ఈనాడు సమాజంలో ఎటుచూసినా అమానవీయం, అరాచకం, అమానుషం రాజ్యమేలుతున్నాయి. మంచి, మర్యాద, మానవీయత మచ్చుకైనా కానరావడం లేదు. మనిషి మానవత్వాన్ని మరిచి మృగంగా ప్రవర్తిస్తున్న సంఘటనలు చూస్తున్నాం. తమ పాత్రలో నీళ్ళు తాగాడని, పెళ్ళిలో గుర్రంపై ఊరేగాడని, తమ చెప్పుచేతల్లో ఉండకుండా తమతో సమానంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారని బడుగులు, బలహీన వర్గా లపై దాడులు చేయడం, హింసించడం, చంపడం లాంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు కూడా ఇలాంటి సంఘటనలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మద్దతు పలకడం మానవ విలువల హననానికి పరాకాష్ట. ఆ స్థాయి వ్యక్తుల్లోనే విలువలు లుప్తం కావడం వల్ల సమాజంలో అసహనం, విద్వేష భావజాలం, కుల, మత రాజకీయాలు పెరిగిపోతున్నాయి.
అయినప్పటికీ పెద్ద స్థాయిలో మానవీయ పరిమళ వికాసాన్నీ మనం చూశాం. కోవిడ్ సమయంలో ఇలాంటి అనేక దృశ్యాలు మన కంటబడ్డాయి. వలస కూలీల దుఃస్థితికి చలించి మానవతను చాటుకున్న అనేకమందిని మనం దర్శించాం. అనేకమంది మానవతావాదులు దేశ సరిహద్దుల్లో, అననుకూల పరిస్థితుల్లో సైనికుల రూపంలో అసాధారణ సేవలు అందిస్తూ మానవత్వాన్ని చాటుకోవడం, ప్రకృతి విపత్తులు విరుచుకు పడినప్పుడు ఆపదల్లో చిక్కుకున్న ప్రజలను ఎంతో సాహసోపేతంగా సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అన్నిరకాల సహాయక చర్యల్లో పాల్గొనడం మనకు తెలిసిందే. ఇదే మానవత్వం!
ఇవ్వాళ ఉగ్రవాదం రూపంలో, ప్రభుత్వాల నిరంకుశ విధానాల రూపంలో, మతం, కులం, జాతి, ప్రాంతీయ విభేదాల రూపంలో అనేక దేశాల్లో మానవత్వానికి తీరని హాని కలుగుతోంది. అడుగంటుతున్న మానవతా విలువలను పరిరక్షించి, మానవ హృదయాల్లో వాటిని మరలా పునః ప్రతిష్ఠించవలసిన అవసరం ఉంది. ఇందుకోసం అన్ని దేశాలూ నడుం బిగించాలి. – ఎమ్‌డి. ఉస్మాన్ ఖాన్, సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment