స్త్రీ సాధికారతపై ఇంకా గొడ్డలి వేటా? | Sakshi Guest Column On Womens protection Girls education | Sakshi
Sakshi News home page

స్త్రీ సాధికారతపై ఇంకా గొడ్డలి వేటా?

Published Thu, Nov 28 2024 4:40 AM | Last Updated on Thu, Nov 28 2024 4:40 AM

Sakshi Guest Column On Womens protection Girls education

విశ్లేషణ

దేశంలో, రాష్ట్రాలలో, గ్రామాలలో, స్త్రీ వ్యక్తిత్వం మీద, వారి సాధికారత మీద, వారి జీవన వ్యవస్థల మీద నిరంతర దాడులు జరుగుతూనే ఉన్నాయి. పురుష ప్రపంచం, పితృస్వామిక పాలక వర్గం స్త్రీని కోలుకోలేని దెబ్బతీస్తోంది. ముఖ్యంగా మతోన్మాద భావజాలం, మూఢాచారాల కఠినత్వం భారత దేశంలో స్త్రీల వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నాయి. ఇప్పటికీ స్త్రీకి విద్యా నిరాకరణ జరుగుతోంది. ఇంకా బాల్య వివాహాలతో తల్లిదండ్రులు బాలికల విద్యను హైస్కూల్‌ స్థాయిలోనే నిలువరిస్తున్నారు. ఇది భారత రాజ్యాంగం స్త్రీలకు కల్పించిన హక్కులను ఉల్లంఘించడమే! స్త్రీల ఆస్తి హక్కుని దెబ్బతీయటం వల్ల వారి వ్యక్తిత్వం మీద దాడి సులభమవుతోంది. స్త్రీ తన సాధికారత కోసం చేస్తున్న పోరాటంలో లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు కలిసి నడవాలి.

సొంత తల్లిదండ్రులే బాలుడిని ఒక రకంగా, బాలికను ఒక రకంగా చూసే పరిస్థితులు ఇంకా కొనసాగడం సిగ్గుచేటు. కొన్ని సామాజిక కులాలైతే మూడు దశాబ్దాల పాటు ఆడ శిశువు భ్రూణ హత్యలకు పాల్పడ్డాయి. బాలికలను చదివించకుండా ఎదుగుతున్న మెదళ్లపై ఉక్కుపాదం మోపాయి.

అక్షరాస్యతలో నుండి నిజమైన విద్యావంతులు ఆవిర్భ విస్తారు. విద్యావంతుల నుండి మేధావులుగా అభివృద్ధి చెంద డానికి ఎక్కువ అవకాశం ఉంది. స్త్రీలకు తమ శరీరాన్ని గురించిన అవగాహన, ఆరోగ్యం, తినవలసిన ఆహార పదార్థాలు, ఏ పదార్థం ఏ శక్తినిస్తుంది మొదలైన అంశాలు అక్షరాస్యత వల్ల తెలుస్తాయి. చేతివృత్తులు, వ్యాపార రంగాల్లో కూడా స్త్రీ వృద్ధి చెందడానికి అక్షరాస్యత ఉపయుక్తం అయ్యింది.

స్త్రీ ఉద్యోగంలోకి ప్రవేశిస్తేనే!
స్త్రీల ఆరోగ్యం సమాజ మూఢాచారాల వలన కుంటుబడి మర ణాల రేటు పెరిగింది. అయితే కేరళ, మిజోరం వంటి రాష్ట్రాల్లో స్త్రీలు విద్య, వైద్య రంగాల్లోకి చొరవగా అడుగుపెట్టిన తరువాత ఆ సమా జాల్లో పెద్ద మార్పులు వచ్చాయి. ఉపాధ్యాయులైన స్త్రీలు సమాజంతో అవినాభావ సంబంధాలు కలిగి ఉండటంతో వాళ్ళ ఆలోచన వల్ల సామాజిక స్ఫూర్తి, చైతన్యం పెరిగాయి. భర్తల వేధింపుల్ని, మానసిక హింసని మొదటిగా అడ్డుకుంది డాక్టర్లు, టీచర్లుగా ఉద్యో గాల్లో ప్రవేశించిన మహిళలే.

అయితే, స్త్రీల ఆస్తి హక్కుని దెబ్బతీయటం వల్ల వారి వ్యక్తిత్వం మీద దాడి సులభమవుతోంది. ఎన్ని చట్టాలు వచ్చినా వారి ఆస్తి హక్కుకు కుటుంబ సభ్యులు, పాలకులు తూట్లు పొడుస్తూనే ఉన్నారు. ఆడపిల్లకి ఆస్తి హక్కు కల్పించడంలో హిందూ వారసత్వ (సవరణ) చట్టం–2005 ఒక మైలురాయి వంటిదని చెప్పవచ్చు.

వందల సంవత్సరాలుగా సాంప్రదాయ వాదులు, సంఘసంస్కర్తల మధ్య జరిగిన సంఘర్షణల అనంతరం ఆడపిల్లలకు ఆస్తిహక్కులు దక్కాయి. విభిన్న మతాలు, సంస్కృతులున్న మన దేశంలో ఈ ఆస్తి హక్కులన్నవి కుల, మత, ప్రాంతీయ ప్రాతిపదికపై వేరువేరుగా ఉన్నాయి. అదేకాక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి కూడా ఆస్తికి సంబంధించి చట్టాలు చేసే అధికారాలు ఉండటం వల్ల అటువంటి తేడాలు ఉన్నాయి. 

హక్కులు ఉన్నప్పటికీ...
‘చట్టం దృష్టిలో అందరూ సమానులే’ అన్న ప్రాథమిక రాజ్యాంగ న్యాయసూత్రానికి విరుద్ధంగా ఆడపిల్ల ఏ హక్కులు లేకుండా పరా ధీనగా బతుకుతోంది. ఈ వివక్షను 2005 సవరణ చట్టం పూర్తిగా తొలగించిందని చెప్పవచ్చు. 1956 నాటి హిందూ వారసత్వ చట్టం ఒక సమగ్రమైన, సమాన వారసత్వపు హక్కులు కల్పించిన మొదటి చట్టం. 

2005 హిందూ వారసత్వ (సవరణ) చట్టం, 1956 చట్టంలోని కొన్ని లొసుగులని తొలగించింది. స్త్రీ సర్వతోముఖాభివృద్ధికి, సాధికా రతకు సంపూర్ణ ఆస్తిహక్కు కలిగి ఉండాలని గుర్తించి, సవరణలు చేసిన సంస్కరణ చట్టం అని దీన్ని చెప్పవచ్చు. 2005 హిందూ వారసత్వ (సవరణ) చట్టం, కేంద్ర ప్రభుత్వం చేత మొత్తం దేశానికంతటికీ వర్తించేలా చేయబడిన చట్టం.

దీని ప్రకారం, మగవారితో సమానంగా ఆడవాళ్లకు పుట్టుకతోనే ‘కోపార్సినరీ’ హక్కు ఉంటుంది. ఏ విధంగా కుమారునికి హక్కులు వస్తాయో, అదే విధంగా ఆడపిల్లలకి కూడ హక్కులు వస్తాయని విస్పష్టంగా పేర్కొంది. హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటా యని చెప్పింది. అలాగే వ్యవసాయ భూములలో కూడా హక్కులు యిచ్చింది. ఈ చట్ట ప్రకారం ఏ హక్కులు అడపిల్లకి వచ్చాయో, ఆ హక్కులు ఆమెకి సంపూర్ణమనీ, వీలునామా ద్వారా తన ఆస్తిని వేరొకరికి ఇవ్వడానికి, లేక అమ్ముకోవడానికి గానీ ఆమెకి పూర్తి హక్కులు ఉన్నాయని ఉద్ఘాటించింది. 

1985లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌.టి.రామారావు ప్రభుత్వంలో వచ్చిన హిందూ వారసత్వ చట్టం అవివాహిత కుమార్తెలకు, కుమారులతో సమానంగా పూర్వీకుల ఆస్తిలో హక్కు కల్పించింది. ఆ చట్టం వచ్చేనాటికి వివాహమైన వారికి హక్కు ఇవ్వలేదు. 1985 తర్వాత వివాహం అయిన కూతుళ్ళకు కూడా ఆస్తి హక్కు ఇచ్చారు. 

ఇంతకు ముందు ఒక్క స్త్రీధనం మీద అంటే వివాహ సమయంలో పుట్టింటి, అత్తింటి వారు బహుమతిగా ఇచ్చే వస్తువులు, కొద్దిపాటి ఆస్తుల మీద మట్టుకే హక్కు కలిగిన ఆడపిల్ల, ఈనాడు అటు పూర్వీకుల ఆస్తిలో సోదరులతో సమానమైన ‘కోపార్సినరీ’ హక్కు, ఇటు తండ్రి వాటాలో లేక స్వార్జితంలో (వీలునామా లేని ఎడల)  సమాన వాటా పొందే హక్కు పొందింది. 

ఈ ఆస్తిహక్కు ఆడపిల్ల సర్వతోముఖాభివృద్ధికి, సాధికారతకి తోడ్పడుతుంది. అయితే, ఆర్థికంగా ఆడపిల్లకు ఆస్తి ఇవ్వకూడదనే ఉద్దేశం అన్ని వైపులా కనిపిస్తుంది. ఇక వారికోసం, వారు వాదించుకునే చట్టాలు తేవడం కోసం ఏ పార్టీ మహిళలకు సముచితమైన సీట్లు ఇవ్వడం లేదు.అందుకే అసెంబ్లీలు, పార్లమెంటు మహిళలు తక్కువగా వుండి వెలవెలబోతున్నాయి. 

అంతటా నిరాశే...
ఇకపోతే ఇటీవల తెలంగాణ గురుకుల పాఠశాలల్లో బాలికల అస్వస్థత చూస్తే, నన్నయ విశ్వవిద్యాలయంలో ఆడపిల్లల అన్నంలో పురుగుల విషయం చూస్తే దేశంలో అన్ని బాలికల హాస్టళ్లలో అశుభ్రమైన, అరుచికరమైన, పౌష్టికాహార రహితమైన వాతావ రణం కనబడుతోందనిపిస్తోంది. పాలక వర్గాల పితృస్వామిక పరి పాలనను విద్యార్థినుల అవస్థలు కళ్ళకు కట్టినట్టు చూపుతున్నాయి.

ఇక బాలికల మీద, యువతుల మీద నిరంతరం జరుగుతున్న అత్యాచారాలకు అంతం లేదు. పురుషులు, యువకులు, మద్యం,గంజాయి, ఇతర మత్తు పదార్థాల వల్ల కామ వ్యామోహితులవు తున్నారు. ఉచ్చనీచాలు తెలియకుండా కళ్ళు కనిపించని స్థితిలో వయస్సు భేదము లేకుండా మీదికి ఉరుకుతున్నారు. ఇటీవల బాపట్ల జిల్లాలో జరిగిన, ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న అనేక ఘటనలు గుండెల్ని పిండుతున్నాయి. 

స్త్రీకి రక్షణ, విద్యార్థినులకు రక్షణ లేకుండా పోతోంది. రాత్రిపూట తాగి ఆ తిక్కతో ఇతర దేశాలకు భర్తలు వెళ్ళి భార్యలు ఒంటరిగా ఉన్న ఇళ్ళ మీద పడి తలుపులు పగులగొట్టి అత్యాచారాలు చేస్తున్నా, వస్తువులు తీసుకెళుతున్నా ప్రభుత్వాలు చూసి చూడనట్లుగా ఉంటున్నాయి.

ఆరు సంవత్సరముల వయసు పూర్తి అగు వరకు బాల బాలికల ఆరోగ్య పరిరక్షణకు, విద్యా వసతులు కల్పించటానికి ప్రభుత్వం కృషి చేయాలని రాజ్యాంగంలోని 45వ అధికరణ చెబుతోంది. 14 ఏళ్ల వయసు వచ్చువరకు బాల బాలికలకు ఉచిత నిర్బంధ విద్య నేర్పా లన్న సూత్రం గతంలో ఈ అధికరణంలో ఉన్నది. అయితే ఆ ఆదేశిక సూత్రం ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చబడింది. 

అయితే కేవలం పదాల గారడీ తప్ప పరిస్థితిలో మార్పు లేదు. ఈ అధికరణను రోజూ పాలక వర్గాలు చదువుకోవాలి. ఇక, మత్తు పానీయాలను నిషేధించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని అధికరణం 47 చెబుతోంది. ప్రజలను ఆరోగ్య వంతులను చేయటం ద్వారా వారి జీవన ప్రమాణాలను పెంచటం ప్రభుత్వ బాధ్యత.

అయినా పితృస్వామ్య పాలక వర్గం భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోంది. తమ అభ్యున్నతి కోసం, ఆర్థిక పరిరక్షణ కోసం, రాజ్యాధి కారం కోసం స్త్రీలు చేస్తున్న పోరాటంలో లౌకికవాదులు, ప్రజా స్వామ్యవాదులు కలిసి నడవాలి.

డా‘‘ కత్తి పద్మారావు 
వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement