Aditi Dugar: జీరో టు.. మ.. మ.. మాస్క్‌ వరకు! | Aditi Dugar: Masque In The World's 50 Best Restaurants List | Sakshi
Sakshi News home page

Aditi Dugar: ‘జీరో’ నుంచి మొదలైన ఆమె ప్రయాణం.. అంతర్జాతీయ స్థాయిలో!

May 30 2024 8:16 AM | Updated on May 30 2024 9:50 AM

Aditi Dugar: Masque In The World's 50 Best Restaurants List

‘రెస్టారెంట్‌ మేనేజ్‌మెంట్‌’ అంటే రెస్టారెంట్‌కు వెళ్లి ఇష్టమైన ఫుడ్‌ తిన్నంత ఈజీ కాదు. ఎన్నో సవాళ్లు వేడి వేడిగా ఎదురవుతుంటాయి. చల్లని ప్రశాంత చిత్తంతో వాటిని అధిగమిస్తేనే విజయం చేతికి అందుతుంది. ‘యాక్సిడెంటల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌’గా తనను తాను పరిచయం చేసుకునే అదితి దుగర్‌కు వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేకపోయినా రెస్టారెంట్‌ బిజినెస్‌లోకి వచ్చింది. అయితే ఆమె ‘జీరో’ దగ్గరే ఉండిపోలేదు. కాలంతోపాటు ఎన్నోపాఠాలు నేర్చుకొని ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయ ఢంకా మోగించింది. ముంబైలో అదితి నిర్వహిస్తున్న ‘మాస్క్‌’ వరల్డ్స్‌ 50 బెస్ట్‌ రెస్టారెంట్స్‌ జాబితాలో చోటు సాధించింది. మనదేశంలో నంబర్‌వన్‌ రెస్టారెంట్‌గా గుర్తింపు పొందింది.

కొన్ని సంవత్సరాల క్రితం...
ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో ‘మాస్క్‌’ పేరుతో అదితి దుగర్‌ ఫైన్‌–డైనింగ్‌ రెస్టారెంట్‌ ప్రారంభించింది. అయితే ఈ రెస్టారెంట్‌ వ్యవహారం ఆమె మామగారికి బొత్తిగా నచ్చలేదు. సంప్రదాయ నిబద్ధుడైన ఆయన రెస్టారెంట్‌లోకి అడుగు కూడా పెట్టలేదు. అలాంటి మామగారు కాస్తా ‘మాస్క్‌’ రెస్టారెంట్‌ తక్కువ సమయంలోనే బాగాపాపులర్‌ కావడం గురించి విని సంతోషించడమే కాదు రెస్టారెంట్‌కి వచ్చి భోజనం చేశాడు. తన స్నేహితులను కూడా రెస్టారెంట్‌కు తీసుకు వస్తుంటాడు.

తన కోడలు గురించి ఆయన ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాడు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వంటకాలను పరిచయం చేయడంతో ‘మాస్క్‌’ దూసుకుపోయింది. మోస్ట్‌ ఫార్వర్డ్‌ – థింకింగ్‌ ఫైన్‌–డైనింగ్‌ రెస్టారెంట్‌గా పేరు తెచ్చుకుంది. ఉమ్మడి కుటుంబ వాతావరణంలో పెరిగిన అదితి ఎన్నో వంటకాల రుచుల గురించి పెద్దల మాటట్లో విన్నది. అలా వంటలపై తనకు తెలియకుండానే ఇష్టం ఏర్పడింది. ఇద్దరు పిల్లల తల్లిగా నాలుగు సంవత్సరాలు ఇంటికే  పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తరువాత కేటరింగ్‌పై దృష్టి పెట్టింది.

ఇంటి నుంచే మొదలుపెట్టిన కేటరింగ్‌ వెంచర్‌తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా తొలి అడుగు వేసింది అదితి. ఆహా ఏమి రుచి అనిపించేలా వంటకాల్లో దిట్ట అయిన తల్లి ఎన్నో సలహాలు ఇచ్చేది. ఒకవైపు తల్లి నుంచి సలహాలు తీసుకుంటూనే మరోవైపు ΄్యాకేజింగ్‌ నుంచి మార్కెటింగ్‌ వరకు ఎన్నో విషయాల్లో తీరిక లేకుండా గడిపేది అదితి.

క్యాటరింగ్‌ అసైన్‌మెంట్స్‌లో భాగంగా అదితి ఒక బ్రిటిష్‌ హోం చెఫ్‌తో కలిసి పనిచేయాల్సి వచ్చింది. అయితే ఇది తన తల్లిదండ్రులు, అత్తమామలకు ఎంతమాత్రం నచ్చలేదు. దీనికి కారణం అతడు నాన్‌–వెజ్‌ చెఫ్‌ కావడమే. అయితే ఆ సమయంలో భర్త ఆదిత్య అదితికి అండగా నిలబడ్డాడు. అత్తమామలు, తల్లిదండ్రులకు నచ్చచెప్పాడు. ఒకవేళ అదిత్య కూడా అసంతృప్తి బృందంలో ఉండి ఉంటే అదితి ప్రయాణం ముందుకు వెళ్లేది కాదు. అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేది కాదు.

      ‘ఆ సమయంలో ఆదిత్య నాకు అండగా నిలబడకుంటే ఇంత దూరం వచ్చేదాన్ని కాదు’ అంటుంది అదితి.
‘అదితి విషయంలో నేను ఎప్పుడూ నో చెప్పలేదు. ఎందుకంటే ఆమె తప్పు చేయదు అనే బలమైన నమ్మకం ఉంది. ఏది చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేస్తుంది. ఆమె ఆలోచనల్లో పరిణతి ఉంది’ అంటాడు మెచ్చుకోలుగా ఆదిత్య.
      ‘కొత్తగా ఆలోచించేవాళ్లకు తగిన స్వేచ్ఛ ఇచ్చి అడిగినవి సమకూర్చితే అద్భుతమైన ఫలితాలు చూపించగలరు’ అనే ఆదిత్య మాటను అక్షరాలా నిజం చేసింది అదితి.
      ఫ్యామిలీ హాలిడే ట్రిప్‌లో స్పెయిన్‌లో ఉన్న అదితికి ‘మాస్క్‌’ ఐడియా తట్టింది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత తన కలకు శ్రీకారం చుట్టింది. ‘ఫలానా దేశంలో ఫలానా వంటకం అద్భుతంగా ఉంటుంది. ఆ వంటకం మీ రెస్టారెంట్‌లో అందుబాటులో ఉండే బాగుంటుంది’... ఇలాంటి సలహాలు ఎన్నో కేటరింగ్‌ క్లయింట్స్‌ నుంచి వచ్చేవి.

ఎంతోమంది సలహాలు,  సూచనలతో ‘మాస్క్‌’ మొదలై విజయం సాధించింది. అయితే ‘మాస్క్‌’ వేగానికి కోవిడ్‌ సంక్షోభం అడ్డుపడింది.
‘కోవిడ్‌ సంక్షోభం వల్ల ఆర్థికంగా నష్టం వచ్చినప్పటికీ విలువైనపాఠాలు ఎన్నో నేర్చుకున్నాను. ఒక్క ముక్కలో చె΄్పాలంటే కోవిడ్‌ అనేది మా వ్యాపారానికి సంబంధించి స్పష్టతను ఇచ్చింది’ అంటుంది అదితి.

ఒక్కసారి వెనక్కి వెళితే...
‘మాస్క్‌ పేరుతో డబ్బులు వృథా చేసుకోకండి. మీకు రెస్టారెంట్‌ బిజినెస్‌లో జీరో అనుభవం ఉంది. వ్యాపారంలో మీకు నష్టం తప్ప ఏమీ మిగలదు’ అన్నారు చాలామంది.
      ‘దశాబ్దాల అనుభవం ఉన్న వ్యాపారులైనా జీరో నుంచే మొదలవుతారు’ అనే విషయం అదితికి తెలియనిది కాదు. ‘జీరో’ నుంచి మొదలైన ఆమె ప్రయాణం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే స్థాయికి చేరింది. అదితి దుగర్‌ విజయం ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది.

‘దశాబ్దాల అనుభవం ఉన్న వ్యాపారులైనా జీరో నుంచే మొదలవుతారు’ అనే విషయం అదితికి తెలియనిది కాదు. ‘జీరో’ నుంచి మొదలైన ఆమె ప్రయాణం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే స్థాయికి చేరింది. – అదితి దుగర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement