బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ వ్యతిరేక నిరసనల మధ్య ఆ దేశ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయడం, తరువాత ఆమె ఆ దేశాన్ని విడిచిపెట్టడం సంచలనంగా మారింది. బంగ్లాదేశ్ సంక్షోభంపై ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ స్పందించారు. షేక్ హసీనా బంగ్లాదేశ్ విడిచి భారత్‌లో ఆశ్రయం పొందడం విడ్డూరంగా ఉందన్నారు. ఇస్లాంవాదులను ప్రసన్నం చేసుకునేందుకే హసీనా బంగ్లాదేశ్ నుంచి బయటపడ్డారని, ఆమె కూడా విద్యార్థి ఉద్యమంలో భాగమైనట్లు ఉన్నదని తస్లీమా ఆరోపించారు.
తస్లీమా నస్రీన్ ఒక ఆన్‌లైన్ పోస్ట్‌లో ‘ఇస్లామిస్టులను ప్రసన్నం చేసుకునేందుకు, హసీనా నన్ను 1999లో నా దేశం నుంచి వెళ్లగొట్టారు. అప్పట్లో నేను మరణశయ్యపై ఉన్న మా అమ్మను చూసేందుకు బంగ్లాదేశ్‌కు వెళ్లాను. ఆ తరువాత నన్ను తిరిగి బంగ్లాదేశ్‌కు రానివ్వలేదు. ఒకవిధంగా చూస్తే ఆమె ఇస్లామిస్టు ఉద్యమంలో భాగమయ్యారు. అదే ఇప్పుడు ఆమెను దేశం విడిచివెళ్లేలా చేసింది’ అని అన్నారు. షేక్ హసీనా మిలటరీ విమానంలో భారతదేశానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఆమె ఆశ్రయం పొందేందుకు లండన్‌కు వెళ్లే అవకాశాలున్నాయి. ఇస్లాంవాదులకు మద్దతుగా నిలిచేందుకు, అవినీతికి పాల్పడే వ్యక్తులకు ఆమె ప్రోత్సాహం అందించారని’ తస్లీమా ఆరోపించారు.
తస్లీమా నస్రీన్ 1994లో ‘లజ్జ’ పేరుతో ఒక పుస్తకాన్ని రాశారు. దీనిపై మత ఛాందసవాద సంస్థల నుండి వచ్చిన బెదిరింపుల కారణంగా ఆమె బంగ్లాదేశ్ విడిచి వెళ్ళవలసి వచ్చింది. ఈ పుస్తకాన్ని బంగ్లాదేశ్‌లో నిషేధించారు. అయితే చాలా ప్రాంతాల్లో ఈ బుక్ బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. తస్లీమా నస్రీన్ దేశం విడిచి వెళ్లిన సమయంలో హసీనా ప్రత్యర్థి ఖలీదా జియా ప్రధానమంత్రిగా ఉన్నారు. నాటి నుంచి రచయిత తస్లీమా నస్రీన్ బంగ్లాదేశ్‌కు దూరంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment