బీఎస్‌ఎన్‌ఎల్ కొన్ని రాష్ట్రాల్లో ‘5జీ-రెడీ సిమ్ కార్డ్’లను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఇవి రాబోయే నెట్‌వర్క్ అప్‌గ్రేడ్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపింది. కొత్త సిమ్ కార్డులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలో అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో 3జీ సదుపాయాన్నే అందిస్తోంది. కొన్ని టైర్1, టైల్ 2 నగరాలతోపాటు ఇతర టౌన్‌ల్లో మాత్రమే 4జీ సేవలను ప్రారంభించింది. ఇటీవల జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ఐడియా..వంటి ప్రైవేట్ నెట్‌వర్క్ ఆపరేటర్లు తమ రీఛార్జ్ ప్లాన్లను సవరించాయి. వాటిని గతంలో కంటే దాదాపు 20-30 శాతం పెంచుతున్నట్లు ప్రకటించాయి. దాంతో ఆ నెట్‌వర్క్ వినియోగదారులు మార్కెట్లో చౌకగా రీచార్జ్ ప్లాన్లు అందించే బీఎస్‌ఎన్‌ఎల్‌వైపు మొగ్గుచూపుతున్నారు. కానీ ఇందులో 4జీ సర్వీసే కొన్ని ప్రాంతాలకు పరిమితమైంది. దాంతో కొంత వెనకడుగు వేస్తున్నారు. ఇది గమనించిన బీఎస్‌ఎన్‌ఎల్ ప్రతినిధులు 4జీ సదుపాయాన్ని వేగంగా విస్తరించేందుకు పావులు కదుపుతున్నారు. భవిష్యత్తులో రాబోయే 5జీ నెట్‌వర్క్ కోసం ప్రత్యేకంగా సిమ్‌కార్డులను తీసుకునే అవసరం లేకుండా ‘5జీ-రెడీ సిమ్‌కార్డు’లను అందిస్తున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ వివరించింది.
ఈ సిమ్‌కార్డును ఆధునిక స్మార్ట్‌ఫోన్లతోపాటు ఫీచర్‌ఫోన్లలో వాడుకునేందుకు వీలుగా రెగ్యులర్, మైక్రో, నానో వేరియంట్లలో తీసుకొస్తున్నారు. ఎయిర్‌టెల్, జియో మాదిరిగానే బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ వినియోగదారులు 5జీ కనెక్టివిటీని యాక్సెస్ చేయడానికి కొత్త సిమ్ కార్డ్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 5జీ-రెడీ సిమ్‌నే వాడుకోవచ్చని సంస్థ పేర్కొంది. వినియోగదారులకు మరింత మెరుగైన నెట్‌వర్క్ కనెక్టివిటీని అందించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు వివరించింది.
ఇదీ చదవండి: తల్లిదండ్రుల అనుమతి లేకుండా పిల్లల డేటా సేకరణ!
ఇదిలాఉండగా, ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో టెలికాం ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ కంపెనీల కోసం రూ.1.28 లక్షల కోట్లను కేటాయించింది. ఇందులో బీఎస్‌ఎన్‌ఎల్, ఎమ్‌టీఎన్‌ఎల్‌లకు రూ.లక్ష కోట్ల పైనే కేటాయించడం విశేషం. ముఖ్యంగా బీఎస్‌ఎన్‌ఎల్‌లో సాంకేతిక మెరుగుదల, పునర్నిర్మాణం కోసం రూ.82,916 కోట్లను కేటాయించారు. తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ సేవల ట్రయల్స్‌ను ప్రారంభించింది. ఈ మేరకు బీఎస్‌ఎన్‌ఎల్ 5జీ నెట్‌వర్క్ సేవల్ని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పరీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment