place of దోశ | Had tasteful and lots of variety Dosa's at Dosa Place | Sakshi
Sakshi News home page

place of దోశ

Published Wed, Jul 9 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

place of దోశ

place of దోశ

మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ కాలనీ... చుట్టూ కాంక్రీట్ జంగిల్... ఐటీ  కంపెనీలు... అక్కడే ఓ ఖాళీస్థలంలో ఉన్న వ్యాన్.. వందల రుచులు పంచుతూ మీ మనసును ‘దోసె’స్తుంది. అందుకే ఆడీ కారు అబ్బాయి నుంచి అడ్డా కూలీ వరకు సాయంత్రం కాగానే అందరూ అక్కడికి చేరుకుంటారు..  రోడ్డుపక్కన కబుర్లు చెప్పుకుంటూ తమకిష్టమైన దోసెలను రుచిచూస్తారు.
-  ప్రవీణ్‌కుమార్ కాసం

 రకరకాల దోశలతో మీ మనుసు దోచే రుచులను పంచుతున్న ఆ వ్యాన్ వెనక పెద్ద చరిత్రే ఉంది. ఏడేళ్లు అమెరికాలో ఉద్యోగం చేసి, కంపెనీ డెరైక్టర్‌గా పనిచేసిన అజయ్ అనే యువకుడి ఆలోచనల ప్రతిరూపమే ఈ దోశ ప్లేస్. కేవలం ఈ దోశలేయడానికి ఆయన ఐటీ జాబ్‌కు టాటా చెప్పి ఇండియా ఫ్లైట్ ఎక్కాడు. ఇంట్లోవాళ్లు కాస్త తటపటాయించినా, తనపై తనకున్న నమ్మకంతో మాదాపూర్‌లో హైటెక్ హంగులతో ఈ ‘దోశ ప్లేస్’ను ఏర్పాటు చేశాడు. రెస్టారెంట్లలో లాగా శుభ్రంగా ఉండాలి.. రోడ్డుపక్కన కబుర్లు చెప్పుకొంటూ తినాలి అనుకోనేవారికి ఈ ప్లేస్ సరైన వేదిక. ఎల్‌ఈడీ లైట్లు, జనరేటర్, వాటర్‌సింక్‌లతో ప్రత్యేకంగా నిర్మించిన ఈ వ్యాన్‌లో మీరు 111 రకాల దోసెలకు ఆర్డరివ్వవచ్చు.
 
 జిహ్వకో రుచి...
 జనరల్ దోసెలు కాదు జనం మెచ్చే దోసెలు అందిచాలన్నది అజయ్ కోరిక. అందుకే వ్యాన్‌లోనే సెంచరీ ప్లస్ దోశలు తయారు చేసేందుకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశాడు. ఇక్కడ తీన్‌మార్ దోశ చాలా ఫేమస్. అలాగే కేరళ ఓపెన్, డ్రైట్ ఫ్రూట్ దోశలాంటి వెరైటీలు కూడా లభిస్తాయి. చిన్నపిల్లలకోసం పిజ్జా దోసె, ముసలివాళ్ల కోసం ప్రకృతి దోశ ఇలా ప్రతి వయసు వారినీ దోచే దోశలూ ఉన్నాయి. అంతేకాదు టేస్టీ, క్వాలటీ విషయంలో రాజీపడకూడదనేది దోశ ప్లేస్ సిద్ధాంతం. అందుకే పరిశుభ్ర వాతావరణంలో మనముందే ఇక్కడ తయారు చేస్తారు. అక్కడి దోశలు రుచి చూస్తుంటే అజయ్ భార్య విద్య (దోశ ప్లేస్ డెరైక్టర్) మీ ఫీడ్‌బ్యాక్‌ను కూడా అడిగి తెలుసుకుంటుంటారు.
 
 అందరికీ కేరాఫ్...
 ఇక్కడ దోశలు తినాలంటే మరీ పర్సు తడుముకోవాల్సిన అవసరం లేదు. దోశ రకాలను బట్టి రూ.30 నుంచి రూ.120 లోపు మాత్రమే ఇక్కడ ధరలుంటాయి. రోజూ 300 మంది దోశ ప్రియులను ఈ చిన్న ట్రక్కు సంతృప్తి పరుస్తుంది. సాఫ్ట్‌వేర్‌లు, సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఈ వీల్-ఆన్-దోశకు పడిపోయారు. భారీ చిత్రాల దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి కూడా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడి రుచులను ఆస్వాది స్తుంటారు. ఆరుబయట కూర్చొని కమ్మని కబుర్లు చెప్పుకుంటూ వేడివేడి దోశలు లాగించేయాలంటే మాదాపూర్‌లోని ఈ దోశ ప్లేస్ మీకు కరెక్ట్ ప్లేస్.  
 
 ఎప్పటికప్పుడు కొత్తగా...

 నలుగురికి ఉపాధి కల్పించాలనే ఆశయంతోనే ఈ దోశ ప్లేస్‌ను ఏర్పాటు చేశా. ఇక్కడ  క్వాలిటీ, టేస్టీ, హైజెనిక్ ఈ మూడు పక్కా పాటిస్తాం. మరిన్ని రకాల దోశలు తయారు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాం. ముంబై, బెంగళూరు తదితర పట్టాణాల్లో కూడా విస్తరించాలనుకుంటున్నాం. నగరంలో మరో పదిచోట్ల కూడా ఇలాంటివే ఏర్పాటు చేయబోతున్నాం. దీని వల్ల వందల మందికి ఉపాధినిస్తున్నాననే సంతృప్తి కలుగుతోంది.
 - అజయ్ కోనేరు, దోశ ప్లేస్ సీఈఓ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement