ఏ పండగొచ్చినా, పబ్బమొచ్చినా ఇంట్లో ముందుగా అందరికీ గుర్తొచ్చే అమ్మమ్మ నాన్నమ్మలే. వారి చేతి వంట మహిమ అలాటిది మరి. కరియర్ కోసం సప్త సముద్రాలు దాటి ఈ తరం పిల్లలు చాలామంది ఆ రుచిని మిస్ అవుతున్నామని ఫీల్ అవుతూ ఉంటారు. ఈ క్రమంలో చెన్నైకు చెందిన దంపతులకు ఒక ఐడియా వచ్చింది. దీనికి బిజినెస్‌లో రాణించాలన్న అమ్మమ్మ కుతూహలం కూడా తోడైంది. ఇంకేముంది జానకి పాటి వంటలు ఖండాంతరాలు దాటి రుచులను పంచుతున్నాయి. రూ.2 వేలతో మొదలైన వ్యాపారం రూ.125 కోట్లకు చేరుకుంది. స్వీట్ కారం కాఫీ(ఎస్‌కేసీ) సక్సెస్ స్టోరీ గురించి తెలుసు కుందాం రండి!
చెన్నైలో ఉండే ఆనంద్ భరద్వాజ్, నళిని పార్థిబన్ దంపతులు. చాలా సందర్బాల్లో అమ్మమ్మ జానకి వంటకాలను ఆస్వాదించ లేకపోతున్నామే అని బాధపడేవారు. చివరికి చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి మరీ అమ్మమ్మ వద్దకు పరిగెత్తుకు వెళ్లారు. 82 ఏళ్ల అమ్మమ్మ చేత వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ ప్రయత్నం అంత సాఫీగా సాగలేదు. చాలా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి తొలుత సుముఖత చూప లేదు. దీంతో ఇంట్లోనే ఒక చిన్న గదిలో కొద్ది పెట్టుబడితో ప్రారంభించారు.
అలా 2015లో ఆనంద్ భరద్వాజ్ , నళిని పార్థిబన్ కేవలం రూ.2000 పెట్టుబడితో చిన్న కిచెన్‌లో స్వీట్ కారం కాఫీని ప్రారంభించారు. ప్రచారం కోసం స్వయంగా కరపత్రాలను పంపిణీ చేసేవారు. దక్షిణాది ప్రాంతాలకు చెందిన స్నాక్స్ జంతికలు జాంగ్రి, మైసూర్ పాక్ వంటి పదార్థాలను పరిచయం చేశారు. ఇక అంతే వెనుదిరిగి చూసింది లేదు. అమ్మమ్మ చేతి వంట అందరికీ తెగ నచ్చేసింది. ఆర్డర్లు వెల్లువలా వచ్చి పడ్డాయి. అలా మొదలైన ప్రయాణం వారు కూడా ఊహించని విధంగా చాలా తక్కువ సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 32 దేశాలకు విస్తరించింది. కంపెనీ విలువ రూ.125 కోట్లకు చేరుకుంది. అలాగే స్వీట్ కారం కాఫీ తన ఉత్పత్తులను కొన్ని ప్రముఖ ఆన్‌లైన్ సంస్థల ద్వారా కూడా విక్రయాలను కొనసాగిస్తోంది. అలాగే సొంత వెబ్‌సైట్, యాప్ ద్వారా విక్రయాలను కొనసాగిస్తోంది.
“నేను ఎప్పటికప్పుడు వంటలన్ని దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తాను. ఎక్కడా రాజీ పడను. ప్రతిదీ ప్రేమగా శ్రద్ధగా, శుభ్రంగా, రుచిగా ఉండేలా జాగ్రత్త పడతాను. నా సొంతం కుటుంబంకోసం చేసినట్టే చేస్తాను’’ అంటారు జానకి పాటి. అంతేకాదు పాటీ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో కూడా ఈమె చాలా పాపులర్. ఇది నాకు పునర్జన్మ లాంటిది అని చెబుతారు గర్వంగా. క్రికెటర్ ఎంఎస్ ధోని పట్ల తన ప్రేమను సోషల్‌మీడియా ద్వారా పంచుకొని ఆనందిస్తూ, ముదిమి వయసులో కూడా ఆనందంగా గడపడం ఎలాగో చెప్పకనే చెబుతోందీ అమ్మమ్మ.
Comments
Please login to add a commentAdd a comment