గుర్తింపు కార్డుల్లో అమ్మ పేరు కోసం... | Suvam Sinha: Long Struggle For Mother Name Printed on Govt ID Cards | Sakshi
Sakshi News home page

‘అమ్మ పేరు’ కోసం అతడి పోరు..

Published Tue, Mar 8 2022 2:26 PM | Last Updated on Tue, Mar 8 2022 2:26 PM

Suvam Sinha: Long Struggle For Mother Name Printed on Govt ID Cards - Sakshi

‘అమ్మ పేరు’ కోసం ఓ కొడుకు చేసిన పోరాటం వ్యవస్థలోని లొసుగులను బయటపెట్టింది. చట్టబద్దమైన గుర్తింపు పత్రాల్లో అమ్మ పేరు చేర్చడానికి ఏడేళ్లుగా అతడు అలుపెరగని ఫైట్‌ చేశాడు. ఎట్టకేలకు విజయం సాధించి ‘అమ్మ పేరు’ను సార్థకం చేశాడు. అతడి పేరు సువామ్ సిన్హా. ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో లింగ్విస్టిక్‌ చదువుకుంటూ పనిచేస్తున్న 23 ఏళ్ల సువామ్‌ పోరాట పటిమను ‘హిందూ’ వెలుగులోకి తెచ్చింది.

సుదీర్ఘ పోరాటం
సువామ్ సిన్హా తల్లిదండ్రులు అతడి రెండేళ్ల వయసులో విడిపోయారు. అతని తండ్రి నేపాల్‌కు చెందినవాడు, తల్లి బీహార్‌లోని భాగల్‌పూర్‌ ప్రాంతవాసి. కోల్‌కతాలో హైస్కూల్ పూర్తి చేసిన తర్వాత, సువామ్‌ తన తండ్రి పేరు లేకుండా స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ (SLC) కోసం తన స్కూల్ ప్రిన్సిపాల్‌ని సంప్రదించినప్పుడు.. బహుశా అతడు అనుకుని ఉండడు ఈ పోరాటం చాలా కాలం సాగుతుందని. అతడు ఊహించనట్టుగానే జరిగింది. భారత పౌరుడిగా తనకు అర్హత ఉన్న తన ప్రాథమిక గుర్తింపు కార్డులన్నింటిలో చట్టబద్ధమైన సంరక్షురాలిగా తన తల్లి పేరును చేర్చేందుకు అతడు సుదీర్ఘ పోరాటం చేశాడు. 

చాలా చర్చల తర్వాత సువామ్.. తన తల్లి మొదటి పేరుతో తొలిసారిగా స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్ పొందాడు. అయితే, 2015 -2017 మధ్య కాలంలో ఆధార్ కార్డ్.. పాస్‌పోర్ట్ కోసం దరఖాస్తు చేసినప్పుడు అడ్డంకులు తలెత్తాయి. ఫిబ్రవరి 11న పాన్‌కార్డు అందుకోవడంతో అతడి పోరాటం ముగిసింది. పాన్‌కార్డులో తన తల్లి పేరు చూసి ఆనందంతో అల్లంత దూరన ఉన్న అమ్మతో సంతోషాన్ని పంచుకున్నాడు. సిన్హా తల్లి నేపాల్‌లోని ఖాట్మండులోని ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీలో కంట్రీ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తాను కోరుకున్న విధంగా తన తండ్రి పేరు లేకుండా అన్ని గుర్తింపు కార్డులు పొందడానికి ఎన్ని అవమానాలు ఎదురైనా అతడు వెనుకడుగు వేయలేదు. 

తండ్రి పేరే కొలమానమా?
‘తండ్రి పేరు మాత్రమే గుర్తింపు కొలమానంగా ఎందుకు ఉండాలి. మా నాన్న నా జీవితంలో ఎప్పుడూ లేడు, అతనితో నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని చెప్పే సువామ్‌ సిన్హా... తన గుర్తింపు పత్రాలన్నిటిలోనూ తల్లి పేరే ఉండాలని కోరుకున్నాడు. తల్లితో కలిసి దరఖాస్తులు పట్టుకుని ఆయా కార్యాలయాలకు వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవాలు తట్టుకుని ముందుకు సాగాడు. అప్పటి కేంద్ర మంత్రుల సుష్మా స్వరాజ్‌, మేనకా గాంధీ నుంచి ఎంతో మంది ఉన్నతాధికారులకు మెయిల్‌ ద్వారా వినతులు పంపాడు.

సింగిల్‌ పేరెంట్స్‌ అభ్యర్థనల మేరకు పాస్‌పోర్ట్ నియమాలను 2016 డిసెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం సవరించింది. పాస్‌పోర్ట్ దరఖాస్తులో చట్టపరమైన సంరక్షకులుగా తండ్రి లేదా తల్లి పేరు చేర్చేలా నిబంధనలను సవరించారు. అలాగే పాన్‌కార్డు నిబంధనలను కూడా ఆదాయపు పన్ను శాఖ 2018లో మార్చింది. అయితే ఆన్‌లైన్‌లో దీన్ని అప్‌డేట్‌ చేయలేదు. సువామ్‌ సిన్హా ఇ-దరఖాస్తు చేసిన ప్రతిసారి తండ్రి పేరు అడుగుతూనేవుంది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR) జోక్యంతో అతడు చివరికి దరఖాస్తు చేయగలిగాడు. పాన్‌కార్డుతో సహా అన్ని గుర్తింపుకార్డుల్లో తనకు చట్టబద్ద సంరక్షకురాలిగా తల్లి పేరును లిఖించి అమ్మకు ఎనలేని ఆనందాన్ని కలిగించిన సువామ్ సిన్హాను నెటిజన్లు మనసారా మెచ్చుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement