విశ్లేషణ
ఏ దేశానికైనా, ఏ జాతికైనా చారిత్రక తాత్విక జ్ఞానం అవసరం. నిజానికి తొలి నుంచీ ఉన్నది భౌతికవాదమే. భారతదేశంలోని భౌతికవాద చింతన అన్ని కీలక పరిణామాల్లో ప్రధాన శక్తిగా నిలిచింది. మానవుడు భౌతిక ప్రపంచం నుండి ప్రభవించడం వల్ల అతని ఆలోచనలు, భావాలు, ఊహలు భౌతిక వాస్తవికత వైపే మొదట్లో పయనించాయి. నిప్పును, నీరును, గాలిని, భూమిని; వాటి భౌతిక రూపాలను తెలుసుకోవడమే మానవుని అభివృద్ధి సోపానం. అయితే అనేక సందర్భాలలో ప్రజలు వెలుగు నుండి చీకట్లోకి, జ్ఞానం నుండి అజ్ఞానంలోకి, వాస్తవం నుండి భ్రమలలోకి తిరోగమిస్తూ ఉంటారు. అప్పుడే అభ్యుదయవాదులు వారిలో జ్ఞానతృష్ణను కలిగించాలి.
భారతదేశ తాత్విక మూలాలపై ఈనాడు లోతైన చర్చ జరుగుతోంది. నిజానికి భారతీయ తత్వశాస్త్రాన్ని సృష్టించినవారు మూలవాసులు. వీరు మెసపటో మియా, సింధూ నాగరికతల కాలం నాటివారు. వీరి మౌఖిక జ్ఞాన సంపదకు ప్రత్యామ్నాయంగానే వైదిక సాహిత్యం వచ్చింది. వైదిక సాహిత్యం కూడా మొదట్లో మౌఖిక రూపంలోనే ఉంది. తర్వాత లిఖిత రూపం ధరించింది. భారతీయ తత్వశాస్త్రం ప్రధానంగా భౌతికవాద తత్వశాస్త్రం. భారతదేశంలో తత్వశాస్త్రమంటే ఆధ్యాత్మిక వాదంగా ప్రచారం చేశారు.
తత్వశాస్త్రమనగానే అది ఆత్మ గురించో, పరలోకం గురించో చెప్పేదనే భావన ఏర్పడింది. నిజానికి భౌతిక అంశాల నుండి రూపొందినదే తత్వశాస్త్రం. భారతదేశంలో అతి ప్రాచీన జాతులు తాత్వికాంశాల మీద సుదీర్ఘమైన చర్చ చేశాయి. శరీరానికీ, చైతన్యానికీ ఉన్న సంబంధాన్నీ; మానవునికీ, ప్రకృతికీ ఉన్న సంబంధాన్నీ, విశ్వ పరిణామాన్నీ, మానవ పరిణామాన్నీ వీరు అర్థం చేసు కోవడానికి ప్రయత్నించారు. ప్రకృతి; సమాజం పట్ల ఉదయించిన అనేక ప్రశ్నలకు భౌతిక దృక్పథంతో సమాధానం వెదికారు.
మానవుడు భౌతిక ప్రపంచం నుండి ప్రభవించడం వల్ల అతని ఆలోచనలు, భావాలు, ఊహలు భౌతిక వాస్తవికత వైపే మొదట్లో పయనించాయి. నిప్పును, నీరును, గాలిని, భూమిని; వాటి భౌతిక రూపాలను తెలుసుకోవడమే మానవుని అభివృద్ధి సోపానం. నిప్పు మానవ సామాజిక పరిణామంలో కీలక పాత్ర వహించింది. నిప్పును ఆరాధించిన జాతుల కంటే, నిప్పును భౌతిక శక్తిగా గుర్తించిన జాతులు శక్తిమంతంగా ముందుకు నడిచాయి.
నిప్పు మానవ జీవితాన్ని ఒక భౌతిక శక్తిగా ప్రభావితం చేసింది. నిప్పును ఆరాధించే జాతులకూ, నిప్పును అధీనం చేసుకొన్న జాతులకూ సమరం జరిగింది. తన చుట్టూ వున్న భౌతిక ప్రపంచాన్ని సమన్వయించుకోవడంలో విఫలమై నవారు భావవాదులుగా రూపొందారు. వీరు భౌతిక సామాజిక వాస్తవికతకు భిన్నమైన భావవాదంతో భౌతికవాదులకు ఎదురు నిలుస్తూ వచ్చారు.
అంతేగాక వానరుడి నుండి నరుడిగా పరిణామం చెందిన ప్రతి కీలక దశలోనూ మానవుని భౌతిక దృక్పథమే అతనికి నిర్ణయాత్మక మెట్టుగా ఉపకరించింది. లక్షలాది సంవత్సరాలకు పూర్వం ఉష్ణమండలంలో ఎక్కడో ఒక చోట నరవానరుడిగా ఉన్న మానవుడు మానవుడిగా రూపొందిన పరిణామంలో చేతుల్ని ఉపయోగించుకున్న తీరును ఎంగెల్స్ వర్ణించాడు. రోమ శరీరులైన మన పూర్వీకులు మొదట ఒక నియమంగానూ, తరువాత అవసరంగానూ నిలబడ టానికి కారణం ఆనాటికి చేతులకు వివిధ రకాలైన ఇతర పనులు ఏర్పడి ఉంటాయని అనుకోవాలి.
వానరాలు ఆహారాన్ని స్వీకరించడానికి, ఆహారాన్ని పట్టుకోవడానికి చేతులను ఉపయోగిస్తాయి. కొన్ని రకాల క్రింది తరగతి స్తన్య జంతువులలో కూడా ముందు పంజాలను ఉపయోగించడం మనం చూస్తాం. చాలా రకాల కోతులు తాము చెట్ల మీద నివసించడానికై గూళ్ళను నిర్మించడానికి చేతులను ఉప యోగిస్తాయి. చింపాంజీలు తమ చేతులతో చెట్ల కొమ్మల మధ్య కప్పులు చేసుకొని ఎండ వానల నుండి కాపాడుకుంటాయి. శత్రువుల నుండి ఆత్మ రక్షణకై ఇవి చేతులతో కర్రలను, కొమ్మలను పట్టుకొని కొట్టడానికి పూనుకొంటాయి.
బోనుల్లో ఉంచిన కోతులు మానవులను చూచి నేర్చుకున్న అనేక చిన్న చిన్న పనులను తమ చేతులతో చేయగలవు. కానీ మానవునికెంతో సన్నిహితమైన దశకు చేరుకున్న వానరుని చేతినీ, అనేక లక్షల సంవత్సరాల కర్మల వల్ల అభివృద్ధి నొందిన మానవుడి చేతిని చూస్తే ఎంతో భేదం కనబడుతుంది. కండ రాల సంఖ్య ఒక్కటే, నిర్మాణం కూడా ఒక్కటే. అయినా ఎంతటి నికృష్టస్థితిలోని ఆటవికుడైన మానవుని హస్తం కూడా ఎంతో అభివృద్ధి చెందిన వానర హస్తం చేయలేని వందలాది పనులను అలవోకగా చేస్తుంది. వానర హస్తం ఏ చిన్న రాతి పనిముట్టును ఎంత బండగా నైన చేసి ఎరుగదు.
భారతదేశంలోని భౌతికవాద చింతన అన్ని కీలక పరిణామాల్లో ప్రధాన శక్తిగా నిలిచింది. మానవ జాతి ప్రతి అడుగులో తన అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని నిలుపుకొంటూ ముందుకు నడిచింది. ఈ భౌతిక దృక్పథంతో కూడిన మానవ ప్రయాణానికి భావవాదం ఒక పెద్ద అవరోధంగా నిలిచింది. మానవ ప్రగతిలో అసమానతలు సృష్టించింది. చరిత్ర పరిణామ క్రమంలో మానవ సమాజాన్ని సమన్వయించడాన్ని మార్క్స్ గతి తార్కిక చారిత్రక భౌతికవాద దృక్పథం అన్నాడు. ఈ క్రమంలో భారత సమాజాన్ని పరిశీలిస్తే చార్వాకులు భారత ఉత్తరఖండంలో భౌతిక సిద్ధాంత కర్తలుగా మన ముందు నిలుస్తారు. వారికి ఎదురు నిలిచిన వైదికులు భావ వాదానికి కొమ్ము కాసిన ప్రతినిధులు అయ్యారు.
వేద వాఙ్మయానికి ప్రత్యామ్నాయంగా భారతీయ భౌతికవాదంగా చార్వాకవాదం ముందుకొచ్చింది. భారతీయ భౌతికవాదాన్ని సాంఖ్యదర్శనం ముందుకు తీసుకువెళ్ళింది. ఈ సాంఖ్య శాస్త్రానికి మూల పురుషులు కపిలుడు, అసురీ, పంచశిఖుడు, ఈశ్వర కృష్ణుడు. ఈశ్వర కృష్ణుని 26 మంది గురుతరాల నుండి ఈ సాంఖ్యం బోధింపబడినట్లు చెప్పబడింది.
ఒక్కొక్క గురువు నుండి మరొక గురువు తరానికి 30 సంవత్సరాల అంతరం ఉందని అనుకుంటే, 780 సంవ త్సరాల అంతరం కపిలుడికీ, ఈశ్వర కృష్ణుడికీ ఉంది. దీనిని బట్టి కపిలుడు క్రీ.పూ.7, 8 శతాబ్దాల వాడై ఉండవచ్చునని చరిత్రకారుల అంచానా. బుద్ధుడి మీద కూడా సాంఖ్య ప్రభావం ఉందనేది స్పష్టం. బుద్ధుడు క్రీ.పూ. 6వ శతాబ్దం వాడనుకుంటే సాంఖ్య సిద్ధాంతం అప్పటికే ప్రాచుర్యం పొంది ఉంది. దీనినిబట్టి కూడా కపిలుని సాంఖ్య శాస్త్రం క్రీ.పూ. 8 శతాబ్దిదని అనుకోవచ్చు.
ఇకపోతే సమాజ నిర్మాణానికి సంబంధించిన మూలాలను అధ్య యనం చేయకుండా, సమాజ వ్యవస్థను ఉన్నదున్నట్లుగా అంగీకరించడం యధాతథవాదం. అది మార్పును అంగీకరించని వాదం. మార్పునకు భావజాలం ఒక చోదకశక్తి. దళితుల చరిత్ర నిర్మాణంలో హేతువాదమే కీలకం అవుతుంది. బి.ఆర్. అంబేడ్కర్ హేతువాద దృక్పథంతోనే సామాజిక చరిత్ర నిర్మాణంలోని చిక్కుముడులను విప్పారు.
కానీ లిఖిత పరమైన ఆధారాలు లేవని వీరి చరిత్రను మనువాదులు నిరాకరిస్తారు. భారతదేశంలో మనువాదం ఉత్పత్తికి భిన్నమైనది. జీవిక కోసం సృష్టించిన ఆ«ధ్యాత్మిక కల్పన వాదం ఇబ్బడి ముబ్బడిగా పెరిగి చివరికి దేశ చరిత్రను గజిబిజి చేసింది. అనేక వైరుద్ధ్యాలు, ప్రక్షిప్తాలతో కూడిన సాహిత్యంలో తాత్విక అంశాలు, చారిత్రక అంశాలు మృగ్యమైనాయి.
ప్రజలు ఎల్లప్పుడు రాజకీయాల్లో వంచనకు, ఆత్మ వంచనకు తెలివి తక్కువగా బలి అవుతూనే ఉన్నారు. అన్ని నైతిక, మత, రాజ కీయ, సాంఘిక పదజాలాల ప్రకటనల వెనుక ఏదో ఒక వర్గపు ప్రయోజనాలు దాగివున్నాయనే విషయాన్ని గ్రహించేంత వరకు వారలా బలి అవుతూనే ఉంటారు. ప్రతి పురాతన సంస్థ అది ఎంత అనాగరికమైనదిగా, కుళ్ళిపోయినదిగా కనబడినప్పటికీ పాలక వర్గాలకు చెందిన కొన్ని శక్తులచే అది నిలబెట్టబడుతోంది.
ఈ విషయాన్ని గ్రహించనంతవరకూ సంస్కరణ వాదులు, అభివృద్ధి కాముకులు పాత వ్యవస్థను సమర్థించే వారి చేత మోసగించబడుతూనే వుంటారు. ఆ వర్గాల ప్రతిఘటనను పటాపంచలు చేయడానికి ఒకే ఒక మార్గం వుంది. అదేమిటంటే మన చుట్టూ ఉన్న సమాజంలోనే పాతను తుడిచి వేసి కొత్తను సృష్టించే సామర్థ్యం కలిగివున్న శక్తులను విజ్ఞానవంతులను చేసి సంఘటిత పర్చడం.
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695
Comments
Please login to add a commentAdd a comment