స్వతంత్రంగా జీవించాలని, సొంతకాళ్లపై నిలబడాలనే ఆలోచన ఒక మనిషిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. అదీ కష్టాల్లో ఉన్న మహిళ ధైర్యంగా, ఆర్థికంగా ఉన్నతంగా బతకాలని నిర్ణయించుకుంటే మాత్రం తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. అంది వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని ధీరగా నిలబడుతుంది. బీచ్‌లో కాఫీ, టీ అమ్ముకునే స్థాయి నుంచి రెస్టారెంట్ల సారధిగా ఎదిగిన పెట్రిసియా నారాయణ్ అనే మహిళ సక్సెస్ జర్నీ అలాంటిదే. ఆ వివరాలేంటో తెలుసుకుందాం పదండి!
తమిళనాడులోని నాగర్‍కోయిల్ ప్రాంతంలో జన్మించారు ప్యాట్రిసియా థామస్ 17 ఏళ్ల వయస్సులోనే నారాయన్ అనే వ్యక్తిని మతాంతర వివాహం చేసుకుంది. ఇద్దరు పిల్లలు కలిగారు. కానీ కాల క్రమంలో ఆమె కలలన్నీ కరిగిపోవడం మొదలైంది. ఆమె భర్త మాదకద్రవ్యాలు, డ్రగ్స్‌కి భావిసగా మారిపోయాడు. జీవితం దుర్భరమైపోయింది. డబ్బుల కోసం భర్త వేధించేవాడు. సిగరెట్లతో కాల్చేవాడు. అందిన డబ్బులు తీసుకుని నెలల తరబడి అదృశ్యమయ్యేవాడు. ఇక అతనిలో మార్పురాదని గ్రహించింది. దిక్కుతోచని నిస్సహాయ స్థితిలో ఉన్నపుడు అదృష్టవశాత్తూ ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఆసరాగా నిలబడ్డారు.
తల్లి ఇచ్చిన ఆర్థిక బలానికి పెట్రిసియా నారాయణ్ దృఢ సంకల్పం తోడైంది. వంటపై ఉన్న ఆసక్తినే వ్యాపారంగా మార్చుకుంది. పచ్చళ్లు, జామ్ లు వంటివి సిద్ధం చేసి విక్రయించటం ప్రారంభించింది. మంచి ఆదరణ లభించింది. దీంతో మరింత ఉత్సాహం వచ్చింది. విభిన్నంగా ఆలోచించింది. పచ్చళ్లు, జామ్‌ల వ్యాపార లాభాలను మరో వ్యాపారంలో పెట్టాలని భావించింది.
అంతే క్షణం ఆలోచించకుండా చెన్నై మెరీనా బీచ్‌లో టీ, కాఫీ, జ్యూస్, స్నాక్స్ అమ్మే వ్యాపారాన్ని ప్రారంభించింది. కేవలం 50 పైసలకు కాఫీ, టీ అమ్మింది. మెుదటి రోజు కేవలం ఒక్క కాఫీ మాత్రమే అమ్ముడు బోయింది. అయినా ఎక్కడా ధైర్యం కోల్పోలేదు. పట్టుదలగా ముందుకు సాగాలని నిర్ణయించుకుంది. అంతే తర్వాతి రోజు పుంజుకున్న వ్యాపారం రూ.700కి చేరింది. మెనూలో శాండ్‌విచ్‌లు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఐస్‌క్రీమ్‌లను కూడా చేర్చింది. స్నాక్స్, ఫ్రెష్ జ్యూస్, కాఫీ, టీ అమ్మడంలో ఆమెకు సహాయం చేయడానికి ఇద్దరు వికలాంగులను నియమించుకుంది. మెరీనా నే బిజినెస్ స్కూల్,అదే నా ఎంబీయే అంటారు ప్యాట్రిసియా. అలా తన సొంత వ్యాపారంతో కుటుంబాన్ని పోషించింది. ఈ క్రమంలో 1998లో సంగీత గ్రూప్ నెల్సన్ మాణికం రోడ్ రెస్టారెంట్‌కి డైరెక్టర్ అవకాశాన్ని పొందటంతో జీవితం మలుపు తిరిగింది.
2002లో భర్త మరణించాడు. రెండేళ్ల తర్వాత కూతురు, అల్లుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. దీంతో దివంగత కుమార్తె జ్ఞాపకార్థం, కుమారుడుతో కలిసి తొలి రెస్టారెంట్ 'సందీప'ను ప్రారంభించింది. ఇక అప్పటినుంచీ, ఆ హోటలే తన కుమార్తెగా మారిపోయింది. అంత జాగ్రత్తగా దాన్ని ప్రేమించి పోషించింది.
కట్ చేస్తే..సందీప్ చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ చెన్నైలో కొత్త బ్రాంచీలతో విస్తరించింది. ప్రస్తుతం పెట్రిసియా నారాయణ్ నికర విలువ దాదాపు రూ.100 కోట్లుగా అంచనా. ప్రస్తుతం ఆమె 14 వివిధ ప్రాంతాల్లో 200 మంది ఉద్యోగులతో విజయవంతంగా నడుస్తున్న ఆమె సక్సెస్ జర్నీ స్పూర్తిదాయకంగా నిలుస్తోంది.
2010లో 'FICCI ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్' అవార్డును గెలుచుకుంది. సైకిల్ రిక్షా, ఆటో రిక్షానుంచి సొంతకారుకు తన జీవితం మారిందనీ, రోజుకు 50 పైసలు ఆదాయం రోజుకు రూ. 2 లక్షలకు పెరిగింది. ఇద్దరు వ్యక్తులతో మొదలైన తన వ్యాపారం 200 వందలకు చేరిందని గర్వంగా చెప్పుకుంటారు ప్యాట్రిసియా .
ఇదీ చదవండి : నయా ట్రెండ్ : పెళ్లికి ముందే బేబీ బంప్ ఫొటోషూట్ రచ్చ!
Comments
Please login to add a commentAdd a comment