వారసత్వ వంటకాలకు సిటీలో క్రేజ్
ఆసక్తికి అనుగుణంగా వినూత్న రెస్టారెంట్లు
హైటెక్ సిటీ, నాలెడ్జ్ సిటీలో బర్మా పసందైన రుచులు
సాక్షి, సిటీబ్యూరో: వినూత్న వంటకాలను ఆస్వాదించే వారి సంఖ్య ఈ మధ్య పెరిగింది. సిటీ లైఫ్‌లోని పాశ్చాత్య ఒరవడులకు గతకాలపు అభిరుచులను అద్ది వడ్డించే పసందైన రుచులకు ఆదరణ పెరిగింది. ఇలాంటి రెస్టారెంట్లు, ఫుడ్ స్పాట్స్‌కు నగరంలో మంచి క్రేజ్ ఉంది. ఐతే ఇలాంటి అంశాలతో కొన్ని రెస్టారెంట్లు నగరంలో ఇప్పటికే ఆదరణ పొందుతుండగా.. వారసత్వ వంటకాలకు అధునాతన హంగులద్ది వడ్డించే బర్మా బర్మా రెస్టారెంట్ హైటెక్ సిటీలో సందడి చేస్తోంది. అంతేగాకుండా బర్మీస్ వంటకాల రుచి తెలిసిన ఫుడ్ లవర్స్‌కు క్రేజీ స్పాట్‌గా మారింది.
బర్మా సంస్కృతికి ప్రతీకగా..
ఖౌసూయ్, టీ లీఫ్ సలాడ్, సమోసా సూప్, మాండలే నూడిల్ బౌల్, బర్మీస్ ఫలూడా వంటి వంటకాలు ఇప్పడు చాలామందికి ఫేవరెట్ డిషెస్‌గా మారాయి. పరాటాతో టోహు మాష్, కొబ్బరి క్రీమ్‌తో స్టిక్కీ రైస్, మెకాంగ్ కర్రీ, కుంకుమపువ్వు–సమోసా, చీజ్‌కేక్ వంటి నోరూరించే రుచులకు నాలెడ్జ్ సిటీలోని బర్మా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. బర్మాలో ప్రసిద్ది చెందిన ఈ విభిన్న రుచులు నగరంలో ప్రారంభించడం విశేషం. ఆసియాలోని అతిపెద్ద ఐటీ పార్కులలో ఒకటైన నగరాన్ని తన గమ్యస్థానంగా ఎంచుకోవడం, ఆహారాన్ని ఆస్వాదించడంలోనూ నగరవాసుల వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోంది.
బర్మా సంప్రదాయ ప్రతీకలైన బర్మీస్ స్వరాలతో పాటు అక్కడి వీధులు, గృహాల నుంచి ప్రేరణ పొందిన యాంబియన్స్‌తో ఆహ్లాద ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. బర్మీస్ ప్రత్యేకతల నుంచి అత్యుత్తమంగా ఎంపిక చేసిన ఆరి్టసానల్ ‘టీ’లు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ మొదలు తరతరాలుగా ఆదరణ పొందుతున్న గిరిజన, వారసత్వ వంటకాలు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉడికించిన అరటి ఆకు పాకెట్స్(కయునిన్ మావో) సిగ్నేచర్‌గా నిలుస్తుంది.
సంస్కృతుల సమ్మేళనం..
వలస ఆహార సంస్కృతులు, స్వదేశీ పదార్థాలతో సమ్మిళితమైన గతకాలపు హోమ్‌స్టైల్ వంటలు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుండగా ఇక్కడి బెస్ట్ సెల్లర్స్‌లో ‘మామిడి సలాడ్, స్పైసీ టీ లీఫ్, అవకాడో సలాడ్, లోటస్ రూట్ చిప్స్, సమోసా సూప్, బ్రౌన్ ఆనియన్, రంగూన్ బేక్డ్ మిల్క్’ ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. చిన్ననాటి స్నేహితులైన చిరాగ్ ఛజెర్, అంకిత్ గుప్తాల ఆలోచనల్లోంచి ఆవిష్కృతమైన బర్మా బర్మా.. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై, అహ్మదాబాద్‌లో విస్తరించింది.
ముఖ్యంగా కోల్‌కతాలో ఎన్నడూ లేనివిధంగా బర్మీస్ సంస్కృతికి జీవం పోస్తోందని సహవ్యవస్థాపకులు అంకిత్ గుప్తా పేర్కొన్నారు. 2023లో అందించిన కొండే నాస్ట్ ట్రావెలర్ టాప్ రెస్టారెంట్ అవార్డ్స్‌లో బర్మా బర్మా 34వ స్థానంలో నిలిచిందని అన్నారు. వంటకాలు పులుపు, కారం రుచులతో.. కాఫీర్ లైమ్‌లు, బాలాచాంగ్ మిరియాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు తదితరాలను వినియోగిస్తాం. సిటీలో బర్మా నుంచి తీసుకొచ్చిన బాండెల్ చీజ్, పికిల్డ్ ప్లం, బాలచాంగ్ పెప్పర్స్, లాఫెట్ వంటి బర్మీస్ పదార్థాల రుచులతో నగరవాసులను యాంగోన్ వీధులకు తీసుకెళతామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment