bhuvaneswari
-
నారా భువనేశ్వరిని నేను ఒక్కటే అడుగుతున్న: గుడివాడ అమర్నాథ్
-
భువనేశ్వరి నీ బస్సు యాత్రలో దమ్ముంటే ఆ నిజం చెప్పు
-
నారా భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై కొడాలి నాని ఫైర్
-
శ్రీవారి పాదాల సాక్షిగా నారా భువనేశ్వరిని ఒక్కటే అడుగుతున్నా
-
భువనేశ్వరి,లోకేష్ లు కూడా జైలుకు వెళ్లే సమయం వచ్చింది: ఆర్కే రోజా
-
జేపీ నడ్డా రామోజీరావుని కలవడానికి అసలు కారణం..!
-
టీడీపీని, చంద్రబాబును పవన్ ఎన్నోసార్లు తిట్టాడు
-
ట్విట్టర్ వేదికగా ఆర్జీవీ ఆగ్రహం..!
-
అమ్మ, కొడుకుపై రోజా నాన్ స్టాప్ పంచులు
-
‘జైల్లో ఉంటే దోమలు కుట్టక.. రంభ, ఊర్వశి, మేనకలు కన్ను కొడతారా?’
సాక్షి, విజయవాడ: లోకేష్ మా పేర్లు రెడ్‌బుక్‌లో రాస్తున్నాడని.. మేము లోకేష్ పేరు చిత్తు కాగితాల్లో కూడా రాయమని మాజీ మంత్రి కొడాలి నాని సెటైర్లు వేశారు. ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవి అని చెప్పిన లోకేష్.. తన తండ్రి జైలుకెళ్తే ఎందుకు ఏడుస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబుకు పెత్త పదవి వద్దా అంటూ చురకలంటించారు. బాబు అరెస్ట్‌తో లోకేష్ తిరునాళ్లలో తప్పిపోయిన పిల్లాడిలా బిత్తర చూపులు చూశాడని విమర్శించారు. కొట్టండి, జైల్లో పెట్టండి, నిరూపించడండి అన్న లోకేష్.. ఇప్పుడు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడని దుయ్యబట్టారు. ‘ఆడెవడో స్టార్ వస్తే లోకేష్ అన్నయ్య అంటాడు. ఓ పక్కన అన్నయ్యను, మరో పక్క మామయ్యను పెట్టుకుని ఏదో చేద్దామని లోకేష్ అనుకుంటున్నాడు. 2 శాతం హెరిటేజ్ షేర్లు అమ్మితే కోట్లు వస్తాయని భువనేశ్వరీ అంటున్నారు. హెరిటేజ్ షేర్లు అమ్మి ప్రజలకు డబ్బులేమైనా పంచుతారా..? తన భర్తక వసతుల్లేవు. వేడి నీళ్లు లేవని భువనేశ్వరి అంటున్నారు. ఏసీలు, ఫ్రిజ్‌లు,కూలర్లు ఉండటానికి అదేం ఇల్లు కాదు. జైలు. జైల్లో ఉంటే దోమలు కుట్టక.. రంభ, ఊర్వశి, మేనకలు కన్ను కొడతారా?. జైల్లో ఏమైనా వసతులు కావాలంటే కోర్టును అడగాలి. చంద్రబాబు ఏదో అరెస్ట్ అయ్యాడూ.. దానిపై ఎదోటి మాట్లాడమని పక్క రాష్ట్రం నేతలను బ్రతిమాలుతున్నారు. అందుకే కొంతమంది ట్వీట్లు పెడుతున్నారు. బాబుతో నేను అంటూ కార్యక్రమాలు చేసేవాళ్లు.. బాబుతో పాటు జైలుకెళ్తారా..? చంద్రబాబు కోసం ఎవరూ పాదయాత్రలు చేయరు.. కార్ల యాత్రలు చేస్తారు. చంద్రబాబు కోసం యాత్రలు చేసేది కమ్మ కులస్తులు మాత్రమే. మా వాళ్లకే కార్లు ఎక్కువగా ఉన్నాయి. పొరుగు దేేశాలు.. రాష్ట్రాల్లో బీసీ, ఎస్సీలేమైనా నిరసనలు చేస్తున్నారా..? చంద్రబాబు నామినేటెడ్ పదవులు ఇచ్చినప్పుడు ఒక్కరికి కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వలేదు.’ అని కొడాలి నాని పేర్కొన్నారు. చదవండి: చంద్రబాబు నాయుణ్ని ముంచుతున్నది ఎల్లో మీడియానే -
నారా భువనేశ్వరి, బీజేపీ పురంధేశ్వరికి మంత్రి ఆర్కే రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు
-
చంద్రబాబును కలిసిన కుటుంబ సభ్యులు
-
చంద్రబాబు కోసం ఓ ప్రత్యేక వార్డు
-
అప్పట్లో అందంతో అలరించింది.. ఇప్పుడేంటీ ఇంతలా మారిపోయింది!
సోషల్ మీడియా పుణ్యమాని సెలబ్రిటీలు ఎక్కడికెళ్లినా తమ అభిమానులతో ఫోటోలు, వీడియోలను పంచుకుంటున్నారు. ఇటీవల సీనియర్ హీరోయిన్స్ సైతం ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్నారు. కానీ ఇప్పటివరకు సోషల్ మీడియాలో ఎక్కడ కనిపించని ఓ సీనియర్ నటి తాజాగా కెమెరాకు చిక్కింది. బుల్లితెరతో పాటు పలు చిత్రాల్లో తనదైన నటనతో పేరు తెచ్చుకున్నారు. 2003లో వచ్చిన తమిళ బాయ్స్ చిత్రం ద్వారా గుర్తింపు దక్కింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన మొదటి చిత్రం కుర్ కురే. తెలుగులో దొంగ రాముడు అండ్ పార్టీ, గుడుంబా శంకర్, చక్రం, భాగ్యలక్ష్మి బంపర్ డ్రా, సీమ శాస్త్రి, ఆంజనేయులు వంటి సినిమాల్లో కనిపించింది. ఆ తర్వాత పలు తమిళ చిత్రాల్లో నటించిన భువనేశ్వరి వెండితెరకు దూరమై పలు సీరియల్స్‌లో నటించింది. ఏపీలోని చిత్తూరు ఆమె స్వస్థలం కాగా.. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలో అడుగుపెట్టింది. చాలా రోజుల తర్వాత కెమెరా కంటికి చిక్కింది భువనేశ్వరి. తిరుమల దర్శనానికి వచ్చిన ఆమె గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. అప్పట్లో సినిమాల్లో తన అందంతో అలరించిన ఆమెను ఇప్పుడు చూస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోక తప్పదు. కెరీర్ ప్రారంభంలో డబ్బింగ్ సీరియల్స్‌లో నటించిన భువనేశ్వరి.. ఆ తర్వాత సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. చాలా వరకు బోల్ట్ సీన్స్‌లోనే నటించింది. కానీ అనుకోకుండా ఓ సారి ఊహించని షాక్ ఇచ్చింది. చెన్నైలో ఓ వ్యభిచార గృహాన్ని నడిపారని ఆమెపై ఆరోపణలు కూడా వచ్చాయి. అప్పట్లో ఆ వార్త సంచలనంగా మారింది. తాజాగా ఆమె తిరుమలకు రావడంతో కెమెరాలకు చిక్కింది. (ఇది చదవండి: డబ్బుల కోసం అలాంటి వార్తలు రాయడం దుర్మార్గం: కోటా శ్రీనివాసరావు) -
అచ్చం నాన్న లానే!
తమిళనాడులో ఉంటున్న లక్ష్మీప్రభకు పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి సమయం దగ్గరపడుతున్నా చెల్లెలు బాధగా ఎందుకు ఉంటోందో అక్క భువనేశ్వరి అర్థం చేసుకుంది. తన పెళ్లి చూడకుండానే తండ్రి మరణించాడనే కారణంగా చెల్లెలు ఏ మాత్రం సంతోషం లేదని భువనేశ్వరికి తెలుసు. పెళ్లి సమయానికి తండ్రి మైనపు విగ్రహాన్ని 6 లక్షలు వెచ్చించి, తయారు చేయించి మండపంలో ఉంచింది. మండపంలో తండ్రి(విగ్రహాన్ని)ని చూసిన లక్ష్మీ ప్రభ ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. పెళ్లి తర్వాత తండ్రి ఆశీర్వాదం తీసుకుంది. చెల్లెలు ఆనందమే తనకు కావాల్సింది అని లక్ష్మీప్రభను దీవిస్తూ అక్క భువనేశ్వరి చెప్పిన మాటలు అతిథులనూ ఆనందింపజేశాయి. అక్కాచెల్లెళ్ల అనుబంధం ఎప్పుడూ ఇలాగే ఉండాలంటూ అతిథులు వారికి అభినందనలు తెలిపారు. కొత్త ఇంటిలో తన గృహలక్ష్మితో కలిసి గృహప్రవేశం వేడుక జరుపుకోవాలనుకున్న పారిశ్రామికవేత్త శ్రీనివాస్ గుప్తా తన దివంగత భార్య మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో జరిగిన ఈ వేడుక వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యాయి. ఇలాగే చాలా మంది తాము పోగొట్టుకన్న ప్రియమైనవారిని విగ్రహాల ఏర్పాటుతో బాధను తగ్గించుకుంటున్నారు. ఇటీవల తమిళనాడు వాసి అయిన లక్ష్మీ ప్రభ వివాహంలో ఆమె తండ్రి మైనపు విగ్రహం సమక్షంలో పెళ్లి జరగడం, ఆ వేడుక భావోద్వేగాలకు ప్రతీకగా నిలవడం అందరినీ ఆకట్టుకుంది. డబ్బు కన్నా ఆనందం మిన్న లక్షీప్రభ తండ్రి ఈ ప్రపంచంలో లేరు. తండ్రి లేకపోవడంతో ఆమె రోజూ బాధపడేది. ఇంతలో, ఆమె ఇంట్లో వివాహానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆమె ఇంకా నిరాశకు గురైంది. తండ్రి లేకుండా ఈ పెళ్లి అవసరమా అంటూ మాట్లాడేది. లక్ష్మీప్రభ అక్క భువనేశ్వరి చెల్లెలికి ఆనందాన్ని తిరిగి ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొంది. తమ తండ్రి మైనపు విగ్రహాన్ని తయారుచేయించి లక్ష్మీప్రభ పెళ్లికి బహుమతిగా ఇచ్చింది. ఈ విగ్రహ తయారీకి భువనేశ్వరి 6 లక్షలు ఖర్చు చేసింది. విగ్రహానికి ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పినా, ‘నా చెల్లెల ముఖంలో ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను, ఆ ఆనందం ముందు ఈ ఖర్చు ప్దెదది కాదు’ అంది భువనేశ్వరి. పెళ్లి రోజున తండ్రితో కలిసి ఉన్నారనే భావనతో లక్ష్మీప్రభ ఆనందంతో పొంగిపోయింది. అక్క ఇచ్చిన అపురూపమైన కానుకకు ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. పెళ్లి కాగానే తన భర్తతో కలిసి తండ్రి ఆశీర్వాదం కూడా తీసుకుంది లక్ష్మీ ప్రభ. చెల్లెలు ఆనందం కోసం భువనేశ్వరి చేసిన ఈ ప్రయత్నం విజయవంతమైంది. -
భువనేశ్వరి మృతి అనుమానాలు రేకెత్తిస్తోంది
సాక్షి, ఒంగోలు: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వాలంటీర్ ఉమ్మనేని భువనేశ్వరి కుటుంబాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆదివారం పరామర్శించారు. ఆమె కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ...‘ భువనేశ్వరి మృతిపై అన్ని కోణాల్లో పూర్తి స్థాయిలో విచారణ జరుగుతోంది. మృతి చెందిన తీరు పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఇలాంటి దారుణమైన సంఘటనలను రాష్ట్ర ప్రభుత్వం ఉపేక్షించబోదు. ( 'సౌమ్య కోరుకున్నట్టే వరప్రసాద్‌ను కఠినంగా శిక్షిస్తాం' ) భువనేశ్వరి కేసు విచారణను వేగవంతం చేసి, నిందితులను కఠినంగా శిక్షిస్తాం. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుంది’ అని హామీ ఇచ్చారు. కాగా, దశరాజుపల్లికి వెళ్లే దారిలో అప్పాయకుంట వద్ద శుక్రవారం రాత్రి ఏడు- ఎనిమిది గంటల ప్రాంతంలో భువనేశ్వరి ట్రై సైకిల్ పైనే సజీవ దహనమైన విషయం తెలిసిందే. గుంటూరు జిల్లా కొర్రపాడులో వేధింపులకు బలైన 10 వ తరగతి విద్యార్థి సౌమ్య కుటుంబాన్ని , ఒంగోలులో అనుమానాస్పద స్ధితిలో సజీవదహనమైన భువనేశ్వరి కుటుంబాన్ని పరామర్శించి , విచారణ వేగవంతం చెయ్యాలని ఎస్పి లను కోరటం జరిగింది. pic.twitter.com/XNaX6hkGJz — Vasireddy Padma (@padma_vasireddy) December 20, 2020 -
రక్తకన్నీరు ఆడి మాకు అమృతం పంచారు
‘చరిత్ర అడక్కు.. చెప్పేది విను’ అని నాగభూషణం ఫేమస్ డైలాగ్. కాని– నటుడిగా ఆయన చరిత్ర చెక్కుచెదరక నిలిచి ఉంది. ప్రేక్షకులకు దానిని పదేపదే అడగాలని ఉంటుంది. విలన్ నాగభూషణంగా, ‘రక్తకన్నీరు’ నాగభూషణంగా, మంచి పాత్రల నాగభూషణంగా ఆయన తెలుగువారికి ఆత్మీయుడు. నాగభూషణం కుమార్తె భువనేశ్వరి తండ్రి జ్ఞాపకాలను సాక్షితో పంచుకున్నారు. మాకు ఊహ తెలిసేటప్పటికే నాన్నగారు బాగా బిజీగా ఉన్నారు. షూటింగ్ అయ్యాక సాయంత్రాలు మేకప్‌తో ఇంటికి వస్తూనే అన్నయ్యను పలకరించేవారు. కాస్త ఊహ వచ్చాక నాన్నకు కావలసినవన్నీ నేనే చూసేదాన్ని. ‘మా అమ్మాయి అన్నీ చూసుకుంటోంది’ అని సంతోషించేవారు. నాన్న ప్రతిరోజూ కాకరకాయ రసం తాగేవారు. నేనే స్వయంగా కాకరకాయ రసం చిన్న గ్లాసుతో ఇస్తే తాగేవారు. ఆ తరవాత మేకప్ తీసేవారు. నాన్న చాలా పంక్చువల్. మడి కట్టుకుని వండేది... మాది శాకాహార కుటుంబమే అయినా నాన్నకు నాన్‌వెజ్ అంటే ఇష్టమని, మా అమ్మ (‘రక్త కన్నీరు’ సీతాదేవి) మడి కట్టుకుని నాన్‌వెజ్ వండేది. అమ్మ చేసిన కంది పచ్చడి అంటే నాన్నకు చాలా ఇష్టం. నాన్నగారికి కమ్యూనిస్టు భావాలున్నా ప్రతిరోజూ తెల్లవారుజామున గాయత్రీ మంత్రం జపించేవారు. దేవుడి గురించి ప్రశ్నిస్తే ‘ఒక మానవాతీత శక్తి ఉంది, ఆ శక్తినే గాయత్రీ మంత్రంగా భావించి జపిస్తాను. దానివల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి’ అనేవారు. అమ్మ శ్రావణ శుక్రవారం వరలక్ష్మీవ్రతం చేసుకున్న రోజున, పూజ అయ్యే సమయానికి ఎక్కడ షూటింగ్లో ఉన్నా, మధ్యాహ్నం ఇంటికి వచ్చి తప్పనిసరిగా భోజనం చేసేవారు. చెంప పగలగొట్టారు... ఆయనకు నేనంటే చాలా ఇష్టం. నేను పుట్టాక కలిసి వచ్చింది అంటుండేవారు. కాని నేను లిప్‌స్టిక్ వేసుకుంటే ఆయనకు నచ్చలేదు. ‘బాగుండదమ్మా. ముఖం కడుక్కో’ అని సున్నితంగా మందలించారు. ఒకసారి నేను, మా మామయ్య కూతురు కలిసి ‘అందాజ్’ (1971) సినిమాకు వెళ్లేసరికి టికెట్లు అయిపోయాయి. సాయంత్రం 6.30 షోకి వెళ్దామని అక్కడే ఉండిపోయాం. సినిమా అయ్యేసరికి ఆలస్యం అయిపోయింది. నాన్న టెన్షన్ పడిపోయి బయటకు వచ్చేసరికి, గేట్ దగ్గరే నిలబడి ఉన్నారు. మమ్మల్ని కారులో ఎక్కించుకుని ఇంటికి తీసుకువచ్చారు. భయంతో ఒళ్లంతా వణికిపోతోంది. ఇంట్లోకి రాగానే, చెంప మీద ఒక్కటి లాగి పెట్టి కొట్టారు. చెవి రింగు ఊడిపోయింది. ఎక్కడకు వెళ్లినా, సాయంత్రం ఆరుగంటలకు ఇంటికి వచ్చేయాలన్నది ఆయన స్ట్రిక్ట్ పోలసీ. ఆ ఒక్క దెబ్బతో ‘అందాజ్’ సినిమా కథంతా మరచిపోయాను. మూగమనసులుతో బ్రేక్ నాన్న 1956 నుంచి ‘రక్తకన్నీరు’ నాటకం వేయటం ప్రారంభించారు. అమ్మ సీతాదేవితో అక్కడే పరిచయం ఏర్పడి, కొన్ని రోజులకే వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. అప్పట్లో అమ్మ స్పెషల్ సాంగ్స్ చేసేది. మా నాయనమ్మ లీలాబాయమ్మ సినిమాలలో హీరోయిన్గా వేశారు. ఆవిడ మా అమ్మను పెంచుకున్నారు. ఆవిడ అదృష్టం ఏమో కాని, అమ్మను దత్తత తీసుకున్న ఆరు నెలలకు మా మేనమామ పుట్టారు. అమ్మకు 1957లో అన్నయ్య, 1960లో నేను పుట్టాక అమ్మ సినిమాలు మానేసింది. ‘మూగమనసులు’ చిత్రంతో నాన్నకు బ్రేక్ వచ్చినా, నాన్న నాటకాలు మానలేదు. నాన్నగారు ఒక్క డైలాగు కూడా మర్చిపోయే వారు కాదు. భయంతో ఏడ్చేశాను.. రక్తకన్నీరు నాటకంలో ఒక సీన్లో స్టేజీ మీద మొత్తం లైట్లన్నీ ఆర్పేసి, రెడ్ స్పాట్ లైట్ వేశారు. ఒక్కసారిగా నాన్న వెనక్కి తిరుగుతారు. రెడ్ లైట్ ముఖం మీద పడగానే, భయంతో ఏడ్చేశాను. ఆ సీన్లో కుష్ఠురోగంతో ఒళ్లంతా చీమునెత్తురుతో కుళ్లిపోయి ఉంటుంది నాన్న శరీరం. ఆ తరవాత ఎన్నడూ చూడలేదు. రక్తకన్నీరు లేకుండానే... 1995లో నాన్నగారు చేసిన సినిమాలన్నీ అన్నయ్య సేకరించాడు. నిర్మాతలు, దర్శకులతో ఇంటర్వ్యూలు చేసి, మావారికి అందచేశాడు. మావారు దానిని డాక్యుమెంటరీ చేశారు. అది దూరదర్శన్ లో టెలికాస్ట్ అయ్యింది. బషీర్‌బాగ్‌లో షో వేసి నాన్నగారికి చూపిస్తే, ‘ఇంత పెద్ద పనిని ఎలా చేయగలిగారు’ అని సంతోషంతో ప్రశంసించారు. అయితే అందులో రక్తకన్నీరు ప్రస్తావన లేకపోవటంతో – తన ఇంటి ముందు రోడ్డు మీద రాబోయే ఆదివారం నాడు కాండిడ్ షాట్స్‌తో కుష్ఠు సీన్ తీద్దామని, రోడ్డు మీద వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామనీ అన్నారు నాన్న. ‘సరే’ అన్నాం. ఇది జరిగిన మరుసటి రోజు (ఆ రోజు గురువారం) నాన్నగారిని చూడటానికి వెళ్లాను. ఆయన ‘భువనా! నాకు ఖీమా తినాలని ఉంది’ అన్నారు. ‘రేపు తేనా?’ అన్నాను. ‘ఆదివారం తిందాంలే, అమ్మ చేసినట్లు చెయ్యాలి’ అన్నారు. సరేనని ఇంటికి వచ్చేశాను. శుక్రవారం నాడు ఏదో పని మీద బయటకు వెళ్లి, బాగా అలసిపోయి, ఇంటికి వచ్చాక ఫోన్ ప్లగ్ తీసేశాను. మరుసటి రోజు ఉదయం నాన్న స్నేహితుడు ప్రతాపరెడ్డి ఫోన్ చేసి ‘నాన్న నిన్నే కలవరిస్తున్నారు. రాత్రంతా ప్రయత్నించాను. నీ ఫోన్ కలవలేదు’ అన్నారు. నాకేమీ అర్థం కాలేదు. ఏదో సీరియస్ అయి ఉంటుంది అనిపించి, వెంటనే బయలుదేరి, వెళ్లేసరికి అంతా అయిపోయింది. అది మే 5, 1995. అలా నాన్న రక్తకన్నీరు నాటకం డాక్యుమెంట్ చేయలేకపోయాను, నాన్నకు ఖీమా పెట్టలేకపోయాను అని ఇప్పటికీ బాధ పడుతుంటాను. టైమ్‌కి అన్నం ఉండాల్సిందే.. ఇంట్లో నేను, నాన్న, అమ్మ కలిసి పేక ఆడుకునేవాళ్లం. అన్నయ్యను ఆడనిచ్చేవారు కాదు. ఆడపిల్ల పేకాడితే చెడిపోదులే, మగపిల్లవాడైతే కష్టం అనేవారు. నాన్నగారు భోజనానికి ఆగలేకపోయేవారు. టైమ్‌కల్లా అన్నం పడాలి. ఒకసారి విజయవాడ వెళుతుంటే దారిలో కారు పంక్చర్ అయ్యింది. అక్కడే పక్కన పొలంలో కూలీలు పంట కోస్తున్నారు. మా అవస్థ చూసి ‘ఏమైనా కావాలా?’ అని అడిగారు. అమ్మ మొహమాట పడకుండా, అన్నం కావాలని అడిగి తెచ్చి, నాన్న ఆకలి తీర్చిందని, అమ్మ గురించి నాన్న గొప్పగా చెప్పేవారు. పుట్టినరోజుకి పట్టు లంగా కొనేవారు. ప్రతి పండక్కి నాన్న తప్పకుండా వచ్చేవారు. దీపావళి నాడు అందరి ఇళ్లకూ తీసుకు వెళ్లి స్వీట్స్ ఇచ్చేవారు. ఆడవేషంలో... నాన్నకి పీతాంబరం గారు మేకప్ చేసేవారు. ‘నేనంటే నేనే’ సినిమాలో లేడీ గెటప్ వేసిన రోజున, అదే వేషంతో సందు చివర నుంచి ఇంటి దాకా నడిచారు. అందరూ నాన్నను క్యాజువల్‌గా చూశారు. అంత సహజంగా నడిచారన్నమాట. – సంభాషణ: వైజయంతి పురాణపండ ఫొటోలు: కె. రమేశ్ బాబు మాది మతాంతర వివాహం మా ఇంటి వ్యవహారాలన్నీ మా మేనమామ చూసుకునేవారు. నేను శారదా విద్యాలయలోను, సయ్యద్ మీర్ (ఎస్. డి.లాల్ కుమారుడు) రామకృష్ణ మిషన్‌లోను చదువుకున్నాం. మా అన్నయ్య సురేంద్ర, మీర్ గారు క్లాస్మేట్స్. ఆయన ఇంటికి వస్తుండేవారు. మా మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఇద్దరి మతాలు వేరు కావటంతో నాన్నగారు ఏమంటారోనని భయం వేసింది. మా విషయం అమ్మకు చెపితే మామయ్య ద్వారా అమ్మ నాన్నకి చెప్పించింది. ఇరువైపుల వారినీ కష్టపడి ఒప్పించాకే 1982లో మా వివాహం జరిగింది. అదే సంవత్సరం డిగ్రీ కూడా పూర్తి చేశాను. మా కుటుంబంలో ఎటువంటి గొడవలు రాకుండా జాగ్రత్తపడ్డాను. నా విధానం చూసి మా అత్తగారు సంతోషించారు. మాకు ఇద్దరు బాబులు. ఆబిద్ భూషణ్, ఆసిఫ్ భూషణ్. మా పిల్లలు తాతగారితో బాగా ఆడుకునేవారు. పెద్దబ్బాయి బిటెక్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. వాడికి యాక్టింగ్ మీద ఆసక్తి ఉంది. చిన్నవాడు విజువల్ ఎఫెక్ట్స్ చేస్తున్నాడు. పెద్దబాబుకి బ్రేక్ రాలేదు. అందుకని పెళ్లి చేసుకోలేదు. చిన్నబాబుకి పెళ్లి చేశాం. కోడలు సంధ్య ఉద్యోగం చేస్తోంది. వాళ్లు చెన్నైలో ఉంటున్నారు. మా వారు పది సంవత్సరాలుగా ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నారు. ఆయనకు వెంకటేశ్వరస్వామి అంటే భక్తి ఎక్కువ. అన్నయ్య డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ చేశాడు. ఉద్యోగం చేస్తూ, సినిమాటోగ్రఫర్‌గా పని చేశాడు. నాలుగేళ్లుగా అనారోగ్యం కారణంగా బయటకు రావట్లేదు. – భువనేశ్వరి, నాగభూషణం కుమార్తె -
కుప్పంలో ఎదురుగాలి? భువనేశ్వరి ఆడియో టేపులు వైరల్!
సాక్షి, కుప్పం : పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ టీడీపీ అధినేత చంద్రబాబుకు టెన్షన్ పెరుగుతోంది. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే టీడీపీ కోట బీటలు వారుతోందా? కుప్పంలో బాబుకు ఎదురుగాలి వీస్తోందా? కుప్పంలో అభివృద్ధి జరగలేదని, ప్రజలు అసంతృప్తితో ఉన్నారని ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికలతో టీడీపీ అధినేత గుండెల్లో గుబులు పుట్టిందా? పులివెందులకు వెళ్లి తొడకొట్టిన చంద్రబాబుకు సొంత నియోజకవర్గ పరిస్థితులే దడ పుట్టిస్తున్నాయా? పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. ఈసారి కుప్పంలో గట్టెక్కడమే కష్టమని బాబు కుటుంబానికి ముందే తెలిసిపోయిందా..? అందుకే 40 ఏళ్లలో ఎప్పుడూ రాజకీయాలు మాట్లాడని ఆయన భార్య భువనేశ్వరి రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు చేపట్టారా...? కుప్పం నాయకులతో టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడిన భువనేశ్వరే తనకు కాన్ఫిడెన్స్ లేదని మాట్లాడటం దేనికి సంకేతం? భువనేశ్వరి ఆడియో టేపులు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. ఇంతవరకు ఎప్పుడూ చంద్రబాబు భార్య భువనేశ్వరి రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. కుటుంబ నిర్వహణ, వ్యాపార బాధ్యతలు చూసుకుంటున్న ఆమె ఇప్పుడు కుప్పం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై మానిటరింగ్ చేస్తున్నారు. ఏకంగా వందమంది నాయకులతో ఒకేసారి టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అక్కడి పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాటల్లో ఎక్కడా కాన్ఫిడెన్స్ లేకపోవడంతో నేతల్లోనూ భయం పట్టుకుంది. మనం ఎన్ని చేసినా ఎక్కడో అనుమానం ఉందంటూ ఆమె అనడంతో నాయకులు, కార్యకర్తల్లో మరింత ఆందోళన పెరుగుతోంది. కుప్పం నియోజకవర్గ నాయకులు కూడా కొన్ని తప్పులు జరిగాయని అంగీకరించడం చూస్తుంటే ఈ సారి అక్కడ టీడీపీ పరిస్థితి కష్టంగా ఉందని అర్థమైపోతోంది. తప్పులు జరిగాయని.. సరిచేసుకుందామంటూ అక్కడ ఇన్ఛార్జ్ నాయకులను కోరడం చూస్తుంటే వారిలో విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో.. ఆ విభేదాలు పార్టీ అధినేతను ఏ రేంజ్లో కలవరపెడుతున్నాయో స్పష్టమవుతోంది. కుప్పం టీడీపీ నేతలతో భువనేశ్వరి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ ఆడియో టేపులు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
శ్రీశాంత్ నాతో సహజీవనం చేశాడు : హీరోయిన్
మరి తన సంగతేంటి అని క్రికెటర్ శ్రీశాంత్‌పై మండి పడుతోంది నికీషాపటేల్. ఈ అమ్మడి కథేంటో చూద్దాం. ఈ పంజాబీ బ్యూటీ దక్షిణాదిలో తొలిసారిగా తెలుగులో పవన్‌కల్యాణ్‌తో కొమరం పులి చిత్రంలో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత కోలీవుడ్‌కు ఎన్నమో ఏదో చిత్రంతో దిగుమతై ఇక్కడ చాలా చిత్రాలు చేసింది. అయినా స్టార్ ఇమేజ్‌కు ఇంకా ఎదగలేదు. మలయాళం, హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్న నికీషాపటేల్‌పై వదంతులు చాలానే ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒకటి క్రికెటర్ శ్రీశాంత్‌తో చెట్టాపట్టాల్ అన్నది ఒకటి. క్రికెట్ రంగంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కొని, కొంతకాలం ఆ క్రీడకు దూరమైన శ్రీశాంత్ నటుడిగా రంగప్రవేశం చేశాడు. ఈయనతో నటి నికీషాపటేల్ ప్రేమ వ్యవహారం మీడియాల్లో పెద్ద ఎత్తున షికారు చేసింది. వీరిద్దరూ ప్రేమలో పడి సహజీవనం చేశారనే ప్రచారం చాలా కాలం క్రితమే హోరెత్తింది. అయితే దీని గురించి అప్పట్లో ఈ సంచలన జంట నోరు మెదపలేదు. కొంతకాలం క్రితం భువనేశ్వరి అనే యువతిని శ్రీశాంత్ వివాహం చేసుకున్నాడు. ఇది జరిగిన చాలా కాలం తరువాత ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశాంత్ తాను భువనేశ్వరిని ఏడేళ్లుగా ప్రేమించి పెళ్లిచేసుకున్నానని చెప్పాడు. ఆయన భేటీని చూసిన నికీషాపటేల్ ఆగ్రహానికి గురైంది. దీంతో శ్రీశాంత్‌తో ఉన్న తన బంధాన్ని బట్టబయలు చేసింది. దీని గురించి నికీషాపటేల్ మాట్లాడుతూ వేరే అమ్మాయిని ఏడేళ్లుగా ప్రేమిస్తూ వచ్చిన శ్రీశాంత్ తనతో ఒక ఏడాది సహజీవనం చేసిన సంగతి గురించి ఏం చెబుతాడని ప్రశ్నించింది. అంతే కాదు తాను శ్రీశాంత్‌తో బ్రేకప్ చేసుకున్న తరువాత ఏడేళ్లుగా ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటున్నానని చెప్పింది. అయితే శ్రీశాంత్ నిజాన్ని దాచడం మాత్రం తాను సహించలేకపోతున్నానని నికీషా పటేల్ అంటోంది. -
నటి భువనేశ్వరి కొడుకుపై మరో కేసు
పెరంబూరు: నటి భువనేశ్వరి కొడుకుపై కేలంబాక్కం పోలీస్‌స్టేషన్‌లో కొత్తగా మరో కేసు నమోదైంది. నటి భువనేశ్వరి కొడుకు మిథున్ శ్రీనివాసన్ లా చదువుతున్నాడు. ఇతను స్థానిక తిరుమంగళంకు చెందిన వైద్య విద్యార్థిని అనుగ్రహను పెళ్లి చేసుకోమని వేధించిన చేసిన కేసులో ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు తిరుమంగళం పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో పరారీలో ఉన్న మిథున్ శ్రీనివాసన్‌ను రెండు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసి పుళల్ జైలులో ఉంచారు. అనుగ్రహపై హత్యా బెదిరింపులకు పాల్పడినందుకు గానూ మిథున్ శ్రీనివాసన్‌పై గురువారం కేలంబాక్కం పోలీస్‌స్టేషన్‌లో మహిళా చిత్రహింస చట్టం కింద మరో కేసును నమోదైంది. -
మాజీ క్రికెటర్ కు పండంటి మగబిడ్డ
ముంబై: స్పాట్ ఫిక్సింగ్‌లో పట్టుబడి జీవితకాల నిషేధం ఎదుర్కొంటున్న భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తండ్రి అయ్యాడు. అతని భార్య భువనేశ్వరి బుధవారం మగ బిడ్డకు జన్మనిచ్చింది. ముంబై శాంతాక్రూజ్ లోని సూర్య ఆసుపత్రిలో తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని శ్రీశాంత్ చెప్పారు. సూర్య ఆసుపత్రి వాతావరణం తనకు బాగా నచ్చిందని చెప్పుకొచ్చిన శ్రీశాంత్ బాబుకు సూర్యశ్రీ అని పేరు పెట్టినట్లు తెలిపారు. కాగా, శ్రీశాంత్, భువనేశ్వరిలకు మొదటి సంతానంగా పాప జన్మించింది. -
'వదిన భువనేశ్వరి ఓటు టీఆర్ఎస్కే'
చంద్రబాబు మాట ఎలా ఉన్నా.. తమ వదిన భువనేశ్వరి మాత్రం టీఆర్ఎస్కే ఓటు వేయడం ఖాయమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభలో పలు చెణుకులు విసిరారు. హైదరాబాద్‌ను వదల బొమ్మాళీ వదల అని చంద్రబాబు అంటున్నారని, ఆయన్ను తాము పొమ్మనలేదని చెప్పారు. ఆయన వ్యాపారమంతా.. తమ వదిన భువనేశ్వరి చూస్తుందని, ఈయన కంటే ఆమే బాగా చూస్తోందని అన్నారు. కావాలంటే 15 రోజులకు ఓసారి వచ్చి లెక్కలు చూసుకుని పోవాలని తెలిపారు. భువనేశ్వరి కూడా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి, ఆమెకు నిజాయితీ ఉందని, ఆమె మాత్రం గ్యారంటీగా తమకే ఓటు వేస్తారని అన్నారు. చంద్రబాబుకు వాస్తవాలు తెలియవు కాబట్టి ఇక్కడే ఉంటానంటున్నారని విమర్శించారు. నేను అమరావతికి, ముంబైకి వెళ్లి ఇక్కడే ఉంటానంటే కుదురుతుందా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో తనకు ఉండబుద్ధి వేయట్లేదని, హైదరాబాద్ నుంచి పాలించాలంటే విదేశాల్లో ఉన్నట్లు ఉంటుందని విజయవాడలో చెబుతారన్నారు. గోదావరి నీళ్లు, కరెంటు అన్ని విషయాల్లో పంచాయతీ పెడుతున్నారని మండిపడ్డారు. నీ పని నువ్వు చేసుకో, మా పని మేం చేసుకుంటామని స్పష్టం చేశారు. -
భువనేశ్వరిని నేను ఇప్పటికీ అమ్మా అంటాను..
గుడివాడ: ఎన్టీఆర్ కుటుంబం అంటే తనకు ఇప్పటికీ గౌరవమే అని, ఆ కుటుంబంలో అందరినీ తాను గౌరవంగా చూస్తానని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. గుడివాడలో వైఎస్ఆర్ సీపీ కార్యాలయాన్ని ఖాళీ చేయించే విషయంలో చంద్రబాబు కుటుంబ సభ్యుల హస్తం ఉందన్నాను కానీ భువనేశ్వరిని తాను ఏమీ అనలేదని, దూషించలేదని ఆయన సోమవారమిక్కడ పేర్కొన్నారు. భువనేశ్వరిని తాను ఇప్పటికీ అమ్మా అనే అంటానన్నారు. గుడివాడ సమీపంలో ఉన్న గ్రామానికి ఆము ఇటీవల వచ్చారని, ఆమెతో ఈ విషయం ప్రస్తావించానని కొడాలి నాని అన్నారు. నిమ్మకూరు, మరో ఊరుకు చెందిన కొందరు ఇక్కడకు వచ్చి దౌర్జన్యంగా కార్యాలయంలో ఉన్న సామన్లు తీశారని ...ఇదంతా జరిగాక చంద్రబాబు కుటుంబసభ్యుల హస్తం ఉందని స్పష్టంగా చెప్పామని ఆయన వ్యాఖ్యానించారు. గుడివాడలో ఉన్న తమ కార్యాలయాన్ని ఖాళీ చేయించి చంద్రబాఉ ఏం చేస్తారని కొడాలి నాని ప్రశ్నించారు. -
సత్తెనపల్లిలో ప్రేమజంట ఆత్మహత్య
సత్తెనపల్లి: తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరని ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. కలిసి బతకలేక పోయినా చావులోనైనా కలిసే ఉందామని నిర్ణయించుకున్న ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా ప్రియుడు అక్కడికక్కడే మృతిచెందగా, ప్రియురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాలెం గ్రామ శివారులోని పంట కాలువ వద్ద బుధవారం తెల్లవారుజామున వెలుగు చూసింది. వివరాలు.. ముప్పాళ్ల మండలం తొండపి గ్రామానికి చెందిన ఎర్ర శ్రీకాంత్(22), అచ్చంపేట మండలం గ్రందసిరి గ్రామానికి చెందిన భువనేశ్వరి(19) ప్రేమించుకున్నారు. ఇది తెలిసిన కుటుంబ సభ్యులు చదువు మానిపించి ఇంటికే పరిమితం చేశారు. కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు తమ పెళ్లికి ఒప్పుకోరని నిర్ణయించుకున్న ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం ఇద్దరు మంగళవారం రాత్రి రెంటపాలెం చేరుకొని వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగారు. దీంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందగా.. భువనేశ్వరి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. బుధవారం ఉదయం గుర్తించిన స్థానికులు ఆమెను సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భువనేశ్వరి కొద్ది సేపటి క్రితం మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అతిథి గృహం సందర్శించిన భువనేశ్వరి
తాడేపల్లి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం సిద్ధం అవుతున్న లింగమనేని అతిథి గృహాన్ని ఆయన సతీమణి భువనేశ్వరి నిన్న సందర్శించారు. బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు అక్కడకు వచ్చిన ఆమె మధ్యాహ్నం ఒంటిగంట వరకూ అక్కడే ఉండి అన్ని గదులను పరిశీలించారు. భువనేశ్వరి పర్యటన రహస్యంగా జరగడంతో స్థానిక అధికారులకు, నాయకులకు ఈ సమాచారం తెలియలేదు. కాగా తాడేపల్లి మండల పరిధిలోని ఉండవల్లి కరకట్టపై ఏర్పాటు చేసుకోనున్న అధికారిక నివాసం వద్ద పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అత్యంత గోప్యంగా ఈ పనులు జరుగుతున్నాయి. -
చంద్రబాబు సతీమణికి గాయం
-
చంద్రబాబు సతీమణికి గాయం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి గాయపడ్డారు. సోమవారం ఉదయం ఆమె ఇంట్లో వ్యాయమం చేస్తుండగా ప్రమాదవశాత్తూ కిందపడిపోయినట్లు సమాచారం. చేతి మణికట్టు విరిగినట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం భువనేశ్వరిని జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
క్లిక్ & బుక్
ఒకప్పుడు నాడి పట్టుకుంటే చాలు.. రోగి ఒంట్లోని జబ్బేంటో చెప్పేసేవారు వైద్యులు. ఇప్పుడు ఏ చిన్న రోగం వచ్చినా.. వైద్యుడిని సంప్రదించే ముందే డయాగ్నోస్టిక్ సెంటర్ గురించి వాకబు చేయాల్సిందే. నగరంలోని డయాగ్నోస్టిక్ సెంటర్స్ అడ్రస్‌లను, ఇతర వివరాలను అందుబాటులో ఉంచుతోంది ‘బుక్ మై ల్యాబ్’ వెబ్సైట్. కామన్ పీపుల్ భారంగా భావించే వైద్య పరీక్షలను సులభతరం చేస్తోంది. - భువనేశ్వరి ఒంట్లో నలతగా ఉంటే డాక్టర్‌ను సంప్రదిస్తాం. డాక్టర్ ఫలానా వైద్య పరీక్షలు చేయించండని చెబుతారు. ఆ టెస్ట్‌లు చేయించడం కోసం మంచి డయాగ్నోస్టిక్ సెంటర్లను వెతకాల్సిన పని లేకుండా చేస్తోంది ‘బుక్ మై ల్యాబ్’. ముందుగా మీరు ఈ వెబ్సైట్లోకి ఎంటరై.. మీ పేరిట అకౌంట్ ఓపెన్ చేయాలి. వెబ్సైట్లో మూడు వందలకు పైగా డయాగ్నోస్టిక్ సెంటర్ల అడ్రస్‌లు, ఫోన్‌నంబర్లు అందుబాటులో ఉన్నాయి. మీరున్న ఇంటికి దగ్గరగా ఉన్నది, లేదా మీకు నమ్మకమైంది ఎంచుకుని ఒక్క ఫోన్ కొడితే చాలు.. సదరు డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రతినిధులు మీ ఇంటికొచ్చి మరీ బ్లడ్ శాంపుల్స్ సేకరిస్తారు. ఇక్కడితోనే బుక్ మై ల్యాబ్ పని అయిపోదు.. శాంపుల్స్‌ను పరీక్షించాక ఆ వివరాలను మీ అకౌంట్లో పొందుపరుస్తారు. మీ రిపోర్ట్స్ మీరెక్కడికి వెళ్లినా వన్ క్లిక్ దూరంలో మీకు అందుబాటులో ఉంటాయన్నమాట. ఒక పరిష్కారంగా.. ‘మేం ఈ వెబ్సైట్ మొదలుపెట్టి ఆరు నెలలు కావొస్తోంది. వెయ్యిమంది పేషెంట్లు అకౌంట్ ఓపెన్ చేస్తే సక్సెస్ అయినట్టేనని భావించాం. అయితే ఇప్పటి వరకు నగరంలోని 2,600 మంది బుక్ మై ల్యాబ్‌లో అకౌంట్లు ఓపెన్ చేసుకున్నారు. మనకు వైద్యం అందుబాటులోకి వచ్చినంత వేగంగా.. డయాగ్నోసెంటర్ల సేవలు అందడం లేదు. ఏదైనా పేరున్న సెంటర్‌కి వెళ్తే గంటల తరబడి క్యూలో వేచి ఉండాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారంగానే బుక్ మై ల్యాబ్‌ను తీసుకొచ్చాం’ అని చెబుతారు దీని రూపకర్త శంకర్. నిక్షేపంగా.. ఈ రోజుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ ఎంత పదిల ంగా దాచుకోవాలో.. టెస్ట్ రిపోర్ట్స్ కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తోంది. దీర్ఘకాలిక రోగాల బారిన పడిన వారికి ఇది అత్యంత అవసరం. నగరంలో చాలా మంది రోగులు రిపోర్ట్స్‌ను భద్రంగా దాచుకోలేక.. చేయించుకున్న టెస్ట్‌లే మళ్లీ చేయించుకోవాల్సి వస్తోందని ఒక సర్వేలో తేలింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బుక్ మై ల్యాబ్‌కు రూపకల్పన చేశామంటారు శంకర్. ‘మొదట కేవలం పరీక్షల రిపోర్ట్స్ భద్రపరిచే ప్లాట్‌ఫామ్‌గా దీన్ని ఉంచాలనుకున్నాం. కానీ, రోగుల అవసరాల దృష్ట్యా వారికి డయాగ్నోస్టిక్ సెంటర్ల వివరాలను అందుబాటులో ఉంచాం’ అంటారు శంకర్. అతని స్నేహితులు కాశి, ప్రమోద్‌తో పాటు మరో ఏడుగురు కుర్రాళ్లు ఈ వెబ్సైట్ నిర్వహణలో పాలుపంచుకుంటున్నారు. అన్నీ ఆన్లైన్... వైద్యపరీక్షల పత్రాలే కాదు.. డాక్టర్ ప్రిస్క్రిప్షన్స్ కూడా ఇందులో భద్రపరుచుకోవచ్చు. డాక్టర్ రాసిచ్చిన మందుల చీటీని స్కాన్ చేసి అకౌంట్లో పెట్టుకుంటే సరి. ఈ వివరాలు అకౌంట్ హోల్డర్ అదుపాజ్ఞల్లోనే ఉంటాయి. మరొకరు ఈ వివరాలు తెలుసుకునే వీలుండదు. ఇటీవల శ్రీనగర్‌కాలనీలోని ఒక అపార్ట్‌మెంట్‌కు చెందిన 200 మంది ఒకేసారి బుక్ మై ల్యాబ్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవడానికి ముందుకొచ్చారు. నిత్యజీవితంలో అన్నీ ఆన్లైన్ అయిపోతున్న ఈ తరుణంలో.. వైద్యపరీక్షలు మాత్రం ఎందుకు ఆన్లైన్లో భద్రపరచకూడదని వారు భావిస్తున్నారు. -
నానమ్మ మిస్సింగ్ కాస్తా...
బెస్ట్ కేస్ నేను కరీంనగర్ జగిత్యాల ఎఎస్పిగా పనిచేస్తున్న సమయంలో ఛేదించిన ఒక కేసు నాకు బాగా గుర్తుండిపోయే కేసుల్లో ఒకటి. ధర్మపురి పోలీస్‌స్టేషన్‌కి ఓ ఇరవైఏళ్ల కుర్రాడొచ్చి వాళ్ల నానమ్మ కనిపించడంలేదని చెప్పాడు. వెంటనే మావాళ్లు ఆ అబ్బాయి గ్రామానికి వెళ్లి వెతకడం మొదలుపెట్టారు. ‘పొద్దునే పెన్షన్ తీసుకుంటానంటే మండలాఫీస్ దగ్గర దించి ఇంటికొచ్చాను. గంట తర్వాత వెళ్లి చూస్తే అక్కడ మా నానమ్మలేదు’ అని ఆ అబ్బాయి చెప్పిన మాటల్ని బట్టి... ఆ ముసలావిడ దారి తప్పి ఏటో వెళ్లిపోయి ఉంటుందనుకున్నాం. ధర్మపురి మండల పరిధిలో చాలా గ్రామాలున్నాయి. అన్ని గ్రామాల్లో వెదికాం. ఆమె ఒంటిపై సొమ్ములు బాగానే ఉన్నాయని చెప్పారు. ఒకవేళ దొంగలెవరైనా ఆమెను కిడ్నాప్ చేసి సొమ్ము దోచుకున్నారేమోనని అనుమానించాం. ఆ దిశగా కూడా పరిశోధన చేశాం. ఎక్కడా వివరాలు దొరకలేదు. రెండు రోజుల తర్వాత... నానమ్మ కనిపించడం లేదని ఈ కుర్రాడు, అతని తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. వారికేం సమాధానం చెప్పాలో అర్థం కావడంలేదు. మరో పక్క ‘ఈ పోలీసులు పెద్దావిడ జాడ కనిపెట్టలేరా?’ అంటూ ఊరివాళ్ల గోల. ఇంతలో ఊరికి నాలుగు కిలోమీటర్ల దూరంలో తుప్పల్లో ఒక ముసలావిడ శవం ఉందని కబురొచ్చింది. మావాళ్లు హుటాహుటిన వెళ్లి చూస్తే బాడీ బాగా పాడైపోయింది. తలకు బలమైన గాయం అయిన ఆనవాళ్లు ఉన్నాయి. ఒక కాలికి చెప్పు ఉంది, మరో చెప్పు నాలుగు అడుగుల దూరంలో పడి ఉంది. అంతకు మించిన వివరాలు గానీ, ఆధారాలు గానీ దొరకలేదు. విషయం పెద్దావిడ ఇంట్లో తెలియగానే కుటుంబం మొత్తం ఘొల్లుమంది. సొమ్ముల కోసమే... హత్య జరిగిన స్థలంలో ఆ పెద్దావిడ శవాన్ని చూడగానే అర్థమైంది అది ‘మర్డర్ ఫర్ గెయిన్’ కేస్ అని. చెవి కమ్మ తీయడం రాలేదేమో హంతకుడు క్రూరంగా చెవిని కూడా కోసేశాడు. సొమ్ములకోసం అంత పెద్ద వయసున్న మహిళ అని కూడా చూడకుండా క్రూరంగా పొట్టన పెట్టుకున్నారని ఆ ఊరివాళ్లంతా బాధపడ్డారు. నాక్కూడ చాలా బాధేసింది. అప్పటివరకూ మిస్సింగ్ కేసుగా ఉన్నదల్లా మర్డర్ కేసైపోయింది. వెంటనే మా క్రైమ్‌టీమ్ రంగంలోకి దిగింది. అన్ని రకాలుగా పరిశోధన మొదలుపెట్టాం. ముందుగా ఆ చుట్టుపక్కల డబ్బులకోసం దాడులు చేసే దొంగలపైనా నిఘా పెట్టాం. అప్పటికే అలాంటి కేసులున్నవారిని స్టేషన్‌కి తీసుకొచ్చి విచారించాం. ఎక్కడా వివరాలు దొరకలేదు. దొంగలపని కాదు... రెగ్యులర్ దొంగలు చేసిన పని కాదని తెలిసాక మా దృష్టిని ఊళ్లో వారిపై పెట్టాం. రోజులు గడుస్తున్నాయి కానీ ఎక్కడా ఎలాంటి సమాచారం దొరకడం లేదు. ‘బంగారం కోసం ముసలావిడను హత్యచేశారంట’ అనే వార్త చుట్టుపక్కల మండలాల్లో సంచలనంలా మారింది. ఒంటిమీద సొమ్ములుండగా ఒంటరిగా ప్రయాణం చేయడం ప్రమాదమంటూ మహిళలంతా ఆందోళన పడసాగారు. మరోపక్క వార్తాపత్రికల్లో పల్లెల్లో భద్రత లేదంటూ కథనాలు. ఇంతలో ఆ పెద్దావిడ మనవడు బండి కొన్నాడన్న విషయం తెలిసింది. మాకు తెలిసిన వివరాల మేరకు ఆ అబ్బాయికి ఉద్యోగం లేదు. తల్లిదండ్రులు కూడా అతనికి డబ్బులివ్వరు. అలాంటిది ఉన్నట్టుండి బండెక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తే నా స్నేహితుడి దగ్గర అప్పు తీసుకున్నానంటూ ఏవో కబుర్లు చెప్పాడు. మాకు మొదటి నుంచి ఆ అబ్బాయి చెప్పే మాటలు వాస్తవం కావనిపించేవి. స్నేహితుల సాయంతో... ఎందుకైనా మంచిదని స్నేహితుల్ని తీసుకొచ్చి విచారించాం. ఒకబ్బాయి ‘ఎప్పుడూ వంద రూపాయలు కూడా ఎరుగనివాడు ఈ మధ్య బాగానే ఖర్చుపెడుతున్నాడు’ అని చెప్పాడు. ఇక లాభం లేదని ఆ మనవడిపై నిఘా పెట్టాను. అలాగే ఊళ్లో ఉన్న మా ఇన్ఫార్మర్ల సాయం కూడా తీసుకున్నాం. మా అనుమానం నిజమైంది. ‘ఈ మధ్యనే అతను మంచిర్యాలలో ఉన్న బంగారం దుకాణానికి వెళ్లి డబ్బు తెచ్చుకున్నాడు. ఆ సమయంలో నన్ను కూడా తీసుకెళ్లాడు’ అని అతని మరో స్నేహితుడు చెప్పిన వివరాల ఆధారంగా ఎంక్వైరీ చేయిస్తే అక్కడ ఇతను ఏవో బంగారు వస్తువుల్ని అమ్మినట్టు తెలిసింది. అలాగే పెద్దావిడను మండల కార్యాలయం దగ్గర వదిలిపెట్టిన విషయం కూడా వాస్తం కాదని తేలింది. పక్కా ఆధారాలతో... పెద్దావిడ మనవడు చెప్పిన విషయాలన్ని నమ్మినట్టే నమ్మి అతనిపై చేసిన పరిశోధన ఫలితాలు మాకు పక్కా ఆధారాలను చూపించాయి. వాటన్నింటిని చేతిలో పెట్టుకుని ఆ అబ్బాయిని స్టేషన్‌కి పిలిపించకుని విచారణ చేశాను. ముందు కాదన్నా... తర్వాత నిజం ఒప్పుకున్నాడు. నానమ్మ ఒంటిపై ఉన్న బంగారం కోసమే ఆమెను హత్యచేసినట్టు అంగీకరించాడు. నోటిమాట సరిపోదు కదా! ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో కారణాల దగ్గర నుంచి సంఘటనా స్థలంలో హత్యకు ఉపయోగించిన వస్తువుల వరకూ అన్నింటినీ రికార్డు చేశాం. హత్య చేసింది మనవడేనన్నందుకు మా దగ్గర ముఖ్య ఆధారం అతని సెల్‌ఫోన్ డేటా. ‘నేను ఫలానా సమయంలో మా నానమ్మను మండల కార్యాలయం దగ్గర దించాను’ అని అతను చెప్పిన సమయంలో అతను ఊరి పొలిమేరల్లోనే ఉన్నట్టు అతని సెల్‌ఫోన్ ఏరియా సిగ్నల్స్ చెప్పాయి. దాంతోపాటు చివరిసారిగా ముసలావిడను మనవడి బండిపై చూసిన సాక్షుల వివరాల ప్రకారం అతను చెప్పిన విషయాలన్ని నిజం కాదని అర్థమైంది. అప్పుడు అతడు వాడింది స్నేహితుడి బైక్. 25రోజులు... మిస్సింగ్ కేసుతో మొదలై మర్డర్ కేసుగా బయటపడ్డ ఈ కేసులో హంతకుడు ఇంటి మనిషే అని తేల్చడానికి మాకు 25 రోజుల సమయం పట్టింది. మర్డర్ కేసుల్లో నిందితుడు బయటివాడైతే కేసు త్వరగా కొలిక్కి వస్తుంది. అదే ఇంటివారైతే చాలా సమయం వృథా అయిపోతుంది. ఎందుకంటే అనుమానించడానికి ఆధారాలు త్వరగా దొరకవు. ఈ కేసులో చూశారుగా... హంతకుడే స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు ఇచ్చాడు. అంతేనా... నాయనమ్మపై ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తూ మాపైన ఒత్తిడి తెస్తూ వారి పేర్లు వీరి పేర్లు చెబుతూ మమ్మల్ని అయోమయానికి గురిచేసే ప్రయత్నం కూడా చేశాడు. జల్సాలకు అలవాటు పడి సొంత నాయనమ్మనే అత్యంత కూర్రంగా హత్య చేసిన వ్యక్తి మా కళ్లెదురుగా ఉన్నా అతనే హంతకుడిని నిర్ధారణకు రావడానికి మాకు ఇంత సమయం పట్టింది. కొన్ని కేసుల్లో అయితే నెలలు, సంవత్సరాలు కూడా గడిచిపోతుంటాయి. ఏడేళ్ల శిక్ష... అన్ని ఆధారాలతో కేసు ఫైల్ చేసి కోర్టుకి అప్పగించాం. ఇంత జరిగినా ఆ పెద్దావిడ ఇంట్లోవాళ్లు మాత్రం మనవడికి ఏ పాపం తెలియదంటారు. ఎవరో దుండగులు చేసిన పని అంటారు. కోర్టులో హంతకుడికి ఏడేళ్ల జైలు శిక్ష పడింది. ప్రెజెంటేషన్: భువనేశ్వరి ఫొటో: రాజేశ్‌రెడ్డి -
ముందే చెప్పివుంటే...
బెస్ట్ కేస్: అప్పటికి రాష్ట్రం నలుమూలలా కిడ్నాప్ కేసుల మోత మోగుతోంది. 2008... వరంగల్ ఎస్పీగా పనిచేస్తున్నాను. మా జిల్లాలో కిడ్నాప్లేం లేవు కదా అనుకుంటుండగా ఒకరోజు ఒకతను ఫోన్ చేసి ‘మా తొమ్మిదేళ్ల పాపని ఎవరో కిడ్నాప్ చేశారు, 20 లక్షలు ఇవ్వాలంటున్నారు’ అని చెప్పాడు. సాయంత్రం పాప స్కూలు నుంచి ఇంటికి తిరిగొస్తుండగా దుండగలు ఎత్తుకెళ్లారు. ముందుగా కిడ్నాప్ అయిన అమ్మాయి తండ్రిని కూర్చోబెట్టి ఎవరిపైనైనా అనుమానం ఉంటే చెప్పమన్నాను. పేర్లు, చిరునామాలతో సహా చెప్పాడు. కేసు త్వరగానే పరిష్కారమవుతుందనుకున్నాను. - సౌమ్యమిశ్రా స్పెషల్ సెక్యురిటీ హోమ్ డిపార్ట్మెంట్, తెలంగాణ. చెప్పిన రియల్ క్రైమ్ స్టోరీ పాతకక్షల కారణంగా... అమ్మాయి తండ్రి చెప్పిన ముగ్గురిని స్టేషన్‌కి తీసుకొచ్చి విచారిస్తే ఎలాంటి సాక్ష్యాధారాలూ దొరకలేదు. నిజానికి ఆ పని చేసింది వాళ్లు కాదు. ఇంతలో ఎవరో గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి పాప వివరాలు తెలుసునన్నాడు. ఫలానాచోట ఆ అమ్మాయిని చూశాననీ, ఎవరో రేప్ చేశారనీ...ఇలా నోటికొచ్చిన అబద్ధాలాడుతూ అసలు విషయం చెప్పకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు. అలాంటి ఫేక్ కాల్స్ మాకే కాదు, టీవీ ఛానళ్ల వారికి కూడా చేసి పాప వివరాలు చెప్పడం మొదలుపెట్టాడు. అప్పటివరకు గోప్యంగా సాగిన విచారణ బట్టబయలైంది. తొమ్మిదేళ్ల పాప కిడ్నాప్ అయి ఇన్ని గంటలైనా, ఇన్ని రోజులైనా పోలీసులు చిన్న క్లూ కూడా సంపాదించలేకపోయారంటూ కథనాలు మొదలయ్యాయి. రెండు రోజులు వృథా... అమ్మాయి ఎక్కడుందో తెలుసునంటూ ఫోన్లు చేసి మమ్మల్ని తిప్పలు పెట్టిన నేరస్తుడ్ని పట్టుకోడానికి మాకు రెండు రోజులు పట్టింది. చివరకు అతడు హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో దొరికాడు. తీరా చూస్తే ఊరికే డబ్బులకోసం చేశానంటాడు. అప్పటికే అతడిపై చాలా కేసులున్నాయి. అతడి విషయం పక్కన పెట్టి తిరిగి పాప ఎక్కడుందో విచారణ మొదలుపెట్టాం. ప్రతిరోజు పాప తల్లిదండ్రులు స్టేషన్‌కి వచ్చి కనిపించేవారు. ఆ తల్లి ఆవేదనను మాటల్లో చెప్పలేం. ఆమెను చూడగానే నాక్కూడ కళ్లలో నీళ్లు తిరిగేవి. కారణం అప్పటికి మా అమ్మాయి వయసు ఆరేళ్లు. రోజు నిద్రపోయేముందు కిడ్నాప్ అయిన పాపే గుర్తుకొచ్చేది. కిడ్నాప్ అయి మూడురోజులు గడిచిపోయింది. ఈ మూడురోజుల్లో నేను గమనించిన విషయం ఏంటంటే... పాప తండ్రి ప్రవర్తన కొద్దిగా చిత్రంగా అనిపించింది. తండ్రి నోరిప్పలేదు... అమ్మాయి కిడ్నాప్ అయిన క్షణం నుంచి ఏ పూట చూసినా తల్లి రోదన ఒక్కతీరుగానే ఉంది. తండ్రి ప్రవర్తన అలా లేదు. అతను ఏదో విషయం దాస్తున్నట్టు అనిపించింది. అతని వద్ద నుంచి ఏ చిన్న క్లూ అయిన దొరకకపోతుందా అని ప్రతిరోజు పిలిపించుకుని ప్రశ్నించేదాన్ని. ఏమీ బయటపెట్టలేదు. నాలుగురోజులు గడిచిపోయాయి. నాలుగు టీమ్‌లు జిల్లాలో వీధి వీధి గాలిస్తున్నాయి. పాప గురించి ఎలాంటి సమాచారం దొరకడం లేదు. ‘మర్యాదగా మేం అడిగిన 20 లక్షలు మేం చెప్పిన ప్లేస్‌కి పంపిస్తే పాపను కాజీపేట్‌లో వదిలేసిపోతాం. పోలీస్ కంప్లయింట్ వంటివి ఇస్తే పాప ప్రాణాలతో ఉండదు’ అంటూ మరోసారి వాళ్లు ఫోన్ చేశారంటూ పాప తండ్రి పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఈసారి అతని ముఖంలో భయం కనపడింది. మాక్కావాల్సింది అదే. ఎందుకంటే ఎవరైనా నిజం చెప్పాలంటే వారికి ఉండాల్సింది భయం. ఆ ముగ్గురే... విషయం ఏంటంటే కిడ్నాప్‌కి గురైన పాప తండ్రి పదిరోజుల క్రితం ఓ ముగ్గరు రౌడీలకు ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. ముందుగా ఎవరిపైన అయితే అనుమానం ఉందని చెప్పాడో వారిని కొట్టించడం కోసం. ఏవో పాత తగాదాలన్నమాట. వారిపై దాడిచేయడం కోసం ఒక కిరాయి హంతకుడ్ని, మరో ఇద్దరు రౌడీషీటర్లకు డబ్బిచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. పాప తండ్రి చిరువ్యాపారి కావడంతో డబ్బులు బాగా ఉంటాయని అనుకున్నారో ఏమో ఆ ముగ్గురు... అసలు మాట్లాడుకున్న పనిని పక్కనపెట్టి ఇతని కూతుర్ని ఎత్తుకుని పారిపోయారు. పాపకు ముందే వారితో పరిచయం ఉండడం కారణంగా స్కూలు దగ్గర వారు పిలవగానే వారితో వెళ్లిపోయిందన్నమాట. అప్పుడే చెప్పి ఉంటే... మొదట కిడ్నాప్ కాల్ రాగానే ఇతనికి ఆ కిరాయి గుండాలపై అనుమానం వచ్చి ఫోన్ చేసి అడిగితే ‘నీ కూతుర్ని మేం ఎందుకు కిడ్నాప్ చేస్తాం సాబ్’ అన్నారట. దాంతో ఇతను తన శత్రువులను అనుమానించాడు. వారి పేర్లు చెప్పి ఊరుకున్నాడు. నేను వెంటనే మరో ఐదు బృందాలను ఇతను చెప్పిన వివరాలతో విచారణకు పంపించాను. మర్నాడు పొద్దున స్టేషన్‌ఘన్‌పూర్ పోలీస్‌స్టేషన్‌కి ఒక ఫోన్ వచ్చింది. కాజీపేట దగ్గర ఒక గ్రామం శివారులోని బావిలో ఒక పాప శవం ఉందని చెప్పారు. సంఘటనా స్థలానికి వెళ్లి చూస్తే చనిపోయింది కిడ్నాప్‌కి గురైన పాపే. అయ్యో...పాపని రక్షించలేకపోయామే అని బాధపడ్డాను. పాప తండ్రిని ఏంచేసినా పాపం లేదనిపించింది. నాలుగురోజుల వరకూ ఆ ముగ్గురు రౌడీల విషయం మాకు చెప్పకుండా దాచి కడుపున పుట్టిన బిడ్డను పోగొట్టుకున్నాడు. 24 గంటల్లో... రెండేళ్లు, మూడేళ్ల పాప అయితే దుండగులను గుర్తుపట్టే అవకాశం ఉండదు. తొమ్మిదేళ్ల పాప...పైగా పరిచయం ఉన్నవారి కిడ్నాప్.. ఆ అమ్మాయి ప్రాణాలతో దొరికితే వారికి ప్రమాదమనుకుని చంపేసి పారిపోయారని అనుకున్నాను. పాపను గొంతునులిమి చంపేసి బావిలో పడేసిపోయారు. ఆ సంఘటన జరిగిన 24 గంటల్లో ఆ ముగ్గురిలో ఒకర్ని పట్టుకున్నాం. అతన్ని విచారిస్తే మిగతా ఇద్దరిని కూడా పట్టుకున్నాం. ఒకతనిపై కరీంనగర్లో మర్డర్ కేసు ఉంది. మరో వ్యక్తిపై కత్తితో దాడిచేసి గాయపరిచిన కేసులు నాలుగున్నాయి. మూడో వాడిపై 304 సెక్షన్‌కింద నాలుగు కేసులున్నాయి. ప్రెస్మీట్లో... అప్పటికే ఈ కేసు గురించి రాష్ట్రం నలుమూలాల పాకింది. ఇక వరంగల్ జిల్లా వాసుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నేరస్తుల్ని పట్టుకున్నామన్న వార్త తెలియగానే జనమంతా వారిపై కోపంతో ఊగిపోతున్నారు. డబ్బు కోసం పసిబిడ్డను అంత దారుణంగా హత్య చేయడం అందరినీ భయాందోళనలకు గురిచేసింది. నేను వెంటనే ప్రెస్‌మీట్ పెట్టాను. ఆ సందర్భంగా ప్రెస్‌వాళ్లు అడిగిన ప్రశ్నలకు నిందితులు వివరంగా సమాధానాలిచ్చారు. పాప ఎలా చంపారో మాటలతో కాదు...చేతలతో చూపించి మరీ చెప్పారు. ‘వీడు పాపని కాళ్లపై పడుకోబెట్టుకున్నాడు. నేను పాప కాళ్లు, చేతులు కదపకుండా గట్టిగా పట్టుకుంటే వీడు పాప గొంతునులుమి చంపేశాడు...’ అంటూ టీవీలోని డైలీ సీరియల్ స్టోరీ చెప్పినట్టు చెప్పారు. మాకే కాదు, వారి మాటలు విన్నవారందరికీ రక్తం ఉడికిపోయింది. కిడ్నాప్ కాల్ రాగానే ఇతనికి ఆ కిరాయి గుండాలపై అనుమానం వచ్చి ఫోన్ చేసి అడిగితే ‘నీ కూతుర్ని మేం ఎందుకు కిడ్నాప్ చేస్తాం సాబ్’ అన్నారట. సంఘటనా స్థలంలో... మర్నాడు పొద్దున విచారణ కోసం సంఘటనా స్థలానికి మా వాళ్లు నిందితుల్ని తీసుకుని వెళ్లారు. ఆ సమయంలో నిందితులు మావాళ్లపై దాడిచేసి పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసుల ఆత్మరక్షణలో భాగంగా నేరుస్తులపై ఎదురు కాల్పులు జరిపారు. దాంతో ఆ ముగ్గురు నిందితులు అక్కడికక్కడే చనిపోయారు. ఇంతలో మానవహక్కుల సంఘంవాళ్లు మాపై రకరకాల ఆరోపరణలు చేయడం మొదలుపెట్టారు. పోలీసులపై ఎలాంటి దాడి చేయకుండానే నిర్దాక్షిణ్యంగా నిందితులపై కాల్పులు జరిపామని ఆరోపించారు. వార్తాపత్రికల్లో ఆ విధమైన కథనాలు కూడా మొదలయ్యాయి. సాక్ష్యాల కోసం మానవహక్కుల సంఘం వారు సంఘటనా స్థలం పరిసరాల్లోని స్థానికుల దగ్గరికి వెళ్లారు. ‘నేరస్తులు పోలీసులపై దాడి చేయడం మేం కళ్లారా చూశాం’ అని చెప్పారు అక్కడి స్థానికులు. అప్పటికి రాష్ట్రంలో నెలకి రెండు మూడు కిడ్నాప్ కేసులు జరుగుతుండగా, ఈ కేసు పరిష్కారం తర్వాత ఆరు నెలల వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. - భువనేశ్వరి ఫొటోలు: రాజేశ్ -
కుంచెడు సేవ
‘దేశ భవిష్యత్ తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుంది’ పెద్దలు చెప్పిన మాట. అలాంటి తరగతి గదుల గోడలకు అందమైన రంగులద్దుతూ విద్యార్థుల భవిష్యత్‌కు బంగారు బాటలు దిద్దుతున్నారు. గోడలపై బొమ్మలతో విద్యార్థుల ఊహలకు రెక్కలు తొడుగుతూ వాళ్ల అధ్యయనానికీ తోడ్పడుతున్నారు. వాళ్లే... ది సోషల్ ఆర్టిస్ట్స్! ఆ ఆన్‌రోడ్ వారియర్స్ పరిచయం.... - భువనేశ్వరి ఓ కళాకారుడు గీసిన చిత్రం సమాజాన్ని ఆలోచింపజేస్తుంది. కానీ ఈ ఆర్టిస్టులు చేస్తున్న సేవ.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల మేథాశక్తిని పెంచుతోంది. ‘ది సోషల్ ఆర్టిస్ట్స్. ఓఆర్‌జి’ సైట్ ఓపెన్ చేయగానే తరగతి గదులకు సున్నాలేసే యువత కనిపిస్తారు. వీళ్లు అరకొర వసతులున్న ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులకు కొత్త రంగులద్ది... విద్యార్థుల మెదడుకు పదును పెడుతున్నారు. రకరకాల పెయింటింగ్స్‌తో పిల్లల మనసు దోచుకుంటున్నారు. ‘మేం గీసే ప్రతి చిత్రం ఆ చిన్నారుల భవిష్యత్తుకి ఓ పునాది రాయి, ఆ రాళ్లు పాతడంలో ఉన్న సంతృప్తిని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నాం. మరో పదిమందికి కూడా పంచుతున్నాం’ అని అంటున్నారు ‘ది సోషల్ ఆర్టిస్ట్స్’ స్థాపకురాలు కావ్య. బొమ్మల పాఠాలు... బ్రాహ్మణబస్తీ, సీతాఫల్మండి, మైలార్‌గడ్డ... ఇలా నగరంలో, నల్గొండ జిల్లాలో కలిపి ఇప్పటి వరకూ తొమ్మిది ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చేసింది ‘ది సోషల్ ఆర్టిస్ట్స్’ టీం. పెయింటింగ్ వేయడం అంటే నచ్చిన బొమ్మ గీయడం కాదు. ఆయా తరగతుల పాఠ్యపుస్తకాల్లోని పిల్లలు నేర్చుకోవాల్సిన చిత్రాలను గోడలపై వేస్తున్నారు. ఒకటో తరగతి గోడలపై పక్షులు, జంతువుల బొమ్మలు కనిపిస్తే, ఏడోతరగతి గోడలపై గుండె, మూత్రపిండాలు, ఇండియా మ్యాపులు... కనిపిస్తాయి. చేసేది ఉచితంగా కదా అని నాణ్యత విషయంలో కాంప్రమైజ్ అవ్వడం లేదు. ఖరీదైన పెయింటింగ్లనే వాడుతున్నారు. ‘నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాను. రెండేళ్లక్రితం ఒక అనాథపిల్లల ఆశ్రమంలో పరిచయం అయ్యింది కావ్య. ఆమె చిత్రాలు అందంగా ఉంటాయి. అలాగే ఆమె ఆశయం కూడా. నేను చిత్రకారుడ్ని కాకపోయినా ఆమెతో చేయి కలిపాను. అలాగే మా స్నేహితులు చాలామంది సోషల్ ఆర్టిస్టులుగా మారిపోయి వారాంతాల్లో పెయింటింగ్ బక్కెట్లు చేతబట్టి ప్రభుత్వ పాఠశాలలకు పయనమవుతున్నాం’ అని చెప్పారు మరో సభ్యుడు శ్రీకృష్ణ. రంగులతో పాటు... ప్రభుత్వ పాఠశాలల పరిసరాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పాత భవంతులు, వెలసిన రంగులు, పెచ్చులూడిన గోడలు.. అలాంటి చోటకి వెళ్లి పనిచేస్తున్నాం అంటోంది మరో సభ్యురాలు నిఖిల .‘కావ్యతో పరిచయం ఏర్పడి మూడేళ్లవుతోంది. ఆమెతో కలిసి ప్రయోజనకరమైన సేవ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మా టీమ్‌లో దాదాపు వందమంది సభ్యులున్నారు. వీరిలో చాలామందికి పెయింటింగ్ అంటే ఏమిటో తెలియదు. నాక్కూడా. పేద విద్యార్థులకు పాఠాలు చెప్పడం, వారికి తెలియని విషయాలపై అవగాహన కల్పించడం వంటి పనులు కూడా చేస్తున్నాం. కావ్య బొమ్మలు బాగా వేస్తుంది. మేం ఎవరికి తోచిన పని వాళ్లం చేస్తాం. కొందరు పెయింటింగ్స్ వేస్తే ఇంకొందరు వారికి సాయం చేస్తారు. పెయింటింగ్ రాకపోయినా ఆసక్తి ఉన్నవారు నేర్చుకుని మరీ పిల్లలకు నేర్పుతున్నారు’ అని చెప్పారామె. ఒక పాఠశాల గోడలకు రంగులేయడంతో సరిపెట్టకుండా అప్పుడప్పుడూ అక్కడికి వెళ్లి పిల్లలకు అవసరమైన అక్షరసాయం కూడా చేస్తున్న ఈ సేనకు స్నేహితుల ప్రోత్సాహం చాలా బాగుంది. టీచర్స్ సహకారం... ఈ సోషల్ ఆర్టిస్టులు అడుగుపెట్టిన ప్రతి పాఠశాలలోని ఉపాధ్యాయులు వీరికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నారు. ‘మీ రాక మా తరగతుల గదుల్లోనే కాదు విద్యార్థుల మొహాల్లో కూడా వెలుగులు నింపుతోంది’ అని అంటున్నారు వాళ్లు. ‘నేను చదివింది ఇంజనీరింగ్ అయినా చిన్నప్పటి నుంచి పెయింటింగ్ అంటే ప్రాణం. నా కళ విద్యార్థులకు ఉపయోగపడాలనుకున్నాను. మొదట బ్రాహ్మణబస్తీలోని పాఠశాలకు నేనొక్కదాన్నే నాలుగు పెయింట్ డబ్బాలు మోసుకుని వెళ్లాను. ఈరోజు నావెంట వందమంది ఉన్నారు. దానికి కారణం... ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల ప్రేమాభిమానాలే. ఈరోజుకీ నేను వెళ్తే... అక్కా అంటూ అతుక్కుపోతారు. వారికి ఇంకా ఏదో చేయాలని ఉంది’ అని చెప్పారు కావ్య. ఆర్టిస్టు కావ్యగా అందరికీ పరిచితురాలైన ఈ కళాకారిణి ఈ మధ్యనే పేరు మార్చుకున్నారు. ‘అవునండి. పెళ్లయ్యాక పేరు మారింది. ఇప్పుడు నా పేరు ఉద్విత. మా నాన్నగారు నటులు సి.వి.ఎల్ నర్సింహారావ్, అమ్మ అడ్వకేట్ అనురాధ. వారిద్దరి గురించి అందరికీ తెలుసు’ అని ముగించారు కావ్య. ఈ సోషియల్ ఆర్టిస్ట్స్ సభ్యుల్ని చూస్తుంటే... కుంచె అందమైన బొమ్మలనే కాదు, అందమైన ఆలోచనలకు కూడా ప్రాణం పోస్తుందనిపిస్తుంది కదా! -
తొమ్మండుగురు తోడేళ్లు
బెస్ట్ కేస్ ఖమ్మంలో ఎస్పిగా ఉన్నప్పుడు పరిష్కరించిన కేసు నేను ఎప్పటికీ మరచిపోలేను. ఏడాదిపాటు కంటిమీద కునుకు లేకుండా చేధించిన కేసు. మహిళలపై దాడి కేసుల గురించి విన్నప్పుడల్లా నాకు ఖమ్మంలో జరిగిన సంఘటనే కళ్లముందుంటుంది. 2009లో జరిగిన సంఘటన ఇది. ఒకరోజు పొద్దునే ఫోన్‌కాల్స్ రావడం మొదలయ్యాయి. ఖమ్మం కొత్తగూడెం సిటికేబుల్‌లో బ్లూఫిల్మ్‌లు టెలికాస్ట్ చేస్తున్నారని ఫిర్యాదు. టీవీ పెట్టి చూస్తే రక్తం ఉడికిపోయే సంఘటన. అందరూ అనుకుంటున్నట్టు అవి బ్లూఫిల్మ్ దృశ్యాలు కావు. ఒకమ్మాయిని తొమ్మిదిమంది రేప్ చేస్తున్నప్పుడు తీసిన ఫొటోలను వీడియోకింద తయారుచేశారు. బ్యాగ్రౌండ్లో సినిమాపాటలు పెట్టి వీడియో ప్లే చేస్తున్నారు. వెంటనే కేబుల్ ఆపరేటర్లను అరెస్ట్ చేశాం. కొందరు మార్ఫింగ్ వీడియో అన్నారు, ఇంకొందరు ఈ ప్రాంతానికి చెందిన చిత్రాలు కావన్నారు. కానీ నాకు, కొత్తగూడెం డిఎస్పికి ఆ రేప్ లోకల్‌దే అనిపించింది. రేప్‌కు గురైన అమ్మాయి ఫొటో ఆధారంగా ఏ ప్రాంతానికి చెందిందో ఎంక్వైరీ చేయిస్తే అక్కడే ఒక గ్రామానికి చెందిన అమ్మాయని తెలిసింది. తెలిసిన వ్యక్తి పనే... మహిళాపోలీసులు మారువేషాల్లో అమ్మాయి దగ్గరికి వెళ్లి కౌన్సెలింగ్ చేసి, తల్లిదండ్రులను ఒప్పించి కేసు పరిష్కారానికి సహకరించమని చెప్పారు. కొద్దిగా టైం తీసుకున్నా ఒప్పుకున్నారు. మీడియావాళ్లు కూడా ఈ కేసు విషయంలో చాలా సహకరించారు. వారికి అమ్మాయి వివరాలు, కేసు వివరాలు తెలిసినా పత్రికల్లో, టీవీల్లో వార్తలు వేయకుండా సాయపడ్డారు. అమ్మాయి పేరు, వివరాలు బయటపెట్టకుండా ఆమెతో కేసు ఫైల్ చేయించాం. విషయం ఏంటంటే, అప్పటికి ఆ అమ్మాయిపై రేప్ జరిగి రెండేళ్లవుతోంది. పదో తరగతి చదువుకుంటున్న ఆ అమ్మాయి ఒకరోజు సాయంత్రం తెలిసిన వ్యక్తితో కలిసి ఆటోలో బంధువుల ఇంటికి బయలుదేరింది. కొంత దూరం వెళ్లాక ఆటో గ్రామం శివార్లకు వెళుతుంటే ఆమె ప్రతిఘటించింది. తెలిసిన వ్యక్తి ఆమెను అరవకుండా నోరునొక్కి, చాకు చూపించి బెదిరించాడు. నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లాక అక్కడ అతని స్నేహితులు మరో ఎనిమిదిమంది ఉన్నారు. ఆటో డ్రైవర్ని కాపలా పెట్టి తొమ్మిదిమంది అత్యాచారం చేశారు. ఈ సంఘటనను ఫొటోలు తీశారు. బాధితురాలు ఇంట్లోవాళ్లకి విషయం చెప్పింది. ఆడపిల్ల జీవితం. నలుగురికి తెలిస్తే పరువు పోతుందని నోరునొక్కుకుని ఊరుకున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారనే మీడియావార్తలు వింటూనే ఉంటాం. కానీ చాలామంది పోలీసులు తమ ఇంటి ఆడపిల్లకు అన్యాయం జరిగినట్టు భావించి పనిచేస్తారు. 24 గంటల్లో... అత్యాచారం జరిగిన ఏడాది తర్వాత ఆ కిరాతకులు దాన్ని సీడీగా తయారుచేసి ఆ అమ్మాయికి పంపారు. మళ్లీ వాళ్లు చెప్పినచోటుకు రాకపోతే కేబుల్టీవీలో ప్రసారం చేస్తామని బెదిరించడం మొదలుపెట్టారు. బాధితురాలు రానని చెప్పింది. అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి తెలిసినవాడే అయినా ఏం చెయ్యలేని దుస్థితి! ఎన్నిసార్లు బెదిరించినా అమ్మాయి లొంగకపోయేసరికి వాళ్లు కేబుల్‌టీవీ ఆపరేటర్లకు డబ్బిచ్చి దీన్ని ప్రసారం చేయించారు. తన రెండేళ్ల నరకం గురించి బాధితురాలు మాకు చెప్పుకొస్తుంటే డిపార్టుమెంట్లో ప్రతిఒక్కరు ఆవేశంతో ఊగిపోయారు. ఆ కిరాతుకుల్ని వీలైనంత త్వరగా పట్టుకోవాలన్న పట్టుదలతో ఎవరికివారు టీమ్‌ల మాదిరిగా విడిపోయి పనిచేశారు. కొత్తగూడెం డిఎస్పి, ఇంకా ఆ చుట్టుపక్కల ప్రాంతాల ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు అందరూ ఇదేపనిలో పడ్డారు. 24గంటల్లో తొమ్మిదిమందిని అరెస్టు చేశారు. వారిలో పద్దెనిమిదేళ్ల కుర్రాడి నుంచి యాభైఅయిదేళ్ల పెద్దమనిషి వరకూ ఉండడం సిగ్గుచేటనిపించింది. ఆ పనిచేసింది కుర్రాళ్లయితే యువత చెడు మార్గంలో పోతుందని చెప్పుకుంటాం. కానీ యాభై ఏళ్ల వయసున్న వ్యక్తులున్నారంటే ఎలాంటి సమాజంలో ఉన్నామోనని అందరం తలదించుకున్నాం. అన్ని కేసులు... అత్యాచారం చేసిన వారిని అరెస్టు చేయడంతో మాపని పూర్తవ్వలేదు. వారిచ్చిన ఫొటోలను వీడియోలా తయారుచేసిన నలుగురు కుర్రాళ్లను ఐటియాక్ట్ కింద అరెస్టు చేశాం. ఆటోడ్రైవర్ని అదుపులోకి తీసుకున్నాం. అందరిపై కేసులు పెట్టాం. గ్యాంగ్ రేప్, కిడ్నాపింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్... అన్నీ ఫైల్ చేశాం. కొత్తగూడెం పోలీస్‌స్టేషన్‌కి కోర్టు కిలోమీటరు దూరం ఉంటుంది. మామూలుగా నిందితుల్ని కోర్టుకి జీపులోనే తీసుకెళతాం. కానీ ఈ కేసులో నేను వీరిని రోడ్డుపై అందరికీ వీళ్ల గురించి తెలిసేలా నడిపించుకుని తీసుకురమ్మన్నాను. సాక్ష్యాలన్నీ పక్కాగా ఉండాలి కదా! రెండేళ్ల తర్వాత కూడా బాధితురాలికి చేసిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టు వచ్చింది. అలాగే అత్యాచారానికి సంబంధించి తయారుచేసిన సీడీలో ఉన్న ఫొటోలు మార్ఫింగ్‌వి కావన్న రిపోర్టు కూడా వచ్చింది. కేసు సీరియస్‌నెస్‌ని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్టిగేషన్ డిఎస్పి రేంజ్ ఆఫీసర్‌కి అప్పజెప్పారు. యావజ్జీవం... ఈ బాలిక కేసుని జిల్లా జడ్జి జగన్నాథ్ రెడ్డిగారి దగ్గర్నుంచి అందరూ సీరియస్‌గా తీసుకున్నారు. కలెక్టర్ ఉషారాణి కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. రెండు రోజులకోసారి ఎంతవరకు వచ్చిందంటూ ఎంక్వయిరీలుండేవి. మా డిపార్టుమెంట్ సంగతంటారా... అందరినీ కటకటాల వెనక్కి నెట్టేవరకూ ఎవరూ నిద్రపోయేట్టు లేరు. కేసుని ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకి తరలించారు. ఏడాది తిరక్కుండా తీర్పు వచ్చింది. తొమ్మిదిమందికి జీవితఖైదు పడింది. ఆటో డ్రైవర్‌కి పది సంవత్సరాల జైలు శిక్ష. సీడీలు చేసిన నలుగురు కుర్రాళ్లకి ఐదేళ్లజైలు శిక్ష, యాభైవేల రూపాయల జరిమానా విధించారు. అక్కడితో అయిపోలేదు... మా దృష్టికి వచ్చిన కేసుని సాక్ష్యాలతో సహా కోర్టులో ఫైల్ చేశాక నేరస్తుడికి శిక్ష పడడంతో మామూలుగా మా పని పూర్తయిపోతుంది. కానీ ఈ కేసు విషయంలో అలా అనుకోలేదు. బాధితురాలి సంక్షేమం కోసం మేం చేయాల్సిన పనులన్నీ పూర్తిచేయాలనుకున్నాను. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అప్పటికి 2003- 28 జీవో ప్రకారం గ్యాంగ్‌రేప్ బాధితురాలికి ప్రభుత్వం లక్ష రూపాయల నష్టపరిహారం ఇస్తుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసినపుడు 25 వేలు, చార్జ్‌షీటు దాఖలు చేసినపుడు 25 వేలు, కేసు ట్రయిలర్ అయ్యాక మిగతా 50 వేల రూపాయలు ఇస్తారు. ఈ బాధితురాలికి కూడా ఆ నగదు అందేలా చేశాం. అలాగే హైదరాబాద్‌లో దుర్గాబాయి దేశ్‌ముఖ్ పాలిటెక్నిక్ కళాశాలలో మహిళా బాధితులకు 70 శాతం రిజర్వేషన్ ఉంటుంది. జిల్లా కలెక్టర్‌గారి సాయంతో ఆ బాధితురాలికి సీటు ఇప్పించాం. ఓ స్వచ్చంద సంస్థ సాయంతో అవసరమైన కౌన్సెలింగ్‌లు చేయించాం. మొదటిసారి ఆ అమ్మాయిని చూసినపుడు బాధనిపించింది. డిప్లమా పూర్తిచేసిందని తెలిశాక సంతోషం కలిగింది. కనీస బాధ్యత... రేప్ కేసులు వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్‌కి ఈ కేసు ఫైలు ఉపయోగపడుతుందని కేసు తీర్పు కాపీని అన్ని జిల్లాల ఎస్పీలకు పంపించారు. కేసు పరిష్కారం తర్వాత నాకు, కొత్తగూడెం డిఎస్పికి, ఇన్స్పెక్టర్కి పై అధికారుల నుంచి ప్రశంసా పత్రాలు వచ్చాయి. ఇక్కడ మరోసారి నేను మెచ్చుకోవాల్సినవారు ఖమ్మం మీడియా ప్రతినిధులు. ఒక్క వార్త కూడా రాకుండా, బాధితురాలి వివరాలు నలుగురికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు. మహిళలపై దాడులకు సంబంధించిన కేసుల పరిష్కారంలో పోలీసులకు మీడియా నుంచి, పబ్లిక్ నుంచి అవసరమైన సహకారం అందకపోతే మా కష్టం మొత్తం వృథా అయిపోతుందని ఈ సందర్భంగా మరొకసారి గుర్తుచేస్తున్నాను. రిపోర్టింగ్: భువనేశ్వరి ఫొటో: రాజేశ్ -
ఉతికిన ఆ తెల్లచొక్కా...
బెస్ట్ కేస్ విజయవాడలో ఏఎస్పీగా చేరిన కొత్తలో నాకు అంతా కొత్తగానే ఉండేది. ముఖ్యంగా గ్రామాల్లో వాతావరణం! మనుషులు అలవాటు పడటానికి సమయం పడుతుంది కదా! విజయవాడలోని నందిగామ గ్రామంలో 1975లో జరిగిన ఆ సంఘటన... నెల కూడా గుర్తుంది... సెప్టెంబర్. ఒకరోజు సాయంత్రం ఆరుగంటలకు ఓ ఇద్దరు కుర్రాళ్లు పోలీస్ స్టేషన్‌కి వచ్చారు. అందులో ఒకతను ‘మా అమ్మను ఎవరో చంపేశారు’ అంటూ ఆయాసపడుతూ చెప్పాడు. సంఘటనా స్థలానికి వెళ్లి చూస్తే గుడిసెలో 45 ఏళ్ల మహిళ మృతదేహం రక్తపుమడుగులో పడివుంది. భర్త లేడు. ఒక్కడే కొడుకు. అతనికి పెళ్లయింది. ఎవరో ఆ మహిళని చెంబుతో తలమీద మోది చంపేశారు. వెంటనే జాగిలాలను రప్పించాను. అవి గుడిసెలో నుంచి బయటకి వచ్చి ఊళ్లోకి వెళ్లాయి. అక్కడ కొంతదూరం వెళ్లాక ఆగిపోయాయి. ఆ పరిసరాల్లోనే మృతురాలి కొడుకు స్నేహితుడి ఇల్లు ఉన్నట్టు అక్కడివారు చెప్పారు. జోస్యం కోసం... ‘‘నేను, నా భార్య, నా స్నేహితుడు, అతని భార్య... అందరం కలిసి సినిమాకి వెళ్లాం సార్. తిరిగొచ్చిచూస్తే అమ్మ ఇలా శవమై కనిపించింది’’ అంటూ బోరుమన్న పాతికేళ్ల కొడుకుని ఓదార్చి విచారణ మొదలుపెట్టాం. ముందుగా మృతురాలి వివరాలు సేకరించాం. ఆమె మంత్రతంత్రాలు తెలిసిన మహిళ. ఆ గ్రామం వాళ్లే కాదు, చుట్టుపక్కల ఊళ్లవాళ్లు కూడా ఏ చిన్న సమస్య ఉన్నా ఆమె దగ్గరికి వచ్చేవారు. కడుపులో నొప్పి నుంచి మొదలుపెట్టి, తప్పిపోయిన పశువుల ఆచూకీ వరకు అన్నింటికీ ఆమెను సంప్రదించేవారు. ఆమె మంత్రమో, అంజనమో వేసి వాళ్లకు పరిష్కారాలు సూచిస్తుందన్నమాట. పల్లెటూళ్లలో ఇలాంటివారుండటం సహజమే కదా! రోజూ ఆమెను కలవడానికి చాలామంది వచ్చేవారు. ఆమెకు ఎవరితోనైనా తగాదాలున్నాయోమోనని ఆరా తీస్తే అలాంటివేమీ లేవని తేలింది. గుడిసెలో అణువణువూ గాలించడం మొదలుపెట్టాం. ఎక్కడా చిన్న క్లూ కూడా దొరకలేదు. ఆమెపై దాడికి ఉపయోగించిన చెంబుపై వేలిముద్రలు కూడా దొరకలేదు. హంతకుడు చాలా జాగ్రత్తపడ్డాడు. అయితే ఇంట్లో కొన్ని విలువైన వస్తువులు కనిపించడం లేదని చెప్పాడు కొడుకు. ముఖ్యంగా తల్లి మెడలోని బంగారు గొలుసు! ఆ పెట్టె లోపల... గుడిసెలో ఒక మూలన చాలా పాత ఇనప్పెట్టె ఒకటి కనిపించింది. దానికి తాళం వేసి ఉంది. తాళం గురించి అడిగితే మృతురాలి కొడుకు ‘ఏమో తెలియ’దంటూ అమాయకంగా మొహం పెట్టాడు. ఎందుకో అతని సమాధానం కరెక్టు కాదని అనిపించింది నాకు. లాభం లేదని పెట్టెని పగలగొట్టాం. అందులో ఏమీ లేదు. ఒక తెల్లని చొక్కాగుడ్డ ఉంది. చూడ్డానికి చాలా కొత్తగా ఉంది. విప్పి చూస్తే అక్కడక్కడా చిన్న చిన్న రక్తపు మరకలు కనిపించాయి. ‘ఏంటి’వని అడిగితే ఆమె కొడుకు నాకు తెలియదంటాడు. అతని స్నేహితుణ్ణి పిలిచి అడిగినా అదే సమాధానం చెప్పాడు. హంతకుడు మాకోసం వదిలిన క్లూ మాత్రం అదేనని నాకు చాలా స్పష్టంగా అర్థమైంది. దానిపైనే దృష్టి పెట్టాను. ఒక టీమ్‌ని ఆ ప్రాంతంలోని బట్టల షాపుల వివరాలు కనుక్కురమ్మని పంపాను. ఆ ఫొటో వెనక... ఆ ప్రాంతంలో మొత్తం మూడే మూడు బట్టల షాపులున్నాయి. వాళ్లకి ఈ క్లాత్‌ని చూపించాం. దాన్ని అమ్మిన షాపు దొరికింది. వారికి మృతురాలి కొడుకు ఫొటో చూపించగానే ‘ఇతనే సార్, నెలరోజుల కిందట వచ్చి పెళ్లి కోసమని నాలుగైదు షర్టు పీసులు కొనుక్కెళ్లాడు’ అని చెప్పారు. నా అనుమానం బలపడింది. తిరిగి గుడిసె దగ్గరికి వెళ్లి మరింత పరిశీలనగా చూస్తే దండెంపై ఆరేసి ఉన్న తెల్లచొక్కాకి అక్కడక్కడా ఆరెంజ్ రంగు మరకలున్నట్టు కనిపించింది. దాన్ని వెంటనే ఫొరెన్సిక్ ల్యాబ్‌కి పంపిస్తే చొక్కాపై రక్తపు మరకలు పడ్డట్టూ, దాన్ని శుభ్రం చేయడానికి ప్రయత్నించినట్టూ చెప్పారు. విచారణలో భాగంగా మా జాగిలాలు వెళ్లిన అతని స్నేహితుడి ఇంటికి కూడా వెళ్లి అంతా సోదా చేస్తే ఆ ఇంట్లో గోడకు తగిలించిన దేవుడి పటం వెనక మృతురాలి గొలుసు దొరికింది. ఇక దొరికిన సాక్ష్యాలు చాలని చెప్పి... మృతురాలి కొడుకుని స్టేషన్‌కి తీసుకెళ్లి విచారిస్తే విషయం బయటపడింది. కన్నతల్లిని తానే స్వయంగా హత్య చేసిన వైనం చెప్పుకొచ్చాడు. అక్రమ సంబంధం... ఎప్పుడూ వెంట తిరిగే తన స్నేహితుడికీ, తల్లికీ అక్రమ సంబంధం ఉన్నట్టు అప్పటికి నెలరోజుల క్రితం బయటపడింది. తన పెళ్లయితే తల్లి ప్రవర్తన మారుతుంది కదా అని ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. అయినా ఎలాంటి మార్పూ రాలేదు. స్నేహితుణ్ణి మందలించి అతణ్ణి కూడా పెళ్లిచేసుకోమని చెప్పి దగ్గరుండి పెళ్లి చేశాడు. ఒకరోజు తల్లి ఇతని స్నేహితుడితో గొడవకు దిగింది. ‘నాతో నీకు సంబంధం ఉండగా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి? నీకు తెలియదా నాకున్న మంత్రశక్తుల గురించి. నిన్నూ, నీ భార్యనూ బూడిద చేసేస్తాను...’ అంటూ తల్లి... స్నేహితుడిపై విరుచుకు పడుతుండగా కొడుకు ఎదురుపడి తల్లిని నిలదీశాడు. దాంతో కొడుకుని కూడా అదేవిధంగా బెదిరించడం మొదలుపెట్టింది. తల్లి ప్రవర్తనతో విసిగిపోయిన కొడుకు, అతని స్నేహితుడు ఒకరోజు సాయంత్రం ఆమెను హతమార్చారు. ఇదీ విషయం. చనిపోయిన వ్యక్తి మంత్రగత్తె కావడంవల్లనేమో తెల్లవారే సరికి గ్రామస్తులంతా ఆమె గుడిసెముందు, మా పోలీస్టేషన్ ముందు ఉండేవారు. ‘సార్, హంతకుడు దొరికాడా... దొరికాడా...’ అంటూ అడుగుతుండేవారు. అలాగని విచారణకు ఏమైనా సాయం చేస్తారా అంటే ఏమడిగినా తెలియదని చెప్పేవారు. తక్కువ సమయంలో... నాకేమో అక్కడి వాతావరణం కొత్త. పల్లె ప్రజల పద్ధతులు, నమ్మకాల గురించి పెద్దగా అవగాహన లేకపోయినా ఇలాంటి కేసుని నాలుగురోజుల్లో విజయవంతంగా చేధించినందుకు మా పై అధికారుల నుంచి మంచి ప్రశంసలు వచ్చాయి. రిపోర్టింగ్: భువనేశ్వరి ఫొటో: రాజేశ్ -
అడవిలో అర్ధరాత్రి...
