Ayyappa Society colony
-
HYD: అయ్యప్ప సొసైటీపై ‘హైడ్రా’ ఫుల్ ఫోకస్.. మరిన్ని కూల్చివేతలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. తాజాగా మాదాపూర్‌లోని ఏడు అంతస్తుల అక్రమ నిర్మాణాన్ని హైడ్రా కూల్చివేసింది. ఇదే సమయంలో అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలపై హైడ్రా దృష్టి సారించింది. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడ పర్యటించారు.మాదాపూర్‌లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. అయ్యప్ప సొసైటీలోని అక్రమ కట్టడాల్లో హాస్టల్స్ పుట్టగొడుగుల్లా వెలిశాయి. తాజా పరిస్థితులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షించారు. అక్రమ నిర్మాణాల కారణంగా రోడ్లపైనే డ్రైనేజీలు పారుతుండటాన్ని గుర్తించారు. దీంతో, అక్రమ కట్టడాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అధికారులపై చర్యలు తీసుకునేందుకు అనుమతి కోసం ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు రంగనాథ్ తెలిపారు.హైడ్రా పోలీసు స్టేషన్..ఇదిలా ఉండగా.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కోసం ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటైంది. నగరంలోని బుద్ధ భవన్లో బీ–బ్లాక్ కేంద్రంగా కార్యకలాపాలు హైడ్రా ఠాణా కార్యకలాపాలు సాగించనుంది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఠాణాకు ఏసీపీ స్థాయి అధికారి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్హెచ్ఓ) ఉండనున్నారు. ఓఆర్ఆర్ లోపలి భాగం, దానికి ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ ఠాణాలో పని చేయడానికి సిబ్బంది, అధికారులను డిప్యూటేషన్ ప్రాతిపదికన తీసుకోనున్నారు. గణతంత్ర వేడుకల్లోగా హైడ్రా ఠాణా కార్యకలాపాలు ప్రారంభించేలా రంగనాథ్ కసరత్తు చేస్తున్నారు. దర్యాప్తులో జాప్యాన్ని నివారించేందుకు.. జలవనరుల్లో కట్టడాలకు అడ్డగోలు అనుమతులను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై ఆయా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయిస్తోంది. సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ)తోపాటు అనేక చోట్ల ఇప్పటికే కేసుల దర్యాప్తు సాగుతోంది. అయితే రోజువారీ కార్యకలాపాల్లో తలమునకలై ఉండే స్థానిక పోలీసులు ఈ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేకపోతుండటంతో దర్యాప్తు ఆలస్యమవుతోంది. ఇది కబ్జాకోరులు, అక్రమార్కులకు వరంగా మారుతుండటంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందుకు సానుకూలంగా స్పందించిన సర్కారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.పీడీపీపీ కింద కేసులు! జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల్లో అనేకం ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. వాటితోపాటు ప్రభుత్వ భూములు, పార్కులు సైతం అన్యాక్రాంతమయ్యాయి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం (పీడీపీపీ) కింద కేసులు నమోదు చేసే అవకాశాన్ని హైడ్రా పరిశీలిస్తోంది. -
place of దోశ
మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ కాలనీ... చుట్టూ కాంక్రీట్ జంగిల్... ఐటీ కంపెనీలు... అక్కడే ఓ ఖాళీస్థలంలో ఉన్న వ్యాన్.. వందల రుచులు పంచుతూ మీ మనసును ‘దోసె’స్తుంది. అందుకే ఆడీ కారు అబ్బాయి నుంచి అడ్డా కూలీ వరకు సాయంత్రం కాగానే అందరూ అక్కడికి చేరుకుంటారు.. రోడ్డుపక్కన కబుర్లు చెప్పుకుంటూ తమకిష్టమైన దోసెలను రుచిచూస్తారు. - ప్రవీణ్‌కుమార్ కాసం రకరకాల దోశలతో మీ మనుసు దోచే రుచులను పంచుతున్న ఆ వ్యాన్ వెనక పెద్ద చరిత్రే ఉంది. ఏడేళ్లు అమెరికాలో ఉద్యోగం చేసి, కంపెనీ డెరైక్టర్‌గా పనిచేసిన అజయ్ అనే యువకుడి ఆలోచనల ప్రతిరూపమే ఈ దోశ ప్లేస్. కేవలం ఈ దోశలేయడానికి ఆయన ఐటీ జాబ్‌కు టాటా చెప్పి ఇండియా ఫ్లైట్ ఎక్కాడు. ఇంట్లోవాళ్లు కాస్త తటపటాయించినా, తనపై తనకున్న నమ్మకంతో మాదాపూర్‌లో హైటెక్ హంగులతో ఈ ‘దోశ ప్లేస్’ను ఏర్పాటు చేశాడు. రెస్టారెంట్లలో లాగా శుభ్రంగా ఉండాలి.. రోడ్డుపక్కన కబుర్లు చెప్పుకొంటూ తినాలి అనుకోనేవారికి ఈ ప్లేస్ సరైన వేదిక. ఎల్ఈడీ లైట్లు, జనరేటర్, వాటర్సింక్లతో ప్రత్యేకంగా నిర్మించిన ఈ వ్యాన్‌లో మీరు 111 రకాల దోసెలకు ఆర్డరివ్వవచ్చు. జిహ్వకో రుచి... జనరల్ దోసెలు కాదు జనం మెచ్చే దోసెలు అందిచాలన్నది అజయ్ కోరిక. అందుకే వ్యాన్లోనే సెంచరీ ప్లస్ దోశలు తయారు చేసేందుకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. ఇక్కడ తీన్మార్ దోశ చాలా ఫేమస్. అలాగే కేరళ ఓపెన్, డ్రైట్ ఫ్రూట్ దోశలాంటి వెరైటీలు కూడా లభిస్తాయి. చిన్నపిల్లలకోసం పిజ్జా దోసె, ముసలివాళ్ల కోసం ప్రకృతి దోశ ఇలా ప్రతి వయసు వారినీ దోచే దోశలూ ఉన్నాయి. అంతేకాదు టేస్టీ, క్వాలటీ విషయంలో రాజీపడకూడదనేది దోశ ప్లేస్ సిద్ధాంతం. అందుకే పరిశుభ్ర వాతావరణంలో మనముందే ఇక్కడ తయారు చేస్తారు. అక్కడి దోశలు రుచి చూస్తుంటే అజయ్ భార్య విద్య (దోశ ప్లేస్ డెరైక్టర్) మీ ఫీడ్‌బ్యాక్‌ను కూడా అడిగి తెలుసుకుంటుంటారు. అందరికీ కేరాఫ్... ఇక్కడ దోశలు తినాలంటే మరీ పర్సు తడుముకోవాల్సిన అవసరం లేదు. దోశ రకాలను బట్టి రూ.30 నుంచి రూ.120 లోపు మాత్రమే ఇక్కడ ధరలుంటాయి. రోజూ 300 మంది దోశ ప్రియులను ఈ చిన్న ట్రక్కు సంతృప్తి పరుస్తుంది. సాఫ్ట్వేర్లు, సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఈ వీల్-ఆన్-దోశకు పడిపోయారు. భారీ చిత్రాల దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడి రుచులను ఆస్వాది స్తుంటారు. ఆరుబయట కూర్చొని కమ్మని కబుర్లు చెప్పుకుంటూ వేడివేడి దోశలు లాగించేయాలంటే మాదాపూర్‌లోని ఈ దోశ ప్లేస్ మీకు కరెక్ట్ ప్లేస్. ఎప్పటికప్పుడు కొత్తగా... నలుగురికి ఉపాధి కల్పించాలనే ఆశయంతోనే ఈ దోశ ప్లేస్‌ను ఏర్పాటు చేశా. ఇక్కడ క్వాలిటీ, టేస్టీ, హైజెనిక్ ఈ మూడు పక్కా పాటిస్తాం. మరిన్ని రకాల దోశలు తయారు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాం. ముంబై, బెంగళూరు తదితర పట్టాణాల్లో కూడా విస్తరించాలనుకుంటున్నాం. నగరంలో మరో పదిచోట్ల కూడా ఇలాంటివే ఏర్పాటు చేయబోతున్నాం. దీని వల్ల వందల మందికి ఉపాధినిస్తున్నాననే సంతృప్తి కలుగుతోంది. - అజయ్ కోనేరు, దోశ ప్లేస్ సీఈఓ