అంతా బాగుంది అనేందుకు లేదు. ఏమీ బాగోలేదు అనేందుకూ లేదు. కొంత సాధ్యమయింది. ఇంకెంతో సాధించవలసి ఉంది. సమాజంలో స్త్రీల స్థితిగతుల గురించి ఇప్పటికిప్పుడు ఇంతకుమించి చెప్పడానికి ప్రత్యేకంగా ఏమీ కనిపించదు... నవంబరులో కేంద్ర ఆర్థికమంత్రి పి.చిదంబరం ప్రారంభించబోతున్న భారతీయ మహిళా బ్యాంకు తప్ప! ఆ బ్యాంకు పరిధిలో అందరూ మహిళలే పని చేస్తారు. అదీ ప్రత్యేకత. స్త్రీల కోసం ఇలా ప్రపంచంలో ఏదో ఒక మూల ఏదో ఒకటి ప్రత్యేకంగా జరుగుతూ ఉండడం సంతోషమే.
ప్రత్యేక కార్యాలయాలు, ప్రత్యేక రవాణా సౌకర్యాలు, ప్రత్యేక అవకాశాలు, ప్రత్యేక సదుపాయాలు, ప్రత్యేక సంక్షేమ కార్యక్రమాలు... మరీ ముఖ్యంగా ప్రత్యేక చట్టాలు, ప్రత్యేక న్యాయస్థానాలు... ఇవన్నీ మహిళలకు పెద్ద... ఊ... ఏమనాలీ... పెద్ద... బలమా? కాదు. భరోసా? కాదు. అండా? కాదు. మరి? పెద్ద ఊరట. మగ ప్రపంచపు ఇరుకులోంచి తమకంటూ కొంచెం ఖాళీ స్థలం! గుండెలనిండా గాలి పీల్చుకోడానికి, హాయిగా కాళ్లూ చేతులు చాపుకోడానికి... గమనింపుల గాలి సోకని ఈ ప్రత్యేక ఏర్పాట్లు స్త్రీలకు నిజంగా ఊరటే.
అయితే ఇవన్నీ వట్టి ఊరడింపులు తప్ప ఇంకేమీ కాదు. సమస్య నుంచి స్త్రీని పక్కకు తప్పించే ప్రత్యేక కేటాయింపులలో ఒక వ్యక్తిగా తప్ప శక్తిగా స్త్రీకి చోటు ఉండదు! ‘‘చూడు నాన్నా... అన్నయ్య విసిగిస్తున్నాడు’’ అని కూతురు ఫిర్యాదు చేస్తే, వాడంతేనమ్మా, నువ్విటు రా, ఇక్కడొచ్చి కూర్చో’’ అని తండ్రి చెప్పడం లాంటిదే ‘స్త్రీలకు మాత్రమే’ అనే ప్రభుత్వ ఏర్పాటు. చెల్లెలు ఇటొచ్చి కూర్చున్నా, అన్నయ్య అక్కడికీ వెళ్లి విసిగిస్తే ఆ పిల్ల ఏం చేయాలి? ప్రస్తుతం... స్త్రీలకు ప్రత్యేకంగా సంక్రమించిన అన్ని హక్కుల విషయంలోనూ జరుగుతున్నది ఇదే.
లేడీస్ సీట్లు ఉంటాయి. వాటిల్లో మగవాళ్లొచ్చి కూర్చుంటారు. రాజకీయ రిజన్వేషన్లు ఉంటాయి. వెనక నుంచి మగవాళ్లు కుర్చీ పట్టుకుని వేలాడుతుంటారు. ఇలా స్త్రీలకు ప్రత్యేక సౌకర్యాలు ఉన్న ప్రతిచోటా, ప్రతి రంగంలో... మగవాళ్లు కల్పించే ప్రత్యేక అసౌకర్యాలూ ఉంటున్నాయి. ప్రభుత్వాలు ఇవ్వగలవు కానీ ఇచ్చినవాటిని పోనివ్వకుండా కాపాడలేకపోతున్నాయని రోజూ ఎక్కడో ఒకచోట స్త్రీలపై జరుగుతున్న దౌర్జన్యాలు, అఘాయిత్యాలు రుజువు చేస్తూనే ఉన్నాయి. గృహహింస చట్టం వచ్చింది. హింస అలాగే ఉంది. నిర్భయ చట్టం వచ్చింది.
అత్యాచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక లైంగిక వివక్ష అయితే కులమత వయోభేదాలకు అతీతంగా, చదువు సంస్కారాలతో నిమిత్తం లేకుండా స్త్రీని సతాయించి సతాయించి చంపుతోంది. మరేమిటి పరిష్కారం? ఏమిటంటే... స్త్రీలే తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిఘటించాలి. వేరే మార్గం లేదు. స్త్రీలంతా ఒకటవ్వాలి. ఒకరికొకరు సాయం చేసుకోవాలి. ఒకరికొకరు మద్దతుగా నిలబడాలి. స్త్రీ తన హక్కులను తను కాపాడుకుంటూనే, తనకంటూ సమాజంలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకోవాలి. అందుకు చాలా శక్తి అవసరం.
అంత శక్తినీ స్త్రీలకు సమకూర్చే ప్రయత్నం చేయాలని సాక్షి ‘ఫ్యామిలీ’ సంకల్పించింది! ధరణికి పంచభూతాల్లా, ప్రాణికి పంచేంద్రియాల్లా, స్త్రీలను శక్తిమంతం చేసే ప్ర‘పంచ’సూత్రాలను మహిళా పాఠకులకు అందించదలచింది. చట్టం-న్యాయం (శస్త్ర), మానవ సంబంధాలు (మిత్ర), ఆత్మరక్షణ (తంత్ర), వ్యక్తిత్వ వికాసం (మంత్ర), ఆర్థిక వ్యవహారాలు (యంత్ర)... అనే ఈ ఐదు సూత్రాలను నిపుణుల సలహాలుగా, నిజజీవితపు అనుభవాలుగా మీ ముందుకు తెచ్చి, మీ ఆలోచనా ధోరణిని ఆయుధీకరించి, ఆధునీకరించేందుకు త్వరలోనే ‘అస్త్ర’ అనే శీర్షికను ప్రారంభిస్తోంది. ఆ శీర్షిక ప్రతి స్త్రీనీ శక్తిమంతురాలిగా చేస్తుందని ఆశిస్తున్నాం.
- ఫీచర్స్ ఎడిటర్