మేధావుల మౌనం అతి ప్రమాదకరం | Dasoju Sravan Guest Column On Intellectuals Silence To The Society | Sakshi
Sakshi News home page

మేధావుల మౌనం అతి ప్రమాదకరం

Published Thu, Oct 29 2020 2:23 AM | Last Updated on Thu, Oct 29 2020 2:23 AM

Dasoju Sravan Guest Column On Intellectuals Silence To The Society - Sakshi

ఫైల్ ఫొటో‌

మేధావులు, ప్రజాస్వామిక వాదులు, ఉద్యమ శక్తులు మేల్కొనాల్సిన సమయం ఆసన్నమైంది. తెలంగాణ గడ్డ పోరాటాలకు అడ్డా. ఇక్కడి మట్టి బిడ్డలకు ఆత్మ గౌరవం ఎక్కువ. ఇక్కడి మట్టికి, గాలికి, నీటికి అన్యాయాన్ని ప్రశ్నించే తత్వం ఉంటుంది. దుర్మార్గంపై తిరుగుబాటు చేసే స్వభావం ఉంటుంది. సమ్మక్క సారక్కల దగ్గర నుండి రాణి రుద్రమ దాకా. నిజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి తొలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం దాకా. సిరిసిల్ల జగిత్యాల ప్రజా ఉద్యమాల దగ్గర నుండి మలి దశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం దాకా. ఇలా అనేక పోరాటాలను, ఉద్యమాలను నడిపిన చరిత్ర ఉంది తెలంగాణ గడ్డకు. తెలం గాణ రాష్ట్రం సాధించుకునే వరకు ఇక్కడి మేధావులు, కవులు, కళాకారులు, ప్రజాస్వామికవాదులు అందరూ సమాజంలో తమ తమ విద్యుక్తధర్మాన్ని నిర్వర్తిస్తూ వచ్చారు. కానీ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ బాధ్యతల నుండి చాలామంది వైదొలిగారు. ఎందుకు ఈ పరిణామం జరిగింది? దానికి దారి తీసిన పరిస్థితులు ఏమిటి అనే చర్చ జరగాలి.

పాలకులు చేసే తప్పులను ప్రశ్నించే దాశరథి, కాళోజి వారసులు ఇప్పుడు తెలంగాణలో లేరా! మాయమైపోయారా! రాజ్యం చేసే తప్పులపై గజ్జకట్టి డప్పుకొట్టి జన జాగృతికి నడుంబిగించిన ప్రజా కళాకారులు ఇప్పుడు ఎందుకు మౌనం దాల్చారు? జనం గొంతు వినిపించే జయశంకర్‌ సార్‌ వారసులైన మేధావులు పదవులకు పెదవులు మూశారా. తెలంగాణ వస్తే హక్కులు వస్తాయి, సామాజిక న్యాయం జరుగుతుంది, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి అనుకుంటే ఉన్న హక్కులు పోతున్నాయి. ఉద్యమ వారసులు, మేధావులు, ప్రజాస్వామిక శక్తులు మౌన ముద్ర దాల్చారు. దీనికి కారణం ఏమిటి! కారకులు ఎవరు! తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు దగ్గరైన వీరు రాష్ట్రం ఏర్పడ్డాక  పదవులకు ఆశపడ్డారా? పదవులు తీసుకుని సాధించుకున్న తెలంగాణను గాలికి వదిలేసి సొంత ప్రయోజనం చూసుకున్నారా? ప్రశ్నించేతత్వాన్ని, పోరాడే గుణాన్ని మొద్దుబార్చారా? తెలంగాణ సహజత్వాన్ని భ్రష్టుపట్టించారా? ఆత్మగౌరవాన్ని అటకెక్కించారా? ప్రజల వాయిస్‌ వినిపించే గొంతుకలను మూగనోము పట్టించారా? తెలంగాణ వస్తే ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఇలా జరుగుతుంది అంటే ప్రజలు తెలంగాణ కోసం కొట్లాడేవారు కాదేమో. యువకులు తమ నిండు ప్రాణాలను బలిదానం చేసేవారు కాదు. ఉద్యోగులు సకల జనుల సమ్మె చేసేవారు కాదు.

తెలంగాణ ఉద్యమ శక్తుల శక్తిని, మేధావులకున్న  బలాన్ని, కవులు కళాకారుల ఆట, పాటలకున్న పవర్‌ను ఉద్యమ సమయంలోనే కేసీఆర్‌ గుర్తించాడు. ఉద్యమ సమయంలో తనకు దగ్గరైన కవులను, కళాకారులను, మేధావులను ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్న తరువాత వారిని తన వెంటనే తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే వీరి ప్రభావం సమాజంలో ఎలా ఉంటుందో తెలుసు కనుక, వీరిని దూరం చేసుకుంటే ఏమి జరగబోతుందో కూడా ఊహించుకున్నాడు. అందుకే అధికారంలోకి రాగానే వీరందరిని తన కబంధ హస్తాలలో బంధించాడు. కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చాడు.  వారు బయటికి వెళ్లి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేదికలు ఎక్కి ఆటపాటలు పాడకుండా కట్టడి చేశాడు.. అలాగే మేధావి వర్గానికి పదవులు ఇచ్చి పెదవులు మూయించాడు. ఉద్యమ వారసులందరినీ తన అదుపులో ఉంచుకున్నాడు. అందుకే వీవీ, సాయిబాబాల మీద కుట్ర కేసులు పెట్టి జైలుకు పంపినా. ప్రజాస్వామికవాదులను అరెస్ట్‌ చేసినా, ధర్నాచౌక్‌ ఎత్తేసి సభలు, సమావేశాలు పెట్టుకునే అవకాశం లేకుండా చేసినా ప్రశ్నించేవాడు ఉండడానికి వీలు లేదు, ఉద్యమాలు చేస్తే కేసులు పెడతామని హెచ్చరిస్తుంటే తెలం గాణ సమాజం మౌనంగా రోదిస్తోంది.

మేధావులారా మేల్కొనండి. తెలంగాణకున్న పోరాటాల వారసత్వాన్ని కాపాడుకుందాం. మేధావి మౌనం సమాజానికి మంచిది కాదు. దేశ వ్యాపితంగా అప్రజాస్వామిక శక్తులు విజృంభిస్తున్నాయి. విభజన రాజకీయాలతో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించే కుట్రలకు తెర లేపారు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశమైన మన దేశాన్ని మధ్యయుగాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్‌ ఇచ్చిన పదవులకు ఆశపడి మీ పాత్రను విస్మరించకండి. రాజకీయాలకు అతీతంగా ఎటువంటి వివక్షత చూపించకుండా ప్రజల పక్షాన, సమాజ హితం కోరి  మీరు చూపించే మార్గం పాలకులకు దశ, దిశ కావాలి. తెలంగాణ మట్టికి, గాలికి, నీటికి ఉన్న ప్రత్యేకతను కాపాడండి. పోరాటాల వారసత్వాన్ని కొనసాగించండి. 
డా. శ్రవణ్‌ దాసోజు
వ్యాసకర్త జాతీయ అధికార ప్రతినిధి,
కాంగ్రెస్‌ పార్టీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement