ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ వచ్చే ఏడాది జూన్ నాటికి 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొస్తుందని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. మే నాటికి లక్ష బేస్ స్టేషన్ల ద్వారా దేశీయంగా 4జీ టెక్నాలజీని విస్తరిస్తామన్నారు. ‘యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్’ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘4జీ టెక్నాలజీకి సంబంధించి భారతదేశం ప్రపంచాన్ని అనుసరించింది. ప్రపంచంతో కలిసి 5జీ సాంకేతికతను అభివృద్ధి చేసింది. కానీ 6జీ టెక్నాలజీలో మాత్రం ఇండియా ప్రపంచానికి నాయకత్వం వహిస్తుంది. బీఎస్‌ఎన్‌ఎల్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది మే నాటికి ఒక లక్ష బేస్ స్టేషన్ల ద్వారా దేశీయంగా 4జీ టెక్నాలజీని విస్తరించనున్నాం. జూన్ నాటికి 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. ఇప్పటివరకు 38,300 సైట్‌లను ఎంపిక చేశాం. ప్రభుత్వ సంస్థ ప్రైవేట్ కంపెనీలకు చెందిన కీలక పరికరాలను ఉపయోగించబోదు. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బీఎస్‌ఎన్‌ఎల్ వద్ద పూర్తిస్థాయిలో పనిచేసే రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ ఉంది. పదేళ్ల క్రితం వాయిస్ కాల్ ఖరీదు 50 పైసలు. కానీ దాని విలువ మూడు పైసలకు చేరింది. వాయిస్ ధర 96 శాతం తగ్గింది. గతంలో ఒక జీబీ డేటా ధర రూ.289.10గా ఉండేది. దాని విలువా గణనీయంగా పడిపోయింది. రానున్న రోజుల్లో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి’ అన్నారు.
ఇదీ చదవండి: రూ.7.7 కోట్లు బాకీ.. కంపెనీపై దివాలా చర్యలు
‘బీఎస్‌ఎన్‌ఎల్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీ-డాట్, దేశీయ ఐటీ కంపెనీ టీసీఎస్ కన్సార్టియం అభివృద్ధి చేసిన 4జీ సాంకేతికతను ఉపయోగిస్తోంది. పదేళ్ల క్రితం బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్‌ల సంఖ్య ఆరు కోట్లుగా ఉంది. ప్రస్తుతం అది 94 కోట్లకు పెరిగింది. భారత్-అమెరికా వ్యూహాత్మక సంబంధాలు మెరుగవుతున్నాయి. ఈమేరకు చాలా రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకారం అందించుకుంటున్నాయి. అమెరికాలో రక్షణ రంగానికి అవసరమయ్యే చిప్‌లను సరఫరా చేసే ఫ్యాబ్ (చిప్ ప్లాంట్)ను భారత్‌లో ఏర్పాటు చేయబోతున్నాం’ అని మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment