తాజా పాస్‌పోర్ట్ కోసం ఎన్‌వోసీ ఇచ్చేలా ప్రత్యేక కోర్టును ఆదేశించండి
హైకోర్టులో వైఎస్ జగన్ పిటిషన్
తీర్పు రిజర్వ్ చేసిన న్యాయస్థానం
సాక్షి, అమరావతి: తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమం నిమిత్తం వచ్చే వారం లండన్ వెళ్లాల్సి ఉందని, అందువల్ల తనకు తాజా పాస్‌పోర్ట్ జారీ నిమిత్తం నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) ఇచ్చేలా విజయవాడ ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టును ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఎన్‌వోసీ ఇవ్వాలంటే స్వయంగా కోర్టు ముందు హాజరై, రూ.20వేలతో వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాల్సిందేనన్న ప్రత్యేక కోర్టు ఆదేశాలను రద్దు చేయాలని కోరుతూ ఆయన సోమవారం హైకోర్టులో అత్యవసరంగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి విచారణ జరిపారు. వైఎస్ జగన్ తరఫున సీనియర్ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్, న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపించారు. వ్యక్తిగత పూచీకత్తుతో నిమిత్తం లేకుండా ఐదేళ్ల గడువుతో కూడిన పాస్‌పోర్ట్ జారీ నిమిత్తం ఎన్‌వోసీ ఇచ్చేందుకు ప్రత్యేక కోర్టు నిరాకరించిందని శ్రీరామ్ తెలిపారు. ఎన్‌వోసీ కావాలంటే స్వయంగా తమముందు హాజరు కావాల్సిందేనని చెప్పారన్నారు.
వాస్తవానికి ఏ పరువు నష్టం కేసులో అయితే వ్యక్తిగతంగా హాజరుకావాలని ప్రత్యేక కోర్టు చెబుతుందో... ఆ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి వైఎస్ జగన్‌కు హైకోర్టు గతంలోనే మినహాయింపునిచ్చిందని ఆయన కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అందువల్ల వ్యక్తిగతంగా హాజరై రూ.20 వేలకు పూచీకత్తులు సమర్పించాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయాన్ని ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. హైకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఐదేళ్ల కాల వ్యవధితో కూడిన పాస్‌పోర్ట్ జారీకి ఎన్‌వోసీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రత్యేక కోర్టుపై ఉందన్నారు. ఈ నెల 16న లండన్‌లో తన కుమార్తె డిగ్రీ ప్రదానోత్సవ కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరుకావాల్సి ఉందని, అందువల్ల ఎన్‌సీవో మంజూరు చేసేలా ప్రత్యేక కోర్టును ఆదేశించాలని కోరారు.
అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ, పరువునష్టం కేసులో విచారణకు మాత్రమే వ్యక్తిగత హాజరు నుంచి వైఎస్ జగన్‌కు హైకోర్టు మినహాయింపు ఇచ్చిందన్నారు. పూచీకత్తులు సమర్పించేందుకు మినహాయింపు ఇవ్వలేదని తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం స్వయంగా హాజరై పూచీకత్తులు సమర్పించాల్సిన బాధ్యత జగన్‌పై ఉందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
Comments
Please login to add a commentAdd a comment