భారతీయ మహిళా బ్యాంక్ | Indian Women's Bank | Sakshi
Sakshi News home page

భారతీయ మహిళా బ్యాంక్

Published Thu, Dec 4 2014 11:32 PM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM

భారతీయ మహిళా బ్యాంక్

భారతీయ మహిళా బ్యాంక్

మహిళ కష్టపడి డబ్బు సంపాదిస్తే సరిపోతుందా? దాన్ని దాచుకునే దారి కూడా ఉండాలి కదా! ఇక్కడ మాట్లాడుతున్నది పెద్ద ఉద్యోగాలు చేస్తూ వేలు, లక్షల రూపాయలు సంపాదించే మహిళల గురించి కాదు.. రోజు కూలీ చేసుకునే సామాన్య మహిళకు పొదుపు చేసుకునేందుకు భద్రమైన చోటు కావాలి. బ్యాంక్‌లో నాలుగు పైసలుంటే ఉండే భద్రత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్క భారతీయ మహిళకూ బ్యాంక్‌లో అకౌంటు ఉండాలనే లక్ష్యంతో గతేడాది ముంబైలో ‘భారతీయ మహిళా బ్యాంక్’ నెలకొల్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 35 భారతీయ మహిళా బ్యాంక్‌లున్నాయి. పందొమ్మిదో బ్రాంచ్‌గా హైదరాబాద్‌లో వెలసిన బీఎమ్‌బీ.. అకౌంట్ల ఓపెనింగ్‌లో తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
- భువనేశ్వరి
 
ఈ ఏడాది మార్చిలో అమీర్‌పేట దగ్గర భారతీయ మహిళా బ్యాంక్ (బీఎమ్‌బీ)ని  నెలకొల్పిన కొత్తలో సిబ్బంది పడ్డ పాట్లు అన్నీఇన్నీ కావు. ‘బ్యాంక్‌లో మొత్తం ఆరుగురు మహిళా ఉద్యోగులం ఉన్నాం. మా బ్యాంక్ చుట్టూ మరో నాలుగు ఇతర బ్యాంకులున్నాయి. ఎవరొచ్చినా వాటిలోకే వెళ్లేవారు. ఒక్కరు కూడా మా బ్యాంకు వైపు తొంగి చూసేవారు కాదు. ‘మహిళా బ్యాంక్‌లో సొమ్ము దాచుకోవడం ఏంటమ్మా..’ అంటూ హేళన చేసేవారు ఎదురయ్యారు.

లాభం లేదని మేమంతా కుర్చీలు వదిలేసి బ్యాంక్ బయట మెట్లపై కూర్చొని అటుగా వచ్చేవారికి మా బ్యాంక్ గురించి చెప్పడం మొదలుపెట్టాం. చాలావరకూ మహిళలకే చెప్పేవాళ్లం. కొందరు బ్యాంక్ లోపలికి వచ్చి మరిన్ని వివరాలు తెలుసుకుని అకౌంట్ ఓపెన్ చేసేవారు. కొన్ని రోజులు గడిచాక మేం మా సీట్లలో కూర్చుని పనిచేయడం మొదలుపెట్టాం’ అంటూ తమ బ్రాంచ్ ఓపెన్ అయిన తొలినాళ్లను గుర్తు చేసుకున్నారు సీనియర్ మేనేజర్ సుచరిత.
 
క్యాంప్.. ఆపరేషన్..
మహిళా ఖాతాదారుల సంఖ్య వేగంగా పెంచాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు బ్యాంక్ సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేశారు. వారాంతాల్లో మురికివాడలకు వెళ్లి అక్కడి మహిళల్ని కలసి కౌన్సెలింగ్ ఇచ్చి వారితో ఖాతాలు తెరిపించడం మొదలుపెట్టారు. దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో విరివిరిగా క్యాంపులు నిర్వహించారు. ఫలితంగా.. పట్టుమని పదినెలలు కూడా పూర్తి కాకుండానే బ్యాంకులో అకౌంట్ల సంఖ్య 7 వేలకు చేరింది. ఇందులో ఆరున్నరవేల ఖాతాలు మహిళలవే కావడం విశేషం.

‘పేద, సామాన్య మహిళలు ఏదో ఒక పనిచేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటున్నారు. కానీ వాటిని పొదుపు చేసుకునే తీరు, దారి తెలియక ఇబ్బందిపడుతుంటారు. అలాంటివారు ఎక్కడున్నారో ముందుగా ఎంక్వయిరీ చేసుకుని వారి ఇళ్లకు వెళ్లి.. బీఎమ్‌బీ గురించి వివరించాం. అప్పుడప్పుడు క్యాంపులు నిర్వహించాం. ‘బ్యాంకు ఖాతా వల్ల ఉపయోగం ఏంటి..?’ అనేవారికి ప్రత్యేక కౌన్సెలింగ్ ఇస్తున్నాం..’ అని వివరించారు మేనేజర్ విశాలిని.
 
నమ్మకమే పూచీకత్తు..
మహిళలకు పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వడం బీఎమ్‌బీకున్న ప్రత్యేకత. మామూలుగా అయితే ష్యూరిటీ లేనిదే రూపాయి కూడా లోన్ ఇవ్వరు. అయితే మహిళా సాధికారికత కోసం ప్రత్యేక పథకం కింద బీఎమ్‌బీ పూచీకత్తు లేని రుణాలు అందిస్తోంది. ‘కర్రీ పాయింట్లు, క్రష్‌లు, క్యాటరింగ్ వ్యాపారాలు, బ్యూటీపార్లర్‌లు వంటి చిన్న చిన్న వ్యాపారాలకు మహిళల దగ్గర ఎలాంటి పూచికత్తులు కోరడం లేదు మేం.

ఆసక్తి ఉన్న మహిళలతో మేమే దగ్గరుండి వ్యాపారం పెట్టిస్తున్నాం. అలా ఇప్పటివరకూ వంద మంది మహిళలతో చిన్న వ్యాపారాలు పెట్టించాం’ అని వివరించారు బ్యాంక్ ఉద్యోగి సుచరిత. ఖాతాలు తెరిపించడం, వ్యాపారాలు పెట్టించడంతో ఆపకుండా.. కార్పొరేట్ రంగంలో కూడా మహిళలకు అండగా నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement