BSNL 4G
-
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు తీపికబురు
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) తన కస్టమర్లకు శుభవార్త అందించింది. సమీప భవిష్యత్తులో టారిఫ్ రేట్లను పెంచబోమని బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ రవి స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో బీఎస్ఎన్ఎల్కు కస్టమర్లు పెరుగుతున్న నేపథ్యంలో స్పామ్ బ్లాకర్స్, ఆటోమేటెడ్ సిమ్ కియోస్క్‌లు, డైరెక్ట్-టు-డివైస్ సేవలు వంటి కొత్త ఆఫర్లను తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఉన్న వినియోగదారులను నిలుపుకోవడంతోపాటు కొత్తవారిని ఆకర్షించడానికి ఈ కార్యక్రమాలు ఉపయోగపడుతాయని చెప్పారు.సెప్టెంబర్ 2024లో బీఎస్ఎన్ఎల్ ఊహించని విధంగా 8.5 లక్షల మంది సబ్స్క్రైబర్లను పొందింది. ప్రైవేట్ రంగ టెలికాం కంపెనీలకు ఈమేరకు కస్టమర్లు తగ్గుతున్నారు. జులైలో ప్రైవేట్ టెలికాం సంస్థలు 10 శాతం నుంచి 27 శాతం వరకు టారిఫ్ రేట్లను పెంచడంతో వినియోగదారులు బీఎస్ఎన్ఎల్కు మళ్లుతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) డేటా ప్రకారం రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా ఇటీవల కాలంతో దాదాపు కోటి మంది చందాదారులను కోల్పోయాయి. జియో ఒక్కటే 79.69 లక్షల మంది సబ్స్క్రైబర్లను నష్టపోయింది.ఇదీ చదవండి: రిపేర్ బిల్లు చూసి చిర్రెత్తిన కస్టమర్!మెరుగైన సేవలందిస్తే మేలు..ప్రస్తుతం జియో 46.37 కోట్లు, ఎయిర్టెల్ 38.34 కోట్లు, బీఎస్ఎన్ఎల్ 9.18 కోట్ల మంది సబ్స్క్రైబర్లను కలిగి ఉంది. బీఎన్ఎన్ఎల్కు సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ ప్రైవేట్ పోటీదారులతో పోల్చితే 4జీ, 5జీ సేవలందించడంతో చాలా వెనకబడి ఉంది. వినియోగదారుల పెంపును ఆసరాగా చేసుకుని విభిన్న విభాగాల్లో మెరుగైన సేవలందిస్తే మరింత మంది సబ్స్రైబర్లు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
బీఎస్ఎన్ఎల్ దూకుడు! మరో మైలురాయికి చేరువలో,,
ప్రభుత్వ టెలికాం ఆపరేటర్ బీఎస్ఎన్ఎల్ దూసుకెళ్తోంది. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు ఈ ఏడాది జూలైలో తమ టారిఫ్ ధరలను పెంచినప్పటి నుండి బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను బలోపేతం చేస్తోంది. ప్రైవేట్ సంస్థల ప్లాన్ల కంటే చౌకగా ఉండే వివిధ రీఛార్జ్ ప్లాన్లను కూడా ప్రారంభించింది.ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 50,000 కంటే ఎక్కువ స్వదేశీ 4జీ సైట్లను దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలలో విజయవంతంగా ఏర్పాటు చేసిందని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అక్టోబర్ 29 వరకు ఇన్స్టాల్ చేసిన 50,000 సైట్లలో 41,000 సైట్లు ఇప్పుడు పనిచేస్తున్నాయని తెలిపింది.దేశంలో లక్ష కొత్త టెలికాం టవర్ల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.24,500 కోట్లు కేటాయించింది. ఇందు కోసం 4జీ పరికరాలను అందించడానికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) నేతృత్వంలోని కన్సార్టియం సహకారంతో ఆత్మ నిర్భర్ భారత్ చొరవ కింద గతేడాది మేలో ఒప్పందం చేసుకుంది.వీటిలో దాదాపు 36,747 సైట్లు ఫేజ్ 9.2 కింద, 5,000 సైట్లు డిజిటల్ భారత్ నిధి ఫండ్ ద్వారా 4జీ శాచురేషన్ ప్రాజెక్ట్ కింద స్థాపితమయ్యాయి. "ఈ ప్రయత్నాలు 1,00,000 పైగా 4జీ సైట్లను విస్తరించాలనే బీఎస్ఎన్ఎల్ లక్ష్యాన్ని బలపరుస్తున్నాయి. ఇది దాని వేగవంతమైన విస్తరణకు నిదర్శనం" అని సమాచార శాఖ తెలిపింది. -
బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్ సేవలకు డేట్ ఫిక్స్
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వచ్చే ఏడాది జూన్ నాటికి 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొస్తుందని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. మే నాటికి లక్ష బేస్ స్టేషన్ల ద్వారా దేశీయంగా 4జీ టెక్నాలజీని విస్తరిస్తామన్నారు. ‘యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్షిప్ ఫోరమ్’ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..‘4జీ టెక్నాలజీకి సంబంధించి భారతదేశం ప్రపంచాన్ని అనుసరించింది. ప్రపంచంతో కలిసి 5జీ సాంకేతికతను అభివృద్ధి చేసింది. కానీ 6జీ టెక్నాలజీలో మాత్రం ఇండియా ప్రపంచానికి నాయకత్వం వహిస్తుంది. బీఎస్ఎన్ఎల్ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది మే నాటికి ఒక లక్ష బేస్ స్టేషన్ల ద్వారా దేశీయంగా 4జీ టెక్నాలజీని విస్తరించనున్నాం. జూన్ నాటికి 5జీ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. ఇప్పటివరకు 38,300 సైట్లను ఎంపిక చేశాం. ప్రభుత్వ సంస్థ ప్రైవేట్ కంపెనీలకు చెందిన కీలక పరికరాలను ఉపయోగించబోదు. ఈమేరకు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బీఎస్ఎన్ఎల్ వద్ద పూర్తిస్థాయిలో పనిచేసే రేడియో యాక్సెస్ నెట్వర్క్ ఉంది. పదేళ్ల క్రితం వాయిస్ కాల్ ఖరీదు 50 పైసలు. కానీ దాని విలువ మూడు పైసలకు చేరింది. వాయిస్ ధర 96 శాతం తగ్గింది. గతంలో ఒక జీబీ డేటా ధర రూ.289.10గా ఉండేది. దాని విలువా గణనీయంగా పడిపోయింది. రానున్న రోజుల్లో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి’ అన్నారు.ఇదీ చదవండి: రూ.7.7 కోట్లు బాకీ.. కంపెనీపై దివాలా చర్యలు‘బీఎస్ఎన్ఎల్ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీ-డాట్, దేశీయ ఐటీ కంపెనీ టీసీఎస్ కన్సార్టియం అభివృద్ధి చేసిన 4జీ సాంకేతికతను ఉపయోగిస్తోంది. పదేళ్ల క్రితం బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ల సంఖ్య ఆరు కోట్లుగా ఉంది. ప్రస్తుతం అది 94 కోట్లకు పెరిగింది. భారత్-అమెరికా వ్యూహాత్మక సంబంధాలు మెరుగవుతున్నాయి. ఈమేరకు చాలా రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకారం అందించుకుంటున్నాయి. అమెరికాలో రక్షణ రంగానికి అవసరమయ్యే చిప్‌లను సరఫరా చేసే ఫ్యాబ్ (చిప్ ప్లాంట్)ను భారత్‌లో ఏర్పాటు చేయబోతున్నాం’ అని మంత్రి తెలిపారు. -
టాప్ కంపెనీకి టెన్షన్.. ఈ బీఎస్ఎన్ఎల్ ప్లాన్
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) వినియోగదారుల కోసం అనేక కొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లు అపరిమిత వాయిస్ కాల్స్, డేటా వంటి ప్రయోజనాలను తక్కువ ధరలకే దీర్ఘ కాల వ్యాలిడిటీతో అందిస్తున్నాయి. ఇంత తక్కువ ధరలో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ ఇచ్చే ప్లాన్లు టాప్ టెలికాం కంపెనీలలో దేనిలోనూ లేవు. అందుకే ఈ ప్లాన్‌తో టాప్ కంపెనీకి టెన్షన్ తప్పదు.బీఎస్ఎన్ఎల్ ప్రవేశపెట్టిన అద్బుతమైన రీఛార్జ్ ప్లాన్లలో రూ.997 ప్లాన్ ఒకటి. ఇది 160 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో వినియోగదారులు రోజుకు 2జీబీ చొప్పున మొత్తం 320 జీబీ హై స్పీడ్ డేటాను పొందుతారు. అలాగే రోజూ 100 ఎస్ఎంఎస్లను ఉచితంగా పంపుకోవచ్చు. దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత వాయిస్ కాల్స్‌ను ఆస్వాదించవచ్చు. ఈ ప్లాన్ దేశం అంతటా ఉచిత రోమింగ్, జింగ్ మ్యూజిక్, బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్ వంటి అనేక విలువ-ఆధారిత సేవలతో వస్తుంది.ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ ప్రీపెయిడ్ ప్లాన్ల ధరలను పెంచడంతో చాలా మంది వినియోగదారులు బీఎస్ఎన్ఎల్కి మారుతున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఈ ప్రభుత్వ టెలికాం కంపెనీ కూడా యూజర్లకు సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పుడు దేశంలోని అన్ని టెలికాం సర్కిళ్లలో 4జీ సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. కొన్ని రాష్ట్రాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీస్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. త్వరలో 5జీ సేవలను కూడా ప్రారంభించే పనిలో ఉంది. 5జీ నెట్వర్క్ టెస్టింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. -
బీఎస్ఎన్ఎల్ ‘5జీ-రెడీ సిమ్‌కార్డు’ విడుదల
బీఎస్ఎన్ఎల్ కొన్ని రాష్ట్రాల్లో ‘5జీ-రెడీ సిమ్ కార్డ్’లను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఇవి రాబోయే నెట్వర్క్ అప్‌గ్రేడ్‌కు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపింది. కొత్త సిమ్ కార్డులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలో అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో 3జీ సదుపాయాన్నే అందిస్తోంది. కొన్ని టైర్1, టైల్ 2 నగరాలతోపాటు ఇతర టౌన్‌ల్లో మాత్రమే 4జీ సేవలను ప్రారంభించింది. ఇటీవల జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ఐడియా..వంటి ప్రైవేట్ నెట్వర్క్ ఆపరేటర్లు తమ రీఛార్జ్ ప్లాన్లను సవరించాయి. వాటిని గతంలో కంటే దాదాపు 20-30 శాతం పెంచుతున్నట్లు ప్రకటించాయి. దాంతో ఆ నెట్వర్క్ వినియోగదారులు మార్కెట్లో చౌకగా రీచార్జ్ ప్లాన్లు అందించే బీఎస్ఎన్ఎల్వైపు మొగ్గుచూపుతున్నారు. కానీ ఇందులో 4జీ సర్వీసే కొన్ని ప్రాంతాలకు పరిమితమైంది. దాంతో కొంత వెనకడుగు వేస్తున్నారు. ఇది గమనించిన బీఎస్ఎన్ఎల్ ప్రతినిధులు 4జీ సదుపాయాన్ని వేగంగా విస్తరించేందుకు పావులు కదుపుతున్నారు. భవిష్యత్తులో రాబోయే 5జీ నెట్వర్క్ కోసం ప్రత్యేకంగా సిమ్‌కార్డులను తీసుకునే అవసరం లేకుండా ‘5జీ-రెడీ సిమ్‌కార్డు’లను అందిస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ వివరించింది.ఈ సిమ్‌కార్డును ఆధునిక స్మార్ట్ఫోన్లతోపాటు ఫీచర్ఫోన్లలో వాడుకునేందుకు వీలుగా రెగ్యులర్, మైక్రో, నానో వేరియంట్లలో తీసుకొస్తున్నారు. ఎయిర్టెల్, జియో మాదిరిగానే బీఎస్ఎన్ఎల్ 4జీ వినియోగదారులు 5జీ కనెక్టివిటీని యాక్సెస్ చేయడానికి కొత్త సిమ్ కార్డ్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 5జీ-రెడీ సిమ్‌నే వాడుకోవచ్చని సంస్థ పేర్కొంది. వినియోగదారులకు మరింత మెరుగైన నెట్వర్క్ కనెక్టివిటీని అందించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు వివరించింది.ఇదీ చదవండి: తల్లిదండ్రుల అనుమతి లేకుండా పిల్లల డేటా సేకరణ!ఇదిలాఉండగా, ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో టెలికాం ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ కంపెనీల కోసం రూ.1.28 లక్షల కోట్లను కేటాయించింది. ఇందులో బీఎస్ఎన్ఎల్, ఎమ్టీఎన్ఎల్లకు రూ.లక్ష కోట్ల పైనే కేటాయించడం విశేషం. ముఖ్యంగా బీఎస్ఎన్ఎల్లో సాంకేతిక మెరుగుదల, పునర్నిర్మాణం కోసం రూ.82,916 కోట్లను కేటాయించారు. తాజాగా బీఎస్ఎన్ఎల్ 5జీ సేవల ట్రయల్స్‌ను ప్రారంభించింది. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్ 5జీ నెట్వర్క్ సేవల్ని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పరీక్షించారు. -
బీఎస్ఎన్ఎల్కి వెళ్తుంటే ఇది తెలుసుకోండి..
తక్కువ ధరకు టెలికం సేవలు అందించే ప్రభుత్వ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్కి మారాలనుకుంటున్నారా..? సిగ్నల్స్ ఎలా ఉంటాయోనని ఆలోచిస్తున్నారా..? అయితే మీకు దగ్గరలో బీఎస్ఎన్ఎల్ టవర్ ఉందో లేదో ఎలా తెలుసుకోవాలో ఇక్కడ తెలియజేస్తున్నాం..పలు ప్రైవేటు టెలికాం కంపెనీలు టారిఫ్‌లు పెంచడంతో అందుబాటు ధరలో రీఛార్జ్ ప్లాన్లు ఉన్న ప్రభుత్వ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వైపు చాలా మంది వినియోగదారులు మొగ్గు చూపుతున్నారు. బీఎస్ఎన్ఎల్ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటోంది. ఇది ఇప్పుడు తన 4G సేవలను చాలా వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల జూలై 21న తన 4G సంతృప్త ప్రాజెక్ట్ కింద 1000 టవర్ల ఏర్పాటు లక్ష్యాన్ని సాధించింది.ఈ నేపథ్యంలో మీరు బీఎస్ఎన్ఎల్కి మారాలని ప్లాన్ చేస్తుంటే, మీరు నివసిస్తున్న ప్రాంతంలో బీఎస్ఎన్ఎల్ టవర్ ఉందో లేదో నిర్ధారించుకోవాలి. మీ మొబైల్ ఫోన్లో చిన్న రేడియో ట్రాన్స్మిటర్, రిసీవర్ ఉంటుంది. ట్రాన్స్మిటర్ సిగ్నల్‌లను పంపుతుంది. రిసీవర్ ఇతర ఫోన్ల నుంచి సిగ్నల్‌లను అందుకుంటుంది. ఈ సిగ్నల్స్ బలహీనంగా ఉంటాయి. తక్కువ దూరం మాత్రమే ప్రయాణించగలవు. అందుకే సమీపంలో మొబైల్ టవర్లు ఉన్నప్పుడు మీ ఫోన్లో సిగ్నల్స్ ఉంటాయి.సమీపంలో టవర్ ఉందో లేదో తెలుసుకోండి ఇలా..ముందుగా https://tarangsanchar.gov.in/ వెబ్‌సైట్‌కి వెళ్లండిపేజీని కిందికి స్క్రోల్ చేసి, ‘మై లొకేషన్’పై క్లిక్ చేయండి.తదుపరి పేజీలో, మీ పేరు, ఈమెయిల్, మొబైల్ నంబర్, క్యాప్చా కోడ్‌ని నమోదు చేయండి.Send me a mail with OTP బటన్ పై క్లిక్ చేయండి.మీ ఈమెయిల్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి.తర్వాతి పేజీలో, మీ చుట్టూ ఉన్న అన్ని మొబైల్ టవర్లను చూపించే మ్యాప్ మీకు కనిపిస్తుంది.ఏదైనా టవర్‌పై క్లిక్ చేస్తే సిగ్నల్ రకం (2G/3G/4G/5G), అది ఏ కంపెనీ టవర్ అనేది మీకు సమాచారం అందుతుంది. -
1,117 బోర్డర్ పోస్టులకు అత్యాధునిక 4జీ కమ్యూనికేషన్.. కారణం ఇదేనా..
దేశసరిహద్దుల్లో సేవలందిస్తున్న జవానులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కొండ ప్రాంతాలు, లోయలు ఉండడంతో వారికి నెట్వర్క్ కనెక్టవిటీ సమస్య ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు 2020లో చైనాతో జరిగిన సరిహద్దు వివాదం నేపథ్యంలో అక్కడి బలగాలతో మరింత కనెక్టివిటీ ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. తాజాగా పొరుగుదేశాలతో సరిహద్దులు పంచుకుంటున్న ప్రాంతాల్లోని దాదాపు 1,117 బోర్డర్ పోస్టులకు అత్యాధునిక 4జీ మొబైల్ కమ్యూనికేషన్ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. వీటిల్లో కొన్ని సాయుధ దళాలకు చెందిన ఇంటెలిజెన్స్ పోస్టులు కూడా ఉండనున్నాయి. అయితే ఇందుకు దాదాపు రూ.1,545 కోట్లు అవసరం అవుతాయని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో టెలికాం శాఖ, హోంశాఖ, బీఎస్ఎన్ఎల్ మధ్య ఒప్పందం కుదిరింది. కేంద్రం చేపట్టిన 4జీ సాచురేషన్ ప్రాజెక్టులో భాగంగా లద్దాఖ్‌లో మొత్తం 379 గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం వీటిల్లో తొమ్మిది గ్రామాల్లోనే పనులు పూర్తయ్యాయి. మరో 34 చోట్ల ప్రారంభమయ్యాయి. మయన్మార్‌తో 2.4 కి.మీ, పాక్‌తో ఉన్న 18 కి.మీ సరిహద్దులో గతేడాది ఫెన్సింగ్ పని కూడా పూర్తి చేశారు. 2023లో చైనా సరిహద్దుల్లో కొత్తగా 48.03 కిలోమీటర్ల రోడ్డు నిర్మించారు. దీంతోపాటు నాలుగు ఔట్ పోస్టులు, మూడు హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. చైనాతో భారత్‌కు దాదాపు 3,488 కిలోమీటర్ల మేరకు సరిహద్దు ఉంది. ఇదీ చదవండి: నేటి నుంచి రాబోతున్న కీలక మార్పులు ఇవే.. భారత్-చైనా సరిహద్దులో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. నిత్యం ఏదో కారణంగా ఇరుదేశాల సైనికులు మోహరించడంతో అక్కడ ఉద్రిక్తత నెలకుంటోంది. అక్కడి ప్రాంతాల పేర్లను మారుస్తూ చైనా వివాదాలకు తెర తీస్తోంది. విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న ఆ దేశం సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక, సైనిక వసతుల కల్పనకు పెద్దయెత్తున నిధులు వెచ్చిస్తోంది. సరిహద్దు గ్రామాలను అభివృద్ధి చేయడం ద్వారానే డ్రాగన్ దూకుడుకు ముకుతాడు వేయవచ్చని ఇండియా బలంగా విశ్వసిస్తోంది. అందులో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తుంది. -
BSNL పునరుద్ధరణకు కేంద్రం నిర్ణయం
-
బీఎస్ఎన్ఎల్పై కేంద్రం కీలక నిర్ణయం.. భారీ ప్యాకేజీ
సాక్షి, న్యూఢిల్లీ: బీఎస్ఎన్ఎల్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీఎస్ఎన్ఎల్లో భారత్ బ్రాడ్‌బాండ్ నెట్వర్క్(బీబీఎన్ఎల్) విలీనానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే బీఎస్ఎన్ఎల్ ఫైబర్ సేవల పటిష్టం కోసం కేంద్రం చర్యలు చేపట్టింది. బీఎస్ఎన్ఎల్కు భారీ ప్యాకేజీ ప్రకటించింది. రూ. లక్షా 64 వేల కోట్లతో బీఎస్ఎన్ఎల్ పునరుద్దరణ ప్యాకేజీకి కేబినెట్ అనుమతి తెలిపింది. ఈ సందర్భంగా టెలికంశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. బీఎస్ఎన్ఎల్ అప్పులను వాటాలుగా మారుస్తామని తెలిపారు. సేవలను మెరుగుపరచడం, బ్యాలెన్స్ షీట్‌ను తగ్గించడం, ఫైబర్ నెట్వర్క్ విస్తరణ వంటి మూడు అంశాలు ప్యాకేజీలో ఉన్నాయని కేంద్ర మంత్రి వివరించారు. బలమైన ప్రభుత్వ రంగ సంస్థ అవసరమని ఆయన పేర్కొన్నారు. 1,20,000 సైట్లలో 4జీ సేవలు అవసరమని తెలిపిన కేంద్ర మంత్రి.. ప్రతి నెలా కొత్తగా లక్ష కనెక్షన్లు ఇస్తామని పేర్కొన్నారు. చదవండి: సోనియా నోటి వెంట రాహుల్ సమాధానాలు! -
టెలికాం దిగ్గజ సంస్థల విలీనం వాయిదా, అదే కారణం!
