చెప్పుకోదగ్గ సంఖ్యలో సభ్యులు
నగరంలో ఫుల్ టైమ్ ట్రెండ్
నగరంలో ఫుడ్ బ్లాగింగ్ హాబీ మారుతోంది.. చెప్పుకోదగ్గ సంఖ్యలో సభ్యులు పూర్తిస్థాయి ప్రొఫెషన్స్‌గా స్థిరపడుతున్నారు. చారిత్రక నేపథ్యం, ఆధునిక వైవిధ్యం.. కలగలిసిన మన నగరం వైవిధ్యమైన అభిరుచులను కలిసి ఆస్వాదించడానికి బ్లాగర్లకు అనేక అవకాశాలను అందిస్తోంది. వీటిని అందిపుచ్చుకుని నగరవ్యాప్తంగా విభిన్న రుచుల విశిష్టతలను వెలుగులోకి తెస్తున్న బ్లాగర్స్..పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్‌ను దక్కించుకుంటూ అటు భోజన ప్రియులకు, ఇటు ఆహార ఉత్పత్తుల విక్రయదారులకు ఆప్తులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ బ్లాగర్స్‌కు సంబంధించి నగరంలో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి తెలుసుకుందాం. – సాక్షి, సిటీబ్యూరో
నిన్న మొన్నటి వరకూ ఫుడ్ బ్లాగింగ్ అంటే ఏంటో ఎవరికీ తెలీదు. కానీ కొంతకాలంగా నగరంలో ఫుడ్ బ్లాగింగ్ సంప్రదాయంగా మారుతోంది. ప్రస్తుతం ఫుల్–టైమ్ ఫుడ్ బ్లాగర్స్ చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. ఈ విషయంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నయ్‌లు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఆ నగరాల స్థాయిలోనే మన నగరం నుంచీ బ్లాగర్లు పెరుగుతున్నారు. నిజామ్‌ల నగరంలో ఫుడ్ బ్లాగింగ్ కల్చర్‌తో మమేకమౌతున్నారు.
బ్లాగర్స్ మీట్స్..
నగరంలోని ఫుడ్ బ్లాగర్స్ సోషల్ మీడియా వేదికల వారీగా వేర్వేరు టీమ్స్‌గా ఏర్పడుతున్నారు. ఇటీవల వార్షిక ఇన్‌స్టాగ్రావ్‌ు ఫుడ్ బ్లాగర్ల సమావేశం జూబ్లీహిల్స్‌లోని ఫ్రోత్ ఆన్ టాప్‌లో జరిగింది. దీంట్లో 70 మందికి పైగా ఫుడ్ బ్లాగర్లు ఒకే చోట సమావేశమయ్యారు. సరదా సంగీతం, ఆట పాటలతో ఉల్లాసంగా గడిపారు. ‘ఈ ఈవెంట్ ద్వారా, ఇన్‌ఫ్లుయెన్సర్లు, బ్లాగర్లు ఒకరినొకరు కలుసుకోవడానికీ, పలకరించుకోవడానికీ, కొత్త స్నేహితులను ఏర్పర్చుకోవడానికి వేదిక నిలుస్తుందని’ నిర్వాహకులు గత ఏడేళ్లుగా ఫుడ్ బ్లాగర్‌గా పేరొందిన కిరణ్ సాహూ తెలిపారు.
బ్లాగర్లు వ్లాగర్లుగా, ఆ తర్వాత ఇన్‌స్టా రీల్స్ ద్వారా కంటెంట్ డెవలపర్స్‌గా.. ఇటీవల కాలంలో ఇన్‌ఫ్లుయెన్సర్లుగా రూపాంతరం చెందుతున్నారు. ప్రస్తుతం పలు ప్రముఖ బ్రాండ్‌లకు ప్రచారం, ప్రమోషన్లను అందించడానికి వీరు ఖరీదైన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.
ఫుడీ నుంచి ఇన్‌ఫ్లుయన్సర్‌గా...
వ్యక్తిగతంగా ఫుడ్ లవర్ అయిన కిరణ్ సాహూ.. సిటీలో దినదిన ప్రవర్ధమానమవుతున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయన్సర్లకు కేరాఫ్‌లా మారారు. గత ఏడేళ్లుగా నగరంలో రుచుల జర్నీ సాగించిన ఆమె.. ఇప్పుడు రోజూ కనీసం ఒకటి నుంచి మూడు వరకూ బ్రాండ్ ప్రచార కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటారు.
‘మేం బ్లాగింగ్‌లోకి ప్రవేశించినప్పుడు మొత్తం లెక్కేస్తే 10మంది బ్లాగర్లు కూడా లేరు. ఇప్పుడు అన్ని స్థాయిల్లో కలిపి 1000 నుంచి 2000 మంది ఉంటారు’ అని సాక్షితో అన్నారు. ఓ వైపు కార్పొరేట్ ఉద్యోగం.. మరోవైపు చిన్న బిజినెస్ నిర్వహిస్తూనే ఫుడ్ బ్లాగర్‌గా రాణిస్తున్న ఈ మాదాపూర్ నివాసి... ఇష్టమైన వ్యాపకాలు ఎన్ని చేసినా కష్టం అనిపించవు అంటూ స్పష్టం చేస్తున్నారు.
పురస్కారాల వంట...
సిటీ ఫుడ్ బ్లాగర్స్ లక్షల సంఖ్యలో ఫాలోవర్స్‌కు, మిలియన్ల సంఖ్యలో వీక్షకులకు చేరువవుతున్నారు. అంతే కాదు చెప్పుకోదగ్గ సంఖ్యలో పురస్కారాలను కూడా అందుకుంటున్నారు. మెట్రో నగరాల్లోని ఫుడ్ బ్లాగర్స్‌కు థీటుగా బ్రాండ్స్‌కు ప్రచారం చేస్తూ తగినంత రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఓ చేత్తో సంపాదిస్తూనే.. మరో చేత్తో అవార్డులను కూడా సొంతం చేసుకుంటున్నారు.
బిర్యానీ ఒక్కటే కాదు...
వంటగది నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి నగరంలో అత్యంత ప్రముఖ ఫుడ్ ఇన్‌ఫ్లుయన్సర్స్‌లో ఒకరిగా మారారు హోటల్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్, ఫుడ్ ఇన్‌ఫ్లుయన్సర్, మార్కెటర్ మొహమ్మద్ జుబైర్ అలీ. సమగ్ర రుచుల సమీక్షల నుంచి ఆకట్టుకునే ఫొటోగ్రఫీ వరకూ ఆయన నిర్వహించే ‘హైదరాబాద్ ఫుడ్ డైరీస్’ పేజీ అనేక ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తోంది.
రెస్టారెంట్లు లాంజ్‌ల నుంచి ఆకట్టుకునే వీధి తినుబండారాల వరకూ పసిగట్టి.. వాటికి బ్లాగ్‌లో పట్టం గట్టడమే జుబైర్ పని. హైదరాబాద్ అంటే కేవలం బిర్యానీలకు మాత్రమే కాదని, అరుదైన రుచులను అందించే వంటకాలను కలిగిన గొప్ప నగరం అంటారాయన. గత దశాబ్ద కాలంగా జుబైర్, అర డజను అవార్డులను తన బ్యాగ్‌లో ఉంచుకుని, జుబైర్ అనేక ప్రసిద్ధ బ్రాండ్లకు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారాడు.
ఇవి చదవండి: 'ఐసైపోతారు'..! సహజ రుచులకు ఆహారప్రియులు ఫిదా..
Comments
Please login to add a commentAdd a comment