బెస్ట్ కేస్ మాజీ డీజీపీ ఎ.కె.ఖాన్ చెప్పిన రియల్ క్రైమ్ స్టోరీ కరీంనగర్ జిల్లాలో ఏఎస్పీగా పనిచేస్తున్నప్పుడు నేను ఛేదించిన ఒక కేసు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కరీంనగర్‌కి, వరంగల్‌కి సరిహద్దు ప్రాంతం తాడిచర్ల మండలం దగ్గర జరిగిన ఘటన అది. ఆ రోజు రాత్రి పదకొండు గంటలకు కబురు వచ్చింది. దగ్గర్లోని అటవీ అధికారులపై జంతువులు దాడి చేసి చంపేశాయని. ఎక్కడో, ఏమిటో వివరాలు సరిగ్గా లేవు. నేను, ముగ్గురు పోలీసులం జీపులో బయలుదేరాం. కొంతదూరం వెళ్లాక కాలినడకన ప్రయాణం మొదలుపెట్టాం. అమావాస్య రోజులు కావడంతో చిమ్మచీకటి. టార్చిలైట్ల వెలుతురులో అడుగులు వేసుకుంటూ వెళుతుంటే దారికడ్డంగా కొండచిలువ. దాని తలెక్కడుందో తెలీలేదు. మెల్లగా తప్పించుకుని ముందుకు వెళ్లాం. విషయం ఏంటంటే ఆ అడవి క్రూరమృగాలకు నెలవు. చిరుతపులులు, ఎలుగుబంట్లు ఎక్కువగా ఉండేవి. పైగా వాటి ‘చేతిలో’ చనిపోయిన అధికారుల దేహాలను వెతకడానికి వెళుతున్నాం. భయం ఖాకీ చొక్కాకి ఉండదేమోగానీ ఆ చొక్కా లోపల ఉన్న మాకుంటుంది కదా! రాత్రి రెండు గంటలకు... ఓ రెండుగంటల కాలినడక ప్రయాణం తర్వాత అటవీ అధికారుల మృతదేహాలు కనిపించాయి. ఒళ్లంతా రక్కినట్టు ఉంది. పులి దాడిచేసిందనుకున్నాం. మృతదేహాలను అడవిని ఆనుకుని ఉన్న తండాకు తీసుకెళ్లాం. తెల్లారాక తిరిగి ఆ మృతదేహాలు దొరికిన సంఘటనా స్థలానికి వెళ్లాం. అంతకు ముందురోజు మేం నడిచిన ఆనవాళ్లతో సహా సంఘటనా స్థలంలో కూడా కొన్ని గుర్తులు కనిపించాయి. ముఖ్యంగా మృతదేహాలు దొరికిన చోటుకు నాలుగు అడుగుల దూరంలో ఎండ్లబండి చక్రాల గుర్తులు కనిపించాయి. ‘‘సార్, పులులు దాడి చేసి చంపి వుంటే ఇక్కడ ఈ ఎండ్లబండి చక్రాల ఆనవాళ్లేంటి? ఎవరో వీరిని చంపి ఇక్కడ పడేయలేదు కదా’’ అన్న మా కానిస్టేబుల్ మాటలు నన్ను ఆలోచనలో పడేశాయి. ఆ చక్రాల గుర్తులు ఎండ్లబండివే కానీ చక్రానికీ, చక్రానికీ మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఆ ఎండ్లబండి అందరి దగ్గర ఉండే ఎండ్లబండి లాంటిది కాదు! వెంటనే ఆ చక్రాల మధ్య ఉన్న దూరాన్ని కొలిచి... చుట్టుపక్కల ఊళ్లలోకి వెళ్లి అలాంటి బండ్లు ఎక్కడున్నాయో తెలుసుకున్నాం. అడవి చుట్టుపక్కల పది ఊళ్లలో అలాంటి బండ్లు మూడు ఉన్నట్టు తెలిసింది. రక్తపు చుక్కలు... మూడు బండ్ల యజమానులను రప్పించి మాట్లాడాం. అధికారులు చనిపోయిన రాత్రి ఆ మూడు బండ్లు ఎక్కడున్నాయో సాక్ష్యాలతో చెప్పమన్నాం. రెండు బండ్ల సమాచారం బాగానే వచ్చింది కానీ మూడో బండి యజమాని చెప్పిన విషయాలు కాస్త తేడాగా అనిపించాయి. ‘‘అంతకు ముందురోజు మా పక్కూరి నుంచి బండి కావాలని వచ్చారు సార్. పైసలిస్తామన్నారు కదా అని ఇచ్చాను. మరి వాళ్లు దేనికి వాడుకున్నారో నాకు తెలీదు’’ అన్నాడు. వెంటనే ఎండ్లబండిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఎడ్లను కట్టే కాడెపై నాలుగైదు రక్తపు మరకలు కనిపించాయి. ఇవేమిటని అడిగితే బండిని వాడుకున్నవాళ్లు చెప్పిన సమాధానం నమ్మాలనిపించలేదు. ‘‘వేసవికాలం కదా సార్... ఎడ్ల ముక్కుల్లోంచి రక్తం కారుతుంది. వాటి మరకలేమో!’’ అన్నారు. వెంటనే ఆ కాడెపై ఎండిన రక్తం శాంపిల్స్‌ని సేకరించి హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించాం. వివరాలు వెంటనే పంపమని ప్రత్యేకంగా ఒక ఆఫీసర్ని పంపించాను. సవాల్‌గా తీసుకున్నాను... అడవిని రక్షించడం కోసం పనిచేస్తున్న అధికారులను హత్య చేయడం అనేది చిన్న విషయం కాదు. ఈ హత్యను మేం తేలిగ్గా తీసుకుంటే ఏకంగా అటవీశాఖా యంత్రాంగాన్నే చులకనగా చూస్తారు. అటవీ సంపదను దోచుకోవడానికి వచ్చే స్మగ్లర్ల నుంచి ప్రతి నిమిషం ప్రమాదం ఉంటుందని తెలిసి కూడా ధైర్యంగా పనిచేసే అధికారులపై చెయ్యివేసే ధైర్యం ఎవరికొచ్చిందని నా గుండె రగిలిపోతోంది. దాంతో ఈ కేసుని డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టల విషయంగా తీసుకున్నాను. ఏ గ్రామం వాళ్లయితే ఆ బండిని అద్దెకు తీసుకున్నారో అక్కడే ఒక వారంరోజులు తిష్టవేశాం. ఎవరిని అడిగినా మాకేం తెలుసంటారు! ఒక్క బండిపై ఉన్న రక్తపు మరకలు తప్ప ఇంకే ఆధారాలూ దొరకలేదు. సంఘటనా స్థలంలో దొరికిన చిన్న చిన్న ఆధారాలు చేతిలో ఉన్నా అవి హంతకుల చిరునామాని చెప్పలేకపోయాయి. ఇంతలో హైదరాబాద్ నుంచి సమాచారం వచ్చింది. ఆ రక్తం ఎద్దుది కాదు మనిషిదని! అంతే విచారణ వేగం పెంచాం. ఆ నలుగురు... అటవీ అధికారుల్ని చంపింది పులులు, సింహాలు కాదనీ, మనుషులనీ స్పష్టమైన విషయాన్ని అన్ని గ్రామాల్లోని వారికి తెలియజేశాం. అయినా మేం తిష్టవేసిన గ్రామవాసుల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఎవరూ కూడా అయ్యోపాపం అనలేదు. నాకు సందేహం వచ్చి ఓ నలుగురు కుర్రాళ్లను విచారిస్తే విషయం బయటపడింది. ఆ గ్రామస్తులే అధికారుల్ని హత్య చేశారని. వారిపై అనుమానం రాకుండా ఉండేందుకు అధికారుల శరీరంపై గోళ్లతో రక్కినట్టు చేశారు. కళ్ల గుడ్లని బయటికి తీసేశారు. అలా జంతువులే చేస్తాయనీ, వారిపై మాకు అస్సలు అనుమానం రాదనీ వారి నమ్మకం. కాని మాకు విషయం తెలిసిపోయాక గ్రామస్తులంతా ఒకచోట కూడి మాకు జరిగిన విషయం చెప్పారు. అధికారులు వారి గ్రామస్థుల్ని బాగా ఇబ్బందిపెట్టేవారట. డబ్బులకోసం, అవసరమైన వస్తువుల కోసం వారిని వేధించేవారట. చాలా రకాలుగా అధికారులతో విసిగిపోయి, వారి పీడని వదిలించుకోవడం కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అడవిలోకి ఆవుల్ని తోలుకెళ్లినా, గొర్రెల్ని కొట్టుకెళ్లినా ఫైన్ కట్టమంటూ ఇబ్బంది పెట్టేవారనీ, వారితో ఇంకా ఏవో ఇబ్బందుల్ని కూడా ఎదుర్కొన్నామనీ చెప్పుకొచ్చారు. ఏదైతేనేం... అధికారులు నిజంగా గ్రామస్థుల్ని ఇబ్బంది పెట్టారనుకోండి. దానికి పరిష్కారం ఇంత ఘోరంగా హత్యచేయడం కాదు కదా! పైగా ఎప్పుడూ మేం అందుబాటులో ఉంటాం. డిపార్ట్మెంటు ఉద్యోగులపై దాడి చేయడం అటవీశాఖలోనే కాదు, మా పోలీసుశాఖలో కూడా తీవ్ర కలకలం రేపింది. ఏ దుండగులో అంటే కాదు... గ్రామం మొత్తం ఏకమై చేసిన పని. హత్యలో ఎంతమంది పాల్గొన్నారని ఆరాతీస్తే మేమందరం అంటూ ఊరి ప్రజలంతా చేతులెత్తుతున్నారు. రెండుమూడు వందలమంది ఉంటారు. ఎవరినని అరెస్టు చేస్తాం. అయినా మా పద్ధతి ప్రకారం విచారణలో ఒక్కక్కరిని వదిలి అసలు హంతకుల పేర్లను రాబట్టాం. అధికారులను వెంటాడినవారు, హత్య చేసినవారు, అనుమానం రాకుండా వారిపై గోళ్లగాట్లను పెట్టినవారు, ఎండ్లబండిపై తీసుకెళ్లి అక్కడ పడేసినవారు, చూసి కూడా తెలియనట్టు నటించినవారు... ఇలా హత్యలో పాల్గొన్న పాత్రధారులందరిని వేరు చేసి, వారిపై వేర్వేరు కేసులు పెట్టి సాక్ష్యాలను కోర్టుకి అప్పగించాం. కేసు విచారణ తర్వాత అందరికీ శిక్షలు పడ్డాయి. వారి వారి నేరాల్ని బట్టి అందరికీ పెద్ద శిక్షలే పడ్డాయి. ఇది జరిగిన నేటికి ముప్పైరెండేళ్లవుతోంది. కానీ ఇప్పటికీ క్రైమ్ అనగానే నా కళ్లముందు ఉండే కేస్ ఇది! రిపోర్టింగ్: భువనేశ్వరి ఫొటోలు: రాజేశ్ రెడ్డి ఆ చక్రాల గుర్తులు ఎండ్ల బండివే కానీ చక్రానికీ, చక్రానికీ మధ్య దూరం చాలా ఎక్కువగా ఉంది. అంటే ఆ ఎండ్లబండి అందరి దగ్గర ఉండే ఎండ్లబండి లాంటిది కాదని అర్థమైంది. అడవిని రక్షించడం కోసం పనిచేస్తున్న అధికారులను హత్య చేయడం అనేది చిన్న విషయం కాదు. ఈ హత్యను మేం తేలిగ్గా తీసుకుంటే ఏకంగా అటవీశాఖా యంత్రాంగాన్నే చులకనగా చూస్తారు. -
మొక్కలకు అక్కచెల్లెళ్లు
కోనేటి వెంకటేశ్వర్లు, సాక్షి, తిరువళ్లూరు ‘‘నువ్వు గొప్పవ్యక్తివి కాకపోయినా... నువ్వు చేసే పని గొప్పదైతే అదే నిన్ను ప్రపంచంలో గొప్పవ్యక్తిగా నిలబెడుతుంది. నువ్వు చేసే పని అందరికీ నచ్చాలని లేదు. కనీసం ప్రోత్సహించగలిగినా చాలు...’’ పదవ తరగతిలో ‘రీఫారెస్టేషన్ మెథడ్స్’ అనే ఇంగ్లీష్ పాఠంలోని అంశాలను వివరిస్తూ తమ టీచర్ చేసిన బోధన ఆ అక్కాచెల్లెళ్లను ఆలోచింపచేసింది. నానాటికి కనుమరుగవుతున్న పచ్చదనాన్ని కాపాడి భావితరాల వారికి కానుకగా అందించాలన్న తపన వీరిని పర్యావరణ పరిరక్షణ ఉద్యమం వైపు నడిపించింది. తమిళనాడు, తిరువళ్లూరు జిల్లా కనకమ్మ సత్రం సమీపంలోని కుగ్రామానికి చెందిన కవలలు కోటీశ్వరి, భువనేశ్వరి. ఇద్దరూ అదే ప్రాంతంలోని తెలుగు మీడియం పాఠశాలలో టెన్త్ వరకు చదువుకున్నారు. తండ్రి వ్యవసాయదారుడు. నానాటికి పంటల సాగు తగ్గిపోవడం, దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోవడం వారిని ఆలోచింపజేసింది. సరిగ్గా అప్పుడే (పదేళ్ల క్రితం) ఇంగ్లీషు టీచర్ రామకృష్ణరాజు... అడవులు నరకడం వలన కలిగే నష్టాలను వివరిస్తూ ప్రముఖ పర్యావరణవేత్త బహుగుణ చేసిన ప్రచారం గురించి బోధించారు. ‘‘ఆ బోధనే ప్రేరణగా నిలిచి ఏడాదికి కనీసం పదివేల మొక్కలు నాటాలని ప్రతిన పూనాం’’ అని చెప్పారు కోటీశ్వరి. వీరిది గ్రామీణ ప్రాంతం కావడంతో పదవ తరగతి ముగిసిన రెండేళ్లకే ఇద్దరికీ పెళ్లి చేసేశారు. దాంతో ప్రతి ఇంటికి చెట్టు అనే తమ కల కలగానే మిగిలిపోతుందేమోనని భయపడ్డారు. మొదట కోటీశ్వరి.. భర్త నటేశన్తో తన ఆశయం గురించి చెప్పారు. ‘ఇదేం ఆశయం’ అన్నట్లు ఆయన చూశారట. ఇంటిబాధ్యతలు వదిలేసి చెట్లు, మొక్కలు నాటడం ఏమిటని ఆయన ఉద్దేశం. కానీ కోటీశ్వరి భర్తకు నచ్చజెప్పి అనుమతి సాధించింది. అలా తనకు ప్రోత్సాహం లభించగానే చెల్లి భువనేశ్వరి ఇంటి వారినీ ఒప్పించి ఆరేళ్ల క్రితం ఇద్దరూ మొక్కల నాటే పనులు ప్రారంభించారు. ఇప్పటి వరకు తిరువళ్లూరు, కాంచీపురం, వేలూరు తదితర జిల్లాలో రెండు లక్షల పైగా మొక్కలు నాటారు. వాటి పర్యవేక్షణను లయన్స్‌క్లబ్ వారికి అప్పగించారు. ఒక మొక్కను నాటడం వల్ల లక్షలాది విత్తనాలు, వేల సంవత్సరాలకు సరిపడా ఆక్సిజన్‌ను ఇవ్వగల చెట్టు వృద్ధి చెందుతుంది. అలాంటి చెట్లును కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై వుందన్న విషయాన్ని మనలో చాలామంది ఎందుకు గుర్తించలేకపోతున్నారో తెలియడం లేదని కోటీశ్వరి ఆవేదన చెందారు. అయినప్పటికీ తామెన్నడూ ఆశయ సాధనలో వెనుకంజ వేయలేదని ఈ అక్కాచెల్లెళ్లు చెప్పారు. ఇంటి దగ్గరే నర్సరీ ఆరంభంలో వారానికి రెండు రోజులు బయట ప్రాంతాలకు వెళ్లి పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాలలో మొక్కలు నాటి వచ్చేవారు కోటీశ్వరి, భువనేశ్వరి. మొక్కల కోసం ప్రతిసారీ అటవీశాఖ అధికారులను ఆశ్రయించాల్సి వచ్చేది. వారానికి కనీసం రెండు వేల మొక్కలను అడిగేవాళ్లు. మొదట్లో ఇచ్చేవారే కానీ, తర్వాత్తర్వాత ఇవ్వడం మానేసారు. దాంతో రెండు మూడు నెలల దాకా మొక్కలు నాటే అవకాశం లేకుండా పోయింది. చివరికి తామే స్వయంగా ఇంటి దగ్గరే నర్సరీ ఏర్పాటు చేసుకున్నారు. ఇలా పెంచిన మొక్కలను స్వచ్ఛందంగా వివిధ ప్రాంతాలకు వెళ్లి నాటి వస్తున్నారు. ‘‘ఏడాదికి లక్ష మొక్కలను నాటుతున్నాం. మరో పది సంవత్సరాల పాటు ఇలా నాటగలిగితే పదిలక్షల చెట్లు అవుతాయి. అప్పుడు పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్న కృషిలో మేము సఫలీకృతం అయినట్లే’’అంటున్నార ఈ అక్కచెల్లెళ్లు. ప్రస్తుతం వీరికి వేలాది మంది మద్దతుగా నిలుస్తున్నారు. ఆ ప్రోత్సాహంతో ‘గ్రీన్ సేవర్ చారిటబుల్ ట్రస్టు’ను ఏర్పాటు చేసుకుని మరీ ముందుకు సాగుతున్నారు. -
యోగా ఎలా మొదలైంది?
యోగా పదిహేనువేల సంవత్సరాల కింద హిమాలయాలలోని ఎగువ ప్రాంతాలలో ఒక యోగి ప్రత్యక్షమయ్యారు. ఆయన నిశ్చలంగా కూర్చుని ఉన్నారు. ఆయన ఎవరో, ఎక్కడనుంచి వచ్చారో ఎవరికీ తెలియదు. ఆయన సమక్షం చాలా అసాధారణంగా ఉండటం వల్ల చాలా మంది ప్రజలు ఆయన చుట్టూ గుమిగూడారు. ఏదో అద్భుతం జరుగుతుందన్న ఆశతో వారంతా నెలల కొద్దీ వేచి చూసారు. అప్పుడప్పుడు ఆయన కనుల నుండి వెలువడే ఆనందభాష్పాలు తప్ప, ఆయన జీవించే ఉన్నారు అన్నదానికి వేరే సంకేతాలేమి లేవు. - జగ్గీ వాసుదేవ్ అంతకు ముందుకానీ, ఆ తరువాత కానీ మానవ చేతనను పెంపొందించడానికి అంతకన్న గొప్పగా దోహదపడినవారు ఎవరూ లేరు. ఒకరు అలా నెలల తరబడి కేవలం కూర్చుని ఉన్నారంటే అతను భౌతిక విషయాలచే ఇక ఏ మాత్రం శాసించబడటం లేదని అర్థం. అదే అద్భుతం కదా! కాని అది వారు గ్రహించలేకపోయారు. అందువల్ల ఒక ఏడుగురు తప్ప అందరూ వెళ్లిపోయారు. వారు ఆయనను, ‘మీకు తెలిసింది ఏమిటో, మాకూ తెలుసుకోవాలని ఉంది!’ అంటూ అభ్యర్థించారు. ఆయన వాళ్ళను పట్టించుకోలేదు. కాని వాళ్ళు అక్కడే ఉండిపోయారు. వారి పట్టుదలను చూసిన వారికి ఆయన ఒక చిన్న ప్రక్రియను భోధించారు. ఏడుగురూ దానిని ఎంతో అభ్యాసం చేసారు. రోజులు వారాలయ్యాయి, వారాలు నెలలు అయ్యాయి, నెలలు సంవత్సరాలు అయ్యాయి. 84 ఏళ్ళ సాధన తరువాత ఆదియోగి మళ్ళీ వారిని చూడటం జరిగింది. వారు తేజోవంతులుగా, తన దగ్గర ఉన్నదాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండడాన్ని ఆయన గమనించారు. ఇక ఆయన వారిని పట్టించుకోకుండా ఉండలేకపోయారు. తర్వాత పౌర్ణమినాడు ఆయన దక్షిణంవైపునకు తిరిగి ఆ ఏడుగురికీ గురువుగా కూర్చున్నారు. ఆ రోజు ఆదిగురువు ఆవిర్భవించారు. అంటే ఆదియోగి ఆదిగురువుగా మారారు. ఇప్పటికీ ఆ రోజుని మనం గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా కృషితో మనిషి క్రమంగా పరిణామం చెందగలిగే అవకాశాన్ని ఆయన కల్పించారు. అంతకు ముందుకానీ, ఆ తరువాత కానీ మానవ చేతనను పెంపొందించడానికి అంతకన్న గొప్పగా దోహదపడినవారు ఎవరూ లేరు. ఆదియోగి వారికి యోగ శాస్త్రాన్ని బోధించడం ఆరంభించారు. అందులోని ఏడు విధానాలను ఏడుగురికీ బోధించారు. మానవ జీవిత నిర్మాణాన్నీ, అది పనిచేసే విధానాన్నీ బోధించారు. మానవుడు ముక్తి పొందడానికి 112 మార్గాలను, స్పష్టమైన పద్ధతులతో అందజేసారు. ఆ సప్తరుషులను మధ్య ఏషియా, దక్షిణ అమెరికా, ఉత్తర ఆఫ్రికా, ఆగ్నేయ ఏషియా, హిమాలయ దక్షిణ ప్రాంతాలను పంపారు. ఒకరు ఆయనతో ఉండిపోయారు. ఆఖరివారు దక్షిణ భారతానికి వచ్చారు. ఆయనే అగస్త్యులవారు. ఆయన దక్కను పీఠభూమికి దక్షిణంగా ఉండే ప్రతి జనావాసానికీ ఆధ్యాత్మిక ప్రక్రియను బోధన, తత్వం, మతంలా కాకుండా - ఒక జీవన విధానంలా అందేట్లు చూశారు. ఈ రోజుకు కూడా మన సంస్కృతిలో ఆయన చేసిన కృషి కనిపిస్తుంది. రిపోర్టింగ్: భువనేశ్వరి -
నా పాట నాతో మాట్లాడుతుంది
అవును.... పాట కాగితంపైకి రాబోయే ముందు, రాస్తున్నప్పుడు, రాసిన తర్వాత నాతో మాట్లాడుతుంది. పూర్వం ధన్వంతరి దగ్గరకు ఎవరైనా వ్యాధిగ్రస్తులు రాగానే వారి శారీరక, మానసిక పరిస్థితి తెలుసుకుని, తన ఔషధమూలికల వనములోకి వెళ్లి నిశితంగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు చూసేవాడట. ఆ వ్యాధి తగ్గించగల ఔషధమూలిక తన కొమ్మలనో, రెమ్మలనో ఊపి, ‘ధన్వంతరీ నేను పనికొస్తానా చూడు’ అనేదట. అలా నా సన్నివేశానికి తగిన పల్లవినిస్తూ పాట నాతో మాట్లాడడం మొదలు పెడుతుంది. మైకేలేంజిలోతో శిల మాట్లాడినట్టు, కృష్ణశాస్త్రితో ప్రకృతి మాట్లాడినట్టు, రవివర్మతో కుంచె మాట్లాడినట్టు, అమరశిల్పి జక్కన్నతో ఉలి మాట్లాడినట్టు, సచిన్ టెండూల్కర్‌తో బ్యాట్ మాట్లాడినట్టు... పాట తన కవితో మాట్లాడుతుంది. నాతో మాత్రమే కాదు ఏ పాటల రచయితతోనైనా పాట మాట్లాడుతుంది. సంకల్పాన్ని పరమ ప్రాణంగా భావించుకునే ప్రతి వ్యక్తి ఆత్మకణం బ్రహ్మకణంతో ట్యూన్ అవుతూనే ఉంటుంది. అలాగే కవికి పాటకి ఒక తపస్సంబంధం ఉంటుంది. కనుకనే పాట నాతో మాట్లాడుతుంది అంటున్నాను. డా॥సుద్దాల అశోక్‌తేజ,పాటల రచయిత ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలోని ‘నీలిరంగు చీరలోన...’ : పాట పాటమాలి నానక్‌రాంగూడలో ‘గోవిందుడు అందరివాడేలే’ షూటింగ్ జరుగుతోంది. కృష్ణవంశీ కబురు పంపాడు. వెళ్లాక ఆయన అన్నమాట: ‘మీరు రాయబోయే పాట ఈ సినిమాకి గుండెకాయలాంటిది’. ‘ప్రతి పాట గురించి డెరైక్టరు ఇలాగే అంటారు...’ అని నవ్వాను నేను. ‘ఈ పాటలో జీవితం ఉండాలి, పండుగలుండాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండాలి... అలాగని సుత్తిపాట కాకుండా అట్రాక్ట్ చేసేవిధంగా మొదలెట్టాలి’ అన్నాడు. నాలుగురోజుల తర్వాత ఒక పాట తీసుకెళ్లాను. కృష్ణవంశీకి నచ్చలేదు. ఆ పాటలో ‘నీలిరంగు చీర’ అన్న పదమొక్కటే నచ్చిందన్నాడు. మళ్లీ ఆలోచనలో పడ్డాను. ఇప్పుడు ‘నీలిరంగు చీర...’ అనేది కేంద్ర బిందువు. పాట పాడేది ప్రకాశ్‌రాజ్, జయసుధ. హీరో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాని పాడడు. ఇక్కడ జీవితం గురించి చెప్పాలి... అదే సమయంలో అట్రాక్షన్‌గా ఉండాలన్నది నాకు బాగా నచ్చింది. జీవితం గురించి అట్రాక్షన్‌గా చెప్పలేం. ‘ఒకటే జననం... ఒకటే మరణం...’ అన్నట్టు వెళ్లిపోతుంది. సీరియస్‌నెస్ ఉన్నదగ్గర ఆకర్షణ ఎక్కడ ఉంటుంది? మలేరియా బిళ్లను షుగర్ కోటింగ్‌తో ఇవ్వాలి. ‘నీలిరంగు చీర...’ అమ్మాయి కట్టుకునే వస్త్రం. ఆ సమయంలోనే నా మనసు పలికిన విషయం... ‘ఒరేయ్ అశోక్‌తేజా, జీవితానికి మించిన హొయలొలికించే జాణ ఇంకోటేదైనా ఉంటుందా!’ అని. ఇలాంటి సందర్భాన్నే నా పాట నాతో మాట్లాడుతుందని అన్నాను. జీవితాన్ని మించిన నెరజాణ లేదు. ఎప్పుడు ఏడిపిస్తుందో, నవ్విస్తుందో... ఎప్పుడు శిఖరానికి తీసుకెళుతుందో... పాతాళానికి పడేస్తుందో... పాపం అమ్మాయిల్ని నెరజాణలంటారుగానీ, అమ్మాయికంటే లక్ష రెట్లు ఎక్కువ నెరజాణ జీవితమే. ఇలా ఆలోచిస్తుండగా ఓ అర్ధరాత్రి వచ్చిన ఆలోచన ఏంటంటే... ‘అమ్మాయి గురించి చెబుతూ చెబుతూ వెళ్లి... అమ్మాయి కాదురా అమాయకుడా... జీవితంరా ఇది’ అని చెబితే ఎలా ఉంటుంది అని ఫిక్స్ అయ్యాను. ‘‘నీలిరంగు చీరలోన/ చందమామ నీవె భామా ఎట్ట నిన్ను అందుకోనే/ ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా/ నిన్ను ఎట్ట అదుముకోనే’’ మామూలుగా స్త్రీకి ఏడు రంగులుండవు. కానీ స్త్రీలో కేవలం శృంగారమే ఉండదు. అమ్మ ఉంది. తోబుట్టువుంది. స్నేహితురాలుంది. చిన్నారి వేలు పట్టుకుని నడిచే కూతురుంది. అందుకే ఏడు రంగులున్న నడుము అన్నాను. స్థిరంగా ఉన్నదాన్ని కౌగిలించుకుంటాం గానీ తిరుగుతున్నదాన్ని ఎలా కౌగిలించుకుంటాం. జీవితం కూడా ఒకే దగ్గర ఉండదు. ‘‘ముద్దులిచ్చి మురిపిస్తావే/ కౌగిలిచ్చి కవ్విస్తావే అంతలోనే జారిపోతావే’’ పదేళ్లకిందటి నా జీవితం ఎక్కడుంది! ఎప్పుడో నా చేజారిపోయింది. ‘‘మెరుపల్లె మెరిసే జాణ/ వరదల్లె ముంచే జాణ ఈ భూమిపైన నీ మాయలోన/ పడనోడు ఎవడే జాణ’’ ‘‘జాణ అంటే జీవితం.. జీవితం నెరజాణరా దానితో సైయ్యాడరా ఎదురీదరా/ ఏటికీ ఎదురీదరా’’ ఈ పల్లవి చూపించగానే కృష్ణవంశీ బిగ్గరగా కౌగిలించుకున్నాడు. ‘అద్భుతమైనటువంటి ట్విస్ట్ ఇచ్చావు అశోక్.. ఇక చరణాల్లో ఏం చేస్తావో నీ ఇష్టం’ అన్నాడు. మరొక వారం రోజుల్లో చరణాలు రాసుకుని వెళ్లాను. చరణాలు నచ్చాయి. కానీ మద్రాసులో మ్యూజిక్ డెరైక్టర్‌కి ఇచ్చాక... ఆయననుకున్న ట్యూన్లకి, నేను రాసిన చరణాలు పొంతన కుదర్లేదు. మ్యూజిక్ డెరైక్టర్ యువన్‌శంకర్‌రాజా. ‘చరణాలకు నేను ముందు ట్యూన్ ఇస్తాను. దానికి తగ్గట్టు మార్చ’మన్నాడు. నేనూ, కృష్ణవంశీ మద్రాసులో హోటల్ రూం తీసుకుని వారంరోజులుండి ఆ పనికానిచ్చాం. కృష్ణవంశీ ఇల్లు ఆ పక్కనే ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చి కలిసేవాడు. మొదటి చరణంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పమన్నాడు. ఈ పాటకు సంబంధించి నా లక్ష్యమొక్కటే, అటు సి.నారాయణరెడ్డిగారికీ కనెక్ట్ అవ్వాలి, ఇటు సామాన్యుడికీ అర్థంకావాలి. చరణం: 1 ‘‘రాక రాక నీకైవచ్చీ పున్నమంటి చిన్నది ఇచ్చే కౌగిలింతె బతుకున వచ్చే సుఖమని’’ ‘‘పువ్వులాగ ఎదురే వచ్చి ముల్లులాగ ఎదలో గుచ్చీ మాయమయ్యె భామవంటిదే కష్టమనుకో’’ ‘‘ఏదీ కడదాకా రాదని/ తెలుపుతుంది నీ జీవితం నీతో నువు అతిథివనుకోని ’’ మనిషికి తనను మించిన అతిథి, ఆత్మీయుడు మరొకరు లేరు. ‘‘జాణకాని జాణరా - జీవితం నెరజాణరా జీవితం ఒక వింతరా - ఆడుకుంటే పూబంతిరా’’ బంతి మనల్ని ఆడుకుంటదా, మనం బంతితో ఆడు కుంటామా అనేది మన శక్తిసామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. చరణం: 2 ‘‘సాహసాల పొలమే దున్నీ/ పంట తీసే బలమే ఉంటే ప్రతిరోజు ఒక సంక్రాంతి అవుతుందిరా’’ ‘‘బతుకు పోరు బరిలో నిలిచీ/ నీకు నువ్వే ఆయుధమైతే ప్రతీపూట విజయదశమీ వస్తుందిరా’’ నీకు నువ్వే ఆయుధమవ్వాలనడంలో రెండు అర్థాలున్నాయి. ఒకటి ప్రపంచంతో పోరాడి గెలవాలి. నీలో ఉన్న బలహీనతలతోనూ పోరాడి గెలవాలి. ఇందులో ప్రతి మాట యూత్‌కి కౌన్సెలింగ్లా ఉపయోగపడాలి. అందుకే రామ్‌చరణ్‌తేజ స్టేజ్‌పై ‘ఇంతవరకూ చాలా సినిమాలు చేశాను అంకుల్. కానీ నాకు ఇంత మంచి పాట ఇచ్చింది మీరే’ అన్నాడు. ‘‘నీపై విధి విసిరే నిప్పుతో ఆడుకుంటే దీపావళి’’ దీపావళి నిప్పుతో ఆడుకునే పండగ. ప్రమాదంతో ఆడుకోవడం. మనిషి జీవితంలో విధి ఎప్పుడూ నిప్పులు జల్లుతానే ఉంటుంది. ‘‘చెయ్ రా ప్రతి ఘడియ పండుగే/ చెయ్ర...చెయ్ర...చెయ్ జీవితం అను రంగుల రాట్నమెక్కి ఊరేగరా జీవితం ఒక జాతర చేయడానికే జన్మరా జీవితం ఒక జాతర చేయడానికే జన్మరా’’ రంగులరాట్నంలో ఒకడు గుర్రంమీద ఎక్కుతాడు, ఒకడు గాడిద మీద ఎక్కుతాడు. ఎవరు ఏ వాహనం ఎక్కినా అందరినీ ఒకేవిధంగా తిప్పుతుంది. ఒకే గమ్యానికి చేర్చుతుంది. ప్రతి ఒక్కరి ప్రారంభం ఒక్కటే, ప్రస్థానం ఒక్కటే. జీవితం ఒక ఉత్సవంలాంటిది. జాతర చేయడానికే వచ్చాం. అందుకే జాతర చేయడానికే ఈ జన్మరా... అని ముగించాను. రిపోర్టింగ్: భువనేశ్వరి -
ఒళ్లు విల్లు మది హరివిల్లు!
యోగా అదృష్టవశాత్తూ భారతభూమి యోగాకు పుట్టినిల్లు. కాలం అత్యాధునికమైనకొద్దీ సంభవిస్తున్న జీవనశైలి రుగ్మతలకు విరుగుడు ఆ అతి ప్రాచీన విధానంలో దొరకడం ఒక విచిత్రం! ఆనందం కూడా! యోగా మనదగ్గరే ఉంది కాబట్టి. జగ్గీ వాసుదేవ్ వాణి, మంచు లక్ష్మీప్రసన్న బాణి.... ఇవీ ఇకముందు ఈ పేజీల్లో మిమ్మల్ని పలకరించబోతున్నాయి. ఈ అరుదైన కాంబినేషన్లో యోగా తరగతులు ఫన్డే పాఠకులకు ప్రత్యేకం... యోగా అనేది మన దేశం మనకిచ్చిన వరం. గత పదేళ్లుగా నేను యోగా చేస్తున్నాను. యోగా అనేది కేవలం శరీరానికి సంబంధించిన ప్రక్రియ మాత్రమే కాదు. మనసుకి చెందింది. ముందుగా యోగా ప్రభావం మన మానసిక స్థితిపై ఉంటుంది. మనసుకి, శరీరానికి మధ్య ఒక వంతెన వేసేదే యోగా. నన్ను చూసి మరో పదిమంది యోగా నేర్చుకోడానికి ముందుకి వస్తారని ఆశిస్తున్నాను. - మంచు లక్ష్మి అసలు యోగా అంటే ఏమిటి? యోగా అన్నప్పుడు చాలా మంది శరీరాన్ని అసాధ్యమైన భంగిమల్లో తిప్పడం అని అర్థం చేసుకుంటారు. యోగా అంటే శరీరాన్ని మెలికలు తిప్పటం లేక తల్లకిందులుగా ఉంచడం కాదు. యోగా అనేది ఒక వ్యాయామ పద్ధతి కాదు. అది మనిషిని తను చేరుకోగల అత్యున్నత స్థితికి చేరేవేసే ఒక సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానం. అసలు ‘యోగా’ అంటే ‘ఐక్యం’ అని అర్థం. మీరు అన్నింటితో ఐక్యం అయితే అదే యోగా! అయితే అన్నీ ఒకటి ఎలా కాగలవు? ఈరోజు ఆధునిక విజ్ఞాన శాస్త్రం మొత్తం అస్థిత్వం కూడా ఒక్కటే శక్తి అనీ, అదే లక్షల కొద్ది మార్గాలలో వ్యక్తమవుతుంది అనీ చెబుతోంది. ప్రపంచ మతాలు కూడా ‘దేవుడు అంతటా ఉన్నాడు’ అని చెబుతున్నాయి. ఒకటే సత్యాన్ని వేరే విధంగా వ్యక్తపరిచారు. ఒక శాస్త్రవేత్త దాన్ని గణితపరంగా తెలుసుకున్నాడు. ఒక ఆధ్యాత్మిక వ్యక్తి దాన్ని నమ్ముతాడు. కానీ ఈ ఇద్దరు దాన్ని అనుభవించలేదు. ఒక యోగి ఇలా గణితపరంగా తెలుసుకోవడంతో గానీ లేదా నమ్మడంతో గానీ సంతృప్తి చెందడు. అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి అనుకుంటాడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో హఠయోగా అభ్యసిస్తున్న పద్ధతిని చూస్తే చాలా బాధ కలుగుతుంది. కేవలం భౌతిక అంశానికి మాత్రమే ప్రాముఖ్యత ఇస్తున్నారు. మీరు కేవలం ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటే ‘టెన్నిస్ ఆడండి లేదా నడవండి’ అని నేనంటాను. యోగా అనేది ఒక వ్యాయామం కాదు. దానిలో ఇతర పార్శ్వాలు ఉన్నాయి. దీనిని చాలా సున్నితంగా చేయాలి. చాలామంది సరైన యోగాని చేయకపోవడం వల్ల మానసిక సమతుల్యతను కోల్పోయారు. యోగా ప్రమాదకరమైనది కావటం వల్ల అలా జరగలేదు. కేవలం మూర్ఖత్వం వల్ల అలా జరిగింది. మూర్ఖత్వం ఎప్పుడూ ప్రమాదకరమే. మీరు దేనినైనా మూర్ఖంగా చేస్తే దాని వల్ల మీకు హాని కలుగుతుంది. హఠ యోగాని సరైన వాతావరణంలో, నమ్రతతో, మనమందరం ఒక్కటే అనే భావనతో నేర్పితే, అది మీ శరీరమనే పాత్రని దివ్యత్వాన్ని అందుకోవటానికి సిద్ధపరిచే ఒక అద్భుతమైన ప్రక్రియ అవుతుంది. హఠయోగా లోని కొన్ని పార్శ్వాలు ఇప్పుడు ప్రపంచంలో పూర్తిగా కనుమరుగైపోయాయి. నేను ఆ పార్శ్వాలను తిరిగి అందించాలనుకుంటున్నాను. ఇది చాలా శక్తివంతమైన జీవన మార్గం. ఇది ఎవరి మీదో అధికారం చలాయించే శక్తి కాదు. ఇది జీవితాన్ని తెలుసుకునే శక్తి. ప్రేమాశీస్సులతో సద్గురు రిపోర్టింగ్: భువనేశ్వరి -
మధ్యాహ్నం హత్య
మాజీ డీజీపీ పేర్వారం రాములు చెప్పిన రియల్ క్రైమ్ స్టోరీ ‘‘ఉదయం పదకొండు గంటలకు కమిషనరేట్‌లో నా ఫోన్ మోగింది. హలో అనకుండానే అవతలివైపున పాతబస్తీ ఎస్ఐ హత్యవివరాలను హడావుడిగా చెప్పడం మొదలుపెట్టాడు. బెస్ట్ కేస్ పట్టపగలు... నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ వస్త్రవ్యాపారిని కత్తులతో పొడిచి హత్య చేశారు. పాతబస్తీలో నాలుగు రాళ్లు రువ్వుకుంటేనే గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. అలాంటిది హత్య. వస్త్రవ్యాపారి హత్య అంటే ఆశ్చర్యపోవాల్సిన విషయమే. వాళ్లకి పెద్దగా శత్రువులుండే అవకాశం ఉండదు. ఉన్నా... ఇలా రోడ్డుపై తెగబడాల్సిన పనిలేదు. ఎవరో మతతత్వశక్తులు ఇలాంటిపనికి పూనుకున్నారేమోనని నా కింది ఆఫీసర్లు వారి ఊహల్ని వినిపిస్తున్నారు. సెన్సిటివ్ కేసు. ఎలాంటి అల్లర్లకు అవకాశం లేకుండా దర్యాప్తు జరగాలి. మరు నిమిషమే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారి దగ్గర నుంచి ఫోన్. ‘ఏమయ్యా... మన నగరంలో అసలు పోలీసులున్నారా? పట్టపగలు రోడ్డుపైన హత్య చేస్తుంటే ఏంచేస్తున్నట్టు? రేపు సాయంత్రంలోగా హంతకుడ్ని పట్టుకోవాలి’ అంటూ ఆర్డరు. వెంటనే నేను నాలుగు టీమ్‌లను సిద్దం చేసుకుని ముందుగా సంఘటనా స్థలానికి వెళ్లాం. అప్పటికే వ్యాపారి చనిపోయాడు. ఉదయం 10:30 గంటలకు... ఆ రోజు పాతబస్తీ యథావిధిగా తెల్లవారింది. ఓ వస్త్రవ్యాపారి బేగంపేటలోని తన దుకాణానికి స్కూటర్‌పై బయలుదేరాడు. పురానాపూల్ బ్రిడ్జ్ ఎక్కాడు. బ్రిడ్జ్ కదా... బండి స్లోగా వెళుతోంది. ఇంతలో ఇద్దరు కుర్రాళ్లు ఓ బండిపై వచ్చి వ్యాపారి బండిని ఢీకొట్టారు. ఉన్నపళంగా కిందపడ్డ వ్యాపారి ‘కళ్లు కనపడడం లేదా...’ అంటూ అరవబోతుండగానే అందులో బాగా బలీయంగా ఉన్న వ్యక్తి చొక్కాలోనుంచి చాకు తీసి వ్యాపారి పొట్టలో నాలుగైదు పోట్లు పొడిచాడు. వాహనదారులంతా ఆ దృశ్యాన్ని చూస్తూ ఉండిపోయారు. ఒక్కరు కూడా ముందుకొచ్చి హంతకుల్ని పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఎవరో పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి విషయం చెప్పారు. మావాళ్లు వెళ్లేసరికి కొన ఊపిరితో ఉన్నాడు వ్యాపారి. దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. మార్గమధ్యంలోనే చనిపోయాడు. మృతుడి చొక్కాజేబులో ఉన్న వివరాల సాయంతో పాతబస్తీలో అతనున్న ఇంటికి చేరుకుంది మా టీమ్. 11:30 గంటలకు... చనిపోయిన వ్యాపారి మధ్యవయస్కుడు. భార్య, ఇద్దరు ప్లిలలు, తల్లి, తమ్ముడు ఉన్నారు. మధ్యతరగతి కుటుంబం. అందరూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. హతుడికి ఎవరైనా శత్రువులున్నారేమోనని ఆరా తీస్తే... అలాంటివారెవరూ లేరని తెలిసింది. ఆస్తితగాదాలు కూడా లేవు. దుకాణం చుట్టుపక్కల ఎంక్వైరీ చేశాం. తోటి వ్యాపారులతో, కస్టమర్లతో కలుపుగోలుగా ఉండేవాడని చెప్పారు. ఇంటి దగ్గర పరిస్థితి చూస్తే... ‘చీమకు కూడా హాని తలపెట్టని నా బిడ్డను చంపే అవసరం ఎవరికుంటుంది సార్...’ అంటూ అతని తల్లి పోలీసుల చొక్కాపట్టుకుని రోదించింది. భార్య సంగతీ అంతే. తనతో భర్త ఎలాంటి విషయాలు చెప్పలేదంది. రెండురోజులుగా కొద్దిగా ఆందోళనగా ఉన్నట్టు చెప్పిందంతే. పోనీ ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు అక్కడ ఎవరితోనైనా గొడవపడేవాడా? గత మూడునాలుగేళ్లలో పాతబస్తీ వదిలి ఎక్కడికీ వెళ్లలేదు. నేను మరో రెండు టీమ్‌లను నా దగ్గర పెట్టుకుని ఫోన్‌కాల్ కోసం వెయిట్ చేస్తున్నాను. హతుడి ఇంటి దగ్గరున్న టీమ్ నుంచి కాల్ వచ్చింది. ‘ఎలాంటి క్లూ దొరకడం లేదు సార్... వచ్చేయమంటారా’ అని. ‘మీరు ఇల్లంతా మరోసారి వెదకండి. చిన్న కాగితం ముక్క కూడా వదలకండి. అక్కడగానీ క్లూ దొరకకపోతే... ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేం’ అని చెప్పాను. నా దృష్టిలో హత్యజరిగిన ఫస్ట్ అవర్ చాలా కీలకమైంది. ఆ సమయంలోనే చాలావరకూ విషయం తెలిసిపోవాలి. లేదంటే... సమయం చేతిలో మేం కీలుబొమ్మలం కావాల్సిందే. 12:00 గంటలకు... ఓ అరగంట తర్వాత ఫోన్ మోగింది. ‘గోడపైన క్యాలెండర్లో మూడు తేదీలు పెన్నుతో రౌండప్ చేసి ఉన్నాయి సార్... దానికి ముందు నెలలో కూడా అవే తేదీల్లో అలాగే రౌండప్ చేసి ఉంది. తేదీలకింద ఒకే రకమైన బండి నంబర్ నోట్ చేసి ఉంది’ అని చెప్పాడు ఎస్ఐ. నాకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. కేసు కీలక మలుపు తిరిగిందనుకున్నాను. వెంటనే నేను మరో టీమ్‌కి ఆ బండి నంబర్ ఇచ్చి ఆర్టీఏ ఆఫీసుకి పంపించాను. 1:00 గంటకు... ఆ బండికలవాడి అడ్రసు పట్టుకున్నారు మా వాళ్లు. ఆ వస్త్రవ్యాపారి ఉన్న ప్రాంతంలోనే కొద్దిదూరంలో అతని అడ్రసు. ఇంటికెళితే అతను లేడు. తల్లి ఉంది. ‘అబ్బా... ఏం సతాయిస్తరు. మీకు రోజు మామూలు ఇవ్వాలా నా బిడ్డ’ అంటూ పోలీసుల్ని తిట్టడం మొదలుపెట్టింది. ఆ సందులో నలుగురితో మాట్లాడితే ఆ బండికలవాడు కిరాయి హంతకుడని, లోకల్ పోలీసులకు లంచం ఇచ్చుకుంటూ బతికేస్తాడని చెప్పారు. అప్పటికే అతనిపై బోలెడన్ని కేసులున్నాయి. బెయిల్‌పై బయటికి వచ్చినపుడు ఇలాంటి పనులకు పాల్పడుతుంటాడు. పోలీసులు గద్దించి అడగడంతో తన చెల్లెలు ఇంటిదగ్గర ఉన్నట్లు చెప్పింది. 2:00 గంటలకు... బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12 దగ్గర మహ్మదీయలైన్స్ స్లమ్ ఏరియా. అన్నీ చిన్న చిన్న ఇళ్లు. మావాళ్లు సివిల్‌డ్రెస్‌లో హంతకుడి స్నేహితుల్ని వెంటబెట్టుకుని వెళ్లారు. తలుపు తట్టారు. ఎవరూ పలకలేదు. ఒక్కసారిగా లోపలికి చొరబడ్డారు. హంతకుడు బాత్రూమ్లో చేతులూ కాళ్లు కడుక్కుంటున్నాడు. అతని చేతుల రక్తపు మరకలు ఇంకా వదల్లేదు. ‘రెడ్ హ్యాండెడ్’గా పట్టుకోవడం అంటారు కదా! అంటే ఎర్రటిరక్తపు చేతుల్ని పట్టుకోవడం అన్నమాట. అదే జరిగింది ఇక్కడ. వెంటనే అతని చేతికున్న బ్లడ్ శాంపిల్స్‌ని తీసుకున్నారు. వ్యాపారి రక్తంతో మ్యాచ్ అయ్యింది. అతని చేతులకు బేడీలు వేశాక హంతకుడన్న మాటలు మా టీమ్ ఎప్పటికీ మరచిపోలేదు. ‘మీరు పోలీసులా, సైతాన్‌లా... మీకెలా తెలిసింది నేనే చంపానని. పోలీసులకు దొరికిపోతానని తెలుసు. కానీ ఇలా రక్తపు చేతుల్తో పట్టుపడతానని ఊహించలేదు’. ఉదయం పదిన్నరకు హత్య జరిగితే మధ్యాహ్నం రెండున్నరకు హంతుకుడ్ని పట్టుకున్నాం. చనిపోయిన వ్యక్తికి ఎలాంటి శత్రువర్గం కానీ, హంతకుల జాడ కనిపెట్టగలిగే ఆధారం కానీ లేని పరిస్థితుల్లో గంటల్లో కేసుని చేధించినందుకు డిపార్టుమెంటు తరఫు నుంచే కాకుండా ప్రభుత్వ అధికారుల దగ్గర నుంచి కూడా మంచి ప్రశంసలు అందాయి. ఎందుకు చంపినట్టు? ఇంతకీ హత్య వెనక ఎవరున్నారని అడిగిన వెంటనే చెప్పలేదు. మాదైన పద్ధతిలో ఇంటరాగేషన్ చేశాక చెప్పాడు. వ్యాపారి తమ్ముడే హత్య సూత్రధారి. హంతకుడు దొరికిన విషయం చెప్పకుండా వ్యాపారి ఇంటికి వెళ్లారు మావాళ్లు. తల్లిపక్కన కూర్చుని ఏడుస్తున్నాడు ఆ తమ్ముడు. చిన్న పని అని చెప్పి స్టేషన్‌కి తీసుకొచ్చి విచారిస్తే అసలు విషయం బయటపెట్టాడు. ‘‘మా అన్నయ్య పిసినారి సార్... బైక్ కావాలని నాలుగేళ్ల నుంచి బతిమిలాడుతున్నాను. స్నేహితులతో సరదాగా గడిపితే ఇష్టపడడు. డబ్బుల విషయంలో నరకం చూపిస్తున్నాడు. అందుకే మా పక్కవీధి కిరాయి రౌడీతో పదివేలకు డీల్ కుదుర్చుకున్నాను’’. హత్యచేసినవాడికి, చేయించినవాడికి ఇద్దరికీ జీవితఖైదు శిక్ష పడింది. క్యాలెండర్‌పై వ్యాపారి రౌండప్ చేసుకున్న మూడు తేదీలు బాగా ఉపయోగపడ్డాయి. ఆయా రోజుల్లో ఆ బండి తనను వెంబడించిందని అర్థం కావొచ్చు. పాపం అమాయకుడు ఎవరితో చెప్పకుండా క్యాలెండర్‌పై నోట్ చేసుకుని ఊరుకున్నాడు. మొత్తానికి ఒక్కరోజులో హంతకుడి చేతులకు బేడీలు వేసినందుకు నేనూ... మా టీమ్ ఊపిరి పీల్చుకున్నాం. రిపోర్టింగ్: భువనేశ్వరి -
దారితోచని సూత్రధారులు
STAR - రిపోర్టర్ సాయిరామ్ శంకర్ సంక్రాంతి వేళ పల్లెవాకిట తిష్టవేసిన ధాన్యరాశులు పురవీధుల్లో వెతికినా కనిపించవు. కల్లాపి చల్లిన లోగిళ్లు, వాటిల్లో ముత్యాల ముగ్గులు, అందులో కొలువుదీరే గొబ్బిళ్లు సిటీలో ఎక్కడో గానీ కానరావు. పట్నంలో సంక్రాంతి శోభను వినువీధిలో గాలిపటాలు తెలిపితే..! రాజధాని వీధివీధిలో తెలియజేసేది డూడూ బసవన్నలను తోడ్కొని వచ్చే డుం డుం గంగిరెద్దు దాసరులే!! అయ్యగారికి దండం పెట్టు అంటూ సిటీవాసులకు రోజంతా వంద వందనాలు అందించినా వారికి వంద రూపాయలైనా గిట్టుబాటు కావు. బసవడితో సమానంగా తకిట తందనాలాడినా.. వచ్చేది ఓ పాత పంచ మాత్రమే. చాలీచాలని సంపాదనతో దారితెన్నూ లేకుండా సాగుతున్న ఈ సూత్రధారులను సాక్షి సిటీప్లస్ తరఫున సాయిరామ్ శంకర్ స్టార్ రిపోర్టర్‌గా పలకరించారు. సాయిరామ్ శంకర్: బసవన్నలు ఇళ్లముందుకు వచ్చి తలాడిస్తేనే సంక్రాంతి పండుగ సందడి మొదలవుతుంది. సాక్షి స్టార్ రిపోర్టర్‌గా ఈ రోజు నేను బసవన్నలుండే ప్రదేశానికి వచ్చినందుకు హ్యాపీగా ఉంది. ఎలా ఉన్నారు? ఎల్లయ్య: బాగనే ఉన్నం సార్. పండగకదా! ఈ నాలుగు రోజులు మంచిగనే ఉంటది. శీను: సంక్రాంతి పండుగ కదా సార్. మా బసవన్నల రోజులు. సాయిరామ్ శంకర్: ఏ ఊరు నుంచి వచ్చారు ఎల్లయ్య? ఎల్లయ్య: మా అందరిదీ మెదక్ జిల్లా మద్దూరు సార్. పండగ రోజులల్ల సిటీకొస్తం. సాయిరామ్ శంకర్: ఇక్కడ ఎన్నిరోజులుంటారు? ఎంకయ్య: నెల రోజులుంటం. సాయిరామ్ శంకర్: ఆ తర్వాత? ఎంకయ్య: మళ్లీ మా ఊరికి పోతం. సాయిరామ్ శంకర్: ఊళ్లో ఏం చేస్తుంటారు? ఎల్లయ్య: ఏం చేస్తం సార్. ఇదే పని. బసవన్నను ఎంట బెట్టుకుని బిచ్చమెత్తుకుంటం. సాయిరామ్ శంకర్: అలాగా, మీరు ఎలా చెబితే గంగిరెద్దులు అలా చేస్తుంటాయి. దండం పెట్టడం నుంచి ఆడటం వరకూ ట్రైనింగ్ మీరే ఇస్తారా..? ఎంకయ్య: మేమేడిత్తం సార్. దాని కోసం గుంటూరుల, తిరుపతిల మాకు గురువులు ఉన్నరు వాళ్ల కాడికి పంపుతం. ఆళ్లే నేర్పిస్తరు. సాయిరామ్ శంకర్: అవునా.. ఈ శిక్షణకు ఎన్ని రోజులు పడుతుంది, ఎంత ఖర్చవుతుంది? ఎంకయ్య: పదిహేను వేల వరకు కట్టాలి సార్. ఏడాది నేర్పిస్తరు. సాయిరామ్ శంకర్: వన్ ఇయరా.. అన్నీ ఫర్ఫెక్ట్గా వచ్చేస్తాయా? ఎల్లయ్య: అన్నీ ఒక తీరుంటాయా సార్. మన పిల్లగాళ్లను స్కూల్‌కు పంపిస్తున్నం. అందరికీ ఒక్క తీరుగ చదువొస్తదా? గిదీ అంతే. సాయిరామ్ శంకర్: నిజమే! నీ బసవన్నపేరు ఏంటి ఎల్లయ్య? ఎల్లయ్య: రాముడు. సాయిరామ్ శంకర్: మరి లక్ష్మణుడు, ఆంజనేయుడు? ఎంకయ్య: నా బసవన్న పేరు లక్ష్మణుడు. సాయిలు: మావోడు ఆంజనేయుడు. సాయిరామ్ శంకర్: పేర్లు బాగున్నాయి. ఏదీ ఓసారి రాముడి పనితనం చూపించు? ఎల్లయ్య: రాముడు.. రాముడు.. చూడు మనకాడికి ఎవరొచ్చిండ్రో.. సినిమాలా దొరొచ్చిండు. ఒక్కపారి అయ్యగారికి దణ్ణం పెట్టు.. దొర సంతోషపడ్తడు. సాయిరామ్ శంకర్: వావ్.. భలేగా పెట్టిందే! ఎల్లయ్య: మా రాముడు బతుకమ్మ ఆడినట్టు ఇంకెవ్వడు ఆడలేడు సార్. సాయిరామ్ శంకర్: అవునా.. గుడ్. మీరు పాడే పాటలు ఎవరి దగ్గర నేర్చుకుంటారు ? అంకయ్య: నేర్చుకునేదేం లేదు సార్. తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి ఆ పాటలు. సాయిరామ్ శంకర్: మరి బసవన్నల ద్వారా ఆదాయం, వాటిపై అయ్యే ఖర్చు గురించి చెప్పండి? సాయిలు: పండుగలప్పుడు బాగానే ఉంటది. మామూలు దినాలల్ల తిండికి కూడా తిప్పలే. మా కడుపు కాలుతున్నా.. బసవన్న పొట్ట మాత్రం మాడ్చలేం సార్. ఇంట్ల అందరూ పస్తు పడుకున్నా.. మా దేవుడికి బువ్వ పెట్టని రోజుండదు. పొద్దుగాళ్ల పిండి పెడ్తం. గడ్డి మామూలే. నెలకు వెయ్యి నుంచి పదిహేనొందల రూపాయలు అయితయి. సాయిరామ్ శంకర్: మీ ఆడవాళ్ల గురించి చెప్పలేదు. ఏమ్మా.. మాట్లాడండి. దుర్గమ్మ: ఏముంది సార్. మగోళ్లు బసవన్నను ఎంటబెట్టుకుని పోతే.. ఊర్లళ్ల ఉన్నప్పుడు పొలం పనికి పోతం. ఈడికొచ్చినప్పుడు అడుక్కోనికి పోతం. సాయిరామ్ శంకర్: మీలో ఆడపిల్లలకు చాలా చిన్న వయసులో పెళ్లిళ్లు చేస్తారట నిజమేనా? సాయమ్మ: ఒకప్పుడు చేసేటోళ్లు సార్. ఆడపిల్ల పుట్టిన 21 దినాలకే.. పెళ్లి ముచ్చట తెద్దురు. ఇప్పుడు అందరం పిల్లల్ని చదివించుకుంటున్నాం. ఎల్లయ్య: మేమంటే నాలుగు మాటలు పడి బతికినం సార్. మా పిల్లలకు ఇసొంటి బతుకొద్దు. అందుకే ఎంత కష్టమైనా పిల్లల్ని చదివిస్తున్నం. సాయిరామ్ శంకర్: మరి ఇక్కడ చాలామంది పిల్లలు ఆవులతో కనిపిస్తున్నారు? అంకయ్య: అందరి పరిస్థితి ఒక్కతీరుగ ఉంటదా సార్! సాయిరామ్ శంకర్: మీ ఊరిలో కనీసం ఇళ్లయినా ఉన్నాయా? భాషా: ఒక్కరికి కూడా సొంతిల్లు లేదు సార్. ఇక్కడ ఎట్లనైతే గుడిసెళ్లో ఉంటున్నమో.. ఊళ్లో కూడా అంతే. సాయిరామ్ శంకర్: పట్నం బసవన్నకు పల్లెటూరు బసవన్నకు తేడా ఏంటి ? శీను: పల్లెల్లో బసవన్నంటే దేవుడి లెక్క సార్. ఇంటిల్లిపాది వచ్చి దండం పెడ్తరు. ధాన్యం పెడ్తరు. వాడికి పంచ కప్పి, మాకు పైసలు ఇచ్చేటోళ్లు. పట్నంల ఆ మర్యాద లేద్సార్. అయితే పది రూపాయలు పడేస్తున్నరు. లేదంటే వెళ్లండి అనేస్తరు. సాయిరామ్ శంకర్: అంతేలే సిటీవాసులు సాటి మనుషుల మీదే అభిమానం చూపడం లేదు. అది సరే, ఏది నాలుగు పాటలు పాడి బసవన్నలతో నాట్యం చేయించండి. ఎల్లయ్య: రాముడు...లక్ష్మణా... ఆంజనేయులు రండ్రి బతుకమ్మ ఆడండి.... అంటూ పాటందుకున్నారు. బసవన్నలు కొమ్ములూపుతూ అడుగులు వేస్తూ నాట్యం చేశాయి. సాయిరామ్ శంకర్: థ్యాంక్యూ. మీకు, మీ బసవన్నలకు హ్యాపీ సంక్రాంతి. బై.. సాయిరామ్ శంకర్: వీటికీ మీకూ అనుబంధం ఎక్కువనుకుంటా..! ఎల్లయ్య: చానా సార్. బిడ్డలెక్కనే.. ఒక్కోసారి అవే మా యజమానుల్లా కనిపిస్తయి. వాటికేమైనా దెబ్బ తగిలినా, పాణం బాగోకపోయినా ఇంట్ల ఎవ్వరం బువ్వ ముట్టం. బసవన్న కాలం చేస్తే.. ఈడికెళ్లి ట్రాక్టరో, డీసీఎంనో మాట్లాడుకుని ఊరికి తీస్కవోయి బొందపెట్టి బంధువులందరికీ భోజనాలు పెట్టుకుంటం. శీను: గవ్వన్ని ఎందుకంటే.. అవికూడా మాలో ఒక్కటే. బసవన్న పలికినట్టు మా బిడ్డ కూడా పలకడు సార్. సాయిరామ్ శంకర్: బిడ్డకంటే గొడ్డు నయం అంటే ఇదే కాబోలు (నవ్వుతూ...). గ్రేట్... మీ అనుబంధం వింటుంటే కడుపు నిండిపోతుంది. ప్రజెంటేషన్: భువనేశ్వరి ఫొటోలు: ఎన్.రాజేష్‌రెడ్డి -
మీ శ్రేయోభిలాషి
ఒక్క క్షణంలో కలిగే నమ్మకం జీవితాన్ని ఉన్నత శిఖరాల వైపు నడిపిస్తుంది. ఒక బలహీన క్షణంలో కలిగే అపనమ్మకం జీవితాన్ని బలవన్మరణం వైపు నడిపిస్తుంది. చావే పరిష్కారం అని ఆత్మహత్యకు యత్నించిన వారిలో చాలామందికి మృత్యువును చేరే దారిలో ఆ చావు ఎంత దుర్భరమో తెలుస్తుంది. బతకాలనే కోరికా పుడుతుంది. ఆఖరి క్షణం వరకూ ఆదుకునే చేయి అందకపోతుందా అని ఎదురుచూస్తుంటారు. అలాంటి క్షణాల్లో మేమున్నాం అంటూ వస్తున్నారు సాగర్ లేక్ వ్యూ పోలీసులు. కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వారిని ఆదుకోవడమే కాదు.. వారికి బతుకుపై భరోసా కూడా కల్పిస్తున్నారు. - భువనేశ్వరి పోరాడుతాం.. గత నెల 29న కొత్తగా పెళ్లయిన ఓ జంట ఆత్మహత్య చేసుకోవడానికి సాగర్‌కు వచ్చింది. ఎవరూ లేని ప్రదేశానికి వెళ్లి ఇద్దరూ నీళ్లలో దూకేశారు. వీరిని గమనించిన లేక్ వ్యూ పోలీసులు వెంటనే రెస్పాండయ్యారు. ఇద్దరినీ కాపాడారు. రమేష్, భానుప్రియ కులాంతర వివాహం చేసుకున్నారు. ఇంట్లో వాళ్లకు దూరంగా భద్రాచలం వెళ్లి ఉద్యోగం చేసుకుని బతుకుతున్నా పెద్దల పెత్తనం వీరిని వదిలిపెట్టలేదు. కలసి జీవించలేమనుకున్న ఈ జంట కలసి చనిపోవాలని నిర్ణయించుకుంది. అయితే లేక్ వ్యూ పోలీసుల పుణ్యాన వీరిద్దరూ బతికి బట్టకట్టారు. ‘పోలీసులు రక్షించిన తర్వాత చావలేకపోయామే అని బాధపడ్డాను. కానీ వారు కౌన్సెలింగ్ చేసిన తర్వాత మా ఆలోచన తీరులో మార్పు వచ్చింది. ఆత్మహత్య కంటే హీనమైన పని మరొకటి లేదని అర్థమైంది. మా సమస్యలపై పోరాటం చేస్తూ నిజమైన ప్రేమికుల్లా జీవిస్తున్నాం ఇప్పుడు’ అంటున్న రమేష్ మాటల్లో ధైర్యం, భానుప్రియ ముఖంలో ఆనందం కనిపించాయి. అవగాహన పెంచేందుకు... హుస్సేన్‌సాగర్ ఆత్మహత్యలకు నెలవుగా మారిపోయింది. వారిని రక్షించడంతో పాటు, ఇలాంటి పనులు మళ్లీ చేయకుండా అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా మాదే అని భావించి ఇలాంటి సదస్సులు నిర్వహిస్తున్నాం. వీరిని రక్షించడంలో భాగంగా మా పోలీసులు కూడా గాయాలపాలైన సందర్భాలున్నాయి. ఆత్మహత్య నేరమనే విషయాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేస్తూ.. వాటి నివారణకు కావాల్సిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. - జానకమ్మ, లేక్ వ్యూ పోలీస్ ఇన్స్పెక్టర్ బతుకుపై భరోసా కోల్పోయిన వారికి ఎనీ టైం సూసైడ్ స్పాట్.. హుస్సేన్‌సాగర్. నగరం నడిబొడ్డున ఉన్న ఈ తటాకం లవ్ ఫెయిల్యూర్స్‌కు, చితికిపోయిన బతుకులకూ ప్రాణాలు తీసుకునే కాసారంగా మారింది. అర్ధాంతరంగా ప్రాణాలు వదులుకోవడానికి వచ్చిన వారి ప్రయత్నాన్ని అడ్డుకుని ఆయుష్షుపోస్తున్నారు సాగర్ లేక్‌వ్యూ పోలీసులు. ఇందు కోసం సాగర్ చుట్టూ 40 మంది లేక్ వ్యూ పోలీసులు పహారా కాస్తుంటారు. ఈ ఒక్క ఏడాదే 85 మందిని రక్షించారు. వీరందరినీ పిలిచి ట్యాంక్‌బండ్ ప్రాంతంలోనే ఒక బోట్లో అవగాహన సదుస్సు నిర్వహించారు. ఇప్పుడు హ్యాపీ.. ఎంబీఏ ఫైనాన్స్ చేసిన స్వర్ణలతది మరో కథ. ఉన్నతంగా చదువుకున్నా.. అల్పంగా ఆలోచించి చనిపోవాలని సాగర్ తీరానికి వచ్చింది. చదువు, ఉద్యోగం తప్ప మరో మాట ఎత్తకూడదన్న తల్లిదండ్రుల ఆజ్ఞకు చావుతో సమాధానం చెప్పాలనుకుంది స్వర్ణలత. ఈ ఏడాది మే 19న సాగర్‌లో దూకింది. వెంటనే పోలీసులు రక్షించారు. ఆమె కష్టాన్ని విన్నారు. ఎలా బతకాలో చెప్పారు. ‘నాకు సామాజిక విషయాలపై ఆసక్తి ఎక్కువ. పది మందికి సాయం చేయాలనుకునే తత్వం. ఉద్యోగం కేవలం నా కోసమే కాదని అనుకునేదాన్ని. నా కన్నవారే నా ఆలోచనను వ్యతిరేకించడంతో భరించలేకపోయాను. కౌన్సెలింగ్ తర్వాత నా ఆలోచన ధోరణిలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నాను’ అని వివరించింది స్వర్ణలత. పట్టుదల పెరిగింది.. అత్తింటి వేధింపులు భరించలేక చావు తలుపు తట్టిన ఎందరో మహిళల్లో ముషీరాబాద్‌కు చెందిన భవాని ఒకరు. అనుక్షణం అనుమానించే తాగుబోతు భర్త, ఆడపిల్ల పుట్టిందని తన కొడుక్కు విడాకులు ఇవ్వాలన్న అత్త.. ఈ సమస్యలు భవానీకి చావే మార్గం అనుకునేలా చేశాయి. విడాకులు ఇవ్వకుంటే తనను, బిడ్డనూ చంపేస్తానని భర్త బెదిరించడంతో.. బిడ్డను తన తల్లిదండ్రులకు అప్పగించి చనిపోవాలని అనుకుంది. ‘గత నెల 26న సాగర్‌కు వచ్చి నీళ్లలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాను. కానీ పోలీసులు చూసి నన్ను రక్షించారు. ప్రాణాలు దక్కాయి కానీ నా సమస్య మాత్రం అలాగే ఉంది’ అంటూ వాపోయింది భవాని. అయితే కౌన్సెలింగ్ తర్వాత బతికి సాధించాలనే పట్టుదల కలిగిందని చెబుతోంది. మరెందరిలోనో.. ప్రభుత్వం ఇచ్చిన స్థలం కబ్జాపాలై, అధికారులతో మొరపెట్టుకున్నా లాభం లేకపోవడంతో మెదక్ జిల్లాకు చెందిన షేక్ మహబూబ్, తోటి మహిళకు పూచీకత్తు ఇచ్చి.. అప్పులు మెడకు చుట్టుకుని పాలుపోక జీవకళ, బస్తీ లీడర్ వేధింపులు భరించలేక.. ఇంట్లో వారితో చెప్పుకోలేక అనిత.. వీరంతా సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుందామనుకున్న వాళ్లే. వీరందరినీ రక్షించిన లేక్ వ్యూ పోలీసులు.. వారికి పునర్జన్మ ప్రసాదించారు. కౌన్సెలింగ్ నిర్వహించి బతుకు పోరులో ముందుకు సాగే విశ్వాసాన్ని ఇచ్చారు. -
సర్ప్రైజ్ బ్యాగ్
తన గారాలపట్టి అన్నప్రాశనను అందరికీ గుర్తుండిపోయేలా చేయాలనే ఓ తల్లి ఆలోచన నయా ట్రెండ్‌గా సెట్ అయింది. ఆ రోజు ఇంటికొచ్చిన బంధువులకు రిటర్న్ గిఫ్ట్‌లు ఇచ్చింది. గిఫ్ట్‌ల సంగతి ఎలా ఉన్నా.. బహుమతులు ఉంచిన బ్యాగులపైనే అందరి దృష్టి పడింది. కొంగొత్తగా ఉన్న ఆ బ్యాగులను చూసిన అందరి ముఖాల్లో ఆశ్చర్యాన్ని చూసి.. అంతకు పదిరెట్ల ఆనందాన్ని పొందింది ఆ తల్లి. తాను పొందిన అనుభూతినే అందరు తల్లులకు అందించాలనుకుంది. అప్పటికే పేపర్ బ్యాగుల తయారీలో ఉన్న ఆ వనిత.. డిఫరెంట్ థీమ్స్‌తో కస్టమైజ్డ్ బ్యాగుల తయారీకి శ్రీకారం చుట్టింది. - భువనేశ్వరి బర్త్ డే ఇన్విటేషన్ కార్డుపై మీ బుజ్జాయి ఫొటోను చూసి ముచ్చటపడి సరిపెట్టుకునే పేరెంట్స్‌కు సరికొత్త ఆనందాన్ని పంచుతున్నారు వసంత చిగురుపాటి. మీ చిట్టి పాపాయి పుట్టిన రోజు వేడుకకు గుర్తుగా ఇచ్చే బహుమతుల బ్యాగులపై కూడా ఆ బంగారు తల్లి ఫొటోను చూసి మురిసి పోయేలా చేస్తున్నారామె. పిల్లలపై ఉన్న ప్రేమను, మీ దర్పాన్ని ప్రతిబింబించే విధంగా నయా బ్యాగులు డిజైన్ చేస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగం చేసి వచ్చిన వసంత ఇక్కడ నయా కాన్సెప్ట్‌తో సక్సెస్ఫుల్ రిజల్ట్స్ సాధిస్తున్నారు. న్యూ థీమ్.. బర్త్‌డే పార్టీ థీమ్‌ను బట్టి బ్యాగుల రంగు, డిజైన్ ఉంటుంది. థీమ్ ఏంటి? డిజైన్ ఏంటి అని కన్ఫ్యూజ్ కాకండి. ఈవెంట్ మేనేజర్లు బర్తెడే పార్టీలను ఒక థీమ్ ప్రకారం డిజైన్ చేస్తున్నారు. వేడుక కోసం ఉపయోగించే పూలు, బెలూన్లు.. వాటి రంగులు ఇతర అలంకరణ.. అంతా ఒక కాన్సెప్ట్ ప్రకారం చేస్తారు. అందుకు సూటయ్యే డిజైన్‌నే బ్యాగుపై ముద్రించడం వసంత ప్రత్యేకత. అబ్బాయి బర్త్ డే డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేలానో.. బొమ్మలతో కలిసున్న ఫొటోనో బ్యాగ్‌పై వేసి టాక్ ఆఫ్ ది ఈవెంట్‌గా తీర్చిదిద్దుతున్నారు. ప్రమోషన్ అదుర్స్.. ‘నేను మొదలుపెట్టింది మామూలు బ్యాగుల కంపెనీనే. మా పాప పుట్టాక తన కోసం పర్సనలైజ్డ్ బ్యాగులను తయారు చేశాను. పాప ఫొటో, నాకు నచ్చిన కొటేషన్‌తో అందమైన డిజైన్‌తో బ్యాగ్ తయారు చేశాను. మా చిట్టితల్లి అన్నప్రాశన రోజు రిటర్న్ గిఫ్ట్స్ ఆ బ్యాగుల్లో పెట్టి ఇచ్చాను. వచ్చినవారంతా ఆ గిఫ్ట్‌ని పక్కనపెట్టి బ్యాగ్ గురించే మాట్లాడుకున్నారు. వారి వారి ఇళ్లల్లో పిల్లల వేడుకలకు అలాంటి బ్యాగులు కావాలని ఆర్డర్ చేశారు. అందరూ నాలాంటి తల్లులే.. బిడ్డ ఆనందం కోసం ఇలాంటివి చేయడానికి అసలు వెనుకాడరు. అదే నా బ్యాగుల ప్రమోషన్‌కు సహకరించింది’ అని చెప్పారు వసంత చిగురుపాటి. కామిక్ బ్యాగ్స్.. ముంబైలోని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఉద్యోగం చేసిన వసంత తర్వాత యూకేలోని విప్రో కంపెనీలో కూడా కొంతకాలం పని చేసి ఇండియాకు వచ్చేశారు. పెళ్లయిన తర్వాత ఏదైనా కొత్త కాన్సెప్ట్‌తో వ్యాపారం చేయాలని భావించారామె. భర్త వంశీ కూడా వసంత ఆలోచనకు ఓటేయడంతో ప్లాస్టిక్ రహిత ఇండియా నినాదానికి పునాదిగా 2010లో పేపర్ బ్యాగుల కంపెనీని స్థాపించారు. రెండేళ్ల కిందట బిజినెస్ ట్రెండ్ మార్చేశారు. ‘ఈ బ్యాగుల తయారీకి ఆర్డర్లు వచ్చిన కొత్తలో చాలా వరకూ బర్త్‌డే పిల్లల ఇష్టానికి అనుగుణంగా డిజైన్లు చేశాను. వారి ఫొటోలతో పాటు టెడ్డిబేర్లు, బెన్‌టెన్ బొమ్మలు.. వారు చూసే కార్టూన్ చానెల్స్ కనుక్కొని అందులోని క్యారెక్టర్లను వారి ఫొటో పక్కన ఉండేలా ప్రింట్ చేశాను. ఈ మధ్య ధనికుల ఇళ్లలో బర్త్‌డేలకు కస్టమైజ్డ్ కేకులను తయారు చేయించుకుంటున్నారు. ఆ కేక్ నేపథ్యాన్ని బట్టే మా బ్యాగులు డిజైన్ ఉంటుందన్నమాట’ అని వివరించారు వసంత. సిటీలోనే కాదు విదేశాల్లో జరిగే ఈవెంట్లకూ ఈ బ్యాగులను పంపిస్తున్నారు. నేను సైతం.... వైజాగ్ హుద్‌హుద్ బాధితుల కోసం నిర్వహించిన ‘మేము సైతం’ కార్యక్రమం గురించి తెలుసు కదా! దాని కోసం వసంత తయారు చేసిన బ్యాగులు ఫుల్ పాపులర్ అయ్యాయి. టాలీవుడ్‌లోని ప్రముఖ నటుల ఫొటోలతో తయారు చేసిన బ్యాగులు ‘మేము సైతం’ కార్యక్రమం ప్రచారానికి బాగా ఉపయోగపడింది కూడా. టాప్ కంపెనీల నుంచి కూడా ఆర్డర్లు కూడా సంపాదిస్తున్నారు. కెనాన్, కోకాకోలా ఇండియా, సోనీ, హ్యుందయ్ మోటర్స్, ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్.. వంటి ప్రముఖ కంపెనీలకు వసంత కస్టమైజ్డ్ బ్యాగులు తయారు చేసి ఇస్తున్నారు. ఫేస్బుక్ ద్వారా బిజినెస్ రేంజ్ పెంచుకుంటూ ఆన్లైన్లో దూసుకుపోతున్నారు. మరిన్ని ప్రాంతాల్లో విస్తరించడానికి సరికొత్త ప్రణాళికలు రూపొందిస్తున్నారు. -
అలా సెట్ అయింది
మర్యాదరామన్న సినిమా గుర్తుందా.. ? ప్రాణరక్షణ కోసం అందులో హీరో గడప దాటని ఇల్లు గుర్తొచ్చిందా..! రాయలసీమ ఠీవి అణువణువూ కనిపించే ఆ ఇల్లు ఒక్క మర్యాదరామన్న సినిమాలోనే కాదు.. ఆపై ఎన్నో సినిమాల్లో మరెన్నో యాంగిల్స్‌లో కనిపించింది. మర్యాదరామన్న స్టోరీలైన్లా.. ఆ ఇంటి సెట్ వేసి ఏళ్లవుతున్నా.. సినీజనాలు నిత్యం ఆ గడప తొక్కుతూనే ఉన్నారు. మర్యాదగా షూటింగ్ చేసుకుంటున్నారు. పావు ఎకరం లోగిలిలో నిండుగా కనిపిస్తూ పల్లె వాతావరణాన్ని గుర్తుతెచ్చే విధంగా నిర్మించిన ఆ సెట్‌కు పేటెంట్ సంపాదించి అందరి మన్ననలు పొందారు ఆర్ట్ డెరైక్టర్ ఎస్.రవీంద్రారెడ్డి. సెట్ ఏమిటి..? పేటెంట్ ఏమిటి..? అని ఆశ్చర్యపోతున్నారా..! కొత్తరకం కెమికల్స్ వాడి చెక్కు చెదరని ఇంటి సెట్ వేసిన మొదటి కళాదర్శకుడిగా గుర్తింపు పొందిన రవీంద్రారెడ్డి చేసిన మ్యాజిక్ గురించి వివరంగా.. - భువనేశ్వరి నగర శివార్లలో ఉన్న కోకాపేటకు వెళ్లి.. ఇక్కడ మర్యాదరామన్న ఇల్లు ఎక్కడని ఎవర్ని అడిగినా.. ఆ సెట్‌కు రూట్ చెబుతారు. ఆ రూట్లో వెళ్లి చూస్తే.. ఆ మండువా లోగిలి మీకు కనిపిస్తుంది. మర్యాదరామన్న కథ ప్రకారం.. అందమైన ఇల్లొకటి కావాలి. ఆ ఇల్లు, ఇంటి పరిసరాలు అన్నీ అనంతపురంలోని పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించాలి. తలుపులు, దూలాలు, వాసాలు, మెట్లు అన్నీ ఒరిజినల్‌గా కనిపించాలి. దానికోసం రవీంద్రారెడ్డి పెద్ద కసరత్తే చేశారు. రెండువందల పేజీల పేపర్ వర్క్, 300 మంది పనివాళ్లతో రెండు నెలలు శ్రమిస్తే ఆ సెట్ కుదిరింది. అందుకే మర్యాదరామన్న సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఆ ఇల్లు కూడా అంత పెద్ద హిట్ అయింది. ఆ సినిమా తర్వాత కూడా ఈ సెట్‌కు పాపులారిటీ తగ్గలేదు. ఈ ఇంటిలో ఇప్పటి వరకూ దాదాపు 600 సినిమాలకు పైగా షూటింగ్ చేసుకున్నాయి. పేటెంట్ ఏమిటి? ఒక సీన్ కోసం.. ఒక పాట కోసం.. వేసే భారీ సెట్టింగులు సైతం.. పని అయిపోయాక పీకేస్తారు. మరీ భారీ సెట్టింగ్‌లు అయితే రెండు మూడు సినిమాలకు వాడుకుంటారు. మర్యాదరామన్న సెట్ ఇందుకు భిన్నమైంది. మామూలు సెట్‌లా కాకుండా దీన్ని వేసేటప్పుడే ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు రవీంద్రారెడ్డి. రెండు టన్నుల బరువుండే అకెలా క్రేన్స్ కూడా ఈ ఇంటి రెండో అంతస్తులోకి తీసుకెళ్లి షూటింగ్ చేయొచ్చు. అంత ధృడంగా దీన్ని వేశారు. ‘ఇలాంటి సెట్ వేయడం మన దగ్గర మొదటి ప్రయోగం. మామూలుగా సెట్ల నిర్మాణానికి వాడే ఫ్లైవుడ్నే నేనూ వాడాను. కాకపోతే వాటిని అతికించడానికి కొత్తరకం మెటీరియల్ వాడాను. దాన్ని తయారు చేసిందీ నేనే. లేటెక్స్, ఇసుక, ఫెవికాల్‌కు తోడు కొన్ని రకాల కెమికల్స్ కలిపి తయారు చేసిన ఆ మెటీరియల్ నేను ఊహించిన దానికంటే మంచి ఫలితాన్ని ఇచ్చింది. మిగతా వస్తువుల తయారీలో కూడా నా బ్రాండ్‌ను క్రియేట్ చేసుకోగలిగాను. ఇంటి సెట్ క్వాలిటీని చూసిన చాలా మంది పేటెంట్ కోసం అప్లయ్ చేయమని చెప్పారు. దాంతో అన్ని వివరాలతో చెన్నైకి చెందిన పేటెంట్ కంపెనీకి అప్లికేషన్ పంపాను. వాళ్లు ఆరునెలలు ఈ ఇంటికి సంబంధించిన పరిశోధన జరిపారు. మన దేశంలోనే కాదు.. ఇంకెక్కడా కూడా ఇంత నాణ్యమైన ఇంటిసెట్ లేదని, నేను వాడిన మెటీరియల్ యూనిక్ అని గుర్తించి నాకు పేటెంట్ హక్కుల్ని కల్పించారు’ అని చెప్పారు రవీంద్రారెడ్డి. మెటీరియల్ చుట్టూ పొలాలు.. ‘మర్యాదరామన్న చిత్రంలో పొలాల్లో కనిపించే సీన్ల కోసం ఆ ఇంటిపక్కనే రెండు ఎకరాల్లో జొన్నపంట పండించి మరీ షూటింగ్ చేశారు రాజమౌళి. ఆ సీన్లలో ఈ ఇంటి నీడైనా కనిపించకపోవడం జక్కన్న పనితనానికి మచ్చుతునక. కథ చెప్పి పక్కకు తప్పుకుంటారు. ఆర్ట్ విషయంలో అసలు కల్పించుకునేవారు కాదు. నిర్మాత సహకారం కూడా మరువలేనిది. ఇంటి సెట్ ఒకెత్తయితే.. ఆ ఇంట్లో కనిపించే వస్తువులు మరోఎత్తు. ఊయల నుంచి వంటింటి సామాన్ల వరకూ అన్నిట్లో ఆ తరం నేటివిటీ కనిపించేలా డిజైన్ చేశాను. ఇవన్నీ ప్లైవుడ్, థర్మాకోల్, ఫైబర్ వాడి తయారు చేశాను. చివరికి పశువుల కొట్టంలో కనిపించే నీళ్ల తొట్టెలతో సహా. కథకు జీవం పోసిన ఆ సెట్‌ని ఆ తర్వాత కొన్ని వందల సినిమాలకు వాడడం, ఇప్పటికీ మర్యాదరామన్న ఇంటి సెట్ అనే పదం వాడడం.. వింటుంటే గర్వంగా అనిపిస్తుంది’ అంటూ చిరునవ్వుతో చెప్పారు రవీంద్రారెడ్డి. కొన్ని వందల సినిమాలు... గబ్బర్‌సింగ్‌లో విలన్ ఇల్లు, బృందావనంలో శ్రీహరి ఇల్లు, కందిరీగ, పూలరంగడు, మిర్చి.. ఇలా చాలా సినిమాల షూటింగులు ఆ ఇంట్లోనే జరిగాయి. తమిళ విక్రమార్కుడు కూడా ఇక్కడే షూట్ చేశారు. నాలుగేళ్లలో తెలుగు, తమిళం, కన్నడం, హిందీ భాషల్లో దాదాపు ఆరువందల సినిమాల చిత్రీకరణ జరిగిన ఆ ఇంట్లో ప్రస్తుతం తెలుగులో ఓ టాప్‌హీరో షూటింగ్ జరుగుతోంది. దానికి కూడా రవీంద్రారెడ్డి ఆర్ట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకూ ఆ ఇంటిని చిన్న చిన్న మార్పులు చేసి వాడుకుంటే ఈసారి రవీంద్రా ఇంటి రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. తమిళ బ్యాక్‌డ్రాప్‌లో సాగే కథనం కోసం ఆ ఇంటికి ద్రవిడ సంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ఎంట్రన్స్ లుక్ కూడా మారిపోయింది. రిచ్ అండ్ లేటెస్ట్గా కనిపించేలా కలర్ఫుల్గా తీర్చిదిద్దారు. అదీ సెట్టే.. ‘మర్యాదరామన్న సినిమాలోనే ట్రైన్ జర్నీ సీన్ చూశారుగా.. ఆ ట్రైన్ కూడా సెట్టే. ఈ ఇంటి పక్కనే రెండు బోగీలు సెట్ వేసి.. ట్రైన్ సీన్‌ను లాగించేశారు. రాయలసీమలో కనిపించే నేటివిటీని చూపిన ఆ సెట్ తర్వాత ఓ ట్రెండ్‌ని సెట్ చేసింది. ఈగ మూవీలో ఇల్లు, అత్తారింటికి దారేది, జులాయి.. ఇలా మిగితా సినిమాల్లో ఇళ్ల సెట్లనూ ఆ దృష్టితో వేసినవే’ అంటూ ముగించారు. -
భారతీయ మహిళా బ్యాంక్
మహిళ కష్టపడి డబ్బు సంపాదిస్తే సరిపోతుందా? దాన్ని దాచుకునే దారి కూడా ఉండాలి కదా! ఇక్కడ మాట్లాడుతున్నది పెద్ద ఉద్యోగాలు చేస్తూ వేలు, లక్షల రూపాయలు సంపాదించే మహిళల గురించి కాదు.. రోజు కూలీ చేసుకునే సామాన్య మహిళకు పొదుపు చేసుకునేందుకు భద్రమైన చోటు కావాలి. బ్యాంక్‌లో నాలుగు పైసలుంటే ఉండే భద్రత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్క భారతీయ మహిళకూ బ్యాంక్‌లో అకౌంటు ఉండాలనే లక్ష్యంతో గతేడాది ముంబైలో ‘భారతీయ మహిళా బ్యాంక్’ నెలకొల్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 35 భారతీయ మహిళా బ్యాంక్‌లున్నాయి. పందొమ్మిదో బ్రాంచ్‌గా హైదరాబాద్‌లో వెలసిన బీఎమ్‌బీ.. అకౌంట్ల ఓపెనింగ్‌లో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. - భువనేశ్వరి ఈ ఏడాది మార్చిలో అమీర్‌పేట దగ్గర భారతీయ మహిళా బ్యాంక్ (బీఎమ్‌బీ)ని నెలకొల్పిన కొత్తలో సిబ్బంది పడ్డ పాట్లు అన్నీఇన్నీ కావు. ‘బ్యాంక్‌లో మొత్తం ఆరుగురు మహిళా ఉద్యోగులం ఉన్నాం. మా బ్యాంక్ చుట్టూ మరో నాలుగు ఇతర బ్యాంకులున్నాయి. ఎవరొచ్చినా వాటిలోకే వెళ్లేవారు. ఒక్కరు కూడా మా బ్యాంకు వైపు తొంగి చూసేవారు కాదు. ‘మహిళా బ్యాంక్‌లో సొమ్ము దాచుకోవడం ఏంటమ్మా..’ అంటూ హేళన చేసేవారు ఎదురయ్యారు. లాభం లేదని మేమంతా కుర్చీలు వదిలేసి బ్యాంక్ బయట మెట్లపై కూర్చొని అటుగా వచ్చేవారికి మా బ్యాంక్ గురించి చెప్పడం మొదలుపెట్టాం. చాలావరకూ మహిళలకే చెప్పేవాళ్లం. కొందరు బ్యాంక్ లోపలికి వచ్చి మరిన్ని వివరాలు తెలుసుకుని అకౌంట్ ఓపెన్ చేసేవారు. కొన్ని రోజులు గడిచాక మేం మా సీట్లలో కూర్చుని పనిచేయడం మొదలుపెట్టాం’ అంటూ తమ బ్రాంచ్ ఓపెన్ అయిన తొలినాళ్లను గుర్తు చేసుకున్నారు సీనియర్ మేనేజర్ సుచరిత. క్యాంప్.. ఆపరేషన్.. మహిళా ఖాతాదారుల సంఖ్య వేగంగా పెంచాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు బ్యాంక్ సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేశారు. వారాంతాల్లో మురికివాడలకు వెళ్లి అక్కడి మహిళల్ని కలసి కౌన్సెలింగ్ ఇచ్చి వారితో ఖాతాలు తెరిపించడం మొదలుపెట్టారు. దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో విరివిరిగా క్యాంపులు నిర్వహించారు. ఫలితంగా.. పట్టుమని పదినెలలు కూడా పూర్తి కాకుండానే బ్యాంకులో అకౌంట్ల సంఖ్య 7 వేలకు చేరింది. ఇందులో ఆరున్నరవేల ఖాతాలు మహిళలవే కావడం విశేషం. ‘పేద, సామాన్య మహిళలు ఏదో ఒక పనిచేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటున్నారు. కానీ వాటిని పొదుపు చేసుకునే తీరు, దారి తెలియక ఇబ్బందిపడుతుంటారు. అలాంటివారు ఎక్కడున్నారో ముందుగా ఎంక్వయిరీ చేసుకుని వారి ఇళ్లకు వెళ్లి.. బీఎమ్‌బీ గురించి వివరించాం. అప్పుడప్పుడు క్యాంపులు నిర్వహించాం. ‘బ్యాంకు ఖాతా వల్ల ఉపయోగం ఏంటి..?’ అనేవారికి ప్రత్యేక కౌన్సెలింగ్ ఇస్తున్నాం..’ అని వివరించారు మేనేజర్ విశాలిని. నమ్మకమే పూచీకత్తు.. మహిళలకు పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వడం బీఎమ్బీకున్న ప్రత్యేకత. మామూలుగా అయితే ష్యూరిటీ లేనిదే రూపాయి కూడా లోన్ ఇవ్వరు. అయితే మహిళా సాధికారికత కోసం ప్రత్యేక పథకం కింద బీఎమ్‌బీ పూచీకత్తు లేని రుణాలు అందిస్తోంది. ‘కర్రీ పాయింట్లు, క్రష్‌లు, క్యాటరింగ్ వ్యాపారాలు, బ్యూటీపార్లర్లు వంటి చిన్న చిన్న వ్యాపారాలకు మహిళల దగ్గర ఎలాంటి పూచికత్తులు కోరడం లేదు మేం. ఆసక్తి ఉన్న మహిళలతో మేమే దగ్గరుండి వ్యాపారం పెట్టిస్తున్నాం. అలా ఇప్పటివరకూ వంద మంది మహిళలతో చిన్న వ్యాపారాలు పెట్టించాం’ అని వివరించారు బ్యాంక్ ఉద్యోగి సుచరిత. ఖాతాలు తెరిపించడం, వ్యాపారాలు పెట్టించడంతో ఆపకుండా.. కార్పొరేట్ రంగంలో కూడా మహిళలకు అండగా నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
పుట్టింది ఎందుకో తెలిసింది వీళ్లకి
పుట్టిన రోజు పండుగే అందరికీ.. మరి పుట్టింది ఎందుకో తెలిసే సరికి ఏజ్ బార్ అయిపోతుంది. ఎంజాయ్మెంట్ తప్ప మరొకటి తెలియని ఈ యూత్‌కు మాత్రం పుట్టింది ఎందుకో ఇప్పుడే తెలిసింది. పుట్టిన రోజు వేడుకను డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేసుకుంటూ పెరుగుతున్న వయసుకు అర్థం చెబుతున్నారు. బర్త్ డేని పార్టీలతోనే వెళ్లదీయకుండా.. పదిమందికీ సాయం చేస్తూ నలుగురు నచ్చే విధంగా జరుపుకుంటున్నారు. తమ పుట్టిన రోజును కాస్త డిఫరెంట్‌గా సెలబ్రేట్ చేసుకుంటాం అంటున్న సోమాజిగూడలోని రూట్స్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు.. ఆ విశేషాలను క్యాంపస్ కబుర్లలో పంచుకున్నారు. భువనేశ్వరి ఆయుష్: నవంబర్ 16 నా బర్త్‌డే.. వెరీ స్పెషల్ డే. ఆ రోజు నేను లోయర్ ట్యాంక్‌బండ్ దగ్గరున్న గోశాలకు వెళ్తాను. ఆవులకు ఇష్టమైన దాణా తీసుకెళ్లి నా చేతులతో వాటికి పెడతాను. అక్కడే చాలా టైం గడుపుతాను. సాయంత్రం ఫ్రెండ్స్‌తో ఫుల్ ఎంజాయ్. అవ్ని: ఓ వావ్.. రియల్లీ యువర్ గుడ్. ఓకే..నా బర్త్‌డే జూన్ 28. ఆశిష్: మేడమ్ ఇయర్ కూడా చెప్పాలి. అవ్ని: థ్యాంక్స్ ఫర్ ద సజేషన్. నో వే. నేను మాత్రం బర్త్‌డే రోజు పొద్దున్నే గుడికి వెళ్తాను. లాస్ట్‌టైం గుడి దగ్గరున్న బెగ్గర్స్‌కు పళ్లు, స్వీట్లు పంచాను. ప్రతిసారీ ఇలాగే అని కాదు. ఒక్కోసారి ఒక్కోలా ప్లాన్ చేసుకుంటాను. ఆశిష్: నో పార్టీ..నో ఎంజాయ్. అవ్ని: చెప్పా కదా.. అప్పటికి ఏం చేయాలనిపిస్తే అది చేస్తాను. ధనలక్ష్మి అగర్వాల్: నేను మాత్రం బర్త్ డే సెలబ్రేషన్స్‌కు వ్యతిరేకం. ఎందుకంటే మన జీవితంలో ఒక ఇయర్ లాస్ అయిన రోజు అది. అలాగని ఆ రోజు నేను మూడీగా ఏమీ ఉండను. మా ఇంటికి దగ్గరగా ఉన్న చారిటీ హోమ్‌లో స్వీట్లు పంచుతాను. అలాగే దీపావళి పండుగ రోజు కూడా నేను ఇంట్లో ఉండను. స్వీట్లు పట్టుకుని ఆశ్రమాలకు వెళ్లిపోతాను. నవ్య: సో గుడ్. అంతకు మించి సెలబ్రేషన్ ఏముంటుంది ధనలక్ష్మి. జూలై 5 నా బర్త్‌డే. నేను నా బ్రదర్‌తో స్నేహితులను తీసుకుని కేఎఫ్‌సీకి వెళ్లాను. బండి పార్క్ చేసి లోపలికి వెళ్తుంటే అక్కడే గోడ పక్కన చిరిగిపోయిన బట్టలతో ఓ పెద్దాయన కనిపించాడు. నేను దగ్గరికెళ్లి డబ్బులిస్తుంటే తీసుకోలేదు. అన్నయ్య తన జర్కిన్ ఇస్తుంటే వద్దన్నాడు. ఏం కావాలని అడిగితే అన్నం అన్నాడు. ముందు అతని కోసం ఆర్డర్ చేసి తర్వాత మేం తిని ఇంటికి వచ్చాం. నేను ఆ రోజు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఎమ్మెస్ పల్లవి: అఫ్కోర్స్.. ఎంజాయ్మెంట్ మహా అయితే రోజుల జ్ఞాపకమే. కానీ ఇలాంటి పనులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నేను మా ఇంటికి దగ్గర్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని పేద విద్యార్థులకు నోట్‌బుక్స్ కొనిపెడుతుంటాను. ఆదిత్య: యా.. ఆ రోజుకే కాదు, ఆ రోజు చేసిన పనికి కూడా స్పెషల్ మెమొరీ ఉంటుంది. మా ఇంట్లో మేం ట్విన్స్. చెల్లి ఐశ్వర్య నేను జనవరి 19న గ్రాండ్‌గా బర్త్‌డే చేసుకుంటాం. అమ్మానాన్న, బాబాయి అందరూ మాకు ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తారు. మొన్నటిసారి ఇంట్లో సెలబ్రేషన్స్‌తో పాటు డెఫ్ అండ్ డమ్ స్కూల్‌కు వెళ్లి స్వీట్లు పంచాం. నిజానికి ఇలా ప్రతిసారి చేస్తే బాగుంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్‌కి అందరికీ ఇలాంటి ఆలోచనలున్నాయి. నవ్య: యా.. ఈవెన్ స్కూల్ స్టూడెంట్స్ కూడా సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు. ఆదిత్య: ఆలోచన వస్తే చాలు.. మన పుట్టినరోజు వేడుక పేదవాడి జీవితంలో వెలుగులు నింపే వేదికగా మార్చే ఐడియాలు బోలెడు వస్తాయి. సత్యం: పార్టీలు, పబ్‌లు, ఎంజాయ్మెంట్లు ఎప్పుడైనా ఉంటాయి కదా! బర్త్‌డే.. అనేది మనతో పాటు మన ఇంట్లోవాళ్లకి కూడా స్పెషల్ కదా. ఆదిత్య: డెఫినెట్లీ.. వాళ్ల ఏర్పాట్లు వారికుంటాయి. మా ఇంట్లో అయితే రాత్రి పన్నెండింటికి కేక్ రెడీ చేసేస్తారు. గిఫ్ట్‌లు కూడా రెడీ చేసి ఉంచుతారు. అవ్ని: నాకు ఈసారి మా డాడ్ ఆక్టీవా గిఫ్ట్‌గా ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇచ్చే సర్ప్రైజ్లు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఆశిష్: ఓ.. గ్రేట్ ఈసారి నీకెన్ని గిఫ్ట్‌లు వచ్చాయి అవ్ని. అవ్ని: నో.. చెప్పను. సత్యం: నా బర్త్‌డే ఫిబ్రవరి 1. ముందు గుడికి వెళ్తాను. తర్వాత ఓల్జేజ్ హోమ్‌కు వెళ్లి అక్కడే కొంత టైం స్పెండ్ చేస్తా. సాయంత్రం ఫ్రెండ్స్‌తో సరదాగా బయటకు వెళ్తాను. సుదీప్తి: నేనైతే నా ప్రతి బర్త్ డే రోజు ఓ మొక్క నాటుతాను. శశి: వావ్.. మీ ఇంట్లో ఎన్ని చెట్లున్నాయి. సుదీప్తి: 23. ఆశిష్: ఓ.. నీ ఏజ్... సుదీప్తి: నో ఇట్స్ నాట్ మై ఏజ్. నేను ఒక్కోసారి రెండు మూడు చెట్లు కూడా నాటుతాను. ఎనీ వే ఈ సందర్భంగా నేను అందరికీ ఇచ్చే బెస్ట్ సజేషన్. ప్రతి పుట్టినరోజున ఒక మొక్క నాటండి. ఆయుష్: యా.. ఇట్స్ రియల్లీ గుడ్ ఐడియా. నీడ్ ఆల్సో. -
సదా మీ సేవలో..
‘వి మేక్ ఎ లివింగ్ బై వాట్ వి గెట్.. బట్, వి మేక్ ఎ లైఫ్ బై వాట్ వి గివ్’ ప్రత్యూష ఫౌండేషన్ బ్రోచర్‌పై ఉన్న కొటేషన్. సమంత మనసులోని మాటకు అక్షర రూపం ఇది. ‘ఉన్నదాంతో మనం బతకగలం. కానీ మనం ఇచ్చిన దాంతో ఎదుటి వారి జీవితాలను నిలబెట్టగలం’ అని సమంత చెప్పే మాటలు చేతల్లోకి మారి ఏడాది కావొస్తోంది. మహిళలకు, పిల్లలకు ఎన్నో రకాల సేవలను అందించింది ప్రత్యూష ఫౌండేషన్. గతేడాది సమంత అనారోగ్యానికి గురైన సమయంలో ఆ మనసును తొలచిన ఆలోచనలే ఆమెను సేవామార్గం వైపు అడుగులు వేయించారు. ‘అన్నీ ఉన్నా.. మనిషి ఆరోగ్యం కుదుటపడాలంటే కాస్త ప్రేమ కావాలి. కానీ పేదవారికి ప్రేమతో పాటు డబ్బు ఉండాలి.. ఆదరణ చూపాలి’.. సమంత మదిలో మెదిలిన ఈ ఆలోచనలే ‘ప్రత్యూష ఫౌండేషన్’ టాగ్లైన్... సపోర్ట్స్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. సమంత.. సింగిల్ కాల్షీట్ కూడా ఖాళీ లేని బిజీ హీరోయిన్. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని అనుకుంటారంతా. సమంత మాత్రం తన ఇంటినే కాదు.. ఎందరి జీవితాలనో చక్కబెట్టాలని సంకల్పించింది. అందుకే రిటైర్ అయ్యాక మదిని తొలిచే సామాజిక సేవ.. సమంత మదిలో ఇప్పుడే మెదిలింది. ‘సంపాదన ఎంత ముఖ్యమో.. సేవ కూడా అంతే ముఖ్యమని’ కదిలింది. తన ఆలోచనకు ‘ప్రత్యూష ఫౌండేషన్’ అని నామకరణం చేసి రంగంలోకి దూకింది. అంతే వేగంగా ‘ఆక్షన్’ పేరుతో మిగతా సెలిబ్రిటీలనూ అందులో భాగస్వాముల్ని చేసింది. ‘నేను ఎప్పటికీ హీరోయిన్గా ఉండలేను..! కానీ సమాజం దృష్టిలో మాత్రం సేవకురాలిగా ఎప్పటికీ నిలిచిపోవాలన్నది నా కోరిక’ అని చెప్పే ఈ కథానాయిక తీరిక కుదిరితే చాలు.. ప్రత్యూష ఫౌండేషన్ పనుల్లో బిజీ అవుతోంది. రియల్ టార్గెట్.. చదువు.. ఆపై ఉద్యోగం.. లైఫ్ సెటిల్మెంట్.. ఈ టార్గెట్‌పై దృష్టి పెట్టిన యూత్ లైఫ్ బిజీ అయిపోయిందని ఫిక్సయిపోయింది. అలాంటి వారికి తీరిక కుదరని షెడ్యూల్లో ఓపిక కూడదీసుకుని సమంత చేస్తున్న సేవా కార్యక్రమాలను ఇప్పటి యూత్ ఆదర్శంగా తీసుకోవాలని చెబుతున్నారు ప్రత్యూష ఫౌండేషన్ కో-ఫౌండర్ డాక్టర్ మంజుల. ‘హీరోయిన్గా సమంత అందరికీ తెలుసు. కానీ ఏడాదిగా ఆమె చేస్తున్న సేవను అభినందిస్తున్నాను. సమంతతో కలసి పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. విమెన్ హెల్త్‌పై అవగాహన తరగతుల ఏర్పాటు, అనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారుల వివరాలు సేకరించి వారికి వైద్యం చేయించడం, వీటితో పాటు మహిళా సాధికారికత కోసం కార్యక్రమాలెన్నో ఈ సంస్థ ద్వారా చేయుగలిగాం. మధ్యలో సమంతకు వచ్చిన ‘మేక్ ఎ విష్’ ఆలోచనను ఆచరణలో పెట్టడంలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాల్సి ఉంది’ అని వివరించారు డాక్టర్ మంజలా అనగాని. బ్లడ్ డొనేషన్ క్యాంప్స్.. ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా తలసేమియా బాధితులకు రక్తం అందించే కార్యక్రమాలను కూడా నిర్వహించారు. సమంత ఫ్యాన్స్ స్వచ్ఛందంగా పాల్గొని ఈ రక్తదాన శిబిరాలను గ్రాండ్ సక్సెస్ చేస్తున్నారు. అలాగే రెయిన్ బో, లివ్లైఫ్ ఆస్పత్రుల సాయంతో చేసే హెల్త్ క్యాంపెయిన్లకు కూడా పెద్ద ఎత్తున బాధితులు తరలి వస్తున్నారు. ఇక్కడ పది మందికీ చేయూతనిస్తున్న ప్రత్యూష ఫౌండేషన్ సేవలను చెన్నైకి కూడా విస్తరింపజేయాలని సమంత కోరుకుంటున్నారు. ఆమె ఆశయం నెరవేరాలని మనమూ కోరుకుందాం. చేతులు కలిపి.. చేతలు తెలపండి.. చీకటి వెలుగుల జీవితంలో అందరూ కోరుకునేది వెలుగే. ఆ జిలుగు నీడలో పది మందినీ ఆహ్వానించే వారు కొందరే ఉంటారు. అలాంటి వారి గురించి పదిమందికీ తెలిస్తే.. మరెందరి హృదయాల్లోనో సేవాభావం వెలుగు చూస్తుంది. మరెందరినో సేవామార్గంలో నడిపిస్తుంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా మీకున్న పరిధిలో సమాజం కోసం మీరు చేతులు కలిపి.. చేసిన చేతల వివరాలు మాకు తెలియజేయండి. మీకు స్ఫూర్తిగా స్టార్‌డమ్‌కి సేవను జోడించి తనదైన శైలిలో స్పందిస్తున్న సినీ నటి సమంత ‘సిటీప్లస్’లో వెలుగుచూసే కథనాలకు బాసటగా నిలుస్తానంటోంది. మీరు చేయాల్సిందల్లా.. ఓ సంస్థ ద్వారా, వ్యక్తిగతంగా మీరు చేస్తున్న సేవల వివరాలను మాకు మెయిల్ చేయండి. వాటిని ‘సిటీప్లస్’లో ప్రచురిస్తాం. వీటిలో ఉన్నతమైన వాటిని ఎంపిక చేసి.. సదరు సేవా సంస్థలు, వ్యక్తులను సమంత పలకరిస్తారు. ఒక్క సమంత మాత్రమే కాదు.. సేవ చేసే హృదయాలను అభినందించడానికి మరెందరో సెలిబ్రిటీలు ముందుకు రానున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు చేస్తున్న చారిటీ -భువనేశ్వరి వివరాలు మెయిల్ టు sakshicityplus@gmail.com -
సీతాకోక చిలుక
33 ఏళ్ల క్రితం బేగంపేట ఎయిర్‌పోర్టులో విమానం దిగిన అలీకి అవార్డు తీసుకుంటున్నానన్న ఆనందం కంటే హైదరాబాద్‌లో అడుగుపెట్టానన్న సంతోషంతోనే మనసు నిండిపోయింది. రద్దీలేని చార్మినార్ వీధులు, పంజగుట్ట షాన్‌బాగ్ హోటల్లోని ఇడ్లీసాంబార్, రాత్రిపూట స్నేహితులతో బిర్యానీ... ఇలా హైదరాబాద్‌తో తనకున్న ముప్పై ఏళ్ల అనుబంధం... భవిష్యత్తులో భాగ్యనగరం కోసం తను కనే కల...అన్నింటినీ గుర్తుచేసుకుంటున్నప్పుడు అలీలోని ఓ హైదరాబాదీ బయటకొచ్చాడు. ‘‘సీతాకోకచిలుక సినిమాకి నాకు ‘స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అవార్డు’ వచ్చింది. ఆ చిన్నవయసులో ప్రభుత్వ అవార్డు వచ్చిందని తెలియగానే చాలా సంతోషపడ్డాను. ఆ అవార్డు ప్రదానం హైదరాబాద్‌లో అని తెలియగానే ఎగిరి గంతేయాలనిపించింది. హైదరాబాద్‌ని అప్పటివరకూ సినిమాల్లో చూడ్డమే గాని ఎప్పుడూ రాలేదు. ప్రభుత్వం అవార్డుతో పాటు మద్రాసు నుంచి హైదరాబాద్‌కి వెళ్లడానికి ఫ్లైట్ టికెట్ కూడా ఇచ్చారు. దాంతో మొదటిసారి హైదరాబాద్‌కి విమానంలో వచ్చి ఇంకొంత గొప్పగా ఫీలయ్యాను. బేగంపేటలో విమానం దిగి నేను, నాన్న నేరుగా సికింద్రాబాద్ దగ్గరున్న డెక్కన్ కాంటినెంటల్ హోటల్‌కి వెళ్లాం. ఇప్పుడు ఆ హాటల్ స్థానంలో కిమ్స్ ఆసుపత్రి ఉంది. తర్వాత ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్‌రెడ్డి చేతులమీదుగా అవార్డు అందుకుని సాయంత్రం వేళలో చార్మినార్ చూడ్డానికి వెళ్లాం. అవార్డుతోపాటు మొదటిసారి హైదరాబాద్‌లో చూసిన అద్భుతమైన విశేషాలనూ వెంటబెట్టుకుని మా స్వస్థలం రాజమండ్రి వెళ్లాను. ఈ సంఘటన జరిగి ఇప్పటికి 33 ఏళ్లవుతుంది. ఇప్పటికీ ఆ రోజు నేను చూసిన దృశ్యాలు నా కళ్లముందుంటాయి. ఇల్లుకొని 20 ఏళ్లు... 1994లో మద్రాసు నుంచి హైదరాబాద్‌కి మకాం మార్చాను. శ్రీనగర్‌కాలనీలో ఫ్లాట్ కొన్నాను. అప్పటివరకూ ఎప్పుడు షూటింగ్ ఉంటే అప్పుడు మద్రాసులో రెలైక్కడం, పనైయ్యాక వెళ్లిపోవడం. హైదరాబాద్‌లో షూటింగ్‌ని ఎంత ఎంజాయ్ చేసేవాళ్లమో పరిసరాలను కూడా అంతే ఇష్టపడేవాడ్ని. ముఖ్యంగా పంజగుట్ట సెంటర్లోని షాన్‌బాగ్ హోటల్. మద్రాసులో సాంబార్ఇడ్లీ అలవాటు కదా మాకు...అలాంటి టిఫిన్ ఒక్క షాన్బాగ్లోనే ఉండేది. షూటింగ్ అయ్యాక సాయంత్రం వస్తూ వస్తూ నాంపల్లి దగ్గర ఒక ఇరానీ చాయ్ కొట్టి రూమ్‌కి చేరుకునేవాళ్లం. చాయ్... చాయ్ మామూలుగా ఏ ప్రాంతంవారైనా పొద్దున, సాయంత్రం వేళలో టీలు తాగుతారు. మన హైదరాబాద్‌లో అర్ధరాత్రి కూడా చాయ్ తాగే అలవాటు ఉంటుంది. అప్పట్లో ఇక్కడ మా స్నేహితులు రాత్రి పదిగంటలకు బిర్యానీ తిని వెంటనే చాయ్ తాగేవారు. ‘ఇదెక్కడి అలవాటురా బాబు...’ అంటే ‘తిన్నది మంచిగ అరుగుతదిరా బై..’ అనేవారు. ముందు పేర్లు పెట్టినా...తర్వాత మెల్లగా నాకూ అలవాటైపోయింది. హైదరాబాద్‌లో చాయ్ తాగడానికి ఫలానా టైం ఉండదని అర్థమైంది. నిజాం గోడతో ఎండ్... అప్పట్లో అన్నపూర్ణ స్డూడియో తర్వాత హైటెక్‌సిటీ వెళ్లే దారిలో పెద్ద గోడ ఉండేది. నిజాం కాలం నాటి గోడ. ఆ గోడపై నా ‘పిట్టలదొర’ సినిమా వాల్‌పోస్టర్‌ని అతికించారు కూడా. తర్వాత రోడ్లు వెడల్పు చేసేపనిలో భాగంగా ఆ గోడను పడగొట్టేశారు. ఆ గోడ దాటాక ఏమీ ఉండేవి కావు. బంజారాహిల్స్‌లో కొందరు డబ్బున్న లంబాడాలు ఉండేవారు. జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్ ప్రాంతాలయితే మొత్తం కొండలూ గుట్టలే. విశేషమేమిటంటే... పాతికేళ్లక్రితమే మన హైదరాబాద్‌లో అద్భుతమైన ఇళ్లు ఉండేవి. ఆ రోజుల్లోనే అమితాబ్‌బచ్చన్ లాంటివారు హైదరాబాద్ వచ్చినపుడు ఇంత ఖరీదైన ఇళ్లు మా ముంబైలోనే లేవని చెప్పారట. నిజమే... మన సిటీలో ఉన్నన్ని ఖరీదైన ఇళ్లు, నిజాంనాటి అద్భుతమైన కట్టడాలు దేశంలో ఇంకెక్కడా లేవు. ఫలక్నుమప్యాలెస్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎవరో వచ్చి ఇక్కడున్న తలుపులకు బంగారు గొళ్లాలు ఉండేవని చెప్పారు. పదేళ్లకిందట కూడా అక్కడి పరిసరాల్లో బంగారు నాణాలు దొరికాయని వార్తలొచ్చాయి. నిజాం పాలన సంగతి పక్కన పెడితే ఈ భాగ్యనగరాన్ని సొంత ఇంటిలా నిర్మించాడనడంలో సందేహం లేదు. చెత్తను మాయం చేస్తేగాని... హైదరాబాద్ గురించి నేనేదైనా కలగనాలంటే... ఒక్కటే కల. చెత్త కనిపించని నగరాన్ని చూడాలని. కేరళలో ఎవరింటి చుట్టుపక్కల చెత్తను వారే వారానికొకసారి కాల్చేస్తుంటారు. ప్రభుత్వ అధికారులు చీపుళ్లు పట్టుకొచ్చి మనింటి ముందు ఊడ్చాలనే ఆలోచన అక్కడి ప్రజలకుండదు. దాంతో ఏ వీధి చూసినా శుభ్రంగా కనిపిస్తుంది. మన నగరవాసులకు కూడా అలాంటి ఆలోచన రావాలి. గోడపై నుంచి చెత్త విసిరేయడంతో మన పని ముగిసిపోయిందను కుంటున్నాం. ఫలితం...వర్షాకాలం వచ్చిందంటే...ప్లాస్టిక్ బాటిల్స్, కాగితాలు, పనికి రాని వస్తువులతో నాలాలన్నీ మూసుకుపోయి మురుగునీరంతా రోడ్లపై ప్రవహిస్తుంది. ఈ విషయంలో మన ప్రవర్తనలో మార్పు రావాలి. హైదరాబాద్‌ని అందమైన నగరంగా మాత్రమే కాదు.. శుభ్రమైన నగరమని కూడా చెప్పుకోవాలి. - భువనేశ్వరి -
చీకటికి చురక
మెరిసే తారల రూపం.. కురిసే వెన్నెల దీపం.. ఆ కళ్లకు శూన్యం. చిరుదివ్వెల్లా వెలగాల్సిన ఆ కనులకు తిమిరంతో సమరం తప్ప మరొకటి తెలియుదు. ఊహల్లోనూ చీకటితో సావాసం చేసే సాహసగాళ్లు వాళ్లు. ఉదయించు భాను బింబాన్ని చూడలేకున్నా.. ఆ లేత కిరణాలు వారి హృదయూలను తాకుతాయి. పచ్చదనం పరుచుకున్న ప్రకృతి కాంతను చూడలేకపోయినా.. అందాలు అలుముకున్న అవని సొగసులకు ఆ మనసులు స్పందిస్తాయి. అంతేనా చుట్టుపక్కల చూడలేని ఈ చిన్నవాళ్లు.. సవూజంలో కొట్టే కుళ్లు కంపు పసిగడతారు. ఆ కుళ్లును కడిగేసే శక్తి వూకుందని ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు. చీకటి ముసురుకున్న ఊహలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా.. వారి మనోనేత్రం మాత్రం బంగారు కలలు కంటున్నాయి. అంధకారం అలుముకున్న సమాజంలో జ్ఞానజ్యోతులు వెలిగిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాయి. దేవుడిచ్చిన చీకట్లలో మగ్గిపోకుండా.. ఆత్మవిశ్వాసంతో బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటున్న చీకటి దివ్వెలను స్టార్ రిపోర్టర్‌గా సినీ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ పలకరించారు. వారి మనసులోని భావాలను మన ముందుంచారు.. ఆర్పీ పట్నాయక్: హలో.. హాయ్ ఐయామ్ ఆర్పీ పట్నాయక్ చిన్నారులు: హాయ్...సార్! థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆర్పీ: నేను వచ్చింది మీతో సరదాగా కబుర్లు చెప్పడానికి మాత్రమే కాదు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి. అవినాష్: వావ్.. థ్యాంక్యు వెరీ మచ్ సార్ ఆర్పీ: ఒకే.. మీకు స్కూల్లో ఏం నచ్చుతుంది? చేతన: ఎడ్యుకేషన్ మల్లికార్జున్: కంప్యూటర్ ల్యాబ్ జయ: ఫ్రీడమ్.. ముఖ్యంగా మాకేసి జాలిగా చూడకుండా మామూలు పిల్లల్ని చూసినట్టే చూస్తారు. ఆర్పీ: మీరు మామూలు పిల్లలు కాదని ఎవరన్నారు? సరస్వతి: ఎవరూ అనరు సార్. ఇంటికెవరైనా బంధువులొస్తే ముందు మా గురించే అడుగుతారు? మమ్మల్నే పలకరిస్తారు. వాళ్లున్నంత సేపు టాపిక్ మేమే. గాయత్రి: మా గురించి జాలిగా మాట్లాడుకోవడం.. లేదంటే తక్కువగా చూడ్డం వంటి సందర్భాల్లో చాలా బాధేస్తుంది. ఆర్పీ: అంటే వారి ఉద్దేశం.. కళ్లున్నవారే జీవితంలో ఎదగడం, సెటిలవ్వడం కష్టమనుకునే రోజులు కదా. అంధులంటే మరింత ఇబ్బందిగా ఉంటుందని! శివారెడ్డి : అలాగనుకుంటే కళ్లు లేనివారి గురించి కాదు జాలి పడాల్సింది. ఆసరా లేనివారి గురించి. నిరుపేద పిల్లల గురించి ఆలోచించమనండి. చేతనైతే వారికి సాయం చేయమని చెప్పండి. విష్ణు: సార్ పట్టుదల, ఆత్మవిశ్వాసం లేనివారి గురించి కూడా జాలి చూమమని చెప్పండి. ఆర్పీ: మీరు చెప్పింది నిజం. సరే.. ఆ టాపిక్ వదిలేయండి. మీరన్నట్టు లక్ష్యం, పట్టుదల ఉన్నవాడికి అవయవలోపం చాలా చిన్న విషయం. నెక్ట్స్.. మీ చదువంతా బ్రెయిలీ లిపితోనేనా? చేతన: దాంతోపాటు మాకు ‘స్క్రీన్ రీడింగ్ సాఫ్ట్వేర్’ ఉంది. దాన్నే ఎక్కువగా వాడతాం. ఆర్పీ: ఓహ్.. కంప్యూటర్ని ఎక్కువగా ఉపయోగిస్తారా? గాయత్రి: అవును సార్! మేం టైప్ చేస్తుంటే అది స్పెల్లింగ్ పలుకుతుంది. తరగతి గదిలో సౌండ్రీడింగ్ బుక్స్ ఉంటాయి. ఉమాశంకర్: వియ్ హ్యావ్ ఐపాడ్స్. అందులో ప్రతి బుక్ నాలుగైదు వాల్యూమ్స్‌లో ఉంటుంది. ఆర్పీ: ఇంతకీ మీరు ఎందుకు చదువుకుంటున్నారు? అవినాష్: అదేం ప్రశ్న సార్.. ఓకే! సమాధానం చెప్పాలి కదా.. ఓ మంచి పౌరుడిగా తయారవ్వాలని. గాయత్రి: జ్ఞానం సంపాదించడానికి కళ్లు అవసరం లేదు సార్. కానీ నలుగురిలో గొప్పగా బతకాలంటే తప్పనిసరిగా చదువు కావాలి కదా సార్. ఇక మా అందరికీ మా సీనియర్సే ఆదర్శం. వారు బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించారు. ముఖ్యంగా చార్టర్డ్ ఎకౌంటెంట్‌గా జాబ్ చేస్తున్న రాజశేఖరన్నయ్యలాంటివారన్నమాట. ఆర్పీ: వెరీ గుడ్.. ఇక మీ హాబీస్ ఏంటి? ఉమాశంకర్: పాటలు వింటాం సార్. నేనొక్కడ్నే కాదు, మా అందరికీ పాటలు వినడం అంటే చాలా ఇష్టం. ఆర్పీ: ఎలాంటి పాటల్ని ఇష్టపడతారు? చేతన: మెలొడీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. గాయిత్రి: ఎమోషనల్ సాంగ్స్.. ముఖ్యంగా రిలేషన్షిప్స్ని తెలిపే లిరిక్స్‌ని ఎక్కువగా ఇష్టడతాం. ఆర్పీ: ఓ.. మీకు సినిమా నాలెడ్జ్ చాలా ఉంది. నచ్చిన సినిమా ఏంటి? శివారెడ్డి: ప్రేమించు.. సినిమా సార్. చాలా సినిమాలు చూశాం. కానీ ఆ సినిమా మాటలు వింటుంటే.. అంధురాలిగా ఓ యువతి సాధించిన విజయం మా గుండెల్లో బోలెడంత బలాన్ని నింపింది. జయ: మీరు ‘శీను వాసంతి లక్ష్మి’ సినిమాలో బ్లైండ్ క్యారెక్టర్ వేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు సార్. అలా అంధుడిగా నటించినపుడు మీ ఫీలింగ్ ఏంటి? ఆర్పీ: మీ లైఫ్‌ని చాలా దగ్గరగా చూశాను. కళ్లు కనిపించకుండా అర నిమిషం కూడా ఉండలేని మామూలువారికి మీరు నిత్యం ఆదర్శవంతులే అనిపించింది. శివారెడ్డి: ఆ సినిమాలోని వానా...వానా పాట మీ నోట వినాలనుంది సార్. ఆర్పీ(పాట పాడాక): బావుందా? చేతన: చాలా బాగుంది సార్. థాంక్యూ సో మచ్. ఆర్పీ: ఇంకా ఏమంటే మీకిష్టం. నవనీత: నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. మల్లికార్జున్: అవును సార్. నాక్కూడా.. టూవీలర్‌పై షికారు కొట్టడం అంటే చాలా ఇష్టం. ఆర్పీ: అవునా.. మరి యాక్సిడెంట్స్ అయిపోతాయి కదా! మల్లికార్జున్: కళ్లున్నవారు మాత్రం వాటిని ఉపయోగిస్తున్నారా సార్. మొన్నీమధ్య మెదక్ జిల్లా వూసారుుపేటలో యాక్సిడెంట్ జరిగిన స్కూల్ బస్ డ్రైవర్‌కి కళ్లు ఉన్నట్టా! లేనట్టా! ఉమాశంకర్: యస్.. అతను సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేశారని పిల్లలు చెప్పారు. ఎంత అన్యాయం సార్. చాలామంది సెల్‌ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తున్నారని చెబుతున్నారు. వారంతా ఆ క్షణాన అంధులతో సమానమే కదా సార్. అవినాష్: అంధులకు డ్రైవింగ్ నేర్పడానికి విదేశాల్లో ప్రత్యేక శిక్షణ సంస్థలున్నాయి. వాటిలో ట్రైనింగ్ తీసుకుంటే మేం కూడా ధైర్యంగా బండి ఎక్కొచ్చు. ఆర్పీ: తప్పకుండా.. కొన్ని రకాల టెక్నాలజీలు కళ్లున్నవారిని అంధుల్ని చేస్తుంటే, మరికొన్ని మీ జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. ఇంతకూ మీ ఇంట్లోవారు మిమ్మల్నెలా ట్రీట్ చేస్తారు? శివారెడ్డి: మా పేరెంట్స్ మాకు ఏ విషయంలోనూ తక్కువ చేయరు. దానికితోడు మా దేవ్నార్ స్కూల్ టీచర్ల గెడైన్స్ సాయంతో మమ్మల్ని అన్నిరంగాల్లో ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నారు. సుశాంత్: అవును సార్. మేం ఆటలు, పాటలతో పాటు అప్పుడప్పుడు నాటికలు వేస్తుంటాం. నాటకాలప్పుడు మా శివారెడ్డి పెద్ద పెద్ద డైలాగ్స్‌తో అదరగొట్టేస్తాడు. ఆర్పీ: ఓకే లాస్ట్ క్వశ్చన్. మీ గోల్స్ ఏంటి? ఉమాశంకర్: ఐఏఎస్ అవ్వాలని ఉంది మల్లికార్జున్: నాక్కూడా.... ఆర్పీ: ఇంకా చెప్పాల్సింది ఏమైనా ఉందా? చేతన: సమాజం చాలా మారాలి సార్. వారికి అవసరమైతే అయ్యో.. అంధులంటూ జాలి చూపిస్తుంది. లేదంటే గుడ్డివాడికి కూడా.. అంటూ చిన్న చూపు చూస్తుంది. వేదికలెక్కి మా గురించి గొప్పగా మాట్లాడతారు. వీధుల్లోకి వస్తే రోడ్డు దాటించడానికి కూడా సాయపడరు. ఆర్పీ: నా మాట కూడా అదేనమ్మా! అంధులపై జాలి చూపనక్కర్లేదు. మిమ్మల్ని అలా వదిలేస్తే చాలు.. అద్భుతాలు చేసి చూపెట్టగలరు. చాలా విషయాల్లో మా ‘కళ్లు’ తెరిపించగలరు. విష్ యు ఆల్ ది బెస్ట్! ఆర్పీ: మంచి పొజిషన్‌కు చేరాక ఏం చేస్తారు? ఉమాశంకర్: అంధుల పట్ల, అనాథల పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నవారి కళ్లు తెరిపిస్తాం. ఆర్పీ: ఓ.. మీరు చెప్పేది కాకినాడలో జరిగిన సంఘటన గురించా.కొట్టినవారు కూడా అంధులే కదా మల్లికార్జున్: అందుకే మాకు కోపం వచ్చింది సార్. కళ్లున్నవాడు కొడితే.. అంధుడి బాధ వాడికేం తెలుస్తుందని క్షమించేస్తాం. అంధులు పడే బాధ తెలిసి కూడా పశువుల్లా ప్రవర్తించారు కదా సార్. ప్రెజెంటేషన్: భువనేశ్వరి ఫొటోలు: సృజన్ -
సిన్సియర్ సిటిజన్స్
శేషజీవితాన్ని హాయిగా గడపాలనుకునే వారికి.. పదవీ విరవుణ ఓ వరం ! బ్యాలెన్స్ లైఫ్‌ను ఎలా నెట్టుకురావాలో అని టెన్షన్ పడే వారికి రిటైర్మెంట్ ఒక శాపం ! కానీ ఈ పెద్దోళ్లకు మాత్రం రిటైర్మెంట్ ఒక బాధ్యత.. సమాజానికి సాయం చేసే తీరిక ఇలా దొరకడం ఓ అదృష్టంగా భావిస్తున్నారు. వీళ్ల కాలక్షేపం కూడా లోకాభిరామమే. కాకపోతే అది కాస్త సందడిగా, డిఫరెంట్‌గా, రెస్పాన్సిబుల్‌గా ఉంటుంది. సరదా సరదా ముచ్చట్లకు ఎంత టైం కేటాయిస్తారో.. సంఘానికీ అంతే సమయం ఇస్తారు. వానప్రస్థాశ్రమంలో రామా కృష్ణా అనుకోవాల్సిన ఈ పెద్దోళ్లు.. సమాజ హితం కోసం నడుం బిగించారు. జీవితానుభవాలే పెట్టుబడిగా.. ఈ సీనియర్లు తమ పెద్దరికాన్ని కాపాడుకుంటున్నారు. - భువనేశ్వరి ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్.. కమలానగర్ సీనియర్ సిటిజన్ క్లబ్లో పొద్దున పదింటికల్లా సందడి మొదలవుతుంది. ఒకరు మనవడ్ని స్కూల్లో దింపి, ఇంకొకరు మనవరాలిని కాలేజీలో దింపి.. ఒక్కొక్కరుగా ఈ క్లబ్లో వాలిపోతుంటారు. రాగానే న్యూస్‌పేపర్లు ముందేసుకుంటారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. సినివూల నుంచి రాజకీయూల వరకు.. సరదాగా ముచ్చటించుకుంటారు. ఇండోర్ గేమ్స్, బ్యాడ్మింటన్‌తో రీఫ్రెష్ అవుతారు. ఇలా నాలుగైదు గంటలు టైంపాస్ చేసి ఇళ్లకు చేరుకుంటారు. మళ్లీ సాయంత్రం.. కాలేజీలు మూసే సవుయూనికి రోడ్డెక్కుతారు. ఈ సమయంలో వీరికేం పని అనుకుంటున్నారా..? ఈ సీనియర్ల అసలు ట్రీట్మెంట్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. దారితప్పితే కౌన్సెలింగ్ ఈ సీనియుర్ సిటిజన్స్‌లో ఓ బృందం.. ఓ కాలేజీ ఎదురుగా ఉన్న రోడ్డు పక్కన బస్టాప్‌లో కూర్చున్నారు. అటుగా వెళ్తున్న ఇద్దరమ్మాయిలను.. వెనుక నుంచి ఓ నలుగురు కుర్రాళ్లు ఫాలో అవుతున్నారు. అంతటితో ఆగకుండా ఏదో కామెంట్ చేశారు. అప్పటికే బస్టాప్‌లో ఉన్న ఈ పెద్దోళ్లకు సీన్ అర్థమైంది. వారిని ఆపి విషయుం ఏంటని ఆరా తీశారు. ఆ నలుగురిలో ఓ అబ్బాయి.. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అలాగా అంటూ వారిని సీనియుర్స్ క్లబ్‌కు తీసుకెళ్లారు. నిజమైన ప్రేమ గురించి.. ఒకరి తర్వాత ఒకరు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతే అమ్మాయిలు థ్యాంక్స్ చెబితే.. అబ్బాయిలు తలదించుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ‘మా క్లబ్ స్థాపించి రెండేళ్లవుతుంది. ఎందరికో ఉపయోగపడే పనులు చేయగలిగాం’ అని అంటారు క్లబ్ ప్రెసిడెంట్ పెద్ది నర్సింహ. తోటివారికి తోడుగా ఓ నెల కిందట తమకు న్యాయం చేయాలంటూ ఓ వృద్ధ జంట ఈ క్లబ్ తలుపు తట్టారు. సవుస్యను సున్నితంగా పరిష్కరించి వారి కళ్లలో ఆనందం నింపారు ఈ క్లబ్ సభ్యులు. ‘మా కళ్లముందే అల్లంవెల్లుల్లి అమ్ముకుని కష్టపడి రెండు వందల గజాల ఇంటి స్థలం కొనుక్కున్నాడు. కొడుక్కి ఉద్యోగం వచ్చాక అతని పేరిట లోన్ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. కొడుకు పెళ్లయ్యూక.. ఈ ఇంటితో మీకు సంబంధం లేదంటూ ఆ కొడుకు కన్నవారిని బయుటకు నెట్టేశాడు. మా క్లబ్ సభ్యుల్లో ఓ నలుగురు ఆ కొడుకు, కోడలికి నచ్చజెప్పాం. నాలుగైదు కౌన్సెలింగ్‌ల తర్వాత దిగొచ్చారు. ఆ పెద్దవునుషులకు ఇంటి మీద ప్రత్యేకంగా ఓ రూమ్ కూడా కట్టిచ్చారు. ఆయునే కాదు.. ఇలాంటి సవుస్యలు ఎవరికున్నా వాటి పరిష్కారానికి మేమందరం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం..’ అని క్లబ్ సెక్రటరీ శత్రుఘ్నచారి వివరించారు. మేం ముసలివాళ్లమేంటి..? అరవై ఏళ్లు పైబడిన ఆ పెద్దోళ్లు.. కాలక్షేపంతో పాటు సవూజం గురించి ఆలోచిస్తున్నారు. ‘ఇన్నాళ్లు ఇల్లు, పిల్లలు, ఉద్యోగం అంటూ చుట్టూ ఉన్న సమాజం గురించి పట్టించుకోకుండానే గడిపేశాం. ఇప్పుడు మా పిల్లలకు మా ఆసరా అక్కర్లేదు, ఉద్యోగానికి ఓ నమస్కారం పెట్టేశాం. మాకున్న ఓపిక, తెలివితేటలు, అనుభవం.. తోటివారికి ఉపయోగపడాలన్నదే వూ ఉద్దేశం’ అని చెబుతారు ఆ సీనియుర్ సిటిజన్స్. ‘వయుసు పైబడుతున్న కొద్దీ ఒంట్లో ఒక్కో పార్ట్ రిపేర్కొస్తుంటుంది. వచ్చిన రోగాలకు భయుపడి ఇంట్లో కూర్చుంటే జబ్బులు తగ్గుతాయూ? ఈ క్లబ్ మా మనసును సేదతీరుస్తుంది. ఇక్కడ అడుగు పెట్టగానే మేవుూ పిల్లలమైపోతాం. ఇండోర్ గేమ్స్‌తో అదరగొడతాం. నేను ముసలాడ్ని ఏంటి అనుకునేవారంతా అవుట్‌డోర్‌లో ఫుల్‌గా ఎంజాయ్ చేస్తారు. వూ వునవలు, వునవరాళ్లు కూడా మాతో జాయిన్ అవుతుంటారు’ అని క్లబ్ విశేషాలు పంచుకున్నారు జేజే రెడ్డి. సమాజం కోసం ఉదయం నుంచి ఎన్ని రకాల పనులు చేసినా.. అప్పుడప్పుడూ కాలేజీలకు వెళ్లి వురీ కౌన్సెలింగ్‌లు ఇస్తుంటారు. రోడ్లపై దవుు్మలాగుతున్న కాలేజీ కుర్రాళ్లకు క్లాసులిస్తారు, కౌన్సెలింగ్ చేస్తారు. సాయుంత్రం కాగానే అవ్మూరుులకు రక్షణగా రోడ్లపై గస్తీ కాస్తారు. ‘వూ పిల్లలు కాలేజీకి వెళ్లిన సవుయుంలో మేం చేయులేని పనులు ఇప్పుడు చేస్తున్నందుకు గర్వంగా ఉంది. ఇవన్నీ చేస్తున్న టైంలో మేం హీరోలుగా ఫీలవుతాం’ అంటూ తమ హీరోయిజాన్ని చాటుకున్నారు చంద్రశేఖర్‌రావు. ఇప్పటివరకూ మేం బతికింది మాకోసం, మా కుటుంబం కోసం. ఇక నుంచి సవూజం కోసం బతకాలనుకుంటున్నాం అంటున్న ఈ సిన్సియుర్ సిటిజన్స్‌ను వునం కూడా అభినందిద్దాం. మాతో పంచుకోండి రిటైర్మెంట్ లైఫ్ సేవాభావంతో వెళ్లదీస్తున్న సీనియుర్ సిటిజన్స్ మీరైతే.. మీ జీవితం పదివుందిలో స్ఫూర్తి నింపాలి. చుట్టూ ఉన్న సవూజం కోసం మీరు పడే తపన వురికొందరికి వూర్గనిర్దేశం చేయూలనుకుంటున్నారా.. అరుుతే మీ సావూజిక బాధ్యతను ‘సిటీప్లస్’తో పంచుకోండి. మీరు చేస్తున్న కార్యక్రవూల వివరాలు sakshicityplus@gmail.com కు పంపండి. -
గ్రేట్ వే టూ అమెరికా.. ఐటీకి ‘మైత్రీ’వనమ్
ఓ ఐటీ ఉద్యోగి గర్వంగా ఫీలవుతాడు తాను మైత్రీవనం బ్రీడ్నని. ఓ ఇంజనీరింగ్ విద్యార్థికి నమ్మకం.. మైత్రీవనం వెళ్తే యూఎస్ స్టాంపింగ్‌కు డేట్ ఫిక్స్ చేసుకోవచ్చని. సిటీకి సంబంధించినంత వరకూ యునెటైడ్ స్ట్రీట్స్ ఆఫ్ అమీర్‌పేట్ యూఎస్ఏ అయితే.. అందులో ఓ ఆరంతస్తుల బిల్డింగ్.. గేట్ వే ఆఫ్ అమెరికాగా నిలిచింది. పాతికేళ్ల కిందట నగరానికి సైబర్ కనెక్టివిటీ అంటే ఏంటో తెలియని రోజుల్లో అది పురుడు పోసుకుంది. అదే.. మైత్రీవనం! లక్షలాది మంది కలలను నిజం చేస్తున్న భవనం!! పాతికేళ్ల కిందట చుట్టూ పచ్చదనం పరుచుకుని.. ఓ చెరువు నిండుగా కళకళలాడుతుండేది. ఆ పచ్చని పరిసరాల్లో వెలసిన ఓ భవంతికి అర్బన్ డెవలప్మెంట్ అధికారులు ‘మైత్రీవనం’గా నామకరణం చేశారు. కొత్త భవిష్యత్తుకు నేనున్నానని ఊతమిచ్చే ఆ భవంతి చుట్టూ కాంక్రీట్ మేటలు పరుచుకున్నా.. ఆ మైత్రి మాత్రం చెక్కుచెదరలేదు. అమీర్‌పేటలోనే కాదు.. అమెరికాలోనూ తెలుగువారు సగర్వంగా చెప్పుకునే ఐటీ హబ్‌గా విరాజిల్లుతోంది. ఫస్ట్ టర్న్ ఆన్ ఇక్కడే హైదరాబాద్‌లో మొదట కంప్యూటర్ ఆపరేట్ అయ్యింది ‘మైత్రీవనం’లోనే. సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ (ఎస్టీపీ) పుట్టింది ఇక్కడే. ఇప్పటి వరకు ఈ వనం నుంచి బయటకు వచ్చిన విద్యార్థుల సంఖ్య పది లక్షలకు పైమాటే. ఈ బిల్డింగ్‌లో దాదాపు యాభై ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఐటీ ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకున్న ప్రతిఒక్కరూ ఇక్కడ అక్షరాభ్యాసం చేయాల్సిందే. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన విద్యార్థులకు మైత్రీవనం భరోసా ఇస్తుంది. కొత్త మిత్రులను పరిచయం చేస్తుంది. ఉదయం పదిన్నర సమయంలో ఈ బిల్డింగ్ లోనికి వెళ్లాలంటే ఓ పావుగంట వెయిట్ చేయాల్సిందే. క్లాసులు ముగించుకొని బయటకు వచ్చే విద్యార్థులతో బిల్డింగ్ పరిసరాలు తిరునాళ్లను తలపిస్తాయి. ఇక్కడ శిక్షణతో ఐటీ హబ్‌లో సుస్థిర స్థానం ఏర్పర్చుకున్న వారి సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. అమీర్‌పేట్ టు అమెరికా ‘అమీర్‌పేట్ టు అమెరికా’ అనే మాట మైత్రీవనం వల్లే అంటారు ఇక్కడి వారు. ‘ ఉదయం ఆరు నుంచి రాత్రి తొమ్మిదింటి వరకు బిల్డింగ్ మొత్తం విద్యార్థులతో కిటకిటలాడుతుంటుంది. ఇక్కడే మూడు క్యాంటీన్లు, చిన్న సైజు షాపింగ్ మాల్స్, రైల్వే, ఎల్ఐసీ సర్వీసులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ భవనంలో స్థలం లేక చుట్టుపక్కల సందుల్లో కూడా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ వందలాదిగా వచ్చేశాయి’ అని చెప్పారు ‘మైత్రీవనం’ మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ డిప్యూటీ ఇంజనీర్ సరోజ. విదేశీ విద్యార్థులతో మైత్రి మైత్రీవనం హైదరాబాదీలకో, ఇతర రాష్ట్రాల విద్యార్థులకో మాత్రమే నేస్తం కాదు.. ఇక్కడ ట్రైనింగ్ కోసం విదేశీ విద్యార్థులూ ఆసక్తి కనబరుస్తున్నారు. దాదాపు తొంభై దేశాల నుంచి విద్యార్థులు ఇక్కడకు వస్తున్నారు. కోర్సుల ఫీజులు తక్కువగా ఉండటం, సౌకర్యవంతంగా ఉండటంతో ఇంజనీరింగ్ విద్యార్థులు మైత్రీవనానికి క్యూ కడుతున్నారు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడంలో మైత్రీవనం ఇన్స్టిట్యూట్లు నంబర్ వన్. అమెరికాలో ఏ కొత్త సాఫ్ట్వేర్ రిలీజ్ అయినా.. రోజుల వ్యవధిలోనే ఇక్కడికి వచ్చేస్తుంది. ‘ మార్కెట్ డిమాండ్‌ను బట్టి దూసుకెళ్లే ఇన్స్టిట్యూట్లకు మైత్రీవనం కేరాఫ్ అడ్రస్’ అని జూమ్ టెక్నాలజీకి చెందిన శివ చెప్పారు. ఇక కొండపల్లి శేషగిరిరావు వేసిన కళాఖండాలు ఈ భవనానికి ప్రత్యేక ఆకర్షణ. ఈ చెట్లూ కొట్టేస్తారట మైత్రీవనం భవనం నిర్మించిన తొలినాళ్లలో ఇక్కడ ఇన్ని భవనాలు, ట్రాఫిక్ ఉండేది కాదు. దీని వెనుక ఒక చెరువు ఉండేది. బోలెడన్ని చెట్లుండేవి. ఇప్పుడు చెట్ల మాట దేవుడెరుగు.. అడుగు పెడదామంటే జానెడు భూమి కూడా లేదు. మెట్రో రైలు మార్గం పనులతో ఇప్పుడున్న నాలుగు చెట్లకూ కాలం చెల్లే పరిస్థితి ఏర్పడింది. మెట్రో గుర్తులు చూస్తున్నారుగా.. అదిగో ఆ తాటిచెట్టును కూడా కొట్టేస్తారట. దాని చుట్టూ అందంగా లాన్‌లా అలంకరించుకున్నాం. రేపో మాపో కూలిపోతుందంటే బాధగా ఉంది.‘మైత్రీ’ జ్ఞాపకాలను పదిలం చేసుకునేందుకు కొందరు ఆ భవనం పరిధిలోని తాటిచెట్టు వద్దకొచ్చి ఫొటోలు తీయించుకుంటున్నారు. - ఎన్.రామకోటేశ్వరరావు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకుడు వానొచ్చెనంటే వరదే ఇన్ని ప్రత్యేకతలున్న మైత్రివనానికి ఓ మచ్చ. భవనం చుట్టూ కాంక్రిట్ జంగిల్ పెరిగిపోవడంతో నీటి బొట్టు ఇంకే దారిలేదు. వర్షాకాలంలో వరద నీరు చేరి సెల్లార్‌లోని వాహనాలు పడవల్లా మారిపోతుంటాయి. బిల్డింగ్ బయట రోడ్లు నాలాలను తలపిస్తాయి. ఈ ఇబ్బందులు పక్కన పెడితే మైత్రీవనం విద్యార్థుల కలలు తీర్చే చక్కటి వేదిక. - భువనేశ్వరి ఫొటోలు: సృజన్ పున్నా -
సూపర్ కాప్.. లక్ష్మీమాధవి
శాంతిదూత: ఆరేళ్ల కిందట అనుకోని రోడ్డు ప్రమాదం. ‘ఎక్కువ సేపు నిలబడడం కూడా కుదరదు’అన్నారు డాక్టర్లు. ఇక ఉద్యోగానికేమెళ్తుంది అనుకున్నారు. ఆమె సంకల్పం, పట్టుదల ముందు అడ్డంకులన్నీ మోకరిల్లాయి. ఆమె మళ్లీ నిలబడటమే కాదు పరుగులు తీసింది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ మళ్లీ డిపార్ట్మెంట్లో అడుగు పెట్టింది. ఇప్పుడు ‘శాంతిదళం’కి ఎంపికయ్యింది. ఆ ఆత్మవిశ్వాసం పేరు లక్ష్మీమాధవి. ఇన్స్పెక్టర్ ఇన్ స్పెషల్ బ్రాంచ్. వచ్చేనెల ప్రపంచశాంతికోసం పనిచేసేందుకు వెళ్తున్న ఆ పోలీస్ స్టోరీ... ఐక్యరాజ్యసమితి ‘శాంతి దళం’ పేరిట ఏటా అన్నిదేశాల నుంచి పోలీసులను ఎంపిక చేస్తుంటుంది. ఈసారి మన దేశం నుంచి 157 మంది ఎంపికయ్యారు. అందులో తొమ్మిది మంది మహిళలు. దక్షిణ భారతదేశంనుంచి ఒకే ఒక్క మహిళ ఇన్స్పెక్టర్ లక్ష్మీమాధవి. ‘డిపార్టుమెంట్లోకి వచ్చిన కొత్తలో ఎ.ఆర్ శ్రీనివాస్ అనే పోలీసుఅధికారి బోస్నియా దేశం వెళ్లారు. మన దగ్గర చిన్నస్థాయిలో పనిచేసే పోలీసుకు విదేశాల్లో అవకాశమెలా వస్తుంది? అనిపించింది. వెంటనే వివరాలు కనుక్కుంటే తెలిసింది ‘శాంతి దళం’ గురించి. ఎనిమిదేళ్లు పనిచేసిన ఏ పోలీసు అధికారి అయినా అప్లై చేసుకోవచ్చు. పరీక్షలన్నింటిలో నెగ్గితే ఏదో ఒక దేశానికి పంపించి ఏడాదిపాటు సేవలందించే అవకాశం కల్పిస్తారు’ అని శాంతిదళం గురించి వివరించారామె. సైప్రస్ దేశానికి... వచ్చేనెల 16న తల్లిదండ్రులతో సైప్రస్ దేశానికి బయలుదేరనున్నారు లక్ష్మీమాధవి. ‘పోలీసు వృత్తిలో ఆడా మగా ఏముంటుంది. ఒంటరిగా ఉండడం ఇష్టం లేక అమ్మానాన్నలను కూడా తీసుకెళుతున్నాను. నాన్న సీతారామయ్య విద్యాశాఖలో పనిచేసి పదవీ విరమణ పొందారు. అమ్మ ఆదిలక్ష్మి గృహిణి. నేను, తమ్ముడు. చిన్నప్పటి నుంచి పోలీసు ఉద్యోగమంటే చాలా ఇష్టం. 2002లో ఎస్ఐగా ఉద్యోగ జీవితం మొదలుపెట్టి సీఐ దాకా ఎదిగాను. ఈ మధ్యనే సేవా మెడల్ కూడా వచ్చింది. ఎన్ని ప్రోత్సాహకాలు వచ్చినా.. నాకు ప్రమాదం జరిగినపుడు డిపార్ట్మెంట్ నా వెన్నుతట్టిన తీరు ముందు అన్నీ బలాదూరే’ అని ఆ విషాద ఘటనను గుర్తు చేసుకున్నారు లక్ష్మీ మాధవి. పునర్జన్మ... ఆరేళ్ల కిందట శ్రీనగర్ కాలనీలో ఉదయం వెహికల్ చెకింగ్ నిర్వర్తిస్తుండగా రాంగ్రూట్లో వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు లక్ష్మీమాధవిని గుద్దింది. తలకు, వెన్నెముకకు బలమైన గాయాలయ్యాయి. వారం రోజులు కోమా. ఏడాదిపాటు మంచంమీద నుంచి కదలలేకపోయింది. తర్వాత ఓపికంతా కూడదీసుకుని పట్టుదలగా అడుగు తీసి అడుగు వేస్తున్న సమయంలో ‘ఇప్పుడే కాదు.. భవిష్యత్‌లో ఎప్పుడూ పరిగెత్తకూడదు, ఎక్కువసేపు నిలబడకూడదు, బరువులు ఎత్తకూడదు, డ్రైవింగ్ చేయకూడదు’ అన్నారు డాక్టర్లు. అది విన్న తల్లిదండ్రులు భోరుమన్నారు. కానీ మాధవి అధైర్య పడలేదు. ‘అందరూ పునర్జన్మ అన్నారు. నేను మరోసారి పోలీసు ఉద్యోగానికి ట్రైనింగ్ తీసుకున్నట్టు భావించాను. అంతే శ్రమించాను. మళ్లీ ఉద్యోగంలోకి చేరతానని డీజీపీగారిని కలిస్తే ‘వెల్కమ్’ అన్నారు. నూతనోత్సాహంతో పనిచేశాను. జరిగిన ప్రమాదాన్ని నన్ను నేను నిరూపించుకోవడానికో అవకాశంగా భావించా. 2012లో శాంతిదళానికి అప్లై చేశా. వారు నిర్వహించిన పరీక్షల్లో అన్నిటికన్నా కఠినమైనది డ్రైవింగ్ టెస్ట్. ఇరుకు సందులో జీపులను పార్కు చేయడం, ఎలాంటి ఇబ్బంది లేకుండా రివర్స్ డ్రైవ్ చేయ డం, ఆ టెస్ట్‌లో నాకు నూటి కి నూరు మార్కులు పడ్డాయి’ అని సంతోషంగా చెప్పారు. నచ్చితే...అక్కడే శాంతిదళంలో సేవలు నచ్చితే మరికొన్నేళ్లపాటు అక్కడే విధుల్లో కొనసాగిస్తారు అధికారులు. ‘ఇప్పటివరకు దేశం దాటింది లేదు. సైప్రస్ గురించి కొన్ని వివరాలు నెట్లో తెలుసుకున్నా. ఎందుకైనా మంచిదని తినే వస్తువుల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తున్నా. అక్కడ విధుల్లో మన ఆయుధాలనే వినియోగించాలి. ఆ దేశ పోలీసువ్యవస్థతో మమేకమై ప్రపంచశాంతికి మా వంతు సేవ చేయడమే ‘శాంతి దళం’ లక్ష్యం. మా లక్ష్యం కూడాను’ అని ముగించారు లక్ష్మీమాధవి. చిన్నవయసులోనే పొరుగుదేశాలకు సేవలందించడానికి వెళుతున్న మన ఇంటి లక్ష్మికి మనం కూడా ఆల్‌దిబెస్ట్ చెబుదాం. - భువనేశ్వరి.. ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి -
శిలలపై శిల్పాలు చెక్కు... నారీ
ఆళ్లగడ్డ... కర్నూలు జిల్లాలోని ఆ ఊరి పేరు చెప్పగానే... రాజకీయ నాయకులకు ఒక రకమైన... సామాజిక పరిశీలకులకు మరో రకమైన అంశాలు గుర్తుకు రావచ్చు. అయితే...చాలామందికి తెలియనిది ఏమిటంటే... అక్కడ కొన్ని వందల కుటుంబాలు... శిలలను శిల్పాలుగా మార్చే వృత్తిలో జీవిస్తున్నాయని! శతాబ్దాలుగా కొన్ని కుటుంబాలు ఈ వృత్తికే అంకితమయ్యాయని!! అంతేకాదు... ఈ ఊళ్లో ఓ అరుదైన మహిళా శిల్పి కూడా ఉన్నారు... శిల్పకళా రంగంలో మహిళలు చాలా అరుదుగా ఉంటారు... చదువుకున్న మహిళలైతే మరీ తక్కువ... కలం పడతారే కాని ఉలి పట్టరు... కానీ, అందుకు భిన్నంగా ఇరవై రెండేళ్ళ భువనేశ్వరి కలం పట్టి చదువుకున్నారు... ఇప్పుడు ఉలి పట్టి శిల్పకళను అభ్యసిస్తున్నారు... ఆళ్లగడ్డకు చెందిన భువనేశ్వరి శిల్పిగా ఎందుకు మారారు? ఎలా మారారు? దాని వెనుక చాలా కథే ఉంది. అందరు ఆడపిల్లల లాగానే భువనేశ్వరి డిగ్రీ పూర్తి చేశారు. వివాహం, సంతానం... వెంటవెంటనే జరిగిపోయాయి. అయితే ఆమె జీవితంలో అనుకోని సంఘటన ఎదురైంది. 2013లో భర్త ఆమెను విడిచి వెళ్లిపోయాడు. అప్పటికి భువనేశ్వరికి ఒక బాబు. చంటిపిల్లవాడితో తండ్రి పంచన చేరారు భువనేశ్వరి. తండ్రికి భారంగా మారకుండా తన కాళ్ల మీద తాను నిలబడాలనుకున్నారు. వారి వంశంలో తరతరాలుగా వస్తున్న శిల్పాల వృత్తిని ఆదాయమార్గంగా ఎంచుకున్నారు. బిఈడి పూర్తిచేసినా టీచరుగా చేరకుండా స్వయంగా శిల్పాలు చెక్కడం నేర్చుకోవడం ప్రారంభించారు భువనేశ్వరి. ఇందుకు కారణం... ఇటీవలే ‘లా' ఎంట్రన్స్ ప్యాసైన భువనేశ్వరి, తనలాగ ఎవరైనా స్త్రీలు బాధపడుతుంటే వారికి సహాయపడాలనుకుంటున్నారు. ‘‘నేను జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాను. ఒకరోజు నాన్న నాతో ‘శిల్పాలు చేసే వాళ్లు పనులు లేక ఇబ్బంది పడుతున్నారు’ అని చెప్పారు. నాకు అప్పుడు ఆలోచన వచ్చింది. ఎవరో వచ్చి శిల్పాలు కొంటారని ఎదురు చూసేకన్నా, మనమే వినియోగదారులకు దగ్గరయ్యేలాగ ఏదైనా చేస్తే బాగుంటుంది కదా అని! ఆ ఆలోచనకు వెంటనే కార్యరూపం ఇచ్చేశాను! మొదటినుంచీ నాకు ఇంటర్నెట్లో సొంతంగా పెట్టే బ్లాగులు, ఫేస్బుక్, యూ ట్యూబ్ వంటివి ఉపయోగించడం అలవాటే. దాంతో ముందుగా నా సొంత బ్లాగ్ ప్రారంభించాను. దానికి స్పందన బాగానే వచ్చింది’’ అంటారు భువనేశ్వరి ఫేస్‌బుక్‌తో మారిన ఫేట్... ఫేస్బుక్లో రకరకాల వస్తువులను అమ్మకానికి ఉంచడం గమనించిన భువనేశ్వరి, తాను కూడా శిల్పాలను సులువుగా అమ్మడానికి ఆ మార్గం ఎంచుకుంటే బావుంటుందనుకుని, తమ వద్ద తయారైన శిల్పాల ఫొటోలను ఫేస్బుక్లో ఉంచడం ప్రారంభించారు. మెల్లగా ఆర్డర్లు రావడం మొదలయ్యాయి. ‘‘వినియోగదారుల అభిరుచి మేరకు ఫేస్బుక్లో ఆర్డర్లు తీసుకుని, వాటికి తగ్గట్టుగా శిల్పాలు తయారు చేయడం కూడా ప్రారంభించాను’’ అంటారు భువనేశ్వరి. నా జీవితంలో మరచిపోలేను..! ఆమె సాధించిన విజయం అంత తేలికగా సాధ్యం కాలేదు. ఒక సంవత్సరం పాటు ఎంతో కష్టపడిన తర్వాతే ఆర్డర్లు రావడం ఆరంభమైంది. ‘‘కిందటి సంవత్సరం ఒక విదేశీ వనిత ... ఆరడుగుల బుద్ధుడి విగ్రహం, డైనింగ్ టేబుల్ సెట్, రెండు నీటితొట్లు, బఫే టేబుల్ ఫేస్బుక్ ద్వారా ఆర్డరిచ్చారు. అదే నేను అందుకున్న మొదటి ఆర్డరు, తొలి సంపాదన కూడా! ఇటీవల ఆమె ఇండియాకు వచ్చినప్పుడు నన్ను చూడాలని సరాసరి మా ఇంటికి వచ్చారు. అది నిజంగా నా జీవితంలో మరచిపోలేని సంఘటన’’ అని ఎంతో సంబరంగా వివరించారు భువనేశ్వరి. అలాగే హైదరాబాద్ నివాసి సిద్ధలక్ష్మి, భువనేశ్వరి దగ్గర దేవుడి విగ్రహాలు కొనుగోలు చేశారు. అవి ఆవిడకు అమితంగా నచ్చడంతో పారితోషికంతో పాటు భువనేశ్వరికి చీర సారె పంపారు. అది తన జీవితంలో ఎంతో ఆనందాన్ని ఇచ్చిన రోజని చెబుతున్న భువనేశ్వరి జీవితం కూడా కాలం చెక్కిన ఒక శిల్పం లాంటిదే! - డా. వైజయంతి శిల్పాల అమ్మకం ప్రారంభిస్తానని నాన్నతో అన్నాను. ఆయన సరే అన్నారు. కానీ శిల్పాల తయారీలో తోడ్పడే వర్కర్స్ మాత్రం బాగా ఇబ్బంది పెట్టారు. ఒక ఆడమనిషి చెబితే మనం చేయటం ఏంటి అనుకున్నారు. కొందరైతే ముఖం మీదే అన్నారు. సరైన సమయం కోసం నిరీక్షించాను. ఫేస్బుక్లో మేం తయారు చేసిన శిల్పాల వివరాలు పెట్టాక, మెల్లగా ఆర్డర్లు రావడం ప్రారంభమయ్యాయి. ఇప్పుడు అందరూ వచ్చి, ‘ఏదైనా పని ఉంటే చెప్పండి’ అంటున్నారు. - భువనేశ్వరి, విగ్రహ శిల్పి -
నారా వారూ ఈ కారెవరిది?
-
నారా వారూ ఈ కారెవరిది?
భువనేశ్వరికి ఒకే కారుందని బాబు తప్పుడు అఫిడవిట్ రవాణా శాఖ రికార్డుల్లో ఆమె పేరిట రెండు కార్లు హైదరాబాద్: తన కార్ల విషయుంలో చంద్రబాబునాయుుడు తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన సంగతి బయుటపడింది. నామినేషన్ సందర్భంగా సవుర్పించిన అఫిడవిట్లో తన పేరుపై ఒక కారు, భార్య భువనేశ్వరి పేరుపై మరో కారు ఉందని పేర్కొన్నారు. నిజానికి భువనేశ్వరి పేరుపై రెండు కార్లు ఉన్నట్లు రాష్ట్ర రవాణా శాఖ రికార్డుల్లో నమోదై ఉంది. కుప్పం అసెంబ్లీ స్థానానికి తెలుగుదేశం అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నామినేషన్ పత్రాలు, ఆస్తుల వివరాలతో కూడిన అఫిడవిట్లను.. ఆయున తరఫున అతని కుమారుడు నారా లోకేష్ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వేణుగోపాల్‌రెడ్డికి ఏప్రిల్ 14న అందజేశారు. అఫిడవిట్లో చంద్రబాబు పేరుపై రూ.2,22,500 విలువైన అంబాసిడర్ కారు (ఏపీ 09 జీ 0393), తన భార్య భువనేశ్వరి పేరుపై రూ.91,92,946 విలువైన కారు (ఏపీ 09 బీవీ 0393) ఉందని పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా భువనేశ్వరి పేరుపై రూ.12 లక్షల విలువైన హ్యుండాయ్ టైన్ కారు (ఏపీ 09 ఏవీ 0393) కూడా రిజిస్టర్ అయినట్లు ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ రికార్డుల్లో స్పష్టంగా ఉంది. ఎన్నికల సంఘం బాబుగారి విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. -
శక్తి అంతా మీలోనే ఉంది... ధీరులై లేచి నిలబడండి..!
సుబోధ శక్తి అంతా మీలోనే ఉంది... ధీరులై లేచి నిలబడండి..! కలకత్తాలో భువనేశ్వరీదేవి, విశ్వనాథ దత్తా దంపతులకు 1863 జనవరి 12న నరేంద్రనాథ్ దత్తాగా జన్మించిన ఓ బాలుడు, చిన్న వయసులోనే శ్రీ రామకృష్ణ పరమహంస ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో ఒదిగాడు. స్వామి వివేకానందగా ఎదిగాడు. కేవలం తన ఒక్కడి మోక్షం కోసం సాధన చేేన సాధారణ తపస్విలా కాక, సమాజంలోని దీనులను ఉద్ధరించాలని తపించిన మహోన్నతుడిగా చివరి దాకా జీవించారు వివేకానంద. ఆధ్యాత్మికత అంటే, ముక్కు మూసుకొని, ప్రపంచానికి దూరంగా బతకడమని ఆయన చెప్పలేదు. తోటి మానవుడిలోనే మాధవుడున్నాడన్న వాస్తవాన్ని బలంగా ప్రతిపాదించారు. అందుకే ఆయన ఓ సందర్భంలో, ‘‘నా మాటంటే మీకు ఏమైనా విలువ ఉంటే, నేనొక సలహా ఇస్తాను. మీ ఇంటి కిటీకీలు, తలుపులు తెరిచేయండి! మీ వాటాలో పతనావస్థలో, దుఃఖంలో పేదవాళ్ళు కుప్పలుగా పడి ఉన్నారు. వారి దగ్గరకు వెళ్ళి, ఉత్సాహంతో, పట్టుదలతో సేవచేయండి. జబ్బుపడిన వారికి మందులివ్వండి. యావచ్ఛక్తితో వారికి ఉపచర్య చేయండి. తిండి లేక మాడిపోతున్నవాళ్ళకు ఆహారం అందించండి. అజ్ఞానులైన వారికి మీలో ఉన్న జ్ఞానం మేరకు బోధనలు చేయండి..’’ అని అతి పెద్ద ధర్మసూక్ష్మాన్ని అత్యంత సరళంగా చెప్పేశారు. ‘‘ప్రతి పురుషుణ్ణీ, స్త్రీనీ, ప్రతి జీవినీ దైవంగా చూడండి. అత్యంత నిష్ఠను పాటించిన అనంతరం నేను ప్రతి జీవిలోనూ భగవంతుడున్నాడనే పరమ సత్యాన్ని కనుగొన్నాను. అది వినా వేరే దైవం లేదు’’ అని తేల్చారు. మరో అడుగు ముందుకు వేని,... ‘‘ప్రత్యక్ష దైవమైన నీ సోదర మానవుణ్ణి పూజించలేనివాడివి, ప్రత్యక్షం కాని పరమాత్ముణ్ణి ఎలా పూజించగలవు?’’ అని సూటిగానే ప్రశ్నించారు. ‘జీవాత్మ సేవ చేసేవాడు పరమాత్ముని సేవించినట్లే!’ అని పదే పదే గుర్తు చేశారు. మహాత్మాగాంధీ అన్నట్లు ‘‘స్వామి వివేకానందుని బోధనలకు ప్రత్యేకంగా ఎవరి నుంచీ ఎటువంటి పరిచయమూ అవసరం లేదు. చదివేవారి మీద వాటంతట అవే చెరగని ముద్ర వేస్తాయి.’’ భౌతికంగా కనుమరుగైన 111 ఏళ్ళ తరువాత కూడా ఇప్పటికీ నిత్య చైతన్య దీప్తిగా స్వామీజీని నిరంతరం తలుచుకోవడం, అన్నేళ్ళ క్రితం ఆయన చెప్పిన మాటలతో నవతరం స్ఫూర్తి పొందడమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. చింతన జెన్ అంటే ఏమిటి? భారతదేశంలో పుట్టి, చైనాలో చిన్‌గా మారి, కొరియా, జపాన్ నేలల్లో ఇంకి, ఆ దేశాలను సారవంతం చేసిన ఒక అద్భుత, సజీవ చైతన్యమే జెన్. బౌద్ధ, జైన మతాలలోని కఠోర నిబంధనలను అనుసరించలేని వారికోసం ఆ రెండు మతాల మేలు కలయికగా పుట్టిందే జెన్. దీనిని ఎవరు ప్రతిపాదించారో ఇతమిత్థంగా తెలియదు. అయితే బోధిధర్ముడే దాని మూలపురుషుడని కొన్ని గ్రంథాలు చెబుతాయి. ఇంతకీ జెన్ అంటే ఏమిటి... చతురోక్తులు, సునిశిత హాస్యం, విషాదం, సరసం తదితరాలు కలిసిన ఓ నవరస గుళిక. మనలోని నైపుణ్యాల వెలికితీతకు ప్రతీక. ప్రాపంచికమైన జీవితానికి, విషయాలకు సంబంధించి ఒక కొత్త దృక్పథాన్ని ఏర్పరచుకునేందుకు అనువైన మార్గమే జెన్. జీవితాన్ని తాజాగా, మరింత సంతృప్తిగా ఉంచే మార్గం జెన్. గురువుల సహకారంతో వ్యక్తిగత అనుభవం ద్వారా సమకూరే ఒక ఆధ్యాత్మిక సంపూర్ణ జ్ఞానం జెన్. మనం ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో జీవన సరళినే ఉదాహరణగా సరళమైన కథల రూపంలో.. కళ్లకు కడుతుంది. జెన్ కథలను చదివితేమన లోపాలు ఏమిటో మనకే తెలిసిపోతాయి. సమస్యను ఎలా ఎదుర్కోవాలో బోధపడుతుంది. అందుకే జెన్ కథలు ఇటీవల కాలంలో బహుళ ప్రాచుర్యం పొందాయి. -
మనసును అధీనంలో ఉంచుకునే ఉపాసన
ఏదైనా పనిచేయడం కష్టమైతే... ఏమీ చేయకుండా, ఏం మాట్లాడకుండా ఉండడం అతికష్టం. అయితే మనిషిలో నుంచి ‘ప్రతిచర్య’ని బయటికి పంపేయాలంటే అదొక్కటే మార్గమంటోంది విపస్సన. పదిరోజుల ధ్యానం ప్రశాంతతతో పాటు మెదడుని కడిగే పనికూడా చేస్తుంది. విపస్సన ధ్యాన కేంద్రాలు మన దేశంలో మూడు దశాబ్దాలుగా సేవలందిస్తున్నాయి. విద్యార్థుల నుంచి వృద్ధులవరకూ ఆ కేంద్రాల్లో పదేసి రోజులు సేదతీరుతున్నారు. బుద్ధుని బహుమతి విపస్సన అనేది బుద్ధభగవానుడు స్వయంగా శోధించి, సాధించిన ధ్యాన ప్రక్రియ. దానికి ‘శ్వాస‘ని ఆయుధంగా ఎంచుకున్నాడు.మనసుకి, శరీరానికి వారధిలా శ్వాస ఉంటుందని కనుగొన్నాడు. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మన శ్వాస కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా! దాని ఆధారంగా మన భావోద్వేగాలను ఎప్పటికప్పుడు నియంత్రించుకోవచ్చని చెప్పాడు. మామూలుగా ధ్యానం చేసేటప్పుడు దృష్టిని మనసుపై ఉంచమంటారు. ఇక్కడ మాత్రం శ్వాసపైనే ఉంచాలి. ఈ సమయంలో తల నుంచి పాదాలవరకూ బోలెడు సంవేదనలు అవుతుంటాయి. వాటిని గమనిస్తూ ఉండాలి. దానివల్ల మీలోని భయాలు, అర్థంలేని ఆలోచనలు, అపోహలు మెల్లగా తొలగిపోతుంటాయి. ఒక్కరోజులో కాదు...కొన్నాళ్లపాటు చేసే సాధన వల్ల. ఆ సూత్రంతోనే విపస్సన మొదలవుతుంది. బుద్ధుని ప్రవచనాలు ప్రపంచమంతా పాకిన సమయంలో ఒక్క బర్మాలో మాత్రమే విపస్సన సిద్ధాంతాలు, ఆచరణ స్వచ్ఛంగా అమలయ్యాయి. విపస్సన ఫలితాలు బాగా తెలిసినవారిలో అశోక చక్రవర్తి ఒకరు. ఆయన వల్ల కూడా దీనికి ఎక్కువ ప్రచారం వచ్చిందని చెబుతారు. రోజూ ఇల్లు సర్దుకున్నట్టే ఏ రోజుకారోజు మెదడును కూడా శుభ్రం చేసుకోవాలి. లేదంటే దుమ్ము కొట్టుకుపోతుంది. దానికితోడు ప్రతి చిన్న విషయానికీ ప్రతిచర్యగా మనం చేసే పనులు మనసుని మరింత మసకబారుస్తాయి. మరి మన మెదడులో అడుగుపెట్టి అక్కర్లేని వాటిని బయటికి విసిరిపారేసే పని ఎవరు చేస్తారు? ఎలా చేస్తారు? ఒక్కసారి విపస్సనలో అడుగుపెడితే అన్ని పనులూ వాటంతటవే జరిగిపోతాయి. మీవంతుగా మీరు చేయాల్సిందల్లా మాట్లాడకుండా ఉండడమే. మౌనంగా మిమ్మల్ని మీరు గమనించుకోవడమే. ఉచితంగా నేర్పే ధ్యానం కాబట్టి అంతకంటే ఉచితంగా మనల్ని మనం ఆ పక్రియకి అంకితం చేయాలి. అప్పుడే మనసు శుద్ధి అవుతుంది. ఎప్పటికప్పుడు అదే మెదడుని శుభ్రం చేస్తుంటుంది. మౌనంతోపాటు... పదిరోజుల సాధనలో మొదటిరోజు మౌనంగా కళ్లు మూసుకుని కూర్చోమంటారు. దాని పేరు ఆన..పాన. ఆన అంటే శ్వాసని లోపలికి తీసుకోవడం. పాన అంటే బయటికి వదలడం. మధ్య మధ్యలో బ్రేక్ ఇచ్చుకుంటూ రోజంతా నాలుగు గంటలపాటు ధ్యానంలో ఉంటారన్నమాట. ఆ రోజు మొత్తంలో రెండు సత్యాలు గ్రహిస్తారు. ఒకటి... మనసు ఆధీనంలో ఉండదు. రెండోది ఆలోచనంతా గతం, భవిష్యత్తుపైనే ఉంటుంది గాని వర్తమానంలో ఉండదని. రెండోరోజు మౌనంతోపాటు దేహ చర్యలకు స్పందించకుండా ఉండాలి. ఆ సాధన సారాంశమేమిటంటే... తెలియకుండా చేసేదే ప్రతిచర్య. తెలుసుకుని చేసేది చర్య. కాబట్టి దృష్టి కేవలం చర్యలపైనే ఉంచితే మనం చేసే పనుల ఫలితాలు ఆశించినట్టుగా ఉంటాయి. ఇలా ఒక్కోరోజు ధ్యానంలో ఒక్కో విధంగా మనసుని నియంత్రించుకునే ప్రక్రియ కొనసాగుతుంది. విపస్సన కేంద్రానికి వెళ్లేవారెవరూ డబ్బులు కట్టక్కర్లేదు కాని... తోచినంత విరాళం ఇవ్వొచ్చు. దేశవ్యాప్తంగా యాభైకేంద్రాలకు పైగానే ఉన్నాయి. మన రాష్ర్టంలోనే ఆరు కేంద్రాలున్నాయి. అన్ని కేంద్రాలు విపస్సన ట్రస్ట్ పేరుతోనే నడుస్తున్నాయి. అక్కడ శిక్షకులు కూడా ఉచితంగానే పనిచేస్తున్నారు. విపస్సన కేవలం పెద్దవాళ్లకే కాదు...పదేళ్లనుంచి పదిహేనేళ్ల వయసు పిల్లలకు, యువతకు కూడా ప్రత్యేకంగా ఉంటుంది. మనిషి జీవితం వేగంలో పడి కొట్టుకుపోతోంది. విశ్రాంతి పేరుతో చేసే పనులు కూడా మెదడుని ఛిద్రం చేస్తున్నాయి. ప్రశాంతత అనే దాహం తీర్చుకోడానికి ఎడారుల వెంట తిరుగుతున్న మనిషికి విపస్సన చల్లటి నీళ్లు అందిస్తుంది. దాహం వేసినా వేయకపోయినా తగినంత నీరు శరీరానికి అవసరం అని వైద్యులు చెబుతున్న మాటల్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి నీటితోనే మెదడుని కడిగి శుభ్రం చేసే విపస్సన దగ్గరికి వెళ్లే అవసరం అందరికీ ఉంది. - భువనేశ్వరి పదిమందికీ పంచాలని... బర్మాలో పుట్టిపెరిగిన ఎస్.సత్యనారాయణ గోయెంకా పూర్వీకులు భారతీయులు. తనను తీవ్రంగా బాధించిన పార్శ్వపునొప్పికి విరుగుడుగా విపస్సనకు వెళ్లిన సత్యనారాయణకు వెంటనే ఉపశమనం కలగడంతో మనసుకి, శరీరానికి విపస్సనకు మించిన రక్షణ మరొకటి లేదని అర్థమైంది. దాంతో ఒక పక్క తన వ్యాపారాలు చేసుకుంటూనే విపస్సన శిక్షకుడిగా పద్నాలుగేళ్లు శిక్షణ పొందారు. 1976లో భారతదేశానికి వచ్చినపుడు తన తల్లిదండ్రులతోపాటు మరో పదిమందితో విపస్సన సాధన చేయించారు. కేవలం నోటిమాటతో జరిగిన ప్రచారం ఆయనతో విపస్సన కేంద్రాలు పెట్టించింది. మొదట ముంబై, హైదరాబాద్ నగరాల్లో పెట్టారు. మెల్లగా దేశంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో గోయెంకా మరణించారు. ఆయన కన్నుమూసే చివరిక్షణం వరకూ విపస్సన ద్వారా అందించే సేవల గురించే ఆలోచించారు. (జనవరి 20న ఆయన తొంభయ్యవ జయంతి). -
నేటీ మధ్యహ్నం కొచ్చిలో శ్రీశాంత్ పెళ్లి
-
నాలుగు రెట్లు ఇస్తాం.. మీ ఆస్తులు రాసిస్తారా?: ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి
సాక్షి, కాకినాడ: ‘మీరు ప్రకటించిన రూ.41.70 కోట్ల విలువైన ఆస్తులకు నాలుగు రెట్లు మేము అడుక్కొనైనా మీకిస్తాం. మీ ఆస్తులు మాకు రాసిచ్చేస్తారా’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాకినాడ సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఆయన కాకినాడలో మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. సత్యహరిశ్చంద్రునిలా తన వ్యక్తిగత ఆస్తి రూ.42 లక్షలేనని, తన భార్య భువనేశ్వరికి రూ.33.05కోట్లు, కుమారుడు లోకేష్‌కు రూ. 4.92 కోట్లు, కోడలు బ్రహ్మణికి రూ. 3.30 కోట్లు అంటూ మొత్తం కుటుంబ ఆస్తి కేవలం 41.70 కోట్లు మాత్రమేనంటూ ప్రకటించడం ఎవర్ని మోసగించడానికని ప్రశ్నించారు. బ్రహ్మణికి రూ.9.90 లక్షల విలువైన బంగారు ఆభరణాలు మాత్రమే ఉన్నాయని ప్రకటించారని, అయితే తన చెల్లెలు వివాహానికి బ్రహ్మణి వేసుకున్న వస్తువులను టీవీ చానల్స్ అన్నీ చూపించాయన్నారు. వాటి విలువ ఎంతో మీకు తెలియకపోతే తమకిస్తే విలువ కట్టిస్తామన్నారు. మీరు చెప్పే కాకిలెక్కలను చూసి ప్రజలు మోసపోరని దుయ్యబట్టారు. చంద్రబాబు ఒక ఉగ్రవాదిలా తయారయ్యారని, అమెరికాలో ట్విన్ టవర్స్‌ను కూల్చివేసి ఉగ్రవాది బిన్‌లాడెన్ అమెరికాను అతలాకుతలం చేస్తే రాష్ర్ట విభజనకు అనుకూలంగా రెండు లేఖలు ఇచ్చి ఆయన ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేశారని మండిపడ్డారు. తెలంగాణ ప్రక్రియ మొదలవుతుందని కేంద్రం ప్రకటిస్తే రెండు రాష్ట్రాల్లో టీడీపీ ఉంటుందని, ఒక రాష్ర్టంలో లోకేష్, మరో రాష్ర్టంలో తాను సీఎం అవుదామనే ఆశతో బాబు కాంగ్రెస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. -
ఆస్తి లెక్కల్లో గారడీ చేసిన చంద్రబాబు
-
చంద్రబాబు నాయుడు లెక్కలు భలే!
జూబ్లీహిల్స్‌లో 1,125 గజాల భవనం విలువ రూ.23 లక్షలేనట పక్కనే 1,285 గజాల లోకేశ్ భవనం విలువ రూ.2.36కోట్లే పంజాగుట్టలోని భవనం ధర కూడా కేవలం రూ.73 లక్షలు మాదాపూర్‌లో 924 గజాల స్థలానికైతే రూ.3.37 లక్షలే బాబు కుటుంబ భూముల విలువ గతేడాదే రూ.500 కోట్లంటూ వార్తలు ఈ ఏడాది వాటి విలువ మరింత భారీగా పెరిగిందంటున్న నిపుణులు నగరం నడిబొడ్డున, అత్యంత ఖరీదైన జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సమీపంలోని చంద్రబాబు నివాసమిది. 1,125 గజాల్లో ఉన్న ఈ ఇంటి విలువ కేవలం 23.2 లక్షలేనని బాబు చెబుతున్నారు. 2007లోనే ఆయన ఇంటికి సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని వేలం వేసినప్పుడు ఐసీఐసీఐ కన్సార్షియం గజం రూ. లక్ష చొప్పున కొనుగోలు చేసింది. ఈ లెక్కన చంద్రబాబు ఇంటి విలువ ఎంత ఉంటుందో తేలికగా అంచనా వేయొచ్చు. ఈ ఉదాహరణ చూస్తే చాలదా.. బాబు ఆస్తి లెక్కలన్నీ.. ఎంతటి కాకి లెక్కలో! సాక్షి, హైదరాబాద్: సాధారణంగా ఎవరైనా తనకున్న స్థలాన్నో, ఇంటినో విక్రయించాలంటే ప్రస్తుత మార్కెట్ ధర ఎంతో అంతకే అమ్ముతారు. అంతేగాని దాన్ని కొనుగోలు చేసిన రోజు ధర ఎంతుందో ఇప్పుడు కూడా దాని విలువ అదేనని, ఆ లెక్కన తన ఆస్తి కూడా అంతే అనుకొమ్మని అంటే ఎవరైనా నవ్విపోతారు. ఎందుకంటే ప్రభుత్వం నిర్దేశించిన (రిజిస్ట్రేషన్) విలువ కంటే మార్కెట్ రేటు ఎంతో ఎక్కువగా ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. కానీ తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు మాత్రం తన ఆస్తుల ప్రకటనలో భాగంగా జూబ్లీహిల్స్‌లోని తన ఇంటి విలువను దాన్ని కొనుగోలు చేసినప్పటి రూ.23.2 లక్షలుగానే చూపించుకున్నారు! జూబ్లీహిల్స్‌లో రోడ్ నంబర్ 65లో 1,125 చదరపు గజాల ప్లాట్ నంబర్ 1310చంద్రబాబుది. కాగా, దాని పక్కనే 1,285 చదరపు అడుగులున్న 1309 నంబర్ ప్లాట్ ఆయన కుమారుడు లోకేశ్‌ది. తన ఇంటి విలువ ప్రస్తుతం ఎంతో చెప్పకుండా, రూ.23 లక్షలకు కొన్నానని మాత్రమే చెప్పి సరిపెట్టిన బాబు, లోకేశ్ ప్లాట్లోని భారీ భవనం విలువను కూడా అలాగే రూ.2.36 కోట్లుగా మాత్రమే చూపించారు. పైగా రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మదీనగూడ సర్వే నంబర్ 51 (ఎ)లోని ఐదెకరాల భూమి విలువను పేర్కొననే లేదు! దాన్ని లోకేశ్‌కు నాయనమ్మ బహుమతిగా ఇచ్చారని మాత్రమే పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ నడిబొడ్డున పంజాగుట్టలో 650 చదరపు గజాల్లో తన భార్య భువనేశ్వరి పేరుతో ఉన్న భవనం విలువను కూడా రూ.73.33 లక్షలుగా చూపారు బాబు! మహారాష్ట్రలోని అలీబాగ్ తాలూకా సోగాం గ్రామంలో 8.426 ఎకరాల భూమి విలువను రూ.58.69 లక్షలుగా, తమిళనాడులో ఎంజీఆర్ జిల్లా శ్రీపెరుంబదూర్ తాలూకాలోని 2.33 ఎకరాల భూమి విలువ రూ.1.86 లక్షలుగా, రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మదీనగూడ సర్వే నంబర్ 51లోని ఐదెకరాల భూమికి రూ.73.8 లక్షలుగా చూపించారు. భువనేశ్వరికున్న 2,780 గ్రాముల బంగారు ఆభరణాల ధర రూ.26.96 లక్షలుగా, 32.7 కిలోల వెండికి రూ.4.57 లక్షలని పేర్కొన్నారు. బాబు కోడలు బ్రహ్మణికి మాదాపూర్‌లో 924 చదరపు గజాల స్థలం విలువను రూ.3.37 లక్షలుగా, నందగిరి హిల్స్‌లోని 778 చదరపు గజాల స్థలం విలువ రూ.4.79 లక్షలుగా, రంగారెడ్డి జిల్లా మణికొండ (సర్వే నంబర్ 211(పి))లోని ప్లాట్ నంబర్ 19, ప్లాట్ నంబర్ 20 కలిపి 2440 చదరపు గజాల స్థలానికి రూ.1.15 కోట్లుగా, చెన్నై టెంపుల్ స్టెప్స్లోని 4,782 చదరపు అడుగుల వాణిజ్యపరమైన ఆస్తి విలువను రూ.48 లక్షలుగా చూపారు. ఆమెకున్న 2,325 గ్రాముల బంగారు ఆభరణాలకు రూ.9.9 లక్షలు, 97.441 కిలోల వెండికి రూ.12.37 లక్షలు చూపించారు. ఇవిగాక నిర్వాణ హోల్డింగ్స్, హెరిటేజ్ ఫుడ్స్‌లో వాటాల వివరాలిచ్చారు. చంద్రబాబు చెప్పిన లెక్కల ప్రకారం 2013 మార్చి 31కి ఆస్తుల వివరాలు... చంద్రబాబు భువనేశ్వరి లోకేశ్ బ్రహ్మణి 42.06 లక్షలు 48.85 కోట్లు 9.73 కోట్లు 3.3 కోట్లు ఈ లెక్కన తన మొత్తం కుటుంబ ఆస్తి రూ.62.30 కోట్లేనని వెల్లడించారు బాబు. కానీ గతేడాదే మార్కెట్ ధర మేరకు బాబు కుటుంబ భూముల విలువ కలిపి రూ.500 కోట్లకు పైనే ఉంటుందని మార్కెట్ నిపుణుల అంచనాగా వార్తలొచ్చాయి. ఈ ఏడాది వాటి విలువ మరింత భారీగా పెరిగిందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.