భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్‌ఎన్‌ఎల్) తన కస్టమర్లకు శుభవార్త అందించింది. సమీప భవిష్యత్తులో టారిఫ్ రేట్లను పెంచబోమని బీఎస్‌ఎన్‌ఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ రవి స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో బీఎస్‌ఎన్‌ఎల్‌కు కస్టమర్లు పెరుగుతున్న నేపథ్యంలో స్పామ్ బ్లాకర్స్, ఆటోమేటెడ్ సిమ్ కియోస్క్‌లు, డైరెక్ట్-టు-డివైస్ సేవలు వంటి కొత్త ఆఫర్‌లను తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్న వినియోగదారులను నిలుపుకోవడంతోపాటు కొత్తవారిని ఆకర్షించడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడుతాయని చెప్పారు.
సెప్టెంబర్ 2024లో బీఎస్‌ఎన్‌ఎల్ ఊహించని విధంగా 8.5 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను పొందింది. ప్రైవేట్ రంగ టెలికాం కంపెనీలకు ఈమేరకు కస్టమర్లు తగ్గుతున్నారు. జులైలో ప్రైవేట్ టెలికాం సంస్థలు 10 శాతం నుంచి 27 శాతం వరకు టారిఫ్ రేట్లను పెంచడంతో వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌కు మళ్లుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డేటా ప్రకారం రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా ఇటీవల కాలంతో దాదాపు కోటి మంది చందాదారులను కోల్పోయాయి. జియో ఒక్కటే 79.69 లక్షల మంది సబ్‌స్క్రైబర్‌లను నష్టపోయింది.
ఇదీ చదవండి: రిపేర్ బిల్లు చూసి చిర్రెత్తిన కస్టమర్!
మెరుగైన సేవలందిస్తే మేలు..
ప్రస్తుతం జియో 46.37 కోట్లు, ఎయిర్‌టెల్ 38.34 కోట్లు, బీఎస్‌ఎన్‌ఎల్ 9.18 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లను కలిగి ఉంది. బీఎన్‌ఎన్‌ఎల్‌కు సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ ప్రైవేట్ పోటీదారులతో పోల్చితే 4జీ, 5జీ సేవలందించడంతో చాలా వెనకబడి ఉంది. వినియోగదారుల పెంపును ఆసరాగా చేసుకుని విభిన్న విభాగాల్లో మెరుగైన సేవలందిస్తే మరింత మంది సబ్‌స్రైబర్లు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment