరు అడిగి చూడండి... నీనా చెప్పే సమాధానం మిమ్మల్ని మరింతగా ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ‘నా కూతురే నా ఆనందం‘ అంటారు నీనా!ఆనందం అందాన్నిస్తుంది. ఆ ఆనందం కూతురు మసాబా రూపంలో నీనా కళ్లెదుట ఉంది. ఇక ఆమెకు ఫేషియల్స్ ఎందుకు? పార్లర్లు ఎందుకు? నీనా వయసు 65. సింగిల్ మదర్‌కి స్ట్రెస్ ఉంటుంది. కూతురు ఉన్న సింగిల్ మదర్‌కి మరింత స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్, మరింత స్ట్రెస్‌లను మించిన మూడోస్ట్రెస్ కూడా ఉండేది నీనాకు. అదేమిటో అందరికీ తెలిసిందే. ఆమె కూతురి తండ్రి ఇండియన్ కాదు. 1980ల నాటి వెస్ట్ ఇండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్. నీనా, రిచర్డ్స్కు పుట్టిన అమ్మాయే మసాబా. రిచర్డ్స్ కు అప్పటికే పెళ్లి అయి ఉండటంతో ఆయన్ని పెళ్లి చేసుకోకుండా, మసాబా పెరిగి పెద్దయ్యే వరకు – ఒంటరిగానే ఉండిపోయారు నీనా. ప్రస్తుతం మసాబా వయసు 35 ఏళ్లు. ఇప్పటికీమసాబానే నీనా కంటి వెలుగు. మసాబానే ఆమె అందం, ఆనందం. ‘ఎదుగుతున్న వయసులో నా కూతురి కోసం నేను రెండు పనులు ఎప్పటికీ చేయకూడదు అని ఒట్టు పెట్టుకున్నాను. ఒకటి: ఆమె చదువు కోసం ‘ఎవరినీ డబ్బు సాయం అడగకూడదు.’ రెండు : తండ్రి (దగ్గర) లేని పిల్లగా ఆమె కోసం ‘ఎవరి ఎమోషనల్ సపోర్టూ తీసుకోకూడదు.’ ఈ రెండిటిపై గట్టిగా నిలబడ్డాను. మనం డబ్బు, సపోర్ట్ అడగం అని తెలిస్తే ఎవరైనా ధైర్యంగా మన దగ్గరకు వస్తారు. మనమూ అంతే.. ఎవరి దగ్గరకైనా ధైర్యంగా వెళ్లగలం అని ‘బ్రట్ ఇండియా’కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కుషా కపిల్‌తో చెప్పారు నీనా గుప్తాకూతురు మాత్రమే కాదు, సింగిల్ మదర్‌గా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ రావటం కూడా నీనా అందానికి కారణం అయి ఉంటుంది -
వారి కోసం ఉపాసన కీలక నిర్ణయం.. !
ఉపాసన కొణిదెల తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు. మెగా కోడలిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవలే మెగా ఇంట్లో వారసురాలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రామ్ చరణ్, ఉపాసన బిడ్డకు క్లీంకారగా నామకరణం చేశారు. అయితే మెగాకోడలు ఉపాసన ప్రస్తుతం తల్లిగా చాలా బిజీగా ఉంది. ఎందుకంటే ఈ జూన్‌లో కూతురు పుట్టిన తర్వాత ఈమె జీవితంలో చాలా మార్పులు వచ్చాయని తెలిపింది. తన బిడ్డ వల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నట్లు వెల్లడించింది. (ఇది చదవండి: మొన్న సెలవులు.. ఇప్పుడేమో ఏకంగా జైలర్ స్పెషల్ షోలు..!) అయితే సామాజిక ఉపాసన సేవలోనూ ఎప్పుడు ముందుంటుంది. తన సేవలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటోంది. అలానే ఒంటరి తల్లుల కోసం ఓ మంచి నిర్ణయం తీసుకుంది. వారి కోసం ప్రత్యేకంగా ప్రతి ఆదివారం ఉచిత ఓపీడీ సేవలు అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అపోలో చిల్డ్రన్స్ పేరిట జూబ్లీహిల్స్‌లోని ఆస్పత్రిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియోను కూడా షేర్ చేసింది. దీంతో ఉపాసన చేస్తున్న సేవలను నెటిజన్స్ అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ.. 'హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో అపోలో చిల్డ్రన్స్ ప్రారంభోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా.. ఒంటరి తల్లుల కోసం ప్రత్యేకంగా ప్రతి ఆదివారం ఉచిత ఔట్ పేషెంట్ డిపార్ట్మెంట్ (OPD) సేవలను పరిచయం చేయడం గర్వకారణం. ప్రతి ఒక్కరూ 040 -23607777 నంబర్‌కు కాల్ చేసి మీ స్లాట్‌ను బుక్ చేసుకోండి. ఈ సేవలు ప్రతి ఆదివారం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటలవరకు అందుబాటులో ఉంటాయి. సంతాన సాఫల్యతతో ఎదురయ్యే సవాళ్లను, ఒంటరి తల్లులను చూసి నేను తీవ్రంగా చలించిపోయా. ప్రత్యేక శిశువైద్యుల బృందం, అత్యాధునిక సాంకేతికతతో, అపోలో హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం వారి ఆరోగ్య సంరక్షణ ప్రయాణంలో మీ కుటుంబాలను ఆదుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్రతి బిడ్డకు సమగ్ర సంరక్షణ అందే విధంగా పెంపొందించే వాతావరణాన్ని సృష్టించడం మా లక్ష్యం.' అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉపాసన నిర్ణయాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. (ఇది చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!) View this post on Instagram A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela) -
కొవ్వొత్తుల తయారీతో మొదలుపెట్టి కోట్ల సంపాదన వరకు..
కాస్మొటిక్స్ క్వీన్‌గా ఎదిగిన మీరా కులకర్ణి విజయగాథ ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకం. చదువును పక్కన పెట్టి 20 ఏళ్ల వయసులో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని తల్లిదండ్రులను, ఇంటిని విడిచిపెట్టిపోయింది... ఆ బంధం వికటించి కొన్ని రోజులకే ఆమె ఒంటరి తల్లిగా తిరిగి వచ్చింది.. కొన్నాళ్లకే తల్లిదండ్రులూ మృతి చెందడంతో అనాథగా మారింది. కాలాన్ని నెట్టుకుంటూ వచ్చి 45 సంవత్సరాల వయస్సులో వ్యాపారాన్ని ప్రారంభించింది. దేశంలోని అత్యంత ధనవంతులైన మహిళల్లో ఒకరిగా అవరించింది. మీరా కులకర్ణి ఫారెస్ట్ ఎసెన్షియల్స్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్. ఇది దేశంలోని ప్రముఖ సహజ సౌందర్య సాధనాల బ్రాండ్లలో ఒకటి. ముఖ్యంగా ఆయుర్వేద ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. మార్కెట్ లీడర్‌గా, విజయవంతమైన వ్యాపారవేత్తగా అవతరించిన మీరా కులకర్ణి ప్రయాణం కొవ్వొత్తుల తయారు చేసే చిన్న కుటీర పరిశ్రమ నుంచి ప్రారంభమైంది. అది తర్వాత హ్యాండ్‌మేడ్ సబ్బుల పరిశ్రమగా మారింది. ఫలించని వైవాహిక బంధం మీరా కులకర్ణి వైవాహిక బంధం ఫలించకపోవడంతో తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఢిల్లీకి తిరిగి వచ్చేసింది. 28 సంవత్సరాలు వయస్సులో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయింది. భర్తకు దూరమై.. తల్లిందండ్రులు మరణించడంతో ఒంటరిగా తల్లిగా మిలిగిపోయింది. తమ ఇంటిలో కొంత భాగాన్ని అద్దెకు ఇచ్చి అలా వచ్చే డబ్బుతో పిల్లలను పోషించుకుంటూ వచ్చింది. కుమార్తెకు పెళ్లి చేసిన తర్వాత 45 ఏళ్ల వయసులో వ్యాపారం ప్రారంభించింది మీరా. మొదట కొవ్వొత్తులను తయారు చేయడం ప్రారంభించిన ఆమె తర్వాత హ్యాండ్ మేడ్ సబ్బుల తయారీకి మారింది. యూఎస్‌లో చదువుతున్న తన కొడుకు వద్దకు వెళ్లినప్పుడు ఆమెకు వచ్చిన సలహాతో సబ్బుల తయారీలో శిక్షణ పొందింది. ఆమె కొడుకు సమర్థ్ బేడీ ఇప్పుడు ఆ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. రూ.2 లక్షల పెట్టుబడితో.. మీరా కులకర్ణి కేవలం రూ. 2 లక్షల పెట్టుబడి, ఇద్దరు ఉద్యోగులతో తన వ్యాపారాన్ని ప్రారంభించింది. నేడు ఆమె బ్రాండ్‌కు భారతదేశం అంతటా 110, విదేశాలలో డజనుకు పైగా స్టోర్లు ఉన్నాయి. తాజ్, హయత్ వంటి 300పైగా హోటళ్లు, దాదాపు 150 స్పాలు ఆమె కంపెనీ ఉత్పత్తులు వినియోగిస్తున్నాయి. ఫారెస్ట్ ఎసెన్షియల్స్ కంపెనీ 2020 ఆర్థిక సంవత్సరంలో రూ.253 కోట్లు, 2021 ఆర్థిక ఏడాదిలో రూ.210 కోట్లు ఆర్జించింది. మీరా కులకర్ణి రూ. 1,290 కోట్ల నికర విలువతో భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా కోటక్ వెల్త్ హురున్ – లీడింగ్ వెల్తీ ఉమెన్ 2020గా నిలిచారు. ఇదీ చదవండి: Chandigarh Couple: చలికాలం ఈ భార్యాభర్తలను రూ. కోట్ల వ్యాపారవేత్తలను చేసింది! -
ఒంటరి అమ్మ బతుకు పోరు
27 ఏళ్ల చంచల్ శర్మ ఝాన్సీ లక్ష్మీబాయిని గుర్తుకు తెస్తోంది. ఝాన్సీ తన బిడ్డను కట్టుకుని శత్రువుతో యుద్ధం చేస్తే చంచల్ తన బిడ్డను కట్టుకుని బతుకుపోరు చేస్తోంది. గర్భంతో ఉండగా భర్త నుంచి విడిపోయిన చంచల్ బిడ్డ పుట్టాక ఏడుస్తూ కూచోలేదు. బతకాలని బిడ్డను బతికించుకోవాలని సంకల్పించింది. ఆమె కథ ఇప్పడు నెట్లో వైరల్‌గా మారింది. ఢిల్లీ– నోయిడాలో చంచల్ శర్మ నడిపే ఈ ఆటో రిక్షా అందరికీ తెలుసు. దాని డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉండే ఆమెను అందరూ మెచ్చుకోలుగా చూస్తూ ఉంటారు. ఆశ్చర్యంగా చూస్తు ఉంటారు. గౌరవంగా చూస్తూ ఉంటారు. దాని కారణం ‘కంగారు’లాగా ఆమె కూడా తన ఒక సంవత్సరం కొడుకును పొట్టకు దగ్గరగా కట్టుకుని డ్రైవింగ్ చేస్తూ ఉండటమే. పల్లెల్లో బిడ్డను నడుముకు కట్టుకుని కూలి పనులు చేసే తల్లులు మనకు కొత్త కాదు. కాని ఒక ఆటో రిక్షా నడుపుతూ ఇలా నగరంలో ఒక ఒంటరి తల్లి తన బతుకు కోసం సంఘర్షించడం మాత్రం కొత్త. ఇటీవల ఈమె గురించి మీడియాలో వస్తే సోషల్ మీడియాలో చాలా మంది మాట్లాడారు. మెచ్చుకున్నారు. ఎందుకు? జీవితం సవాలు విసిరినప్పుడు చేతనైన జవాబు చెప్పాలని చంచల్ అనుకోవడమే. భర్త నుంచి విడిపోయి... 27 ఏళ్ల చంచల్ శర్మ పెళ్లయ్యి గర్భం వచ్చాక భర్త నుంచి విడిపోవాల్సి వచ్చింది. ఆమెకు తల్లి తప్ప ఎవరూ లేరు. బతుకు తెరువు లేదు. బిడ్డకు జన్మనిచ్చాక ఒకవైపు భర్త తోడు లేకపోవడం, మరోవైపు బిడ్డ బాధ్యత ఆమెను సతమతం చేశాయి. జీవితంలో ఓడిపోవడమా? పోరాడి నిలవడమా? రెండో మార్గమే ఎంచుకుంది. కొడుకు నెలల బిడ్డగా ఉండగా తల్లి దగ్గరే వదిలి ఈ ఆటో రిక్షా నడపడం మొదలెట్టింది. కాని ఇప్పుడు వాడికి సంవత్సరం నిండింది. తల్లి కోసం బెంగటిల్లుతుంటాడు. అదీగాక తల్లి ఆ పిల్లాణ్ణి చూసుకోలేకపోతోంది. క్రష్‌లో వేద్దామంటే అందుకు కట్టాల్సినంత డబ్బు తన వద్ద లేదు. పైగా క్రష్‌లు కూడా బాగా చార్జ్ చేస్తున్నాయి ఢిల్లీలో. అందుకే తనతోపాటే కొడుకును నడుముకు కట్టుకుని డ్యూటీ చేయాలని నిశ్చయించుకుంది చంచల్ శర్మ. 600 సంపాదన... ఉదయం ఆరున్నరకు కొడుకుతో పాటు డ్యూటీ ఎక్కుతుంది చంచల్ శర్మ. మధ్యాహ్నం వరకూ ఆటో నడిపి ఇల్లు చేరుతుంది. కొడుక్కు స్నానం చేయించి, తినిపించుకుని, కాసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ డ్యూటీ ఎక్కుతుంది కొడుకుతో. రాత్రి ఎనిమిది వరకూ పని చేస్తుంది. మధ్యలో కొడుకు ఆకలికి ఒక పాల సీసా పెట్టుకుంటుంది. ఇంత శ్రమ చేస్తే ఆమెకు రోజుకు 600 మిగులుతున్నాయి. ఒక్కోసారి కొడుకు పొట్ట మీద నిద్రపోతాడు. ఒక్కోసారి మేలుకుని హుషారుగా ఉంటాడు. ఒక్కోసారి మాత్రం ఏడుస్తూనే ఉంటాడు. కాని పాసింజర్లు విసుక్కోరు. ఆమెను సానుభూతితో అర్థం చేసుకుంటారు. మహిళా పాసింజర్లయితే ఈమె ఆటోనే వెతికి ఎక్కుతారు.. సాయం చేసినట్టు ఉంటుందని. ఎండాకాలం వస్తే మాత్రం బిడ్డను తీసుకుని తిరగడం కష్టం అంటుంది చంచల్. ఆ టైమ్‌లో తల్లి మీద ఆధారపడాల్సి వస్తుంది అంటుంది. ‘నా బిడ్డ కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను’ అంటుంది చంచల్ శర్మ. ఒంటరి స్త్రీ... సింగిల్ మదర్‌గా జీవించడంలో బెంబేలెత్తాల్సిన పని లేదు. సమాజంలో ఇప్పుడు సింగిల్ మదర్‌కు అండ దొరుకుతుంది. వారు కష్టపడి పని చేయాలనుకుంటే సాయం చేసే వారూ ఉన్నారు. కావలసిందల్లా ఎదురొడ్డే తెగువే. చంచల్ శర్మను చూసి చాలా మంది స్ఫూర్తి పొందుతున్నారు. -
గుర్తింపు కార్డుల్లో అమ్మ పేరు కోసం...
‘అమ్మ పేరు’ కోసం ఓ కొడుకు చేసిన పోరాటం వ్యవస్థలోని లొసుగులను బయటపెట్టింది. చట్టబద్దమైన గుర్తింపు పత్రాల్లో అమ్మ పేరు చేర్చడానికి ఏడేళ్లుగా అతడు అలుపెరగని ఫైట్ చేశాడు. ఎట్టకేలకు విజయం సాధించి ‘అమ్మ పేరు’ను సార్థకం చేశాడు. అతడి పేరు సువామ్ సిన్హా. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో లింగ్విస్టిక్ చదువుకుంటూ పనిచేస్తున్న 23 ఏళ్ల సువామ్ పోరాట పటిమను ‘హిందూ’ వెలుగులోకి తెచ్చింది. సుదీర్ఘ పోరాటం సువామ్ సిన్హా తల్లిదండ్రులు అతడి రెండేళ్ల వయసులో విడిపోయారు. అతని తండ్రి నేపాల్‌కు చెందినవాడు, తల్లి బీహార్‌లోని భాగల్పూర్ ప్రాంతవాసి. కోల్‌కతాలో హైస్కూల్ పూర్తి చేసిన తర్వాత, సువామ్ తన తండ్రి పేరు లేకుండా స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ (SLC) కోసం తన స్కూల్ ప్రిన్సిపాల్‌ని సంప్రదించినప్పుడు.. బహుశా అతడు అనుకుని ఉండడు ఈ పోరాటం చాలా కాలం సాగుతుందని. అతడు ఊహించనట్టుగానే జరిగింది. భారత పౌరుడిగా తనకు అర్హత ఉన్న తన ప్రాథమిక గుర్తింపు కార్డులన్నింటిలో చట్టబద్ధమైన సంరక్షురాలిగా తన తల్లి పేరును చేర్చేందుకు అతడు సుదీర్ఘ పోరాటం చేశాడు. చాలా చర్చల తర్వాత సువామ్.. తన తల్లి మొదటి పేరుతో తొలిసారిగా స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ పొందాడు. అయితే, 2015 -2017 మధ్య కాలంలో ఆధార్ కార్డ్.. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసినప్పుడు అడ్డంకులు తలెత్తాయి. ఫిబ్రవరి 11న పాన్‌కార్డు అందుకోవడంతో అతడి పోరాటం ముగిసింది. పాన్‌కార్డులో తన తల్లి పేరు చూసి ఆనందంతో అల్లంత దూరన ఉన్న అమ్మతో సంతోషాన్ని పంచుకున్నాడు. సిన్హా తల్లి నేపాల్‌లోని ఖాట్మండులోని ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో కంట్రీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తాను కోరుకున్న విధంగా తన తండ్రి పేరు లేకుండా అన్ని గుర్తింపు కార్డులు పొందడానికి ఎన్ని అవమానాలు ఎదురైనా అతడు వెనుకడుగు వేయలేదు. తండ్రి పేరే కొలమానమా? ‘తండ్రి పేరు మాత్రమే గుర్తింపు కొలమానంగా ఎందుకు ఉండాలి. మా నాన్న నా జీవితంలో ఎప్పుడూ లేడు, అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని చెప్పే సువామ్ సిన్హా... తన గుర్తింపు పత్రాలన్నిటిలోనూ తల్లి పేరే ఉండాలని కోరుకున్నాడు. తల్లితో కలిసి దరఖాస్తులు పట్టుకుని ఆయా కార్యాలయాలకు వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవాలు తట్టుకుని ముందుకు సాగాడు. అప్పటి కేంద్ర మంత్రుల సుష్మా స్వరాజ్, మేనకా గాంధీ నుంచి ఎంతో మంది ఉన్నతాధికారులకు మెయిల్ ద్వారా వినతులు పంపాడు. సింగిల్ పేరెంట్స్ అభ్యర్థనల మేరకు పాస్‌పోర్ట్ నియమాలను 2016 డిసెంబర్లో కేంద్ర ప్రభుత్వం సవరించింది. పాస్‌పోర్ట్ దరఖాస్తులో చట్టపరమైన సంరక్షకులుగా తండ్రి లేదా తల్లి పేరు చేర్చేలా నిబంధనలను సవరించారు. అలాగే పాన్‌కార్డు నిబంధనలను కూడా ఆదాయపు పన్ను శాఖ 2018లో మార్చింది. అయితే ఆన్లైన్లో దీన్ని అప్డేట్ చేయలేదు. సువామ్ సిన్హా ఇ-దరఖాస్తు చేసిన ప్రతిసారి తండ్రి పేరు అడుగుతూనేవుంది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) జోక్యంతో అతడు చివరికి దరఖాస్తు చేయగలిగాడు. పాన్‌కార్డుతో సహా అన్ని గుర్తింపుకార్డుల్లో తనకు చట్టబద్ద సంరక్షకురాలిగా తల్లి పేరును లిఖించి అమ్మకు ఎనలేని ఆనందాన్ని కలిగించిన సువామ్ సిన్హాను నెటిజన్లు మనసారా మెచ్చుకుంటున్నారు. -
ఇట్లు... రేవతి
శక్తి ఎక్కడో లేదు.. మనలోనే ఉంది.. తెలుసుకోవాలంతే... శాశ్వత ఆనందం.. అశాశ్వత ఆనందం... తేడా తెలుసుకోవాలంతే... ఎప్పుడు మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి?.. తెలుసుకోవాలంతే... పిల్లలను ఏ వయసు వరకూ గైడ్ చేయాలి.. ఆ విషయాన్ని తెలుసుకోవాలంతే... వెండితెరపై గుర్తుండిపోయే పాత్రల్లో అలరిస్తున్న రేవతి ‘ఇట్లు.. రేవతి’ అంటూ మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా చెప్పారు. ఆమె టైటిల్ రోల్లో ‘అంకురం’ ఫేమ్ ఉమామహేశ్వరరావు దర్శకత్వం వహించిన ‘ఇట్లు అమ్మ’ చిత్రం హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా రేవతితో ‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. ► కథలు ఎంచుకునే విషయంలో మీరు మొదటి నుంచి సెలెక్టివ్‌గా ఉంటారు. ‘ఇట్లు అమ్మ’ అంగీకరించడానికి కారణమేంటి? రేవతి: నటిగా 30 ఏళ్లు దాటిన తర్వాత మంచి పాత్రలు రావడం చాలా తక్కువ అవుతుంది. నిజానికి నేను బాగా కనెక్ట్ అయ్యే పాత్రలు చాలా తక్కువ వస్తున్నాయి. ‘ఇట్లు అమ్మ’ స్క్రిప్ట్ వినగానే కనెక్ట్ అయ్యాను. అందుకే వెంటనే చేయాలని నిర్ణయించుకున్నాను. సి.ఉమామహేశ్వరావు డైరెక్షన్లో నేను ‘అంకురం’ (1992) సినిమా చేశాను.. మంచి దర్శకుడు. ఆయన ‘ఇట్లు అమ్మ’ కథ’ చెప్పగానే ఎగ్జయిట్ అయ్యాను. ► ‘ఇట్లు అమ్మ’లో కొడుకుని వెతికే సింగిల్ మదర్ పాత్రలో కనిపించారు. సినిమాలో ‘సింగిల్ మదర్’ గెలుస్తుంది. కానీ జీవితంలో సింగిల్ మదర్ గెలిచే అవకాశం ప్రస్తుత సమాజం ఇస్తుందంటారా? సమాజమంటే మనమే కదా. ఓ మంచి సమాజాన్ని ఏర్పరచాల్సిన బాధ్యత మనందరి మీదా ఉంది. ఇదే విషయాన్ని ‘ఇట్లు అమ్మ’లో చెప్పాం. ‘ఇట్లు అమ్మ’ ఒక అమ్మ, ఒక స్త్రీ కథ మాత్రమే కాదు. నిజానికి మనం, మన ఇల్లు, మన కుటుంబం, స్నేహితులు, మనమందరం అని మాత్రమే ఆలోచిస్తాం. దీన్ని దాటి చూడం. ఏం జరుగుతున్నా పెద్దగా పట్టించుకోం. ఏదైనా జరిగితే మాట్లాడుకుని వదిలేస్తాం తప్పితే మన వంతుగా ఏం చేయాలో ఆలోచించం. ‘ఇట్లు అమ్మ’ లో నేను చేసిన రోల్ కూడా ఇదే. బాల సరస్వతి (‘ఇట్లు అమ్మ’లో రేవతి చేసిన పాత్ర) సాధారణ గృహిణి. నా ఇల్లు, నా కుటుంబం అనుకుంటుందామె. కానీ తన జీవితంలో ఎదురయ్యే సందర్భాలు తనని, తన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చాయి? తను ఎలా మారింది? అన్నది కథ. ఇంకా బాల సరస్వతి చాలా తెలివైనది. దైవభక్తి చాలా ఎక్కువ. నేనస్సలు కాదు. ► అంటే... మీరు దేవుణ్ణి నమ్మరా? నమ్మనని కాదు. బాల సరస్వతి నమ్మినంతగా నమ్మకం లేదు. అయితే ఒక శక్తి మనల్ని నడిపిస్తుందని నమ్ముతాను. నా వెనక ఓ శక్తి ఉందని నమ్ముతాను. ఏదైనా కష్టం వచ్చినప్పుడు కళ్లు మూసుకుని ప్రార్థన చేస్తాను. కానీ ప్రత్యేకంగా ఓ ప్రదేశానికి వెళ్లి పూజించడాన్ని నమ్మను. మా ఇంట్లో రోజువారి పనుల్లో దీపం వెలిగించడం కచ్చితంగా ఒకటి. దైవభక్తికి, ఆధ్యాత్మికతకు చాలా తేడా ఉంది. నేను ‘అహం బ్రహ్మాస్మి’ అనే సిద్ధాంతాన్ని నమ్ముతాను. శక్తంతా మనలోనే ఉందని గ్రహించాలి. మనం ఆ బలాన్ని ఉపయోగించుకోవాలి. ► మీ వెనక ఓ శక్తి ఉందన్నారు. ఆ శక్తి మీ జీవితాన్ని సాఫీగా సాగేలా చేస్తోందంటారా? మీకు సహాయపడిందంటారా? మన వెనక ఉండే శక్తి కేవలం గైడ్ మాత్రమే. అది మనకు మంచి జీవితం, మంచి కెరీర్ ఇవ్వదు. శక్తి ఉంది కదా అని సైలెంట్‌గా కూర్చోకూడదు. మన కష్టం, మన శ్రమ మాత్రమే ఇస్తాయి. వెనకాల ఉండే ఫోర్స్ గైడ్ చేస్తుంది. ఆ గైడెన్స్ ఉందని నా నమ్మకం. ఇంకా నా గైడింగ్ ఫోర్స్ అంటే నా కుటుంబమే. అమ్మ, నాన్న, సిస్టర్ నా వెనక ఉన్నారు... నన్ను నడిపించారు... నడిపిస్తుంటారు. అలానే నిర్ణయాల విషయంలో ఇది సరైనదా? కాదా, తప్పా? ఒప్పా అనేది మాత్రం నాకు తెలిసిపోతుంది. ► సమాజంలో మ్యారీడ్ ఉమన్ జీవితానికి ఉండే భరోసా సింగిల్ మదర్‌కి ఉంటుందంటారా? జీవితం ఎవ్వరికీ సాఫీగా ఉండదు. సమాజంలో ఎప్పుడూ ఏదో ఒక సమస్య... గొడవ ఉంటుంది. దాన్ని మనం ఎలా ఎదుర్కొంటాం అనేది ముఖ్యం. ఎదుర్కొనే క్రమంలో మనం నేర్చకున్న విషయాలను పిల్లలకు చెప్పి, ఎలా ఎదుర్కొనేలా తయారు చేస్తాం అనేది ముఖ్యం. లైఫ్‌లో ఏదీ సులువు కాదు. ప్రతి దాని వెనక ఏదో ఒక కష్టం ఉంటుంది.. సమస్య ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఓ యుద్ధం చేస్తూనే ఉంటారు. ► మీ నాన్న ఆర్మీ ఆఫీసర్. ఆయన నేర్పిన ధైర్యమే మిమ్మల్ని ధైర్యంగా నడిపిస్తుందని అనుకుంటున్నారా? ఖచ్చితంగా.. మా అమ్మానాన్న నన్ను, నా సిస్టర్ని చాలా బాగా పెంచారు. అసలు లింగ వివక్ష అనేది ఉంటుందని నాకు 30 ఏళ్లు వచ్చాకే తెలిసింది. అప్పటివరకూ అమ్మాయిని ఒకలా చూస్తారు, అబ్బాయిని ఒకలా చూస్తారనే విషయమే నాకు తెలియదు. ఆర్మీలో అందర్నీ ఒకేలా చూశారు. దాంతో మాకు అబ్బాయి వేరు... అమ్మాయి వేరు అనే ఫీలింగ్ కలగలేదు. ► కరోనా లాక్డౌన్.. ప్రపంచం ఎటు వెళుతుందో అర్థం కాని పరిస్థితి.. ఒక అనిశ్చితి ఉందనేది చాలామంది ఫీలింగ్. మీరేం చెబుతారు? నిజమే. ప్రస్తుతం మనందరం ఓ అయోమయ స్థితిలో ఉన్నాం. ఎటు వెళ్తున్నామో అర్థం కాని పరిస్థితి. ఈ కోవిడ్, లాక్డౌన్ మనందరినీ ఏది ముఖ్యమో ఆలోచించేలా చేసింది. కేవలం మనం మాత్రమే కాదు.. మన చుట్టూ ఉన్నవి కూడా మనం పట్టించుకోవాలి. అప్పుడే మన పిల్లలకు ఓ మంచి సమాజాన్ని ఏర్పాటు చేయగలం. వాళ్లకు డబ్బు, ఇల్లు కాదు మంచి విద్య, మంచి సమాజాన్ని, సురక్షితమైన వాతావరణాన్నీ ఇవ్వాలి. మన పిల్లలకు మనమిచ్చే గొప్ప సంపద అదే. ► పిల్లలకు సురక్షితమైన వాతావరణాన్ని, సమాజాన్ని ఇవ్వాలన్నారు. ప్రస్తుతం మన సమాజం అమ్మాయిలకు సురక్షితంగా ఉందంటారా? చాలా దారుణాలు జరుగుతున్నాయి. వీటికి కారణమేమంటారు? నాకు నిజంగా తెలియదు. కారణం ఇదీ అని విశ్లేషించగలిగి ఉంటే పరిష్కారం చెప్పేదాన్ని. ప్రస్తుతం అందరి అవసరాలు మారిపోయాయి. ఇప్పటివారి అవసరాలు మన ముందు తరాల వాళ్లకంటే మారిపోయాయి. మా అమ్మ వాళ్లు ఒకలా బతికారు. మేము ఒకలా. ఇప్పుడు మా పిల్లలు ఒకలా ఉన్నారు. ఆ అవసరాల కోసం మనం ఎంతలా తాపత్రయపడుతున్నాం? మనం ఎంత నైతిక భాధ్యతతో ఉంటున్నాం అనేది మారిపోయింది. ఇది తప్పు, ఇది ఒప్పు అనే ఫిలాసఫీ మారిపోయింది. ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్‌కే ఇది బాగా మారిపోయింది. కాకపోతే ఒకప్పటి విధానాల్లో కొన్నింటిని తిరిగి తీసుకురావాలి. అది ఎలా తీసుకురావాలో నిజంగా తెలియదు. అయితే మన పిల్లలతో మనం మాట్లాడాలి. నిజమైన సంతోషమేంటి? శాశ్వత ఆనందమేంటి? అశాశ్వతం ఏంటి? అనే విషయాలను వాళ్లకు వివరించాలి. ► మాకు ‘ప్రైవసీ’ కావాలని ఇప్పటి తరం అంటోంది. ఎక్కువ స్వాతంత్య్రం ఇచ్చినా ఇబ్బందే అంటారా? అసలు పిల్లల్ని ఏ వయసు వచ్చేవరకూ తల్లిదండ్రులు గైడ్ చేయాలి? 18ఏళ్ల వయసొచ్చే వరకే పిల్లల్ని మనం గైడ్ చేయాలి. ఆ తర్వాత వాళ్లను వాళ్లే గైడ్ చేసుకోవాలి. అలా వాళ్లను వాళ్లు గైడ్ చేసుకునే ధైర్యం, తెగువ అన్నీ మనమే ఇవ్వాలి. 20 ఏళ్ల తర్వాత కూడా పిల్లల్ని గైడ్ చేయడం అనేది నాన్సెన్స్ అంటాను నేను. వాళ్లు చిన్న చిన్న తప్పులు చేయాలి.. ఆ తప్పుల నుంచి నేర్చుకోవాలి. వాటిని సరిదిద్దుకోవడం తెలుసుకోవాలి. అలా చేయకూడదు అని ఆలోచించగలగాలి. అయితే 10–12 ఏళ్ల వయసులోనే ఈ ఫౌండేషన్ పడేలా చూసుకోవాలి. తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకు చాలా ప్రేమ, భద్రత ఇవ్వాలి. ఏదైనా సమస్య వచ్చిన వెంటనే వాళ్లు మనతో నిర్మొహమాటంగా, నిర్భయంగా పంచుకునే స్వేచ్ఛ ఇవ్వాలి. 20 ఏళ్ల తర్వాత కూడా పిల్లల్ని ఒళ్లో కూర్చోబెట్టుకుని ఏది చేయాలో ఏది చేయకూడదో చెప్పడం నాన్సెన్స్. ► ఓకే... మీ మాటలను బట్టి మీ అమ్మాయి మహీకి అన్నీ వివరంగా చెబుతారనిపిస్తోంది.. అవును. ప్రతి తల్లికీ బిడ్డల మీద ప్రేమ ఉన్నట్లుగానే నాకూ తనంటే చాలా ప్రేమ. ప్రేమతో పాటు సెక్యూర్డ్ ఫీలింగ్‌ని కలగజేస్తాను. మహీ తనంతట తాను నిలబడటానికి గైడ్ చేస్తూ ఉంటాను. తను ఇండిపెండెంట్ అమ్మాయి. ► మహీ ఏం చదువుతోంది? థర్డ్ గ్రేడ్‌లో ఉంది. ► ఏ ఇండస్ట్రీలో అయినా స్త్రీలకు ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఆ ఇబ్బందులను బయటకు చెబితే ‘తప్పు తనదేనేమో’ అనేవాళ్లు ఉంటారు. మరి.. మీరు మీకు ఎదురైన ఇబ్బందులు చెప్పుకోవడానికి భయపడిన సందర్భాలున్నాయా? అదృష్టవశాత్తు లేవు. మొదట్నుంచీ కూడా నాకు చాలా తక్కువ మాట్లాడటం అలవాటు. కానీ మాట్లాడే విషయాన్ని మాత్రం చాలా విజన్‌తో, అవగాహనతో మాట్లాడతాను. దాంతో అందరూ నా మాట వినేవారు. ఈ సందర్భంగా నేనొక విషయం చెబుతాను. ఎప్పుడు మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? అనే విషయాన్ని కూడా మనం పిల్లలకు నేర్పించాలి. అది చాలా ముఖ్యం. ► మంచి విజన్‌తో, అవగాహనతో మాట్లాడితే అందరూ వింటారని అన్నారు. మీలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తే ప్రజలు మీ మాట వినే అవకాశం ఉంటుంది.. 1996 తర్వాత మళ్లీ మీరు రాజకీయాల్లోకి రాలేదేం? అలా ఆలోచించే 1996 ఎన్నికల్లో నిల్చున్నాను కూడా. కానీ ప్రస్తుతం ఆలోచించడం లేదు. ఎందుకంటే పాలిటిక్స్ అనేది 24/7 జాబ్. ప్రస్తుతం నాకు ఓ పాప ఉంది. తనని చక్కగా పెంచాలి. మంచి సిటిజన్‌గా మార్చాలి. ఈ బాధ్యత పూర్తయ్యాక రాజకీయాల గురించి ఆలోచిస్తానేమో ఇప్పుడే చెప్పలేను. ► మీరు హీరోయిన్గా చేసే సమయంలో కథలు చాలా బావుండేవి. ఇప్పుడు అలాంటి కథలు ఉన్నాయంటారా? కథలు ఉన్నాయి.. అయితే కథలు చెప్పే విధానంలో మార్పు వచ్చింది. కొన్ని మలయాళం, హిందీ సినిమాల్లో కథ చెప్పే విధానం అద్భుతంగా ఉంది. మంచి సినిమాలను మనందరం సపోర్ట్ చేయాలి. అప్పుడే మంచి సినిమాలు తీస్తారు. ► ఫైనల్లీ.. కొంత గ్యాప్ తర్వాత ‘ది లాప్ట్ హుర్రా’ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు... ఆ సినిమా గురించి? చాలా సంవత్సరాల క్రితం చదివిన కథ ఇది. ఆ కథను మంచి స్క్రిప్ట్‌గా తయారు చేశాం. ఎలాంటి క్లిష్ట పరిస్థితులను అయినా నవ్వుతూ ఎదుర్కొనే ఓ తల్లి కథ ఇది. ఈ కథకు కాజోల్ సరిపోతారని ఆమెను తీసుకున్నాం. ►ప్రస్తుత సోషల్ మీడియా జనరేషన్లో మంచి విషయంలోనూ చెడు చూడటం కామన్ అయింది... ఈ విషయం గురించి ఏం చెబుతారు? తరాలు మారుతుంటాయి. ఆ మార్పుతో మనం ముందుకు వెళ్లాలి. మంచి, చెడు అని చెప్పలేం. సోషల్ మీడియాలో విమర్శలు అంటున్నారు. అసలు ఆ విమర్శలను ఎందుకు పట్టించుకుంటున్నారు? వాటికి ఎందుకు అంత టైమ్ కేటాయిస్తున్నారు? నేను సోషల్ మీడియాని నాకు కావాల్సిన సమాచారాన్ని తీసుకోవడం వరకే ఉపయోగిస్తాను. ఏదైనా తెలుసుకోవడానికో, నేర్చుకోవడానికో, నాకు తెలిసింది పంచుకోవడానకో... అంతే. విమర్శలకు ప్రాముఖ్యత ఇవ్వకపోతే ఆటోమేటిక్‌గా అవే తగ్గిపోతాయి. అది నా నమ్మకం. ఇప్పుడు మనం అపార్ట్మెంట్లో ఉన్నాం అనుకుందాం. మన పని మనం చేసుకుంటే హాయిగా ఉంటుంది. ఎదురింట్లో వాళ్లకి ఫ్రిజ్ ఉందా? పక్కింట్లో వాళ్లకు ఎలాంటి చీర ఉంది? అనేవి పట్టించుకొని ప్రతీది ఆలోచిస్తేనే ప్రాబ్లమ్. మన గురించి మనం చూసుకుని, మన చుట్టూ ఉండేవాళ్ల విషయాలను విమర్శించకుండా ఉంటే ఏ గొడవా ఉండదు. – డి.జి. భవాని -
Luqma Kitchen: ‘సింగిల్’ క్వీన్స్ సాధించిన సక్సెస్
బిజినెస్ అంటే వందల కోట్ల డబ్బులు సంపాదించడం కాదు... చుట్టూ ఉన్న ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు తేవడం, ఉపాధి కల్పించి సమాజంలో సంపదను సృష్టించడం. అందుకే వ్యాపార వర్గాలకు ప్రభుత్వాలు రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానిస్తాయి. అయితే ఇక్కడ ఏ కార్పోరేట్ సంస్థ అడుగు పెట్టలేదు, ప్రభుత్వం నుంచి సహాకారం అందలేదు. అయినా సరే చీకటి నిండిన జీవితాల్లో వెలుగు వచ్చాయి. ► పాతబస్తీకి చెందిన సలేహాకు ముగ్గురు పిల్లలు. ఉన్నట్టుండి భర్త విడాకులు ఇచ్చేశాడు. కనీసం భరణం కూడా ఇవ్వలేదు. అక్షర జ్ఞానం అసలే లేదు. ముగ్గురు పిల్లల పోషణకు టైలరింగ్ చేసినా అది కుటుంబ పోషణకు సరిపోలేదు. తన చేతి వంట బాగుంటదనే పేరు తప్ప ఆమెకంటే ప్రత్యేకతలు ఏమీ లేవు. ► భర్త చనిపోవడంతో ఉన్న కొడుకుతో పాటు అత్తమామలను బాగోగులు యాభై ఏళ్ల బదరున్సీసాపై పడ్డాయి. స్థానికంగా చిన్న హోటల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. ఓ రోజు ఆ హోటల్లో దొంగతనం జరగడంతో.. అప్పులపాలై తిరిగి హోటల్ నిర్వహించలేని స్థితికి చేరుకుంది. సలేహా, బదరున్నీసా లాంటి మరో పదిమూడు మంది మహిళలది ఇంచుమించు ఇలాంటి కథలే. అందరి జీవితాల్లో కామన్ పాయింట్స్.. తోడుండాల్సిన భర్త అండగా లేకపోవడం, నిత్యం నరకం చూపించే భర్త నుంచి విడిపోవడం. మరోవైపు తిండికి బట్టకు విద్యకు తమపైనే ఆధారపడ్డ కుటుంబాలు. ఉమ్మడి శక్తి ఒంటరి మహిళ అంటే బలహీనం, కానీ అలాంటి ఒంటరి మహిళలు ఐక్యంగా మారితే, తమలో ఉన్న స్కిల్‌కి పదును పెడితే, దానికి వ్యాపార మెలకువలను అద్దితే వారి జీవితాల్లో వెలుగు నిండటమే కాదు, మరికొందరి కష్టాలు తీర్చేందుకు సైతం ఉపయోగపడింది. హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ ఒంటరి మహిళల ఉమ్మడి శక్తికి ప్రతిరూపమే లుక్మా కిచెన్. లుక్మా అంటే నోరూరించే అనే తెలుగు పదానికి ఉర్థులో సమానార్థం వస్తుంది. సఫా సహకారంతో హైదరాబాద్‌లో పాతబస్తీలో పని చేసే సఫా ఎన్జీవో సంస్థ చేపట్టిన వివిధ కార్యకర్రమాల్లో సలేహా, బదరున్నీసా వంటి ఒంటరి మహిళలు భాగస్వాములుగా ఉన్నారు. భర్త తోడుగా లేకపోయినా ఒంటరిగా కష్టాలు పడుతూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఎంత కష్టం చేసిన వచ్చే ప్రతిఫలం అంతంతే. ఇలాంటి ఒంటరి మహిళలకు సఫా చేయూతను అందించి వారందరికి బ్యూటీషియన్, టైలరింగ్‌లలో శిక్షణ ఇచ్చారు. కమ్యూనిటీ కిచెన్ సఫా శిక్షణ కేంద్రంలో చాలా మంది తాము టైలరింగ్ , బ్యూటీషియన్ కోర్సులు చేయలేమని కాకపోతే చాలా బాగా వంట చేస్తామని చెప్పారు. ఇలా రుచికరమైన వంటలు చేసే వారికి ఒక్క తాటిపైకి తెచ్చి లుక్మా పేరుతో కమ్యూనిటీ కిచెన్‌ని 2019లో ప్రారంభించారు. ఫేస్బుక్, ఇన్‌స్టా వంటి సోషల్ మీడియా వేదికగా ప్రచారం ప్రారంభించారు. ఫోన్లోనే ఆర్డర్లు తీసుకుంటూ వ్యాపారం మొదలుపెట్టారు. కోవిడ్‌తో కోలుకున్నారు లుక్మా కిచెన్ ప్రారంభమైనా ఆర్డర్లు అంతంత మాత్రమే. తమ జీవితాలు వెలుగు నిండే రోజే లేదా అని ఆలోచిస్తున్న సమయంలో కరోనా సంక్షోభం తలెత్తింది. హోటళ్లు మూతపడ్డాయి, బయట తిండి దొరకని పరిస్థితి, మరోవైపు పొట్ట చేతబట్టుకుని సొంతూళ్లకు పయణమైన వలస కార్మికులు. ఈ విపత్కర పరిస్థితులు కొడిగట్టిపోతున్న లుక్మా కిచెన్‌కి ఊపిరి అందించింది. వలస కార్మికులకు భోజనం అందించేందుకు సిద్ధపడిన ఎన్జీవోలు, దాతలు లుక్మాను సంప్రదించారు. అలా చేతి నిండా పని దొరికింది. వారి వంటల గురించి నలుగురికి తెలిసింది. ఇంటి వంట సాధారణ హోటల్ ఫుడ్‌కు భిన్నంగా ఇంటి తరహా వంటలు అందివ్వడమే లుక్మాను ప్రత్యేకంగా నిలబెట్టింది. లుక్మా నుంచి ఫుడ్ కావాలంటే ఒక రోజు ముందుగానే ఆర్డర్ బుక్ చేసుకోవాలి. అప్పుడు తీసుకున్న ఆర్డర్ ప్రకారం పూర్తిగా ఇంటి తరహా పద్దతిలోనే వంటలు తయారు చేసి డెలివరీ ఇస్తారు. లుక్మాకు వచ్చే ఆర్డర్లలో ఎక్కువగా కిట్టీ పార్టీలు, బర్త్ డే, వెడ్డింగ్డే, గెట్ టూ గెదర్‌కి సంబంధించిన ఆర్డర్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఇంటి ఫుడ్ మాత్రమే కావాలనుకునే వారి నుంచి సైతం ఆర్డర్లు స్వీకరిస్తున్నారు. లుక్మా స్పెషల్స్ లుక్మా కిచెన్‌లో హైదరాబాద్ స్పెషల్ వంటకాలైన ఖట్టీదాల్, బగార్ ఏ బైగన్, దమ్ కా కీమా, దాల్చా, ఆచారి చికెన్, తలావా ఘోష్, ఖుబూలీ, దస్తీరోటీ, మిర్చీకా సలాన్, షమీ కబాబ్, చికెన్ కట్లెట్స్, గిలే ఏ ఫిర్దౌస్, ఖుబాని కా మీఠా, డబుల్ కా మీఠా తదిరత రుచికరమైన వంటకాలు లభిస్తాయి. గాడిన పడ్డ బతుకులు ఒకప్పుడు టైలరింగ్ ఇతర చేతి వృత్తి పనులు చేసుకుంటూ నెలకు కేవలం రూ.5000 సంపాదించడమే వారికి చాలా కష్టంగా ఉండేది. లుక్మా వారి జీవితాల్లోకి వచ్చిన తర్వాత కడుపు నిండా తిండే కాదు వాళ్లింట్లో పిల్లల చదువులకు సైతం ఇబ్బంది లేని స్థితికి చేరుకున్నారు. ఫ్యూచర్ ప్లానింగ్ లుక్మా కిచెన్‌తో ఒకప్పటి తమ కష్టాలు తీరిపోయాయి ఇక రిలాక్స్ అవుదామనే ఆలోచనలో లేదు లుక్మా టీం. తమ వ్యాపారంలో వచ్చిన డబ్బులో సగం రా మెటీరియల్‌కు ఇచ్చేయగా, మిగిలిన దాంట్లో ముప్పై శాతాన్ని తమ వేతనంగా తీసుకుంటున్నారు. మిగిలిన 20 శాతాన్ని వ్యాపార విస్తరణ కోసం సేవ్ చేస్తున్నారు. ఇప్పటికే లుక్మా కిచెన్ నుంచి మసాలాలు తయారు చేసి విక్రయిస్తున్నారు. న్యూ సిటీకి వచ్చేస్తాం లుక్మా కిచెన్ ఓల్డ్ సిటీలో ఉన్నప్పటికీ ఆర్డర్లు ఎక్కువగా న్యూ సిటీ నుంచే వస్తున్నాయి. అంతేకాదు ఇటీవల గచ్చిబౌలీలో కొలువైన ఐటీ ఎంప్లాయిస్ సైతం లుక్మా టేస్ట్‌కి ఫిదా అయిపోతున్నారు. అక్కడి నుంచి కూడా స్పెషల్ డేస్‌కి ఆర్డర్లు పెరుగుతున్నాయి. దీంతో న్యూ సిటీలో రెండో బ్రాంచ్ ప్రారంభానికి రెడీ అవుతోంది లుక్మా టీం. అవకాశాన్ని అంది పుచ్చుకుని వ్యాపారం, స్టార్టప్‌లు ప్రారంభించాలంటే మంచి కుటుంబ నేపథ్యం, ఉన్నత విద్య, లక్షల కొద్ది పెట్టుబడి అక్కర్లేదు. సాధారణ కుటుంబ నేపథ్యం ఉన్న వారైనా సరై తమకున్న నైపుణ్యానికే కొంచెం ఓర్పు, మరికొంత నేర్పు జత చేస్తే చాలని నిరూపించారు. అక్షర జ్ఞానం లేకున్నా సరే సోషల్ మీడియా వేదికగా ప్రచారం నిర్వహించి ఫోన్ల ద్వారా ఆర్డర్లు స్వీకరించి కమ్మని వంటలు అందిస్తున్నారు. తమ కుటుంబ కష్టాలను గట్టెక్కించారు. - సాక్షి, వెబ్ ప్రత్యేకం చదవండి : వర్కింగ్ విమెన్: మీకోసమే ఈ డ్రెస్సింగ్ స్టైల్ -
‘నా పిల్లలకు ఆ పరిస్థితి రాకూడదు’
తండ్రి లేని లోటు నాకు బాగా తెలుసు.. నా పిల్లలకు ఆ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్. తన చిన్నప్పుడే కత్రినా తల్లిదండ్రులు మనస్పర్ధలతో విడిపోయారు. దాంతో చిన్నప్పటి నుంచి కత్రినా తండ్రి లేకుండానే పెరిగారు. ఈ విషయం గురించి కత్రినా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఆడపిల్ల జీవితంలో తండ్రి లేకపోతే.. ఒక శూన్యం ఏర్పడుతుంది. అభద్రతకు గురవుతుంది. ఈ బాధలను నేను అనుభవించాను. ఎందుకంటే నేను తండ్రి లేకుండా పెరిగాను. ఆ లోటు ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. అందుకే భవిష్యత్తులో నా పిల్లలకు ఆ లోటు ఉండకూడదు. వారికి తల్లిదండ్రులతో కలిసి ఉంటే కలిగే అనుభూతి తెలియాలి’ అన్నారు. అయితే ‘జీవితంలో తండ్రి లేనంత మాత్రాన ఓ ఆడపిల్ల అన్నీ కోల్పోయినట్లు కాదు. మేం ఏడుగురు తోబుట్టువులం. మా అమ్మ మమ్మల్ని చాలా క్రమశిక్షణతో పెంచింది. చిన్నప్పుడు నేను చాలా సైలెంట్‌గా ఉండేదాన్ని. అన్నీ నాలోనే దాచుకునేదాన్ని. అలాంటిది నేను హీరోయిన్ ఎలా అయ్యానో నాకే తెలీడంలేదు’ అన్నారు. ప్రసుత్తం కత్రినా కైఫ్, సల్మాన్‌తో నటించిన ‘భారత్’ సినిమా జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలీ అబ్బాస్ జఫర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దిశా పటానీ మరో కథానాయికగా నటించారు. -
ఓ బిడ్డ తల్లిగా...
హిందీ చిత్రసీమలో నంబర్‌వన్ అందాలతార ఎవరంటే దాదాపుగా అందరూ కత్రినాకైఫ్ పేరే చెబుతారు. అందుకు తగ్గట్టుగానే ఆమె అత్యధిక శాతం గ్లామర్ పాత్రలే పోషిస్తుంటారు. ‘రాజ్‌నీతి’ సినిమా తరహాలో అప్పుడప్పుడూ ప్రయోగాత్మక పాత్రలు చేస్తుంటారు. ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో ప్రయోగానికి సిద్ధమయ్యారు. ‘కహానీ’ చిత్రం ద్వారా విద్యాబాలన్‌కి దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టిన సుజయ్ ఘోష్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో కత్రినా పాత్ర విభిన్నంగా ఉంటుందని వినికిడి. భర్తలేని ఒంటరి ఆడదానిగా కత్రినా కనిపించనుందట. పైగా ఇందులో ఆమె ఓ బిడ్డకు తల్లి కూడానట. జపాన్ నవల ’ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్’ అనే చిత్రం ఆధారంగా సుజయ్‌ఘోష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. త్వరలో కత్రినాకైఫ్ నటించిన భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ విభిన్న పాత్రలో కనిపిస్తే, అభిమానులు సంతృప్తి చెందుతారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.