Indian Womens Bank
-
విలీనంతో ఎస్బీఐ ఆస్తులకు దన్ను
విలువ రూ. 30 లక్షల కోట్లకు బలమైన ప్రపంచ స్థాయి బ్యాంకుగా అవతరణ ముంబై : 5 అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు విలీనంతో ఎస్బీఐ ఆస్తుల విలువ భారీగా పెరగనుంది. మరెన్నో ప్రయోజనాలు చేకూరనున్నాయి. ► విలీనం ద్వారా 120 బిలియన్ డాలర్ల (రూ.8.04లక్షల కోట్ల) మేర ఆస్తుల విలువ పెరుగుతుంది. ఈ విలీనం అనంతరం ఎస్బీఐ మొత్తం ఆస్తుల విలువ 36 శాతం పెరిగి 447 (సుమారు రూ.30 లక్షల కోట్లు) బిలియన్ డాలర్లకు చేరుతుంది. ► ఐసీఐసీఐ ఆస్తుల విలువ అప్పుడు ఎస్బీఐ విలువలో పావుశాతంగానే ఉంటుంది. ► 24వేల శాఖలతో, 2,70,000 మంది ఉద్యోగులతో, 58వేల ఏటీఎంలతో 50 కోట్ల మందికి సేవలు అందించే బ్యాంకుగా ఎస్బీఐ ఎదుగుతుంది. ► విలీనం ద్వారా నిర్వహణ సామర్థ్యాలు మెరుగవడంతోపాటు కొత్త క్లయింట్లను చేరుకోవడం ద్వారా మార్కెట్ వాటాను పెంచుకోవడం సాధ్యపడుతుంది. -
ఎస్బీఐతో భారతీయ మహిళా బ్యాంక్ విలీనం!
ఆర్థికశాఖ పరిశీలనలో కీలక ప్రతిపాదన ముంబై: కాంగ్రెస్ నేతృత్వంలోని గత యూపీఏ ప్రభుత్వం 2013లో ‘మహిళల కోసం’ ఏర్పాటు చేసిన భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) త్వరలో తెరమరుగుకానుందా? ఈ బ్యాంకును దేశీయ ప్రభుత్వ బ్యాకింగ్ దిగ్గజం- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో విలీనం చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. తుది నిర్ణయం ఏదీ ఇప్పటివరకూ తీసుకోకపోయినా... విలీన ప్రతిపాదనను ఆర్థికమంత్రిత్వశాఖ తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. రూ.1,000 కోట్ల తొలి మూలధనంగా బీఎంబీ ప్రారంభమైంది. నాకు తెలియదు: ఎస్బీఐ చీఫ్ కాగా ఈ వార్తల గురించి తనకేమీ తెలియదని ఎస్బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ ప్రతిపాదన ఉన్నట్లు తన దృష్టికి రాలేదని, తనను ఎవ్వరూ సంప్రదించలేదని తెలిపారు. ఒకవేళ ఈ ప్రతిపాదనను క్యాబినెట్లో చర్చించివుండవచ్చని సైతం అభిప్రాయపడ్డారు. ఈ విలీనం జరిగితే ఎస్బీఐకి ఎటువంటి ఇబ్బందీ ఉండబోదని సైతం ఆమె వ్యాఖ్యానించారు. అతి చిన్న బ్యాంక్ అయినప్పటికీ, అది విలీనానికి ఎటువంటి అడ్డంకీ కాబోదన్నారు. బీఎంబీ గురించి... ప్రస్తుతం ఈ బ్యాంకుకు దేశంలో దాదాపు 60 శాఖలు ఉన్నాయి. పబ్లిక్ రంగ బ్యాంకుల్లో బీఎంబీ అన్‌లిస్టెడ్ సంస్థ. మహిళా ఆర్థిక సాధికారత లక్ష్యంగా ఈ బ్యాంక్ ఏర్పాటయ్యింది. 2013-14లో ఆదాయం రూ.45.29 కోట్లు. 2014 మార్చి నాటికి బ్యాంక్ వ్యాపారం రూ.175 కోట్లు. -
భారతీయ మహిళా బ్యాంక్
మహిళ కష్టపడి డబ్బు సంపాదిస్తే సరిపోతుందా? దాన్ని దాచుకునే దారి కూడా ఉండాలి కదా! ఇక్కడ మాట్లాడుతున్నది పెద్ద ఉద్యోగాలు చేస్తూ వేలు, లక్షల రూపాయలు సంపాదించే మహిళల గురించి కాదు.. రోజు కూలీ చేసుకునే సామాన్య మహిళకు పొదుపు చేసుకునేందుకు భద్రమైన చోటు కావాలి. బ్యాంక్‌లో నాలుగు పైసలుంటే ఉండే భద్రత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్క భారతీయ మహిళకూ బ్యాంక్‌లో అకౌంటు ఉండాలనే లక్ష్యంతో గతేడాది ముంబైలో ‘భారతీయ మహిళా బ్యాంక్’ నెలకొల్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 35 భారతీయ మహిళా బ్యాంక్‌లున్నాయి. పందొమ్మిదో బ్రాంచ్‌గా హైదరాబాద్‌లో వెలసిన బీఎమ్‌బీ.. అకౌంట్ల ఓపెనింగ్‌లో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. - భువనేశ్వరి ఈ ఏడాది మార్చిలో అమీర్‌పేట దగ్గర భారతీయ మహిళా బ్యాంక్ (బీఎమ్‌బీ)ని నెలకొల్పిన కొత్తలో సిబ్బంది పడ్డ పాట్లు అన్నీఇన్నీ కావు. ‘బ్యాంక్‌లో మొత్తం ఆరుగురు మహిళా ఉద్యోగులం ఉన్నాం. మా బ్యాంక్ చుట్టూ మరో నాలుగు ఇతర బ్యాంకులున్నాయి. ఎవరొచ్చినా వాటిలోకే వెళ్లేవారు. ఒక్కరు కూడా మా బ్యాంకు వైపు తొంగి చూసేవారు కాదు. ‘మహిళా బ్యాంక్‌లో సొమ్ము దాచుకోవడం ఏంటమ్మా..’ అంటూ హేళన చేసేవారు ఎదురయ్యారు. లాభం లేదని మేమంతా కుర్చీలు వదిలేసి బ్యాంక్ బయట మెట్లపై కూర్చొని అటుగా వచ్చేవారికి మా బ్యాంక్ గురించి చెప్పడం మొదలుపెట్టాం. చాలావరకూ మహిళలకే చెప్పేవాళ్లం. కొందరు బ్యాంక్ లోపలికి వచ్చి మరిన్ని వివరాలు తెలుసుకుని అకౌంట్ ఓపెన్ చేసేవారు. కొన్ని రోజులు గడిచాక మేం మా సీట్లలో కూర్చుని పనిచేయడం మొదలుపెట్టాం’ అంటూ తమ బ్రాంచ్ ఓపెన్ అయిన తొలినాళ్లను గుర్తు చేసుకున్నారు సీనియర్ మేనేజర్ సుచరిత. క్యాంప్.. ఆపరేషన్.. మహిళా ఖాతాదారుల సంఖ్య వేగంగా పెంచాలన్న లక్ష్యాన్ని చేరుకునేందుకు బ్యాంక్ సిబ్బంది అవిశ్రాంతంగా కృషి చేశారు. వారాంతాల్లో మురికివాడలకు వెళ్లి అక్కడి మహిళల్ని కలసి కౌన్సెలింగ్ ఇచ్చి వారితో ఖాతాలు తెరిపించడం మొదలుపెట్టారు. దీంతోపాటు కొన్ని ప్రాంతాల్లో విరివిరిగా క్యాంపులు నిర్వహించారు. ఫలితంగా.. పట్టుమని పదినెలలు కూడా పూర్తి కాకుండానే బ్యాంకులో అకౌంట్ల సంఖ్య 7 వేలకు చేరింది. ఇందులో ఆరున్నరవేల ఖాతాలు మహిళలవే కావడం విశేషం. ‘పేద, సామాన్య మహిళలు ఏదో ఒక పనిచేసుకుంటూ డబ్బు సంపాదించుకుంటున్నారు. కానీ వాటిని పొదుపు చేసుకునే తీరు, దారి తెలియక ఇబ్బందిపడుతుంటారు. అలాంటివారు ఎక్కడున్నారో ముందుగా ఎంక్వయిరీ చేసుకుని వారి ఇళ్లకు వెళ్లి.. బీఎమ్‌బీ గురించి వివరించాం. అప్పుడప్పుడు క్యాంపులు నిర్వహించాం. ‘బ్యాంకు ఖాతా వల్ల ఉపయోగం ఏంటి..?’ అనేవారికి ప్రత్యేక కౌన్సెలింగ్ ఇస్తున్నాం..’ అని వివరించారు మేనేజర్ విశాలిని. నమ్మకమే పూచీకత్తు.. మహిళలకు పూచీకత్తు లేకుండా రుణాలు ఇవ్వడం బీఎమ్బీకున్న ప్రత్యేకత. మామూలుగా అయితే ష్యూరిటీ లేనిదే రూపాయి కూడా లోన్ ఇవ్వరు. అయితే మహిళా సాధికారికత కోసం ప్రత్యేక పథకం కింద బీఎమ్‌బీ పూచీకత్తు లేని రుణాలు అందిస్తోంది. ‘కర్రీ పాయింట్లు, క్రష్‌లు, క్యాటరింగ్ వ్యాపారాలు, బ్యూటీపార్లర్లు వంటి చిన్న చిన్న వ్యాపారాలకు మహిళల దగ్గర ఎలాంటి పూచికత్తులు కోరడం లేదు మేం. ఆసక్తి ఉన్న మహిళలతో మేమే దగ్గరుండి వ్యాపారం పెట్టిస్తున్నాం. అలా ఇప్పటివరకూ వంద మంది మహిళలతో చిన్న వ్యాపారాలు పెట్టించాం’ అని వివరించారు బ్యాంక్ ఉద్యోగి సుచరిత. ఖాతాలు తెరిపించడం, వ్యాపారాలు పెట్టించడంతో ఆపకుండా.. కార్పొరేట్ రంగంలో కూడా మహిళలకు అండగా నిలబడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. -
వెయ్యి కోట్ల డిపాజిట్లపై మహిళా బ్యాంక్ దృష్టి
ముంబై: భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) 2015 మార్చి నాటికి రూ.1,000 కోట్ల డిపాజిట్లు, రూ.800 కోట్లరుణ మంజూరు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చైర్మన్ అండ్ మేనేజింగ్ (సీఎండీ) డెరైక్టర్ ఉషా అనంత సుబ్రమణియన్ తెలిపారు. ఇక్కడ శనివారం బ్యాంక్ 35వ బ్రాంచ్ ప్రారంభించిన ఆమె ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రస్తుత బ్యాంక్ డిపాజిట్లు రూ. 300 కోట్లుకాగా, రుణ పరిమాణం రూ.500 కోట్లుగా ఉంది. మార్చి నాటికి బ్రాంచ్ నెట్వర్క్ సంఖ్యను 80కి పెంచాలన్నది కూడా లక్ష్యం. ముఖ్యంగా ఈ విషయంలో ద్వితీయ, తృతీయ పట్టణాల్లో బ్రాంచీల ప్రారంభానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎండీ తెలిపారు. -
మహిళా బ్యాంక్ ‘రూపే’ డెబిట్ కార్డ్
న్యూఢిల్లీ: ఈఎంవీ(యూరో పే, మాస్టర్ కార్డ్, వీసా) చిప్‌తో కూడిన రూపే డెబిట్ కార్డులను భారతీయ మహిళా బ్యాంక్(బీఎంబీ) గురువారం ప్రారంభించింది. ఎన్ఎఫ్ఎస్ నెట్‌వర్క్‌లోని 1.73 లక్షలకుపైగా ఏటీఎంలు, 9.89 లక్షల వాణిజ్య సముదాయాలు, 15 వేలకుపైగా ఆన్లైన్ మర్చెంట్ సైట్లలో వీటిని అనుమతిస్తారని బ్యాంక్ సీఎండీ ఉషా అనంత సుబ్రమణియన్ తెలిపారు. తమ ఖాతాదారులకు అత్యాధునిక టెక్నాలజీతో కూడిన సేవలను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవడమే తమ లక్ష్యమని చెప్పారు. -
ఉద్యోగాలు
భారతీయ మహిళా బ్యాంక్ భారతీయ మహిళా బ్యాంక్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: ప్రొబేషనరీ ఆఫీసర్లు ఖాళీల సంఖ్య: 200 వయసు: జూన్ 1, 2014నాటికి 30 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూన్ 25 వెబ్సైట్: www.bmb.co.in విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మైన్స్ విభాగంలో కింది ఖాళీల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: * సీనియర్ మేనేజర్ (మైన్స్) * డిప్యూటీ మేనేజర్ (మైన్స్) * మేనేజర్ (ఎలక్ట్రికల్) * జూనియర్ మేనేజర్ (ఎలక్ట్రికల్) * డిప్యూటీ మేనేజర్ (జియాలజీ) * జూనియర్ మేనేజర్ (జియాలజీ) * డిప్యూటీ మేనేజర్ (సివిల్) * అసిస్టెంట్ మేనేజర్ (సివిల్) * అసిస్టెంట్ మేనేజర్ (మెకానికల్) * జూనియర్ మేనేజర్ (ఎన్విరాన్మెంట్) అర్హతలు: నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు ఉండాలి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది: జూన్ 30 వెబ్సైట్: www.vizagsteel.com -
ఉద్యోగాలు
భారతీయ మహిళా బ్యాంక్‌లో ఆఫీసర్లు భారతీయ మహిళా బ్యాంక్ కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. చీఫ్ మేనేజర్(ఐటీ హెడ్) అర్హతలు: పీజీ లేదా ఎంసీఏ/ఎంబీఏతో పాటు కనీసం ఏడేళ్ల అనుభవం ఉండాలి. చీఫ్ మేనేజర్(హెడ్ ఐటీ సెక్యూరిటీ) అర్హతలు: సంబంధిత సబ్జెక్టులతో పీజీ ఉండాలి. ఏడేళ్ల అనుభవం ఉండాలి. చీఫ్ మేనేజర్( ఐటీ ప్లానింగ్, బడ్జెటింగ్ అండ్ వెండర్ మేనేజ్మెంట్) అర్హతలు: సంబంధిత సబ్జెక్టులతో పీజీ ఉండాలి. ఏడేళ్ల అనుభవం ఉండాలి. చీఫ్ మేనేజర్(ఐటీ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్) అర్హతలు: సంబంధిత సబ్జెకుల్లో పీజీతో పాటు ఏడేళ్ల అనుభవం ఉండాలి. చీఫ్ మేనేజర్(చీఫ్ ఎకనామిస్ట్) అర్హతలు: ఎకనామిక్స్‌లో పీజీతో పాటు ఏడేళ్ల అనుభవం ఉండాలి. చీఫ్ మేనేజర్ (హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్) అర్హతలు: హ్యూమన్ రిసోర్స్లో పీజీ లేదా ఎంబీఏ. ఏడేళ్ల అనుభవం ఉండాలి. సీనియర్ మేనేజర్(లీగల్) అర్హతలు: మూడు లేదా ఐదేళ్ల లా డిగ్రీ ఉత్తీర్ణత. అడ్వకేట్‌గా మూడేళ్ల అనుభవం ఉండాలి. సీనియర్ మేనేజర్(సివిల్ ఇంజనీర్) అర్హతలు: సివిల్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ సీనియర్ మేనేజర్(ఆర్కిటెక్ట్) అర్హతలు: బీఆర్క్ ఉత్తీర్ణులు సీనియర్ మేనేజర్(ఫారెక్స్ డీలర్) అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ట్రెజరీ మేనేజ్మెంట్/ఫారెక్స్‌లో పీజీ డిప్లొమా లేదా డిప్లొమా ఉండాలి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: జూన్ 18 వెబ్సైట్: www.bmb.co.in హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, కోరాపుట్ డివిజన్ ఓడిశా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మెడికల్ ఆఫీసర్(గ్రేడ్- 2) సేఫ్టీ ఆఫీసర్(గ్రేడ్ - 2) ఫైర్ ఆఫీసర్(గ్రేడ్ - 2) సెక్యూరిటీ ఆఫీసర్(గ్రేడ్ - 2) అర్హతలు: నోటిఫికేషన్లో పేర్కొన్న అర్హతలు కలిగి ఉండాలి. దరఖాస్తులకు చివరి తేది: జూలై 4 వెబ్సైట్: www.hal-india.com -
మహిళల కోసం...మహిళల చేత...
లావణ్య సొంతంగా ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాలనే ఆలోచనతో పని మొదలుపెట్టింది. కంపెనీ స్థాపించడానికి సహజంగానే బ్యాంకు రుణం కావాల్సివచ్చింది. ఓ ఐదారు బ్యాంకులు తిరిగింది. అన్ని బ్యాంకులు ఆమెకు రుణం ఇవ్వడం కుదరదన్నాయి. కావాల్సిన అర్హతలు లేవన్నాయి. కారణం అడిగితే ఒక్కొక్కరూ ఒక్కో రకంగా స్పందించారు. ఒకరు మహిళకు రుణం ఏమిటన్నారు, మరొకరు ఎవరైనా మగవారు పూచీకత్తు ఉండాలన్నారు, ఇంకొకరు వివరంగా కారణాలు చెప్పడానికే సమయం కేటాయించకుండానే పంపేశారు. ఈ ఏడాది మార్చి 31న హైదరాబాద్‌లోని ఎస్ఆర్ నగర్లో భారతీయ మహిళా బ్యాంకు(బి.ఎం.బి)ని ఏర్పాటు చేశారని తెలిసి లావణ్య అక్కడకు వెళ్ళింది. మేనేజర్ సుచరితను కలిసింది. వీళ్లు కూడా బ్యాంకు రుణం ఇవ్వడం కుదరదన్నారు. కానీ ఓ అరగంట లావణ్య అడిగిన ప్రశ్నలకు, సందేహాలకు సమాధానం చెప్పి...బ్యాంకు రుణం పొందే మార్గాలను ఆమెకు వివరించారు. ‘‘మొదట నేనెళ్లిన బ్యాంకులు నాకు రుణం ఇవ్వడం కుదరదన్నందుకు నాకు కోపం రాలేదు, కానీ కారణాలు సరిగ్గా చెప్పకుండా విసుక్కున్నందుకు మాత్రం చాలా బాధేసింది. ఈ మహిళా బ్యాంకు పుణ్యాన...రుణాలకు సంబంధించి బోలెడన్ని విషయాలు తెలుసుకోగలిగాను’’ అని చెప్పింది లావణ్య. హైదరాబాద్‌లో భారతీయ మహిళా బ్యాంకు స్థాపించి రెండునెలలు కూడా కాలేదు. రెండు వందలమంది ఖాతాలు తెరిచారు. దేశంలో 23వ మహిళా బ్యాంకుగా విజయవంతంగా కొనసాగుతోంది. భారతీయ మహిళా బ్యాంకు...మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాంకు. గత ఏడాది నవంబర్ 19న ముంబయిలో బ్యాంకు మొదటి శాఖను స్థాపించారు. గడచిన ఆరునెలల్లో దేశవ్యాప్తంగా 23 బ్రాంచ్‌లు ఏర్పాటు చేశారు. మొత్తం ఈ బ్యాంకులన్నింటిలో 70శాతం మంది మహిళలు లబ్ధి పొందుతున్నారు. మహిళల కోసం మహిళలే నడిపే ఈ బ్యాంకులకున్న మరో ప్రత్యేకత...వారానికోసారి బ్యాంకు సిబ్బందే నేరుగా మహిళల దగ్గరికి వచ్చి ఖాతాలు తెరవడం. మెట్లపై కూర్చుని... హైదరాబాద్‌లో బి.ఎం.బి శాఖ ఏర్పాటు చేసిన సందులో మరో నాలుగు ఇతర బ్యాంకులున్నాయి. ప్రత్యేకంగా మహిళల కోసం బ్యాంకు స్థాపిస్తున్నారని తెలిసినపుడు ఆ బ్యాంకుల్లోని సిబ్బంది ‘ఇన్ని బ్యాంకులుండగా...మళ్లీ ప్రత్యేకంగా మహిళల కోసం బ్యాంకు ఎందుకు’ అన్నారట. ఈ బ్రాంచ్‌లో మొత్తం ఐదుగురు మహిళా సిబ్బంది - ఒక మేనేజర్, ముగ్గురు ఆఫీసర్లు, ఒక డీఆర్‌ఒ. వీరితో పాటు ఒక సెక్యురిటీ గార్డ్, ఒక బాయ్ ఉన్నారు. శనివారం వచ్చిందంటే...ఓ ఇద్దరు ఆఫీసర్లు చుట్టుపక్కల డ్వాక్రా గ్రూపులున్న ప్రాంతాలకు వెళతారు. అక్కడ డ్వాక్రా గ్రూపుల మహిళలతో పాటు ఇతర మహిళలను కూడా కలిసి వందున్నా...వెయ్యి ఉన్నా..బ్యాంకులో భద్రపరుచుకోవడం గురించి వివరంగా చెప్పి ఒప్పించి వారితో ఎకౌంట్లు తెరిపిస్తున్నారు. ఈ పనితో పాటు మధ్యతరగతి మహిళలతో వ్యాపారం చేయించడానికి వారికి ప్రత్యేక కౌన్సెలింగ్‌లు, అవగాహన తరగతులు ఏర్పాటు చేస్తున్నారు. ఆసక్తి ఉన్నవారికి ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నారు. ‘‘మొన్నీమధ్యనే ఒక మహిళతో బ్యూటీపార్లర్ పెట్టించాం. డే కేర్ సెంటర్లు, క్యాంటీన్లు, కర్రీపాయింట్లు...ఎలాంటి వ్యాపారాలకైనా మహిళలకు మా బ్యాంకులు పూటీకత్తు పేరెత్తకుండా రుణాలిచ్చి వ్యాపారాలు చేయించడానికి సిద్ధంగా ఉంది. రుణమిచ్చి ఊరుకోకుండా...వ్యాపారానికి కావాల్సిన మిగతా సౌకర్యాల విషయంలో కూడా మా బ్యాంకు సిబ్బంది సాయపడతారు. ప్రత్యేకంగా మహిళల కోసం బిఎమ్బీలు స్థాపించడంలో ఉన్న ఉద్దేశమిదే’’ అని చెప్పారు సుచరిత. ఇక్కడ బిఎమ్బీలో మహిళా సిబ్బంది పనితీరుని చూసి చాలామంది తమ ఎకౌంట్లను ఈ బ్యాంకుకి షిప్ట్ చేసుకోవడానికి ముందుకొస్తున్నారు. బ్యాంకు లక్ష్యాలను తెలుసుకున్న మహిళలు ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి వచ్చి తాము చేయదలుచుకున్న వ్యాపారాల గురించి మాట్లాడుతున్నారు. మహిళల ప్రగతికి తమ వంతు కృషి చేయడానికి ముందుకొచ్చిన భారతీయ మహిళా బ్యాంకుని అందరూ అభినందించాల్సిందే! -భువనేశ్వరి; ఫొటోలు: ఎ. సతీష్ మొదట్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ‘అందరూ మహిళలే ఉంటారంట..ఏదైనా సమస్య వస్తే వారు సమర్థంగా ఎదుర్కోలేరు’ అంటూ చాలామంది ప్రచారం చేశారు. ఒక్కరంటే ఒక్కరు కూడా బ్యాంకులోపలికి వచ్చేవారు కాదు. మగవాళ్ల సంగతి పక్కన పెట్టండి. మహిళలైనా లోపలికి వచ్చి చూడొచ్చు కదా! బోర్డు వంక చూసుకుంటూ పోయేవారు. ఇక చేసేది లేక..మేమే బయటికి వెళ్లి మెట్లమీద కూర్చుని వచ్చేపోయేవాళ్లని పలకరిస్తూ మా ప్రత్యేకతల్ని చెప్పుకొన్నాం. ఓ పదిరోజుల తర్వాత ఒక్కొక్కరూ రావడం మొదలుపెట్టారు. ఇక్కడ మా పనితీరు, సహకారం చూసి ఈ నోటా ఆ నోటా ప్రచారం జరిగింది. మెల్లగా సంఖ్య పెరగడం మొదలైంది. ఇప్పటివరకూ ఓ ఇద్దరు మహిళా వ్యాపారస్థులకు వ్యాపారరుణాలు ఇచ్చాం’’. - సుచరిత, హైదరాబాద్ బిఎమ్‌బి బ్రాంచ్ మేనేజర్ -
ఏ రంగమైనా..రాణించే సత్తా మహిళల సొంతం
గెస్ట్‌కాలమ్ బ్యాంక్ ఆఫ్ బరోడాలో స్పెషలిస్ట్ ఆఫీసర్‌గా బ్యాంకింగ్ కెరీర్ ప్రస్థానం ప్రారంభించి.. దేశంలోనే మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారతీయ మహిళా బ్యాంకు చైర్ పర్సన్ స్థాయికి ఎదిగారు ఉషా అనంత సుబ్రమణియన్. మహిళల్లో ఓర్పు, సహనం, శ్రమించే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఆ లక్షణాలు ఉన్నప్పటికీ అవకాశాలను అందిపుచ్చుకునే మార్గాలు తెలియక వంటింటికే పరిమితమయ్యే మహిళలు ఎందరో! అలాంటి మహిళల్లో సాధికారత, స్వావలంబన కల్పించడం.. విద్యార్థినులకు కెరీర్‌పరంగా చేయూతనందించడమే భారతీయ మహిళా బ్యాంక్(బీఎంబీ) ప్రధాన లక్ష్యాలు అంటున్న ఉషా అనంత సుబ్రమణియన్‌తో ఇంటర్వ్యూ.. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బ్యాంకుకు తొలి చైర్‌పర్సన్‌గా ఎంపికవడంపై మీ స్పందన? ఒక విధంగా ఇది సవాల్. అయితే, నాకు గత 30 ఏళ్లుగా బ్యాంకింగ్ రంగంలోనే పలు హోదాలు నిర్వర్తించిన అనుభవం ఉంది. మహిళా బ్యాంకు ఏర్పాటుకు సంబంధించిన కమిటీలోనూ నేను మెంబర్‌గా ఉన్నా. దాంతో బ్యాంకు విధి విధానాలపైనా అవగాహన వచ్చింది. ఇవన్నీ ప్రస్తుత బాధ్యతలకు న్యాయం చేయడంలో దోహదపడతాయనే విశ్వాసముంది. భారతీయ మహిళా బ్యాంకు లక్ష్యాలు? ప్రధానంగా మహిళలు, విద్యార్థినుల్లో స్వావలంబన, సాధికారత కల్పించడం ఈ బ్యాంకు ప్రధానోద్దేశం. ఇందుకోసం తొలిరోజు నుంచే మహిళలకు ఎన్నో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇప్పటికే ఏర్పాటైన బ్రాంచ్‌ల్లో ఎంతో ఆదరణ లభిస్తోంది. ఇదే స్ఫూర్తితో త్వరలోనే.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా మరిన్ని బ్రాంచ్‌లు ప్రారంభిస్తాం. దేశంలోని అన్ని ప్రాంతాల మహిళలకు చేరువయ్యేలా అడుగులు వేస్తాం. విద్యార్థినులకు ఉన్నత విద్య పరంగా మహిళా బ్యాంకు నుంచి లభించే చేయూత? విద్యార్థినులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు.. బీఎంబీ సరస్వతీ లోన్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఈ స్కీం ప్రకారం.. భారత్‌లో ఉన్నత విద్యకు గరిష్టంగా రూ.10లక్షల వరకు.. విదేశీ విద్యకు గరిష్టంగా రూ.20 లక్షల రుణ సదుపాయాన్ని అందజేస్తాం. రూ.4 లక్షల రుణం వరకు ఎలాంటి హామీ లేకుండానే అందిస్తాం. వడ్డీ రేట్ల విషయంలోనూ విద్యార్థినులకు ఒక శాతం రాయితీ సదుపాయం కల్పిస్తున్నాం. మహిళల్లో స్వయం ఉపాధి దిశగా ఎలాంటి ప్రోత్సాహకాలు అందించనున్నారు? మహిళలకు, వారి అర్హతలు, వారు ఎంచుకున్న స్వయం ఉపాధి మార్గాలకు అనుగుణంగా పలు రుణ పథకాలు అమల్లోకి తీసుకొచ్చాం. ఎలాంటి విద్యార్హతలు లేకున్నా.. మహిళలు మాత్రమే నిర్వహించగల ‘డే కేర్’.. ‘బ్యూటీ కేర్’ సెంటర్ ఏర్పాటు నుంచి.. అత్యున్నత ప్రొఫెషనల్ కోర్సులుగా పేరుగడించిన సీఏ, సీఎస్ కోర్సుల్లో ఉత్తీర్ణత సాధించి.. సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకునే వారి వరకూ.. పలు రుణ సదుపాయాలు అందచేయనున్నాం. వీటితోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి, స్వయం సహాయ బృందాలకు వేర్వేరుగా ప్రత్యేక రుణ పథకాలు రూపొందించాం. కేవలం రుణ పథకాలను ప్రారంభించడంతో సరిపెట్టకుండా.. వాటిని అర్హులైన వారికి అందించే విధంగా స్వీయ లక్ష్యాలు నిర్దేశించుకొని.. తద్వారా మహిళలు సాధికారత సాధించేలా కృషి చేస్తున్నాం. అకడెమిక్‌గా విద్యార్థినులు నేటికీ కొంత వెనుకంజలో ఉన్నారని.. లింగ వివక్షత ఇప్పటికీ కొనసాగుతోందనే వ్యాఖ్యలపై మీ అభిప్రాయం? ఇది కొంతమేర వాస్తవమైనప్పటికీ.. గత ఒకటిన్నర దశాబ్ద కాలంలో పరిస్థితిలో క్రమేణా మార్పు కనిపిస్తోంది. ప్రతి రంగంలో మహిళల నిష్పత్తి పెరుగుతోంది. నూటికి దాదాపు 40శాతం మంది మహిళలు ప్రతి రంగంలో స్థానం సంపాదించుకుంటున్నారు. ఇది విద్యారంగం నుంచి ఉద్యోగాల వరకూ అన్ని చోట్లా ప్రస్ఫుటమవుతోంది. కెరీర్ పరంగా ప్రత్యేకించి బ్యాంకింగ్ రంగంలో మహిళలకు గల అవకాశాలు? మహిళలకు చక్కటి కెరీర్ సోపానం బ్యాంకింగ్ రంగం. కూల్ అండ్ కంఫర్ట్ జాబ్ అని చెప్పొచ్చు. కెరీర్ ప్రారంభించాక.. స్వల్ప వ్యవధిలోనే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చు. ముఖ్యంగా ప్రైవేటు రంగంలో ఈ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రభుత్వ రంగంలోనూ అవకాశాలున్నప్పటికీ.. ప్రమోషన్లు విషయంలో అమలయ్యే కొన్ని విధానాల కారణంగా కొంత వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. భారతీయ మహిళా బ్యాంకులో ఖాళీలన్నీ మహిళలతోనే భర్తీ చేస్తారా? అలాంటి నిబంధన లేదు. అధిక శాతం మంది మహిళా సిబ్బంది ఉండేలా యత్నిస్తున్నాం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 60 బ్రాంచ్‌లు ప్రారంభించాలని యోచిస్తున్నాం. ఇందుకోసం 600 మంది సిబ్బందిని నియమిస్తాం. ఇందులో 400 ఖాళీలను డిప్యుటేషన్ విధానంలో.. 200 ఖాళీలను డెరైక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా చేపట్టనున్నాం. భవిష్యత్తులో బ్యాంకింగ్ రంగ నియామకాలు ఎలా ఉండనున్నాయి? ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సమీప భవిష్యత్తులో వేల అవకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ప్రతి బ్యాంకు.. ఆధునికీకరణ, శాఖల విస్తరణ కార్యకలాపాలు చేపడుతోంది. దాంతో రానున్న అయిదారేళ్లలో వేల సంఖ్యలో ఖాళీల భర్తీ జరగనుంది. మరోవైపు మరికొన్ని ప్రైవేటు బ్యాంకులకు కూడా అనుమతులిచ్చే అవకాశముంది. కాబట్టి అటు ప్రైవేటు రంగంలోనూ బ్యాంకుల్లో పలు అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. మీ అభిప్రాయంలో నేటి విద్యార్థినులకు అనుకూలించే రంగం? ప్రస్తుతం ఏ రంగంలోనైనా మహిళలు దూసుకెళ్తున్నారు. కారణం.. మహిళల్లో ఓర్పు, సహనం, శ్రమించే లక్షణాలు అధికంగా ఉంటాయి. వీటిని సాధనాలుగా చేసుకుంటే నేటి తరం విద్యార్థినులు భవిష్యత్తులో సమున్నత స్థానాలు అధిరోహించొచ్చు. అయితే చాలామంది మహిళల్లో లోపిస్తున్న లక్షణం ‘మొబిలిటీ’(స్థాన చలనం) లేకపోవడం. ఫలితంగా మంచి అవకాశాలు వచ్చినా చేజార్చుకుంటున్నారు. దీనికి మన కుటుంబ సంస్కృతి కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. కాబట్టి మహిళల అభివృద్ధి విషయంలో కుటుంబ స్థాయిలోనే తోడ్పాటుకు పునాది పడితే.. ఎన్నో అద్భుతాలు సృష్టిస్తారు. కెరీర్ ఎంపికలో విద్యార్థినులు ఏ అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి? మన దేశంలో విద్యార్థినులు ఇప్పటికీ కెరీర్ ఎంపికలో తల్లిదండ్రులు, ఇతరుల సలహాలపైనే ఆధారపడుతున్నారు. దాంతో కొంతకాలం గడిచాక ఆ రంగంలో ఆసక్తి తగ్గిపోయి.. యాంత్రికంగా వ్యవహరిస్తూ కెరీర్ మనుగడనే ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. మన సమాజంలో మహిళలు ఆశించిన స్థాయిలో ఉన్నతస్థానాల్లో లేకపోవడానికి ఇది ఒక ప్రధాన కారణం. నా అభిప్రాయంలో.. ఆసక్తి, అభిరుచుల మేరకే కెరీర్‌ను ఎంపిక చేసుకోవాలి. అప్పుడే విజయాలు సాధించగలరు. పురుషులు సైతం క్లిష్టంగా భావించే వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రఫీ, ఖగోళ శాస్త్రం వంటి రంగాల్లోనూ మహిళలు రాణిస్తున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుని తమ ఆసక్తికి అనుగుణంగా కెరీర్ ఎంపిక చేసుకోవాలి. మహిళా విద్యార్థులకు మీరిచ్చే సూచన? ప్రస్తుతం దేశంలో మహిళలకు ఎన్నో రకాలుగా ఆర్థిక ప్రోత్సాహకాలు అందుతున్నాయి. పాఠశాల స్థాయిలో స్కాలర్షిప్లు మొదలు పీహెచ్డీ ఫెలోషిప్స్ వరకూ.. మహిళలకు ఎన్నో విధాలుగా ప్రత్యేక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా లింగ సమానత్వం(జెండర్ ఈక్వాలిటీ) దిశగా అన్ని వర్గాలు కృషి చేస్తున్న తరుణంలో ప్రైవేటు రంగం నుంచి కూడా అనేక ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. వీటిని అందిపుచ్చుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా ‘మనకు సాధ్యం కాదు’ అనే సనాతన భావన వీడితే సమున్నత స్థానాలు సొంతం చేసుకోవడం ఖాయం. -
గ్రామీణ ప్రాంతాలపై బీఎంబీ దృష్టి
ఏడాదిలోగా గ్రామీణ ప్రాంతాల్లో 20 శాఖల ఏర్పాటు ఎన్జీవోలు, ఎస్‌హెచ్‌జీలతో ఒప్పందం జూన్ నాటికి అందుబాటులోకి ఇంటర్నెట్ బ్యాంకింగ్భారతీయ మహిళా బ్యాంక్ సీఎండీ వెల్లడి హదరాబాద్, బిజినెస్ బ్యూరో: గ్రామీణ ప్రాంతాల్లో ఉండే మహిళలకు రుణ సౌకర్యం కల్పించడంపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) ప్రకటించింది. ఇందుకోసం స్వచ్ఛంద సంస్థలు, స్వయం సేవక సంఘాల(ఎస్‌హెచ్‌జీ)తో ఒప్పందాలను కుదుర్చుకుంటోంది. ప్రస్తుతం పట్టణాల్లోనే శాఖలను ఏర్పాటు చేయడంతో గ్రామీణ ప్రాం తాల వారికి రుణాలు అందుబాటులోకి తీసుకురావడం కోసం ఈ విధమైన ఒప్పందాలను కుదుర్చుకుంటున్నట్లు బీఎంబీ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ ఉషా అనంత సుబ్రమణియన్ తెలిపారు. దేశంలో 19వ, రాష్ట్రంలో మొదటి బీఎంబీ శాఖను హైదరాబాద్‌లో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉప్పాడ చేనేత వస్త్రాలు తయారు చేసే వారికి, అలాగే గుంటూరు జిల్లాలో పసుపు పొడి తయారు చేసే మహిళలకు రుణాలు ఇవ్వడానికి స్వచ్ఛంద సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు తెలిపారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలోగా మొత్తం శాఖల సంఖ్యను 80కి చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో 20 శాఖలను గ్రామీణ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇంకా మొబైల్ బ్యాంకింగ్, ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురాలేదని, ఈ జూన్ నాటికి ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను తీసుకొచ్చేప్రయత్నంలో ఉన్నట్లు ఉషా తెలిపారు. అలాగే ఖాతాదారుల సౌకర్యం కోసం మొబైల్ ఏటీఎం సేవలను అందిస్తున్నట్లు తెలిపారు. కేవలం మహిళలకే కాదు: పేరుకు మహిళా బ్యాంకే అయినా ఇతరులూ ఖాతాలు తెరవచ్చని ఉషా తెలి పారు. బ్యాంకు సిబ్బంది కూడా కేవలం మహిళలే ఉం డరని, కానీ ప్రస్తుతం హైదరాబాద్ శాఖలో మాత్రం అందరూ మహిళలే ఉంటే సిమ్లా శాఖలో అందరూ పురుషులు ఉన్నట్లు చెప్పారు. మహిళాభివృద్ధిపై బ్యాంకు దృష్టి పెడుతుందని అన్నారు. మొత్తం రుణాల్లో 70% మహిళలకు కేటాయించినట్లు వివరించారు. మిగిలిన 30% రుణాలపై ఎటువంటి పరిమితులు ఉండవని, ఎవరికైనా కేటాయిస్తామన్నారు. -
గ్రామీణ ప్రాంతాలకూ విస్తరణ
చండీగఢ్: చిన్న నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్రాంచీల ప్రారంభానికి భారతీయ మహిళా బ్యాంక్ (బీఎంబీ) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచీ ఇందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు దేశ మొట్టమొదటి మహిళా బ్యాంక్ గురువారం తెలిపింది. తద్వారా 2015 మార్చి నాటికి బ్యాంక్ బ్రాంచీల సంఖ్యను 80కి చేర్చాలన్నది బీఎంబీ లక్ష్యంగా ఉంది. ‘‘మహిళా బ్యాంక్ తన బ్రాండ్‌ను స్థిరపరచుకోవాల్సి ఉంటుంది. ప్రతి రాష్ట్రంలోనూ ఒక బ్రాంచ్ని తక్షణం ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. తద్వారా దేశ వ్యాప్త విస్తరణను కోరుకుంటున్నాం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో బ్రాంచీలను ప్రారంభిస్తున్నాం. మార్చి 2015కల్లా కనీసం 80 బ్రాంచీల ఏర్పాటు మా లక్ష్యం’’ అని సీఎండీ ఉషా అనంతసుబ్రమణ్యన్ పేర్కొన్నారు. అంతకుముందు ఆమె ఇక్కడ బ్యాంక్ 10వ బ్రాంచ్ని ప్రారంభించారు. భారతీయ మహిళా బ్యాంక్‌ను రూ.1,000 కోట్ల తొలి మూలధనంతో ఏర్పాటు చేశారు. 2020 నాటికి రూ.60,000 కోట్ల వ్యాపార పరిమాణం దీని లక్ష్యం. మంచి ఆలోచనలతో వస్తే...: మంచి ఆలోచనలతో ముందుకు వచ్చే మహిళలకు రాయితీపై రుణాలను అందించడానికి బ్యాంక్ సిద్ధంగా ఉన్నట్లు సీఎండీ వివరించారు. మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పలు రుణ పథకాలను బ్యాంక్ రూపొందించినట్లు కూడా ఆమె తెలిపారు. హామీ రహిత రుణాలను మహిళలకు ఇవ్వడానికి కూడా తమ బ్యాంక్ సిద్ధంగా ఉంటుందని పేర్కొంటూ... అయితే వారు ఇందుకు మంచి వ్యాపార ఆలోచనలతో ముందుకు రావాల్సి ఉంటుందని వివరించారు. మహిళాభివృద్ధే ధ్యేయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) వంటి వృత్తివిద్యా సంస్థలతో సైతం అవగాహన కుదుర్చుకుని మహిళాభివృద్ధికి బ్యాంక్ కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఆయా అంశాల్లో విద్యా రుణాలను ఇవ్వడం, ప్రాక్టీస్ ప్రారంభానికి తోడ్పాటుగా ఒకశాతం వడ్డీ రాయితీతో రుణాలను అందించడం లక్ష్యంగా ఈ దిశలో ముందుకు కదులుతున్నట్లు తెలిపారు. మహిళలకు సొంత కారు’ లక్ష్యంగా... మహిళల అభ్యున్నతి దిశలో మోటార్ కంపెనీలతోనూ ఒప్పందాలను కుదుర్చుకోడానికి వ్యూహ రచన చేస్తున్నట్లు ఉషా అనంతసుబ్రమణ్యన్ వెల్లడించారు. మహిళలకు సొంత కారు లక్ష్యంగా షోరూమ్ ధరలో 90 శాతం రుణం వారు పొందేలా చర్యలు తీసుకోవడం ఈ అవగాహన లక్ష్యంగా ఉండబోతున్నట్లు తెలిపారు. -
అస్త్ర
అంతా బాగుంది అనేందుకు లేదు. ఏమీ బాగోలేదు అనేందుకూ లేదు. కొంత సాధ్యమయింది. ఇంకెంతో సాధించవలసి ఉంది. సమాజంలో స్త్రీల స్థితిగతుల గురించి ఇప్పటికిప్పుడు ఇంతకుమించి చెప్పడానికి ప్రత్యేకంగా ఏమీ కనిపించదు... నవంబరులో కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం ప్రారంభించబోతున్న భారతీయ మహిళా బ్యాంకు తప్ప! ఆ బ్యాంకు పరిధిలో అందరూ మహిళలే పని చేస్తారు. అదీ ప్రత్యేకత. స్త్రీల కోసం ఇలా ప్రపంచంలో ఏదో ఒక మూల ఏదో ఒకటి ప్రత్యేకంగా జరుగుతూ ఉండడం సంతోషమే. ప్రత్యేక కార్యాలయాలు, ప్రత్యేక రవాణా సౌకర్యాలు, ప్రత్యేక అవకాశాలు, ప్రత్యేక సదుపాయాలు, ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు... మరీ ముఖ్యంగా ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక న్యాయస్థానాలు... ఇవన్నీ మహిళలకు పెద్ద... ఊ... ఏమనాలీ... పెద్ద... బలమా? కాదు. భరోసా? కాదు. అండా? కాదు. మరి? పెద్ద ఊరట. మగ ప్రపంచపు ఇరుకులోంచి తమకంటూ కొంచెం ఖాళీ స్థలం! గుండెలనిండా గాలి పీల్చుకోడానికి, హాయిగా కాళ్లూ చేతులు చాపుకోడానికి... గమనింపుల గాలి సోకని ఈ ప్రత్యేక ఏర్పాట్లు స్త్రీలకు నిజంగా ఊరటే. అయితే ఇవన్నీ వట్టి ఊరడింపులు తప్ప ఇంకేమీ కాదు. సమస్య నుంచి స్త్రీని పక్కకు తప్పించే ప్రత్యేక కేటాయింపులలో ఒక వ్యక్తిగా తప్ప శక్తిగా స్త్రీకి చోటు ఉండదు! ‘‘చూడు నాన్నా... అన్నయ్య విసిగిస్తున్నాడు’’ అని కూతురు ఫిర్యాదు చేస్తే, వాడంతేనమ్మా, నువ్విటు రా, ఇక్కడొచ్చి కూర్చో’’ అని తండ్రి చెప్పడం లాంటిదే ‘స్త్రీలకు మాత్రమే’ అనే ప్రభుత్వ ఏర్పాటు. చెల్లెలు ఇటొచ్చి కూర్చున్నా, అన్నయ్య అక్కడికీ వెళ్లి విసిగిస్తే ఆ పిల్ల ఏం చేయాలి? ప్రస్తుతం... స్త్రీలకు ప్రత్యేకంగా సంక్రమించిన అన్ని హక్కుల విషయంలోనూ జరుగుతున్నది ఇదే. లేడీస్ సీట్లు ఉంటాయి. వాటిల్లో మగవాళ్లొచ్చి కూర్చుంటారు. రాజకీయ రిజన్వేషన్లు ఉంటాయి. వెనక నుంచి మగవాళ్లు కుర్చీ పట్టుకుని వేలాడుతుంటారు. ఇలా స్త్రీలకు ప్రత్యేక సౌకర్యాలు ఉన్న ప్రతిచోటా, ప్రతి రంగంలో... మగవాళ్లు కల్పించే ప్రత్యేక అసౌకర్యాలూ ఉంటున్నాయి. ప్రభుత్వాలు ఇవ్వగలవు కానీ ఇచ్చినవాటిని పోనివ్వకుండా కాపాడలేకపోతున్నాయని రోజూ ఎక్కడో ఒకచోట స్త్రీలపై జరుగుతున్న దౌర్జన్యాలు, అఘాయిత్యాలు రుజువు చేస్తూనే ఉన్నాయి. గృహహింస చట్టం వచ్చింది. హింస అలాగే ఉంది. నిర్భయ చట్టం వచ్చింది. అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక లైంగిక వివక్ష అయితే కులమత వయోభేదాలకు అతీతంగా, చదువు సంస్కారాలతో నిమిత్తం లేకుండా స్త్రీని సతాయించి సతాయించి చంపుతోంది. మరేమిటి పరిష్కారం? ఏమిటంటే... స్త్రీలే తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించాలి. వేరే మార్గం లేదు. స్త్రీలంతా ఒకటవ్వాలి. ఒకరికొకరు సాయం చేసుకోవాలి. ఒకరికొకరు మద్దతుగా నిలబడాలి. స్త్రీ తన హక్కులను తను కాపాడుకుంటూనే, తనకంటూ సమాజంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకోవాలి. అందుకు చాలా శక్తి అవసరం. అంత శక్తినీ స్త్రీలకు సమకూర్చే ప్రయత్నం చేయాలని సాక్షి ‘ఫ్యామిలీ’ సంకల్పించింది! ధరణికి పంచభూతాల్లా, ప్రాణికి పంచేంద్రియాల్లా, స్త్రీలను శక్తిమంతం చేసే ప్ర‘పంచ’సూత్రాలను మహిళా పాఠకులకు అందించదలచింది. చట్టం-న్యాయం (శస్త్ర), మానవ సంబంధాలు (మిత్ర), ఆత్మరక్షణ (తంత్ర), వ్యక్తిత్వ వికాసం (మంత్ర), ఆర్థిక వ్యవహారాలు (యంత్ర)... అనే ఈ ఐదు సూత్రాలను నిపుణుల సలహాలుగా, నిజజీవితపు అనుభవాలుగా మీ ముందుకు తెచ్చి, మీ ఆలోచనా ధోరణిని ఆయుధీకరించి, ఆధునీకరించేందుకు త్వరలోనే ‘అస్త్ర’ అనే శీర్షికను ప్రారంభిస్తోంది. ఆ శీర్షిక ప్రతి స్త్రీనీ శక్తిమంతురాలిగా చేస్తుందని ఆశిస్తున్నాం. - ఫీచర్స్ ఎడిటర్