
ఆధార్, పాన్ కార్డు, ఓటర్ ఐడీ వివరాలు పబ్లిక్ డొమైన్‌లోకి..
లోకల్ సర్కిల్స్ సంస్థ సర్వేలో 87 శాతం మంది వెల్లడి
ఆధార్ డేటా లీకవుతోందని 54% మంది ఆందోళన
టెలికం, ఈ–కామర్స్, ఫైనాన్షియల్ సంస్థలే కారణమని అభిప్రాయం
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఎక్కడో ఒకచోట.. ఏదో ఒక అవసరానికి మన కీలక వివరాలైన ఆధార్, పాన్ కార్డు, ఈ–మెయిల్, ఫోన్ నంబర్.. వీటిలో ఏదో ఒకటి చెప్పక తప్పని పరిస్థితి. అయితే ఇలా మనం ఎంతో నమ్మకంగా ఇతర సంస్థలతో పంచుకునే డేటా కొన్ని మార్గాల్లో లీకవుతున్నట్టు తెలుస్తోంది.
వ్యక్తిగత వివరాలకు సంబంధించి డేటా లీకేజీలపై ప్రజాభిప్రాయం కోసం లోకల్ సర్కిల్స్ సంస్థ ఇటీవల చేపట్టిన సర్వేలో ఇదే అంశాలు వెల్లడయ్యాయి. ఆధార్, పాన్ కార్డు లేదా ఓటర్ ఐడీ.. ఇలా ఏదో ఒక రకమైన తమ డేటా పబ్లిక్ డొమైన్‌లోకి లీకైనట్టుగా సర్వేలో పాల్గొన్న 87 శాతం మంది వెల్లడించారు.
డేటా లీకేజీకి ఈ–కామర్స్ వెబ్‌సైట్లు, టెలికం, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, పేమెంట్ యాప్‌లతోపాటు ప్రభుత్వ కార్యాలయాలు కారణమై ఉండొచ్చని వారు పేర్కొన్నారు. మరో 50 శాతం మంది తమ ఆధార్ లేదా పాన్‌కార్డుల వివరాలు లీకయ్యే ప్రమాదం ఉన్నట్టుగా ఆందోళన వ్యక్తం చేశారు. డేటా లీకేజీ 2022లో 72 శాతంగా ఉండగా.. 2025 ఫిబ్రవరి నాటికి అది 87 శాతానికి చేరినట్టుగా లోకల్ సర్కిల్స్ సంస్థ వెల్లడించింది.
2024 అక్టోబర్‌లో ఆరోగ్య బీమా సంస్థ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వినియోగదారుల్లో 31 మిలియన్ల మంది డేటా లీకవడం.. ఇటీవల జరిగిన కుంభమేళా సమయంలో సంబంధం లేకుండానే ఎన్నో రకాల ఆఫర్ల పేరిట ఎస్‌ఎంఎస్‌లు రావడంతో డేటా లీకేజీపై ప్రజాభిప్రాయ సేకరణ చేసినట్టు సంస్థ వెల్లడించింది. ఇటీవల దేశవ్యాప్తంగా 375 జిల్లాల్లో 36 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించి నివేదిక రూపొందించినట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment