కాస్మొటిక్స్ క్వీన్‌గా ఎదిగిన మీరా కులకర్ణి విజయగాథ ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకం. చదువును పక్కన పెట్టి 20 ఏళ్ల వయసులో ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుని తల్లిదండ్రులను, ఇంటిని విడిచిపెట్టిపోయింది... ఆ బంధం వికటించి కొన్ని రోజులకే ఆమె ఒంటరి తల్లిగా తిరిగి వచ్చింది.. కొన్నాళ్లకే తల్లిదండ్రులూ మృతి చెందడంతో అనాథగా మారింది. కాలాన్ని నెట్టుకుంటూ వచ్చి 45 సంవత్సరాల వయస్సులో వ్యాపారాన్ని ప్రారంభించింది. దేశంలోని అత్యంత ధనవంతులైన మహిళల్లో ఒకరిగా అవరించింది.
మీరా కులకర్ణి ఫారెస్ట్ ఎసెన్షియల్స్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్. ఇది దేశంలోని ప్రముఖ సహజ సౌందర్య సాధనాల బ్రాండ్‌లలో ఒకటి. ముఖ్యంగా ఆయుర్వేద ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది. మార్కెట్ లీడర్‌గా, విజయవంతమైన వ్యాపారవేత్తగా అవతరించిన మీరా కులకర్ణి ప్రయాణం కొవ్వొత్తుల తయారు చేసే చిన్న కుటీర పరిశ్రమ నుంచి ప్రారంభమైంది. అది తర్వాత హ్యాండ్‌మేడ్ సబ్బుల పరిశ్రమగా మారింది.
ఫలించని వైవాహిక బంధం
మీరా కులకర్ణి వైవాహిక బంధం ఫలించకపోవడంతో తన ఇద్దరు పిల్లలను తీసుకుని ఢిల్లీకి తిరిగి వచ్చేసింది. 28 సంవత్సరాలు వయస్సులో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయింది. భర్తకు దూరమై.. తల్లిందండ్రులు మరణించడంతో ఒంటరిగా తల్లిగా మిలిగిపోయింది. తమ ఇంటిలో కొంత భాగాన్ని అద్దెకు ఇచ్చి అలా వచ్చే డబ్బుతో పిల్లలను పోషించుకుంటూ వచ్చింది.
కుమార్తెకు పెళ్లి చేసిన తర్వాత 45 ఏళ్ల వయసులో వ్యాపారం ప్రారంభించింది మీరా. మొదట కొవ్వొత్తులను తయారు చేయడం ప్రారంభించిన ఆమె తర్వాత హ్యాండ్ మేడ్ సబ్బుల తయారీకి మారింది. యూఎస్‌లో చదువుతున్న తన కొడుకు వద్దకు వెళ్లినప్పుడు ఆమెకు వచ్చిన సలహాతో సబ్బుల తయారీలో శిక్షణ పొందింది. ఆమె కొడుకు సమర్థ్ బేడీ ఇప్పుడు ఆ సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
రూ.2 లక్షల పెట్టుబడితో..
మీరా కులకర్ణి కేవలం రూ. 2 లక్షల పెట్టుబడి, ఇద్దరు ఉద్యోగులతో తన వ్యాపారాన్ని ప్రారంభించింది. నేడు ఆమె బ్రాండ్‌కు భారతదేశం అంతటా 110, విదేశాలలో డజనుకు పైగా స్టోర్లు ఉన్నాయి. తాజ్, హయత్ వంటి 300పైగా హోటళ్లు, దాదాపు 150 స్పాలు ఆమె కంపెనీ ఉత్పత్తులు వినియోగిస్తున్నాయి. ఫారెస్ట్ ఎసెన్షియల్స్ కంపెనీ 2020 ఆర్థిక సంవత్సరంలో రూ.253 కోట్లు, 2021 ఆర్థిక ఏడాదిలో రూ.210 కోట్లు ఆర్జించింది. మీరా కులకర్ణి రూ. 1,290 కోట్ల నికర విలువతో భారతదేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో ఒకరిగా కోటక్ వెల్త్ హురున్ – లీడింగ్ వెల్తీ ఉమెన్ 2020గా నిలిచారు.
ఇదీ చదవండి: Chandigarh Couple: చలికాలం ఈ భార్యాభర్తలను రూ. కోట్ల వ్యాపారవేత్తలను చేసింది!
Comments
Please login to add a commentAdd a comment