సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. తాజాగా మాదాపూర్‌లోని ఏడు అంతస్తుల అక్రమ నిర్మాణాన్ని హైడ్రా కూల్చివేసింది. ఇదే సమయంలో అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలపై హైడ్రా దృష్టి సారించింది. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడ పర్యటించారు.
మాదాపూర్‌లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. అయ్యప్ప సొసైటీలోని అక్రమ కట్టడాల్లో హాస్టల్స్ పుట్టగొడుగుల్లా వెలిశాయి. తాజా పరిస్థితులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షించారు. అక్రమ నిర్మాణాల కారణంగా రోడ్లపైనే డ్రైనేజీలు పారుతుండటాన్ని గుర్తించారు. దీంతో, అక్రమ కట్టడాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అధికారులపై చర్యలు తీసుకునేందుకు అనుమతి కోసం ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు రంగనాథ్ తెలిపారు.
హైడ్రా పోలీసు స్టేషన్..
ఇదిలా ఉండగా.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కోసం ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటైంది. నగరంలోని బుద్ధ భవన్‌లో బీ–బ్లాక్ కేంద్రంగా కార్యకలాపాలు హైడ్రా ఠాణా కార్యకలాపాలు సాగించనుంది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఠాణాకు ఏసీపీ స్థాయి అధికారి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్‌హెచ్‌ఓ) ఉండనున్నారు. ఓఆర్‌ఆర్ లోపలి భాగం, దానికి ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ ఠాణాలో పని చేయడానికి సిబ్బంది, అధికారులను డిప్యూటేషన్ ప్రాతిపదికన తీసుకోనున్నారు. గణతంత్ర వేడుకల్లోగా హైడ్రా ఠాణా కార్యకలాపాలు ప్రారంభించేలా రంగనాథ్ కసరత్తు చేస్తున్నారు.
దర్యాప్తులో జాప్యాన్ని నివారించేందుకు..
జలవనరుల్లో కట్టడాలకు అడ్డగోలు అనుమతులను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై ఆయా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయిస్తోంది. సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ)తోపాటు అనేక చోట్ల ఇప్పటికే కేసుల దర్యాప్తు సాగుతోంది. అయితే రోజువారీ కార్యకలాపాల్లో తలమునకలై ఉండే స్థానిక పోలీసులు ఈ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేకపోతుండటంతో దర్యాప్తు ఆలస్యమవుతోంది. ఇది కబ్జాకోరులు, అక్రమార్కులకు వరంగా మారుతుండటంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందుకు సానుకూలంగా స్పందించిన సర్కారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
పీడీపీపీ కింద కేసులు!
జీహెచ్‌ఎంసీ పరిధిలోని చెరువుల్లో అనేకం ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. వాటితోపాటు ప్రభుత్వ భూములు, పార్కులు సైతం అన్యాక్రాంతమయ్యాయి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం (పీడీపీపీ) కింద కేసులు నమోదు చేసే అవకాశాన్ని హైడ్రా పరిశీలిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment