అభిప్రాయం
దేశంలో కోట్లాది మంది విద్యార్థులు అభ్యసించే ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో మతవాద భావజాలాన్ని చొప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మతవాద భావాలు లౌకికవాద భావజాలానికి విఘాతం కలిగిస్తాయని అంబేడ్కర్ ఏనాడో అన్నారు. లౌకికవాద రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాఠ్య ప్రణాళికలు రూపొందించే విధానం చరిత్రకు నష్టం కలిగిస్తుంది. విద్యార్థి సమూహానికి దేశంలోని భౌగోళిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, చరిత్ర... వాస్తవంగా, ఉన్నది ఉన్నట్టుగా అర్థం కావలసి ఉంది. మతవాదాన్నే జాతీయ వాదంగా ప్రచారం చేసే ప్రయత్నాలు మంచివి కావు. భారతదేశంలో చదువుకుంటున్న విద్యార్థులు దేశ చరిత్రను శాస్త్రీయ భావాలతో, సరైన పద్ధతుల్లో అర్థం చేసుకోకపోతే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగలరా?
ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను అభ్యసిస్తున్న విద్యార్థులు సుమారు నాలుగు కోట్ల మంది ఉన్నారు. మొదట సిలబస్ రూపకల్పనలో భారత దేశ రాజ్యాంగ స్ఫూర్తి కలిగిన, జాతీయ భావాలు కలిగిన, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలలో పరిశోధకులు అయిన మేధావులు ఉన్నారు. అయితే వాజ్‌పేయి కాలం నుంచి ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ను మార్చి మతవాద పూరితమైన భావజాలాన్ని చూపించాలనే ప్రయత్నాన్ని బీజేపీ ప్రభుత్వాలు చేస్తూ వస్తున్నాయి. భారతదేశంలో చదువుకుంటున్న విద్యార్థులు దేశ చరిత్రను శాస్త్రీయ భావాలతో, సరైన పద్ధతుల్లో అర్థం చేసుకోకపోతే దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగలరా?
విద్యార్థి సమూహానికి దేశంలోని భౌగోళిక పరిస్థితులు, సామాజిక, లౌకికవాదాల పరిస్థితులు, చరిత్ర... వాస్తవంగా, ఉన్నది ఉన్నట్టుగా అర్థం కావలసి ఉంది. అయితే బీజేపీ ప్రభుత్వం మతవాదాన్నే జాతీయవాదంగా ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తోంది. పాఠ్య గ్రంథాలు రూపొందించినవారి అనుమతి లేకుండా తమకు అనుకూలంగా పాఠ్య గ్రంథాలను మార్చేశారు. అందుకే తమ అనుమతి లేకుండా పాఠ్య గ్రంథాలను మార్చేసి, సలహాదారుల్లో తమ పేరు
ఉంచి ప్రచురిస్తే కోర్టులో కేసులు దాఖలు చేస్తామని ప్రొఫెసర్లు యోగేంద్ర యాదవ్, సుహాస్ పల్శీకర్ హెచ్చరించే దాకా పరిస్థితి వచ్చింది.
ఈ మేరకు వారు ఎన్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ దినేశ్ ప్రసాద్ సక్లానీకి లేఖ రాశారు. చరిత్రలో వాస్తవ ఘట్టాలను తొలగించి, కల్పిత కథలను చేర్చి, వాస్తవ ఆధునిక రాజకీయ చరిత్రను విద్యార్థులకు అందకుండా చేసే నైతిక హక్కు మీకు లేదని వారు వాదించారు. ముఖ్యంగా భారతదేశ ఆధునిక చరిత్రలో అద్వానీ చేసిన రథయాత్రను, హిందూమత వాదాన్ని రాజకీయాల్లో చొప్పించి భారతదేశంలో హిందువులు, హిందూయేతరులు అనే భావజాలాన్ని తీసుకొచ్చారు.
అద్వానీ రథ యాత్ర దేశ రాజకీయాల్లో హిందూ భావజాలాన్ని పెంపొందించింది. అంతకు మునుపే హిందూ, ముస్లిం రాజకీయ విభేదాలను పెంచే మతవాద చరిత్రలు కొందరి చేత రాయబడి ఈ వైషమ్యాలను బాగా పెంచాయి. స్వాతంత్రోద్యమానికి ముందు నుంచి కూడా ఈ వైషమ్యాలను పెంచే భావజాల చరిత్ర రాయబడుతూ వచ్చింది. 19వ శతాబ్దంలో భారతీయ రాజకీయాల్లో మతవాదం చోటు చేసుకొనే సరికి మతాన్ని అన్వయించి రాయడం మొదలయింది.
మధ్యయుగ భారత చరిత్రను మతవాదులు సుదీర్ఘమయిన హిందూ, ముస్లిం సంఘర్షణగా చూస్తూ, అనివార్యంగా అదే దృష్టిని 19, 20 శతాబ్దాలకు అన్వయిస్తూ, జాతి వివక్ష సిద్ధాంతానికి, రాజకీయాలకు ఈ ఆధునిక యుగంలో ‘న్యాయం’ చేయగలిగామనుకొంటున్నారు. మత వివక్షతా చరిత్రకారులు మధ్యయుగాల్లోని ముస్లిం పాలకుల పాలనను విదేశీయుల పాలనగా చిత్రీకరిస్తూ, భారత సమాజానికి ముస్లింలు శాశ్వతంగా విదేశీయులని చెప్పగలుగుతున్నారు. ఈ దారుణమైన భావం హిందూ, ముస్లింల వైషమ్యాలను పెంచడానికి మరింతగా తోడ్పడింది. మతాన్ని రాజకీయాలకు ఉపయోగించుకోవడమనే ప్రక్రియ భారతదేశ చీలికకు దారితీసింది.
ఈ విషయంగా మొదటి నుండి బి.ఆర్.అంబేడ్కర్ ఆందోళన చెందారు. భారతదేశంలో మతవాద భావాలు లౌకికవాద భావజాలానికి విఘాతం కలిగిస్తాయనీ, రాజ్యాంగంలో పేర్కొన్న సౌభ్రాతృత్వం, సామాజిక సమతుల్యత భావాలు దెబ్బతింటాయనీ అన్నారు. ఇప్పుడు చరిత్రలో వీరు తొలగించిన పాఠ్యాంశాల్లో ఎంతో రాజకీయ చరిత్ర దాగి వుంది. ‘బాబ్రి మసీదు’ కూల్చివేత చిన్న విషయం కాదు. ఆ కూల్చివేత వెనుక ‘హిందూ రాజ్య’ నిర్మాణ భావన ఉంది. లౌకికవాద భావజాలానికి ఆ చర్య గొడ్డలి పెట్టు.
బాబ్రీ మసీదు కూల్చివేత ముస్లింలకు అభద్రత తీసుకొచ్చింది. నిజానికి చరిత్ర అనేది వాస్తవ ఘటనల సముచ్ఛయంగా ఉండాలి. కొత్తగా సిద్ధం చేసిన పాఠ్యపుస్తకాలలో బాబ్రీ మసీదు విధ్వంసానికి ముందు జరిగిన అద్వానీ రథయాత్ర, ఆ తరువాత జరిగిన పరిణామాలను తొలగించేశారు. వివాదాస్పద స్థలంలో రామ మందిరం నిర్మించడానికి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి మాత్రం విస్తారంగా ప్రస్తావించారు. అయోధ్య గురించి మునుపటి పుస్తకాలలో నాలుగు పేజీలు ఉంటే ఇప్పుడు రెండు పేజీలకు కుదించారు. వాస్తవ ఘటనలను తొలగిస్తే, ‘బాబ్రీ మసీదు’ కూల్చివేతను గురించిన మూలాలు, ‘రామ మందిరం’ నిర్మాణం దృక్పథం తెలియకుండా పోతాయి.
పాఠ్యపుస్తకాలను కాషాయీకరించాలన్న ప్రస్తుత పాలకుల ధోరణికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేయడాన్ని లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, సామ్యవాదులు, చరిత్ర రచనా ప్రవీణులు నిరసిస్తున్నారు. దేశంలో అంబేడ్కర్ కృషి వలన లౌకికభావ స్ఫూర్తి బలంగా ఉంది. దేశ చరిత్ర ఎప్పుడూ కూడా మతవాదంతో సాగదు. అది ఉత్పత్తి శక్తుల వల్లే ముందుకు సాగుతుంది.
ఈనాటి పాఠ్య ప్రణాళిక భారత రాజ్యాంగ స్ఫూర్తితోనే ముందుకు నడవవలసి ఉంది. భారతదేశ సంస్కృతిలో, ప్రజల్లో మొదటి నుండి కూడా పోరాట పటిమ ఉంది. ఇంగ్లీషువాళ్ళు అనేక రూపాల్లో మన సంపదను దోచుకుని, సుఖాలు పొందుతున్న విషయాలను ప్రజలు అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా రైతులు, కార్మికులు, పేద ప్రజలు బ్రిటిష్ ప్రభుత్వ కాలంలో పన్నుల చేత వేధించబడ్డారు. అందుకే భారతదేశంలో అన్ని వర్గాల ప్రజల్లో పోరాట పటిమ పెరిగింది. ‘రూపాయి సమస్య’ అనే గ్రంథంలో బ్రిటిష్ వాళ్ళ ఆర్థిక దోపిడీని గురించి అంబేడ్కర్ స్పష్టంగా నివేదించారు.
ఇకపోతే రాబోయే చరిత్రలో మోదీ పాలనలోని ఎన్నో దాడులు, అణచివేతలు చరిత్రకు సాక్ష్యాలు. ఒకసారి మనం అవలోకిస్తే ఎన్నో దారుణమైన ఘట్టాలు మనముందు వచ్చి నిలబడతాయి. ప్రజల జీవనోపాధిపై దాడి, నోట్ల రద్దు వల్ల ఏర్పడిన సంక్షోభం, గో రక్షణ పేరుతో జరిగిన దాడులు, ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణతో పాటు వాటి విక్రయాలు... ఇలా ఎన్నో. కేంద్ర కార్మిక సంఘాల ఉమ్మడి వేదిక సుదీర్ఘ కాలంగా ఉనికిలో ఉండటమేగాక, ఆయా సంఘాలు దశాబ్దాలుగా నయా ఉదారవాద విధానాలను ఎదుర్కోవడంలో ప్రధానపాత్ర పోషించాయి.
వారి అనుభవం కూడా రైతు ఉద్యమానికి లాభించింది. 2018 మార్చిలో నాసిక్ నుండి ముంబై వరకు సుదీర్ఘంగా సాగిన కిసాన్ లాంగ్ మార్చ్ రైతుల డిమాండ్లను నొక్కిచెప్పింది. ఈ లాంగ్ మార్చ్ బీజేపీని ఓడించటం సాధ్యమేనని... బీజేపీ అజేయశక్తి అనే అభిప్రాయం కేవలం కార్పొరేట్ మీడియా ప్రచార సృష్టి మాత్రమేనని స్పష్టమైన సందేశాన్ని పంపింది. 2019 సంవత్సరంలో జరిగిన పుల్వామా ఘటన, ప్రతిగా జరిగిన బాలాకోట్ వైమానిక దాడి, ఆ తరువాత తీవ్ర జాతీయవాద ప్రచార నేపథ్యంలో బీజేపీ విజయం సాధించినప్పటికీ... 2024 కల్లా 240 సీట్లకు ఎందుకు పడిపోయిందో ప్రజలకు, విద్యార్థులకు తెలియాల్సిన అవసరం ఉంది.
దేశంలో లౌకికవాదం, రాజ్యాంగ స్ఫూర్తి పెరుగుతున్నాయి. ఈ రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా పాఠ్య ప్రణాళికలు రూపొందించే విధానం చరిత్రకు నష్టం కలిగిస్తుంది. రాబోయే తరాలు లౌకికవాదానికీ, మతవాదానికీ జరిగిన సమరాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు భారతీయులే అనేది ముందు గుర్తించాలి. భారతీయులందరికీ వాస్తవమైన చరిత్రను అందించినప్పుడే భారతదేశ పరిణామం త్వరితం అవుతుంది. డీడీ కోశాంబీ, రొమిల్లా థాపర్, బిపిన్ చంద్ర, అంబేడ్కర్ రచనలు భారతదేశ చరిత్ర నిర్మాణానికి దిశా నిర్దేశం చేస్తున్నాయి. ఆ వైపు నడుద్దాం.
డా‘‘ కత్తి పద్మారావు
వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు ‘ 98497 41695
Comments
Please login to add a commentAdd a comment