న్యూఢిల్లీ: దేశీయంగా అభివృద్ధి చేసిన 4జీ టెలికం నెట్‌వర్క్‌ను బీఎస్ఎన్ఎల్ త్వరలోనే అమల్లోకి తీసుకురానుంది. దేశవ్యాప్తంగా 1.12 లక్షల 4జీ టవర్లను బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేయనున్నట్టు టెలికం మంత్రి అశ్విని వైష్ణవ్ లోక్‌సభకు తెలిపారు. 5జీ నెట్వర్క్ అమల్లోకి వచ్చిన తర్వాతే రైళ్లలోపల ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రస్తుతం 4జీ నెట్‌వర్క్‌లో రైళ్లు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ఇంటర్నెట్లో అంతరాయాలు వస్తున్నట్టు చెప్పారు. ‘‘భారత శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అభివృద్ధి చేసిన 4జీ నెట్వర్క్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీనికి ప్రపంచవ్యాప్త ప్రశంసలు వచ్చాయి. బీఎస్ఎన్ఎల్ ముందుగా 6 వేల టవర్లకు ఆర్డర్ ఇవ్వనుంది. ఆ తర్వాత మరో 6,000. అనంతరం లక్ష 4జీ టవర్లు ఏర్పాటు చేస్తుంది’’ అని చెప్పారు. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనం వాయిదా ప్రభుత్వరంగ టెలికం సంస్థలైన బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ విలీనాన్ని ఆర్థిక కారణాల దృష్ట్యా వాయిదా వేసినట్టు కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ చౌహాన్ రాజ్యసభకు తెలిపారు. భారత్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ (బీబీఎన్ఎల్), భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) ప్రతిపాదిత విలీనం పరిశీలనలో ఉన్నట్టు చెప్పారు. ఎంటీఎన్ఎల్కు అధిక రుణభారం ఉండ డం సహా ఆర్థిక కారణాలు ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్ విలీనం వాయిదాకు కారణమని చెప్పారు. -
బీఎస్ఎన్ఎల్: ఆశ్చర్యకరమైన పరిణామాలు!
ప్రభుత్వ రంగ మొబైల్ నెట్వర్క్ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) ఆశ్చర్యకర ఫలితాల్ని చవిచూస్తోంది. 4జీ సర్వీసులు లేకున్నా.. ఆదాయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం కొనసాగుతున్నప్పటికీ.. సబ్ స్క్రయిబర్ షేర్ మీద మాత్రం ఎలాంటి ప్రభావం పడకపోవడం విశేషం. బీఎస్ఎన్ఎల్ స్క్రయిబర్ షేర్ గత కొన్నేళ్లుగా నిలకడగా పెరుగుతూ వస్తోంది. 2016-2017 మధ్య బీఎస్ఎన్ఎల్ స్క్రయిబర్ షేర్ 8.6 శాతంగా ఉండగా, 2017-18కి 9.4 శాతం, 2018-19కి 9.9 శాతం, 2019-2020 నాటికి 10 శాతానికి చేరింది. ఇక 2020-2021కి(మార్చి 21, 2021) స్వల్పంగా పెరిగి.. 10.3 శాతానికి చేరుకుందని కేంద్ర మంత్రిత్వ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. డాటా వినియోగం, టెలికామ్ సెక్టార్లో పోటీ వల్ల టారిఫ్‌లలో మార్పులు కనిపిస్తున్నప్పటికీ.. 4జీ సర్వీసులు లేకపోవడం బీఎస్ఎన్ఎల్కు ప్రతికూలంగా మారాయని టెలికాం నిపుణులు చెప్తున్నారు. ఇది ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ARPU)పై మాత్రం ప్రభావం పడేలా చేస్తోంది. 4జీ ఎందుకు లేట్ అంటే.. లోకల్ ఎక్విప్మెంట్లు, తగిన సాంకేతికత లేకపోవడం బీఎస్ఎన్ఎల్ 4జీ ప్రయత్నాలకు ప్రతికూలంగా మారుతూ వస్తోంది. నిజానికి 2019 నాటి కేంద్ర కేబినెట్ నిర్ణయం ప్రకారం.. 4జీ స్పెక్ట్రమ్‌ను బీఎస్ఎన్ఎల్కు కేటాయించారు. ఆత్మనిర్భర్ భారత్ పథకం ప్రకారం, బీఎస్ఎన్ఎల్కు దాన్ని భారతీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూనే ఇవ్వాలని ఫిర్యాదులు రావడం, చైనా కంపెనీలు పాల్గొనకూడదన్న నిర్ణయంవల్ల గత రెండేళ్లుగా బీఎస్ ఎన్ఎల్ 4జీ సేవలను అమలు చేయడం ఆలస్యం అవుతోంది. హాట్ న్యూస్: మీ ఫోన్లో ఈ యాప్స్.. వెంటనే డిలీట్ చేయండి నష్టాల్ని ఇలా తగ్గించుకుంది పీఎస్‌యూ దిగ్గజం బీఎస్ఎన్ఎల్ గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నష్టాలు తగ్గించుకుంది. రూ. 7,441 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది(2019–20)లో దాదాపు రూ. 15,500 కోట్ల నికర నష్టం నమోదైంది. ప్రధానంగా ఉద్యోగుల వేతన వ్యయాలు క్షీణించడం ప్రభావం చూపినట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. 78,569 మంది ఉద్యోగులు స్వచ్చంద పదవీ విరమణ చేపట్టిన నేపథ్యంలో వేతన వ్యయాలు తగ్గినట్లు తెలియజేశారు. మరోపక్క ఆర్థిక నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న వోడాఫోన్ ఐడియా-బీఎస్ఎన్ఎల్ను విలీనం చేయాలనే ప్రతిపాదనను కొందరు తెర మీదకు తెస్తున్నప్పటికీ.. ప్రభుత్వ పరిధిలో మాత్రం అలాంటి ఆలోచనేం కనిపించడం లేదు. -
టెలికాం రేసులో బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్
-
నెలాఖరులోగా 4జీ సేవలు
సాక్షి, హైదరాబాద్: బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు ఈ నెలాఖరులోగా అందుబాటులోకి రానున్నా యి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్–రంగారెడ్డి జిల్లాలు మినహా అన్ని జిల్లా కేంద్రాలతోపాటు ముఖ్య పట్టణాల్లో కలిపి 40 చోట్ల 409 4జీ టవర్స్ ఏర్పాటు చేసినట్లు బీఎస్ఎన్ఎల్ తెలంగాణ టెలికం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం) సుందరం వెల్లడించారు. స్పెక్ట్రం అనుమతి లభించిన వెంటనే 4జీ సేవలను ప్రారంభిస్తామని తెలిపారు. హైదరాబాద్ దూర్ సంచార్ భవన్లో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. సుమారు రూ.123 కోట్ల వ్యయంతో 2జీ, 3జీ నెట్‌వర్క్‌గల ప్రాంతాల్లో సేవలు అప్గ్రేడ్చేసి కొత్త పరికరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మెట్రో రైలు కారిడార్‌లో 2జీ,3జీ సేవలను అందుబాటులో తెచ్చేందుకు 64 టవర్స్ ఏర్పాటు లక్ష్యానికి గాను ఇప్పటికే 24 స్టేషన్లలో సేవలు అందిస్తున్నామన్నారు. మిగిలిన స్టేషన్లలో సైతం సేవలు అందుబాటులో తెచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. బీఎస్ఎన్ఎల్ వైఫై 910 హాట్‌స్పాట్స్ లక్ష్యానికి గాను ఇప్పటి వరకు 487 స్పాట్స్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మిగిలిన 423 ఫిబ్రవరి నాటికి ఏర్పాటు చేస్తామన్నారు. బీఎస్ఎన్ఎల్కు సంబంధించిన 4,09,855 ల్యాండ్‌లైన్, 1,12,978 బ్రాండ్ బాండ్, 27,723 ఎఫ్టీటీహెచ్ కనెక్షన్లు వర్కింగ్‌లో ఉన్నట్లు వివరించారు. రూ.1,699 వార్షిక ప్లాన్ కొత్త సంవత్సరం ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం కొత్తప్లాన్లను ప్రవేశపెట్టినట్లు సీజీ ఎం వివరించారు. వార్షిక–1,699, వార్షిక ప్లస్– 2009, పది శాతం అదనపు టాక్ టైమ్, ప్రమో షనల్ ఎస్టీవీ, అదనపు డేటా ఆఫర్స్ ప్రవేశపెట్టినట్లు చెప్పారు. బీఎస్ఎన్ఎల్ బ్రాడ్ బాండ్‌పై కూడా అదనపు వాయిస్ కాల్స్, ఎఫ్టీటీహెచ్ ప్లాన్లపై అదనపు జీబీ వర్తింపు ఆఫర్స్‌ను ప్రవేశపెట్టినట్లు వివరించారు. సమావేశంలో టెలికం పీజీఎంలు రాంచంద్రం, ఎస్.వెంకటేశ్, నరేందర్, సీఎస్ఎన్ మూర్తి పాల్గొన్నారు. -
రూ.123 కోట్లతో బీఎస్ఎన్ఎల్ 4జీ విస్తరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సర్కిల్లో ఎంపిక చేసిన నగరాలు, పట్టణాల్లో రూ.123 కోట్ల వ్యయంతో బీఎస్ఎన్ఎల్ 4జీ విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలంగాణ టెలికం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్(సీజీఎం) సుందరం వెల్లడించారు. పైలట్ ప్రాజెక్టుగా మహబూబ్‌నగర్‌లోని జడ్చర్ల, ఖమ్మంలోని వైరాలో 4జీ టెస్టింగ్ చేపట్టామన్నారు. తెలంగాణ సర్కిల్లో ఆగస్టులో విస్తరణ పనులు ప్రారంభించి డిసెంబర్‌లోగా 4జీ సేవలు అందిస్తామని, హైదరాబాద్‌లో వచ్చే ఏడాది మార్చి నాటికి 4జీ సేవలను విస్తరిస్తామని చెప్పారు. బుధవారం హైదరాబాద్ దూర్ సంచార్ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2జీ, 3జీ నెట్వర్క్ కలిగిన ప్రాంతాల్లో 4జీ సేవలు విస్తరిస్తున్నామని, ఇప్పటికే 2జీ నెట్వర్క్ కలిగిన టవర్స్‌ను అభివృద్ధి చేస్తామని, కొత్తగా 409 4జీ టవర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మెట్రో రైలు కారిడార్‌లో 64 టవర్స్ ఏర్పాటు చేసి 3జీ సేవలు విస్తరిస్తున్నామని, ఇప్పటికే 26 స్టేషన్లల్లో 2జీ టవర్స్ ఏర్పాటు చేశామని, మిగిలి స్టేషన్లలో సైతం టవర్స్ ఏర్పాటు చేసి 3జీ సేవలు అందిస్తామన్నారు. రూ.1,199కి ఫ్యామిలీ ప్లాన్ ఆఫర్ బీఎస్ఎన్ఎల్ ఫ్యామిలీ బీబీజీ కాంబో యూఎల్డీ 1199ను ప్రవేశపెట్టినట్లు సీజీఎం సుందరం చెప్పారు. రూ.1199తో నెలకు అన్లిమిటెడ్ బ్రాడ్‌బాండ్ 10 ఎంబీపీఎస్ స్పీడ్ 30 జీబీ వరకు, రెంట్ ఫ్రీ ల్యాండ్‌లైన్ 24 గంటలు అన్లిమిటెడ్ ఉచిత కాలింగ్, మూడు మొబైల్ కనెక్షన్లకు అన్లిమిటెడ్ ఉచిత లోకల్, ఎస్టీడీ ఎనీ నెట్వర్క్, రోజుకు 1జీబీ డాటా వర్తిస్తుందన్నారు. బ్రాడ్‌బాండ్ ప్రమోషన్ ఆఫర్‌గా బీబీ 99, బీబీ 199, బీబీ 299, బీబీ 491 ప్లాన్లను తీసుకొచ్చామని, అన్లిమిటెడ్ బ్రాడ్‌బాండ్, 20 ఎంబీపీఎస్ స్పీడ్, 24 గంటలు ఉచితం కాలింగ్ ఎనీ నెట్‌వర్క్‌కు వర్తిస్తోందన్నారు. ప్లాన్‌ను బట్టి 1.5 జీబీ నుంచి 20 జీబీ డాటా వస్తుందన్నారు. ఫైబర్ కాంబో 777 ఆఫర్ కింద అన్లిమిటెడ్ బ్రాడ్‌బాండ్, 50 ఎంబీపీస్ స్పీడ్ 500 జీబీ వరకు, 1277 ఆఫర్ కింద 100 ఎంబీపీఎస్ స్పీడ్ 750 జీబీ వరకు డాటా, అన్లిమిటెడ్ లోకల్, ఎస్టీడీ వాయిస్ కాల్స్ ఉచితమన్నారు. బీబీ 299 కింద అన్లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్, 30 ఎంబీపీఎస్ 100 జీబీ వరకూ.. 399 ప్లాన్ కింద అన్లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్, 30 ఎంబీపీఎస్ 200 జీబీ వరకు వర్తిస్తుందన్నారు. అనంత–105, అనంతప్లస్–328, పోస్ట్‌పెయిడ్‌లో ఎంఎంసీ–399 ప్లాన్లు.. ఎస్టీవీలో ఈద్ ముబారక్–786, ఎస్టీవీ–148, డాటా సునామీ–98, ఎస్టీవీ–118, ఎస్టీవీ–44 ప్లాన్లను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. టాపప్‌లో అన్ని ఆదివారాల్లో రూ.160కి çఫుల్ టాక్‌టైమ్, టాపప్ రూ.310కి అన్ని రోజుల్లో ఫుల్ టాక్‌టైమ్ వర్తిస్తుందన్నారు. విలేకరుల సమావేశంలో టెలికం హైదరాబాద్ పీజీఎం రాంచంద్రం పాల్గొన్నారు. -
వచ్చే మార్చికల్లా బీఎస్ఎన్ఎల్ 4జీ: శ్రీవాస్తవ
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం(2017–18) చివరి నాటికి ఎంపిక చేసిన ప్రదేశాల్లో 4జీ సేవలను అందించేందుకు ప్రభుత్వరంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్ సిద్ధమవుతోంది. అన్ని 2జీ సైట్లను 3జీకి మార్చేందుకు వీలుగా 28,000 కొత్త బేస్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. ‘‘ఎనిమిదో దశ విస్తరణలో భాగంగా 2జీ బేస్ స్టేషన్లను, పాత ఎక్విప్మెంట్ను ఆధునిక బేస్ స్టేషన్లతో మారుస్తున్నాం. ఈ బేస్ స్టేషన్లు 3జీ, 4జీ సర్వీసులకు అనుకూలంగా ఉంటాయి. తొలుత కొన్ని ప్రాంతాల్లో 4జీ సేవలను ప్రారంభించే ప్రణాళికతో ఉన్నాం. ఎనిమిదో దశ విస్తరణ పనులు 2017–18 నాటికి పూర్తి అవుతాయి’’ అని బీఎస్ఎన్ఎల్ ఎండీ శ్రీవాస్తవ తెలిపారు. 3జీ స్పెక్ట్రమ్‌లో కొంత భాగాన్ని 4జీ సేవలకు వినియోగించే ఆలోచనతో ఉన్నట్టు చెప్పారు. బేస్ స్టేçషన్ల మార్పిడి ప్రాజెక్టు రేసులో నోకియా, ఎరిక్సన్, జెడ్‌టీఈ ఉన్నాయని... నోకియా తక్కువ బిడ్డర్‌గా వచ్చిందని, ఆ తర్వాత జెడ్‌టీఈ ఉన్నట్టు శ్రీవాస్తవ వెల్లడించారు. -
ఆరు నెలల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ..
