
బీఎస్‌ఎన్‌ఎల్‌కి చివరగా 2009–2010 ఆర్థిక సంవత్సరంలో 581 కోట్ల రూపాయల లాభం వచ్చింది. అది కూడా అప్పటికి దానికి ఉన్న డిపాజిట్ల మీద వచ్చిన వడ్డీ తప్ప వాణిజ్యపరమైన లాభాల వల్ల కాదు. వాణిజ్య పరంగా దానికి లాభాలు 2007–2008 ఆర్థిక సంవత్సరంలో చివరగా వచ్చాయి. భారత ప్రభుత్వం ‘సావరిన్ గ్యారెంటీ’తో రూ. 8,500 కోట్ల రుణం బాండ్ల రూపంలో తీసుకోవడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్‌లో 2020 సెప్టెబర్ 28న బీఎస్‌ఎన్‌ఎల్ లిస్ట్ అయింది. దానితో ప్రతి మూడు నెలలకు ఒకసారి తమ ఆర్థిక ఫలితాలను సెబీకి ఇవ్వవలసి ఉంటుంది. ఈ రకంగా ప్రతి మూడు నెలలకు ఆ సంస్థ తన ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తోంది. డిసెంబర్ 2024తో ముగిసిన మూడు నెలల కాలానికి బీఎస్‌ఎన్‌ఎల్‌కు నికరంగా 262 కోట్ల లాభం 17 ఏళ్ల తర్వాత వచ్చింది. ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలానికి మొత్తంగా చూస్తే ఇంకా నష్టాలలోనే ఉన్నా, ఒక త్రైమాసికంలో లాభాలు ఆర్జించడం దాదాపు 17 ఏళ్లలో ఇదే తొలిసారి. అయితే ఇది ఎలా సాధ్యం అనేది ఇప్పుడు చూద్దాం.
రెవెన్యూ పరంగా చూస్తే కేవలం 131 కోట్లు మాత్రమే ఆదాయం పెరిగింది. సాధారణంగా మూడు, నాలుగు త్రైమాసికాల్లో టెలికం కంపెనీల ఆదాయాలు పెరుగు తాయి కనుక ఆ ఆదాయం పెరుగుదల లెక్కలోకి రాదు. కానీ ఇతర ఆదాయంలో 336 కోట్ల పెరుగుదల, ఉద్యో గుల జీతభత్యాల ఖర్చులో 336 కోట్లు తగ్గటం, డిప్రిసి యేషన్, ఋణమాఫీ వంటి అంశాలలో 766 కోట్లు తగ్గుదల వల్ల ఈ లాభం ఆర్జించడం సాధ్యమయింది. అంటే ఆర్థిక ఫలితాల లెక్కలు కట్టడంలో ఈ 2024–25 నుండి బీఎస్‌ఎన్‌ఎల్ చేసిన మార్పుల వల్ల ఇది సాధ్యం అయింది.
లెక్కలు కట్టడంలో చేసిన మార్పులు ఏమిటి?
ఉద్యోగుల జీతభత్యాలను ఆ యా ప్రాజెక్టుల వారీగా విడగొట్టి చూపడం వల్ల రూ. 337 కోట్లు ఖర్చు ఆదా అయింది. అలాగే డిప్రిసియేషన్, పారు బకాయిల రద్దు వంటి చర్యలను ఆ యా సర్కిళ్లకు ప్రత్యేకంగా లెక్క కట్టడం ద్వారా 766 కోట్లు తక్కువ చూపించగలిగారు. గతంలో ఈ మొత్తాలను సర్కిల్ వారీగా కాకుండా మొత్తం మీద చూపించేవారు. ఏతావతా స్పెక్ట్రం మీద కట్టే మొత్తం డబ్బులను విడగొట్టి ఆయా సర్కిళ్లలో చూపడం, తగ్గుదలను ప్రాజెక్టు వారీగా చూపడం వల్ల ఆదాయం గణనీయంగా పెరగక పోయినా ఈ త్రైమాసికంలో 262 కోట్ల లాభం వచ్చింది. నాల్గవ త్రైమాసికంలో ఏడాదికి కట్టే మొత్తాలు ఉండటం మూలంగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది.
చదవండి: భావోద్వేగాల డిజిటల్ బందిఖానా!
స్థూలంగా చూస్తే ప్రయివేటు టెలికాం కంపెనీలు రేట్లు పెంచితే కేవలం నాలుగు నెలల్లో 65 లక్షల మంది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌కు వస్తే ఆ తరువాత నెలలో మళ్లీ 4 లక్షల మంది వినియోగదారులు వెళ్లిపోయారు. అంతకుముందు కేవలం ఏడాదిన్నరలో బీఎస్‌ఎన్‌ఎల్ రెండు కోట్ల మంది వినియోగదారులను కోల్పోయింది. ఇందుకు కారణం విశ్లేషిస్తే నెట్‌వర్క్ నాణ్యతా లోపం ప్రధాన కారణం. ప్రయివేటు టెలికాం కంపెనీలు 5జీ నెట్‌వర్క్ అందిస్తుంటే ఇంకా 3జీలోనే బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL) ఉండటం, భారతీయ సాంకేతికతతో కూడిన 4జీ సేవలు అందుబాటులో రావడానికి గత నాలుగేళ్లుగా ఆలస్యం కావడం, ఇప్పుడిప్పుడే టవర్ల అప్‌గ్రెడేషన్ పూర్తి అవుతున్నా కొన్ని సాంకేతిక సమస్యలు పరిష్కారం కావాల్సి ఉండటం... వంటి కారణాల వల్ల బీఎస్‌ఎన్‌ఎల్ మార్కెట్ షేర్‌ను పెంచుకోలేక పోతోంది.
4జీ సేవలు అందుబాటులోకి త్వరలో పూర్తి స్థాయిలో రాబోతున్నాయి. దానిని 5జీ లోకి మార్చుకునే అవకాశాలు ఉండటం, శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు విదేశీ కంపెనీతో అనుసంధానం కానుండటంతోనైనా బీఎస్‌ఎన్‌ఎల్ తన ఆదాయాలు మరింత పెంచుకుని లాభాలు పూర్తి స్థాయిలో పొందాలని కోరుకుందాం.
– తారానాథ్ మురాల
టెలికామ్ రంగ విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment