barma
-
ఈ బర్మా ఫుడ్.. క్రేజీ టేస్ట్!
సాక్షి, సిటీబ్యూరో: వినూత్న వంటకాలను ఆస్వాదించే వారి సంఖ్య ఈ మధ్య పెరిగింది. సిటీ లైఫ్‌లోని పాశ్చాత్య ఒరవడులకు గతకాలపు అభిరుచులను అద్ది వడ్డించే పసందైన రుచులకు ఆదరణ పెరిగింది. ఇలాంటి రెస్టారెంట్లు, ఫుడ్ స్పాట్స్‌కు నగరంలో మంచి క్రేజ్ ఉంది. ఐతే ఇలాంటి అంశాలతో కొన్ని రెస్టారెంట్లు నగరంలో ఇప్పటికే ఆదరణ పొందుతుండగా.. వారసత్వ వంటకాలకు అధునాతన హంగులద్ది వడ్డించే బర్మా బర్మా రెస్టారెంట్ హైటెక్ సిటీలో సందడి చేస్తోంది. అంతేగాకుండా బర్మీస్ వంటకాల రుచి తెలిసిన ఫుడ్ లవర్స్‌కు క్రేజీ స్పాట్‌గా మారింది.బర్మా సంస్కృతికి ప్రతీకగా.. ఖౌసూయ్, టీ లీఫ్ సలాడ్, సమోసా సూప్, మాండలే నూడిల్ బౌల్, బర్మీస్ ఫలూడా వంటి వంటకాలు ఇప్పడు చాలామందికి ఫేవరెట్ డిషెస్గా మారాయి. పరాటాతో టోహు మాష్, కొబ్బరి క్రీమ్‌తో స్టిక్కీ రైస్, మెకాంగ్ కర్రీ, కుంకుమపువ్వు–సమోసా, చీజ్‌కేక్ వంటి నోరూరించే రుచులకు నాలెడ్జ్ సిటీలోని బర్మా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. బర్మాలో ప్రసిద్ది చెందిన ఈ విభిన్న రుచులు నగరంలో ప్రారంభించడం విశేషం. ఆసియాలోని అతిపెద్ద ఐటీ పార్కులలో ఒకటైన నగరాన్ని తన గమ్యస్థానంగా ఎంచుకోవడం, ఆహారాన్ని ఆస్వాదించడంలోనూ నగరవాసుల వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తోంది.బర్మా సంప్రదాయ ప్రతీకలైన బర్మీస్ స్వరాలతో పాటు అక్కడి వీధులు, గృహాల నుంచి ప్రేరణ పొందిన యాంబియన్స్‌తో ఆహ్లాద ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. బర్మీస్ ప్రత్యేకతల నుంచి అత్యుత్తమంగా ఎంపిక చేసిన ఆరి్టసానల్ ‘టీ’లు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇక్కడి స్ట్రీట్ ఫుడ్ మొదలు తరతరాలుగా ఆదరణ పొందుతున్న గిరిజన, వారసత్వ వంటకాలు ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఉడికించిన అరటి ఆకు పాకెట్స్(కయునిన్ మావో) సిగ్నేచర్‌గా నిలుస్తుంది.సంస్కృతుల సమ్మేళనం..వలస ఆహార సంస్కృతులు, స్వదేశీ పదార్థాలతో సమ్మిళితమైన గతకాలపు హోమ్‌స్టైల్ వంటలు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుండగా ఇక్కడి బెస్ట్ సెల్లర్స్‌లో ‘మామిడి సలాడ్, స్పైసీ టీ లీఫ్, అవకాడో సలాడ్, లోటస్ రూట్ చిప్స్, సమోసా సూప్, బ్రౌన్ ఆనియన్, రంగూన్ బేక్డ్ మిల్క్’ ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. చిన్ననాటి స్నేహితులైన చిరాగ్ ఛజెర్, అంకిత్ గుప్తాల ఆలోచనల్లోంచి ఆవిష్కృతమైన బర్మా బర్మా.. ప్రస్తుతం బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, అహ్మదాబాద్‌లో విస్తరించింది.ముఖ్యంగా కోల్‌కతాలో ఎన్నడూ లేనివిధంగా బర్మీస్ సంస్కృతికి జీవం పోస్తోందని సహవ్యవస్థాపకులు అంకిత్ గుప్తా పేర్కొన్నారు. 2023లో అందించిన కొండే నాస్ట్ ట్రావెలర్ టాప్ రెస్టారెంట్ అవార్డ్స్‌లో బర్మా బర్మా 34వ స్థానంలో నిలిచిందని అన్నారు. వంటకాలు పులుపు, కారం రుచులతో.. కాఫీర్ లైమ్లు, బాలాచాంగ్ మిరియాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు తదితరాలను వినియోగిస్తాం. సిటీలో బర్మా నుంచి తీసుకొచ్చిన బాండెల్ చీజ్, పికిల్డ్ ప్లం, బాలచాంగ్ పెప్పర్స్, లాఫెట్ వంటి బర్మీస్ పదార్థాల రుచులతో నగరవాసులను యాంగోన్ వీధులకు తీసుకెళతామని వివరించారు. -
మనసును అధీనంలో ఉంచుకునే ఉపాసన
ఏదైనా పనిచేయడం కష్టమైతే... ఏమీ చేయకుండా, ఏం మాట్లాడకుండా ఉండడం అతికష్టం. అయితే మనిషిలో నుంచి ‘ప్రతిచర్య’ని బయటికి పంపేయాలంటే అదొక్కటే మార్గమంటోంది విపస్సన. పదిరోజుల ధ్యానం ప్రశాంతతతో పాటు మెదడుని కడిగే పనికూడా చేస్తుంది. విపస్సన ధ్యాన కేంద్రాలు మన దేశంలో మూడు దశాబ్దాలుగా సేవలందిస్తున్నాయి. విద్యార్థుల నుంచి వృద్ధులవరకూ ఆ కేంద్రాల్లో పదేసి రోజులు సేదతీరుతున్నారు. బుద్ధుని బహుమతి విపస్సన అనేది బుద్ధభగవానుడు స్వయంగా శోధించి, సాధించిన ధ్యాన ప్రక్రియ. దానికి ‘శ్వాస‘ని ఆయుధంగా ఎంచుకున్నాడు.మనసుకి, శరీరానికి వారధిలా శ్వాస ఉంటుందని కనుగొన్నాడు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మన శ్వాస కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా! దాని ఆధారంగా మన భావోద్వేగాలను ఎప్పటికప్పుడు నియంత్రించుకోవచ్చని చెప్పాడు. మామూలుగా ధ్యానం చేసేటప్పుడు దృష్టిని మనసుపై ఉంచమంటారు. ఇక్కడ మాత్రం శ్వాసపైనే ఉంచాలి. ఈ సమయంలో తల నుంచి పాదాలవరకూ బోలెడు సంవేదనలు అవుతుంటాయి. వాటిని గమనిస్తూ ఉండాలి. దానివల్ల మీలోని భయాలు, అర్థంలేని ఆలోచనలు, అపోహలు మెల్లగా తొలగిపోతుంటాయి. ఒక్కరోజులో కాదు...కొన్నాళ్లపాటు చేసే సాధన వల్ల. ఆ సూత్రంతోనే విపస్సన మొదలవుతుంది. బుద్ధుని ప్రవచనాలు ప్రపంచమంతా పాకిన సమయంలో ఒక్క బర్మాలో మాత్రమే విపస్సన సిద్ధాంతాలు, ఆచరణ స్వచ్ఛంగా అమలయ్యాయి. విపస్సన ఫలితాలు బాగా తెలిసినవారిలో అశోక చక్రవర్తి ఒకరు. ఆయన వల్ల కూడా దీనికి ఎక్కువ ప్రచారం వచ్చిందని చెబుతారు. రోజూ ఇల్లు సర్దుకున్నట్టే ఏ రోజుకారోజు మెదడును కూడా శుభ్రం చేసుకోవాలి. లేదంటే దుమ్ము కొట్టుకుపోతుంది. దానికితోడు ప్రతి చిన్న విషయానికీ ప్రతిచర్యగా మనం చేసే పనులు మనసుని మరింత మసకబారుస్తాయి. మరి మన మెదడులో అడుగుపెట్టి అక్కర్లేని వాటిని బయటికి విసిరిపారేసే పని ఎవరు చేస్తారు? ఎలా చేస్తారు? ఒక్కసారి విపస్సనలో అడుగుపెడితే అన్ని పనులూ వాటంతటవే జరిగిపోతాయి. మీవంతుగా మీరు చేయాల్సిందల్లా మాట్లాడకుండా ఉండడమే. మౌనంగా మిమ్మల్ని మీరు గమనించుకోవడమే. ఉచితంగా నేర్పే ధ్యానం కాబట్టి అంతకంటే ఉచితంగా మనల్ని మనం ఆ పక్రియకి అంకితం చేయాలి. అప్పుడే మనసు శుద్ధి అవుతుంది. ఎప్పటికప్పుడు అదే మెదడుని శుభ్రం చేస్తుంటుంది. మౌనంతోపాటు... పదిరోజుల సాధనలో మొదటిరోజు మౌనంగా కళ్లు మూసుకుని కూర్చోమంటారు. దాని పేరు ఆన..పాన. ఆన అంటే శ్వాసని లోపలికి తీసుకోవడం. పాన అంటే బయటికి వదలడం. మధ్య మధ్యలో బ్రేక్ ఇచ్చుకుంటూ రోజంతా నాలుగు గంటలపాటు ధ్యానంలో ఉంటారన్నమాట. ఆ రోజు మొత్తంలో రెండు సత్యాలు గ్రహిస్తారు. ఒకటి... మనసు ఆధీనంలో ఉండదు. రెండోది ఆలోచనంతా గతం, భవిష్యత్తుపైనే ఉంటుంది గాని వర్తమానంలో ఉండదని. రెండోరోజు మౌనంతోపాటు దేహ చర్యలకు స్పందించకుండా ఉండాలి. ఆ సాధన సారాంశమేమిటంటే... తెలియకుండా చేసేదే ప్రతిచర్య. తెలుసుకుని చేసేది చర్య. కాబట్టి దృష్టి కేవలం చర్యలపైనే ఉంచితే మనం చేసే పనుల ఫలితాలు ఆశించినట్టుగా ఉంటాయి. ఇలా ఒక్కోరోజు ధ్యానంలో ఒక్కో విధంగా మనసుని నియంత్రించుకునే ప్రక్రియ కొనసాగుతుంది. విపస్సన కేంద్రానికి వెళ్లేవారెవరూ డబ్బులు కట్టక్కర్లేదు కాని... తోచినంత విరాళం ఇవ్వొచ్చు. దేశవ్యాప్తంగా యాభైకేంద్రాలకు పైగానే ఉన్నాయి. మన రాష్ర్టంలోనే ఆరు కేంద్రాలున్నాయి. అన్ని కేంద్రాలు విపస్సన ట్రస్ట్ పేరుతోనే నడుస్తున్నాయి. అక్కడ శిక్షకులు కూడా ఉచితంగానే పనిచేస్తున్నారు. విపస్సన కేవలం పెద్దవాళ్లకే కాదు...పదేళ్లనుంచి పదిహేనేళ్ల వయసు పిల్లలకు, యువతకు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. మనిషి జీవితం వేగంలో పడి కొట్టుకుపోతోంది. విశ్రాంతి పేరుతో చేసే పనులు కూడా మెదడుని ఛిద్రం చేస్తున్నాయి. ప్రశాంతత అనే దాహం తీర్చుకోడానికి ఎడారుల వెంట తిరుగుతున్న మనిషికి విపస్సన చల్లటి నీళ్లు అందిస్తుంది. దాహం వేసినా వేయకపోయినా తగినంత నీరు శరీరానికి అవసరం అని వైద్యులు చెబుతున్న మాటల్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి నీటితోనే మెదడుని కడిగి శుభ్రం చేసే విపస్సన దగ్గరికి వెళ్లే అవసరం అందరికీ ఉంది. - భువనేశ్వరి పదిమందికీ పంచాలని... బర్మాలో పుట్టిపెరిగిన ఎస్.సత్యనారాయణ గోయెంకా పూర్వీకులు భారతీయులు. తనను తీవ్రంగా బాధించిన పార్శ్వపునొప్పికి విరుగుడుగా విపస్సనకు వెళ్లిన సత్యనారాయణకు వెంటనే ఉపశమనం కలగడంతో మనసుకి, శరీరానికి విపస్సనకు మించిన రక్షణ మరొకటి లేదని అర్థమైంది. దాంతో ఒక పక్క తన వ్యాపారాలు చేసుకుంటూనే విపస్సన శిక్షకుడిగా పద్నాలుగేళ్లు శిక్షణ పొందారు. 1976లో భారతదేశానికి వచ్చినపుడు తన తల్లిదండ్రులతోపాటు మరో పదిమందితో విపస్సన సాధన చేయించారు. కేవలం నోటిమాటతో జరిగిన ప్రచారం ఆయనతో విపస్సన కేంద్రాలు పెట్టించింది. మొదట ముంబై, హైదరాబాద్ నగరాల్లో పెట్టారు. మెల్లగా దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో గోయెంకా మరణించారు. ఆయన కన్నుమూసే చివరిక్షణం వరకూ విపస్సన ద్వారా అందించే సేవల గురించే ఆలోచించారు. (జనవరి 20న ఆయన తొంభయ్యవ జయంతి).