• త్వరలో మొబైల్ డేటా ఆఫ్‌లోడ్ సేవలు • కోటి కస్టమర్లకు చేరువలో తెలంగాణ, ఏపీ • మొబిక్యాష్ ఎం–వాలెట్ ఆవిష్కరణ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ఆరు నెలల్లో 4జీ సేవలను ప్రారంభిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడతగా 1,150 టవర్లు ఏర్పాటు చేస్తోంది. మొబైల్ డేటా ఆఫ్‌లోడ్ (ఎండీవో) సేవలను మార్చికల్లా అందుబాటులోకి తెస్తామని బీఎస్ఎన్ఎల్ తెలంగాణ టెలికం సర్కిల్ సీజీఎం ఎల్.అనంతరామ్ తెలిపారు. బీఎస్ఎన్ఎల్ మొబైల్ డేటాను వాడుతున్న కస్టమర్ వైఫై హాట్‌స్పాట్ ఉన్న ప్రాంతానికి వెళ్లగానే అంతరాయం లేకుండా వేగవంతమైన ఇంటర్నెట్ను వాడేందుకు ఎండీవో టెక్నాలజీ తోడ్పడుతుందన్నారు. బ్రాడ్ బ్యాండ్‌లో 24 ఎంబీ డౌన్లోడ్ వేగం అందిస్తున్నామని, కొద్ది రోజుల్లో వెక్టర్ వీడీఎస్ఎల్ టెక్నాలజీతో 100 ఎంబీ వరకు వేగాన్ని ఆఫర్ చేస్తామన్నారు. కొత్త మొబైల్ వాలెట్‌ను ఆవిష్కరించిన సందర్భంగా మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. అగ్రస్థానం దిశగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బీఎస్ఎన్ఎల్కు ప్రతి నెల కొత్తగా 2 లక్షల మంది మొబైల్ కస్టమర్లు వచ్చి చేరుతున్నారు. కొత్త కస్టమర్ల సంఖ్యాపరంగా చూస్తే దేశంలో తెలుగు రాష్ట్రాలు తొలి స్థానంలో ఉన్నాయి. మొత్తం మొబైల్ చందాదారుల సంఖ్య ప్రస్తుతం 97 లక్షలుంది. మార్చికల్లా ఈ సంఖ్య ఒక కోటి దాట నుంది. ఇదే జరిగితే మూడో స్థానంలో ఉన్న తెలం గాణ, ఆంధ్రప్రదేశ్‌లు టాప్–1కు చేరతాయి. 4.5జీ టెక్నాలజీతో కూడిన వైఫై హాట్‌స్పాట్స్ 518 నెలకొల్పారు. డిసెంబర్‌కల్లా మరో 3,000 హాట్‌స్పాట్స్ జతకూడతాయని అనంతరామ్ వెల్లడించారు. బ్యాంకు ఖాతా లేకున్నా.. బీఎస్ఎన్ఎల్–ఎస్బీఐ మొబిక్యాష్ మొబైల్ వాలెట్‌ను బ్యాంకు ఖాతా లేకున్నా వాడొచ్చు. ఫీచర్ ఫోన్ ద్వారా కూడా నిర్వహించుకోవచ్చు. వాలెట్లో నగదు నింపేందుకు డెబిట్/క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ అవసరం లేదని ఎస్బీఐ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీజీఎం హరదయాల్ ప్రసాద్ తెలిపారు. వాలెట్లో నగదు నింపుకునేందుకు ప్రస్తుతానికి బీఎస్ఎన్ఎల్ రిటైల్ ఔట్‌లెట్‌కు వెళ్లాలి. వాలెట్ నుంచి వాలెట్‌కు, వాలెట్ నుంచి బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేయవచ్చు. బిల్లులు, వర్తకులకు చెల్లింపుల వంటి సేవలు రెండో దశలో జోడిస్తారు. -
వచ్చే ఏడాదికి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు
బీఎస్ఎన్ఎల్ ఇన్చార్జి జీఎం వెల్లడి ఎన్జీఎన్ను ప్రారంభించిన కలెక్టర్ ల్యాండ్‌లైన్‌తో వీడియో కాలింగ్, వాయిస్, మల్టీమీడియా సేవలు అందుబాటులోకి.. కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : వచ్చే ఏడాది మార్చి తరువాత జిల్లాలో 4జీ సేవలు అందుబాటులోకి తేనున్నట్టు జిల్లా ఇన్చార్జి జీఎం ఎం.జాన్ క్రిసోస్టమ్ తెలిపారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో నెక్ట్స్ జనరేషన్ నెట్వర్క్ (ఎన్జీఎన్) ఎక్సే్ఛంజిని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ వి.విజయరామరాజు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో క్రిసోస్టమ్ మాట్లాడుతూ, మొదటి దశలో 4జీ సేవలను కాకినాడలో అందుబాటులోకి తెస్తామన్నారు. కొత్తగా ప్రారంభించిన ఎన్జీఎన్ ఎక్సే్ఛంజి వల్ల ఒకే లైనుపై వాయిస్, వీడియో కాలింగ్, డేటా, మల్టీమీడియా సర్వీసులు పని చేస్తాయన్నారు. ల్యాండ్‌లైన్‌కు కూడా ప్రీపెయిడ్ సదుపాయం అందుబాటులో ఉందన్నారు. ఈ నెల 25 తరువాత నుంచి ప్రతి ఆదివారం ల్యాండ్‌లైన్ ద్వారా రోజంతా ఉచిత కాల్స్ సదుపాయం అందుబాటులోకి రానున్నదని చెప్పారు. నూతనంగా రూ.49కే ల్యాండ్‌లైన్ కనెక్షన్, దీంతోపాటు ఒక ప్రీపెయిడ్ సిమ్ ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. బ్రాడ్‌బ్యాండ్‌లో రూ.470కే అన్ లిమిటెడ్ ప్లానులో 10 జీబీ వరకు 2 ఎంబీపీఎస్ ఇంటర్నెట్ను పొందవచ్చని క్రిసోస్టమ్ వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థలకు దీటుగా సేవలందించి ప్రజలకు బీఎస్ఎన్ఎల్ మరింత చేరువ కావాలని అన్నారు. కమిషనర్ విజయరామరాజు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ఉచిత వైఫై అందిస్తే తాము సహకరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీఎస్ఎన్ఎల్ ఐటీఎస్ అ«ధికారి ఎ.శ్రీనివాసరావు, డీజీఎంలు రమేష్‌బాబు, డి.సుబ్బారావు, ఏవీ కృష్ణారావు, విజిలెన్స్ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.