నా భద్రతా బృందంతో బాషాను పంపేలా ఆదేశాలివ్వండి: వైఎస్‌ జగన్‌ | Former CM YS Jagan urgent petition in Andhra High Court | Sakshi
Sakshi News home page

నా భద్రతా బృందంతో బాషాను పంపేలా ఆదేశాలివ్వండి: వైఎస్‌ జగన్‌

Published Tue, Jan 14 2025 4:59 AM | Last Updated on Tue, Jan 14 2025 5:08 AM

Former CM YS Jagan urgent petition in Andhra High Court

హైకోర్టులో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ అత్యవసర పిటిషన్‌

గతంలో కూడా బాషా నా భద్రతా బృందంలో ఉన్నారు

నా భద్రతా ఏర్పాట్ల గురించి ఆయనకు మంచి అవగాహన ఉంది

బాషా కోసం వినతిపత్రం ఇచ్చినా ప్రభుత్వం స్పందించడం లేదు

సాక్షి, అమరావతి: తన కుమార్తె స్నాతకోత్సవం నిమిత్తం లండన్‌ వెళుతున్న నేపథ్యంలో... తన భద్రతా బృందంలో గతంలో డీఎస్పీగా వ్యవహరించిన ఎస్‌.మహబూబ్‌ బాషాను ప్రస్తుతం తన భద్రతా బృందంతోపాటు పంపేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం అత్యవసరంగా హౌస్‌మోషన్‌ రూపంలో దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ న్యాపతి విజయ్‌ విచారణ జరిపారు. వైఎస్‌ జగన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సుబ్రహ్మణ్య శ్రీరామ్, న్యాయవాది శెట్టిపల్లి దుష్యంత్‌రెడ్డి వాదనలు వినిపించారు.

మంగళవారం నాడు వైఎస్‌ జగన్‌ లండన్‌ బయలుదేరుతున్నారని, ఈ నెలాఖరు వరకు అక్కడే ఉంటారని శ్రీరామ్‌ తెలిపారు. లండన్‌ వెళ్లేందుకు కోర్టు నుంచి చట్ట ప్రకారం అనుమతులు కూడా తీసుకున్నారని ఆయన వివరించారు. జగన్‌కు ప్రాణహాని ఉన్న నేపథ్యంలో ఆయనకు జెడ్‌ ప్లస్‌ భద్రతను కల్పిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు విదేశాలకు వెళుతున్న నేపథ్యంలో ఎల్లోబుక్‌ ప్రకారం ఆయనకు సెక్యూరిటీ ప్రొటోకాల్‌ కింద భద్రతను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్‌ పలుమార్లు లండన్‌ వెళ్లారని, అప్పుడు భద్రతా బృందంలో మహబూబ్‌ బాషా ఉన్నారని కోర్టుకు వివరించారు. 

తన భద్రతాపరమైన విషయాల గురించి బాషాకు స్పష్టమైన అవగాహన ఉందని, అందువల్ల ఆయనను తన వెంట పంపాలంటూ జగన్‌ ఈ నెల 9న ప్రభుత్వానికి వినతిపత్రం సమర్పించారన్నారు. మంగళవారం లండన్‌ వెళుతున్నప్పటికీ, ప్రభుత్వం ఇప్పటి వరకు ఆ వినతిపత్రంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ నేపథ్యంలో అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించామని చెప్పారు. జెడ్‌ ప్లస్‌ భద్రతను కల్పిస్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకుని భద్రతను కల్పించి తీరాల్సి ఉండగా, ప్రభుత్వం ఇప్పటి వరకు చోద్యం చూస్తూ ఉందన్నారు. 

జగన్‌ భద్రతను ఈ ప్రభుత్వం భారీగా కుదించింది
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ స్పందిస్తూ, ఎల్లోబుక్‌ ప్రకారం తనకు నిర్దిష్ట వ్యక్తినే భద్రతాధికారిగా నియమించాలని కోరడానికి వీల్లేదన్నారు. శ్రీరామ్‌ జోక్యం చేసుకుంటూ జగన్‌కు ఉన్న భద్రతను ఈ ప్రభుత్వం భారీగా కుదించిందని, దీనిపై తాము న్యాయపోరాటం చేస్తున్నామని వివరించారు. తమ వినతిపత్రంపై నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వానికి ఉన్న ఇబ్బంది ఏమిటో అర్థంకావడం లేదన్నారు. దమ్మాలపాటి స్పందిస్తూ ఆ వినతిపత్రంపై తప్పక పరిశీలన జరిపి నిర్ణయం తీసుకుంటామని, ఇందుకు కొంత సమయం పడుతుందని చెప్పారు. అందువల్ల విచారణను ఈ నెల 17కి వాయిదా వేయాలని కోరారు. తమకు అభ్యంతరం లేదని శ్రీరామ్‌ చెప్పారు. దీంతో న్యాయమూర్తి పూర్తి వివరాల సమర్పణ నిమిత్తం విచారణను 17కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement