సాక్షి, హైదరాబాద్: ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి కేటీఆర్ (KTR) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ కొట్టేసిన నేపథ్యంలో ఆర్డర్ కాపీలో కీలక విషయాలను వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులకు మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి బాధ్యుడిగా ఉండాలి. హెచ్‌ఎండీఏ నిధులు సంబంధిత మంత్రి పర్యవేక్షణలోనే ఉంటాయని ప్రాధమికంగా తేలింది. అవి దుర్వినియోగం అయ్యాయా? లేదా? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉందని వ్యాఖ్యలు చేసింది.
కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత అనంతరం హైకోర్టు ఆర్డర్ కాపీ విడుదల చేసింది. 45అంశాలతో 35పేజీల ఆర్డర్ కాపీని విడుదల చేసింది. ఈ సందర్బంగా.. ఉన్నత న్యాయస్థానం (Telangana High Court) పలు కీలక వ్యాఖ్యలు చేసింది. దర్యాప్తు సంస్థల అధికారాలను కోర్టులు అడ్డుకోలేవు. ఎఫ్‌ఐఆర్ క్వాష్ చేయడానికి కొన్ని పరిమితులు ఉంటాయి. హెచ్‌ఎండీఏ ఖాతాలోని డబ్బును నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారనే ఆరోపణలున్నాయి. రాష్ట్ర ఖజానాకు నష్టం చేకూర్చి ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలకు లబ్ధి చేకూర్చారని అభియోగాలున్నాయి. ఆరోపణల మేరకు ఏసీబీ అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అప్పటి ప్రభుత్వంలో పురపాలక మంత్రిగా ఉన్న కేటీఆర్ హెచ్‌ఎండీఏ నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలున్నాయి. ఎఫ్ఐఆర్‌ను కొట్టివేసే అధికారాన్ని కోర్టు కొన్ని సందర్భాల్లో మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
పోలీసుల దర్యాప్తు అన్యాయంగా ఉంటేనే కోర్టు తన అధికారాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. పోలీసులకు ఉన్న అధికారాలను కోర్టు ఎప్పుడూ అన్యాయంగా తీసుకోదు. ఏసీబీ చేసిన ఆరోపణల్లోకి వెళ్లి దర్యాప్తు చేయాలని కోర్టు భావించడం లేదు. ఈ కేసులో నేరపూరిత కుట్ర జరిగిందని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి బాధ్యత గల హోదాలో ఉన్నారు. మరో నిందితుడితో కలిసి కేటీఆర్ హెచ్‌ఎండీఏ(HMDA) నిధులను అక్రమంగా వినియోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి మండలి, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే పిటిషనర్ హెచ్‌ఎండీఏ నుంచి భారీ మొత్తంలో నగదు బదిలీ చేయించినట్లు ఆరోపణలున్నాయి. సొంత లబ్ధి కోసమా.. లేక మూడో వ్యక్తి ప్రయోజనం కోసం నగదు బదిలీ జరిగిందా.. అనేదానిపై దర్యాప్తు జరగాల్సి ఉంది.
అయితే, నిధుల దుర్వినియోగం జరగలేదని పిటిషనర్ వాదించడాన్ని కోర్టు నమ్మడం లేదు. దర్యాప్తులో ఈ విషయాలన్నీ తేలాల్సి ఉంది. నేరం జరిగిందని చెప్పడానికి ప్రాథమిక ఆరోపణలు మాత్రమే ఎఫ్‌ఐఆర్(FIR)లో ఉంటాయి. పూర్తిస్థాయి వివరాలన్నీ ఎఫ్‌ఐఆర్‌లో పొందుపర్చాల్సిన అవసరం లేదు. డిసెంబర్ 18న ఫిర్యాదు అందితే, 19న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. డిసెంబర్ 20న పిటిషనర్ క్వాష్ పిటిషన్ వేశారు. ఆధారాలు సేకరించాల్సిన సమయం దర్యాప్తు సంస్థలకు కావాలి. దర్యాప్తు విషయంలో హైకోర్టు జోక్యం చేసుకోదల్చుకోలేదు’ అని ధర్మాసనం కామెంట్స్ చేసింది.
ఇది కూడా చదవండి: ఏసీబీ దూకుడు.. ‘సుప్రీం’కు చేరిన ఈ-కార్ రేసు పంచాయితీ!
Comments
Please login to add a commentAdd a comment