సాక్షి, హైదరాబాద్: విశిష్ట గుర్తింపు కార్డు (ఆధార్)లో చిన్న మార్పు కొత్త చిక్కులు తెచ్చింది. చిరునామాలో ‘కేరాఫ్’ను చేర్చడం వివాహితులైన మహిళలకు తలనొప్పిగా మారింది. ఈ సవరణ ఆదాయపన్నుకు సంబంధించిన శాశ్వత ఖాతా సంఖ్య (పాన్) కార్డు జారీలో తప్పిదాలకు దారితీస్తోంది. కొత్తగా పాన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే బంధుత్వాలు మారిపోతున్నాయి. తండ్రి స్థానంలో భర్త పేరుతో కార్డులు జారీ కావడం ఇబ్బందులకు గురిచేస్తోంది.
దీంతో పాన్ కార్డులో సవరణల కోసం మరోమారు దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడుతోంది. కొత్త పాన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునే వారు అవగాహన లేక కొందరు ఏజెంట్లను ఆశ్రయిస్తుండటతో ఈ గందరగోళం ఏర్పడుతోంది. నిబంధనల ప్రకారం కొత్త పాన్‌కార్డు కోసం దరఖాస్తుపై రెండు సంతకాలు, పాస్‌పోర్టు సైజు ఫొటోతో పాటు పుట్టిన తేదీ నిర్ధారణ, చిరునామా ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డు జిరాక్స్ సమర్పిస్తే సరిపోతుంది.
అయితే వివాహితులైన మహిళలకు ఆధార్ చిరునామాలోని ‘కేరాఫ్’అంశం ఇబ్బందిగా మారింది. పాన్‌కార్డు దరఖాస్తును ఆన్‌లైన్‌లో నమోదు చేసే సమయంలో సంబంధిత ఆపరేటర్లు చాలావరకు దరఖాస్తులోని వివరాలు సరిగా చూడటం లేదు. పాన్‌కార్డు దరఖాస్తులో తండ్రి పేరు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఆధార్ కార్డు జిరాక్స్ ఆధారంగా నమోదు చేస్తుండటంతో.. కార్డులో తండ్రి పేరు స్థానంలో ఆధార్‌లో కేరాఫ్‌గా ఉండే భర్త పేరు వస్తోంది.
సన్నాఫ్, డాటరాఫ్ స్థానంలో కేరాఫ్
పౌరుడి వ్యక్తిగత గోప్యతకు ఏ విధంగానూ భంగం కలగకూడదని గతంలో సుప్రీంకోర్టు చేసిన సూచనల మేరకు ఆధార్ కార్డులో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. అందులో భాగంగా ఆరు నెలల క్రితం ఆధార్ కార్డులో బంధుత్వాన్ని సూచించే సన్నాఫ్, డాటరాఫ్, వైఫ్ ఆఫ్ వంటి పదాలను తొలగించి కేవలం కేరాఫ్ మాత్రమే ఉండే విధంగా మార్పులు చేశారు. ఈ కేరాఫ్ వివాహిత మహిళలకు పాన్ కార్డు జారీలో పొరపాటుకు కారణమవుతోంది. ఆధార్ కార్డులో ఇంటి పేరు సాధారణంగా మొదట్లో ఉంటుండగా, పాన్ కార్డులో మాత్రం చివర్లో వస్తుండటంతో బ్యాంక్ ఖాతాల అనుసంధానానికి సమస్యగా మారుతోంది.
Comments
Please login to add a commentAdd a comment