మనసును అధీనంలో ఉంచుకునే ఉపాసన
ఏదైనా పనిచేయడం కష్టమైతే... ఏమీ చేయకుండా, ఏం మాట్లాడకుండా ఉండడం అతికష్టం. అయితే మనిషిలో నుంచి ‘ప్రతిచర్య’ని బయటికి పంపేయాలంటే అదొక్కటే మార్గమంటోంది విపస్సన.
పదిరోజుల ధ్యానం ప్రశాంతతతో పాటు మెదడుని కడిగే పనికూడా చేస్తుంది. విపస్సన ధ్యాన కేంద్రాలు మన దేశంలో మూడు దశాబ్దాలుగా సేవలందిస్తున్నాయి. విద్యార్థుల నుంచి వృద్ధులవరకూ ఆ కేంద్రాల్లో పదేసి రోజులు సేదతీరుతున్నారు.
బుద్ధుని బహుమతి
విపస్సన అనేది బుద్ధభగవానుడు స్వయంగా శోధించి, సాధించిన ధ్యాన ప్రక్రియ. దానికి ‘శ్వాస‘ని ఆయుధంగా ఎంచుకున్నాడు.మనసుకి, శరీరానికి వారధిలా శ్వాస ఉంటుందని కనుగొన్నాడు.
మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మన శ్వాస కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా! దాని ఆధారంగా మన భావోద్వేగాలను ఎప్పటికప్పుడు నియంత్రించుకోవచ్చని చెప్పాడు.
మామూలుగా ధ్యానం చేసేటప్పుడు దృష్టిని మనసుపై ఉంచమంటారు. ఇక్కడ మాత్రం శ్వాసపైనే ఉంచాలి.
ఈ సమయంలో తల నుంచి పాదాలవరకూ బోలెడు సంవేదనలు అవుతుంటాయి. వాటిని గమనిస్తూ ఉండాలి. దానివల్ల మీలోని భయాలు, అర్థంలేని ఆలోచనలు, అపోహలు మెల్లగా తొలగిపోతుంటాయి. ఒక్కరోజులో కాదు...కొన్నాళ్లపాటు చేసే సాధన వల్ల. ఆ సూత్రంతోనే విపస్సన మొదలవుతుంది.
బుద్ధుని ప్రవచనాలు ప్రపంచమంతా పాకిన సమయంలో ఒక్క బర్మాలో మాత్రమే విపస్సన సిద్ధాంతాలు, ఆచరణ స్వచ్ఛంగా అమలయ్యాయి.
విపస్సన ఫలితాలు బాగా తెలిసినవారిలో అశోక చక్రవర్తి ఒకరు. ఆయన వల్ల కూడా దీనికి ఎక్కువ ప్రచారం వచ్చిందని చెబుతారు.
రోజూ ఇల్లు సర్దుకున్నట్టే ఏ రోజుకారోజు మెదడును కూడా శుభ్రం చేసుకోవాలి. లేదంటే దుమ్ము కొట్టుకుపోతుంది. దానికితోడు ప్రతి చిన్న విషయానికీ ప్రతిచర్యగా మనం చేసే పనులు మనసుని మరింత మసకబారుస్తాయి. మరి మన మెదడులో అడుగుపెట్టి అక్కర్లేని వాటిని బయటికి విసిరిపారేసే పని ఎవరు చేస్తారు? ఎలా చేస్తారు? ఒక్కసారి విపస్సనలో అడుగుపెడితే అన్ని పనులూ వాటంతటవే జరిగిపోతాయి.
మీవంతుగా మీరు చేయాల్సిందల్లా మాట్లాడకుండా ఉండడమే. మౌనంగా మిమ్మల్ని మీరు గమనించుకోవడమే. ఉచితంగా నేర్పే ధ్యానం కాబట్టి అంతకంటే ఉచితంగా మనల్ని మనం ఆ పక్రియకి అంకితం చేయాలి. అప్పుడే మనసు శుద్ధి అవుతుంది. ఎప్పటికప్పుడు అదే మెదడుని శుభ్రం చేస్తుంటుంది.
మౌనంతోపాటు...
పదిరోజుల సాధనలో మొదటిరోజు మౌనంగా కళ్లు మూసుకుని కూర్చోమంటారు. దాని పేరు ఆన..పాన. ఆన అంటే శ్వాసని లోపలికి తీసుకోవడం. పాన అంటే బయటికి వదలడం. మధ్య మధ్యలో బ్రేక్ ఇచ్చుకుంటూ రోజంతా నాలుగు గంటలపాటు ధ్యానంలో ఉంటారన్నమాట. ఆ రోజు మొత్తంలో రెండు సత్యాలు గ్రహిస్తారు. ఒకటి... మనసు ఆధీనంలో ఉండదు. రెండోది ఆలోచనంతా గతం, భవిష్యత్తుపైనే ఉంటుంది గాని వర్తమానంలో ఉండదని. రెండోరోజు మౌనంతోపాటు దేహ చర్యలకు స్పందించకుండా ఉండాలి. ఆ సాధన సారాంశమేమిటంటే...
తెలియకుండా చేసేదే ప్రతిచర్య. తెలుసుకుని చేసేది చర్య. కాబట్టి దృష్టి కేవలం చర్యలపైనే ఉంచితే మనం చేసే పనుల ఫలితాలు ఆశించినట్టుగా ఉంటాయి. ఇలా ఒక్కోరోజు ధ్యానంలో ఒక్కో విధంగా మనసుని నియంత్రించుకునే ప్రక్రియ కొనసాగుతుంది.
విపస్సన కేంద్రానికి వెళ్లేవారెవరూ డబ్బులు కట్టక్కర్లేదు కాని... తోచినంత విరాళం ఇవ్వొచ్చు. దేశవ్యాప్తంగా యాభైకేంద్రాలకు పైగానే ఉన్నాయి. మన రాష్ర్టంలోనే ఆరు కేంద్రాలున్నాయి.
అన్ని కేంద్రాలు విపస్సన ట్రస్ట్ పేరుతోనే నడుస్తున్నాయి. అక్కడ శిక్షకులు కూడా ఉచితంగానే పనిచేస్తున్నారు. విపస్సన కేవలం పెద్దవాళ్లకే కాదు...పదేళ్లనుంచి పదిహేనేళ్ల వయసు పిల్లలకు, యువతకు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. మనిషి జీవితం వేగంలో పడి కొట్టుకుపోతోంది.
విశ్రాంతి పేరుతో చేసే పనులు కూడా మెదడుని ఛిద్రం చేస్తున్నాయి. ప్రశాంతత అనే దాహం తీర్చుకోడానికి ఎడారుల వెంట తిరుగుతున్న మనిషికి విపస్సన చల్లటి నీళ్లు అందిస్తుంది. దాహం వేసినా వేయకపోయినా తగినంత నీరు శరీరానికి అవసరం అని వైద్యులు చెబుతున్న మాటల్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి నీటితోనే మెదడుని కడిగి శుభ్రం చేసే విపస్సన దగ్గరికి వెళ్లే అవసరం అందరికీ ఉంది. - భువనేశ్వరి
పదిమందికీ పంచాలని...
బర్మాలో పుట్టిపెరిగిన ఎస్.సత్యనారాయణ గోయెంకా పూర్వీకులు భారతీయులు. తనను తీవ్రంగా బాధించిన పార్శ్వపునొప్పికి విరుగుడుగా విపస్సనకు వెళ్లిన సత్యనారాయణకు వెంటనే ఉపశమనం కలగడంతో మనసుకి, శరీరానికి విపస్సనకు మించిన రక్షణ మరొకటి లేదని అర్థమైంది. దాంతో ఒక పక్క తన వ్యాపారాలు చేసుకుంటూనే విపస్సన శిక్షకుడిగా పద్నాలుగేళ్లు శిక్షణ పొందారు. 1976లో భారతదేశానికి వచ్చినపుడు తన తల్లిదండ్రులతోపాటు మరో పదిమందితో విపస్సన సాధన చేయించారు.
కేవలం నోటిమాటతో జరిగిన ప్రచారం ఆయనతో విపస్సన కేంద్రాలు పెట్టించింది. మొదట ముంబై, హైదరాబాద్ నగరాల్లో పెట్టారు. మెల్లగా దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో గోయెంకా మరణించారు. ఆయన కన్నుమూసే చివరిక్షణం వరకూ విపస్సన ద్వారా అందించే సేవల గురించే ఆలోచించారు. (జనవరి 20న ఆయన తొంభయ్యవ జయంతి).