వచ్చే ఏడాదికి బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలు
వచ్చే ఏడాదికి బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలు
Published Sun, Aug 21 2016 12:01 AM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
బీఎస్‌ఎన్‌ఎల్ ఇన్‌చార్జి జీఎం వెల్లడి
ఎన్‌జీఎన్‌ను ప్రారంభించిన కలెక్టర్
ల్యాండ్‌లైన్‌తో వీడియో కాలింగ్, వాయిస్,
మల్టీమీడియా సేవలు అందుబాటులోకి..
కంబాలచెరువు (రాజమహేంద్రవరం) : వచ్చే ఏడాది మార్చి తరువాత జిల్లాలో 4జీ సేవలు అందుబాటులోకి తేనున్నట్టు జిల్లా ఇన్‌చార్జి జీఎం ఎం.జాన్ క్రిసోస్టమ్ తెలిపారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయంలో నెక్ట్స్ జనరేషన్ నెట్‌వర్క్ (ఎన్‌జీఎన్) ఎక్సే్ఛంజిని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ వి.విజయరామరాజు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో క్రిసోస్టమ్ మాట్లాడుతూ, మొదటి దశలో 4జీ సేవలను కాకినాడలో అందుబాటులోకి తెస్తామన్నారు. కొత్తగా ప్రారంభించిన ఎన్‌జీఎన్ ఎక్సే్ఛంజి వల్ల ఒకే లైనుపై వాయిస్, వీడియో కాలింగ్, డేటా, మల్టీమీడియా సర్వీసులు పని చేస్తాయన్నారు. ల్యాండ్‌లైన్‌కు కూడా ప్రీపెయిడ్ సదుపాయం అందుబాటులో ఉందన్నారు. ఈ నెల 25 తరువాత నుంచి ప్రతి ఆదివారం ల్యాండ్‌లైన్ ద్వారా రోజంతా ఉచిత కాల్స్ సదుపాయం అందుబాటులోకి రానున్నదని చెప్పారు. నూతనంగా రూ.49కే ల్యాండ్‌లైన్ కనెక్షన్, దీంతోపాటు ఒక ప్రీపెయిడ్ సిమ్ ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. బ్రాడ్‌బ్యాండ్‌లో రూ.470కే అన్ లిమిటెడ్ ప్లానులో 10 జీబీ వరకు 2 ఎంబీపీఎస్ ఇంటర్‌నెట్‌ను పొందవచ్చని క్రిసోస్టమ్ వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థలకు దీటుగా సేవలందించి ప్రజలకు బీఎస్‌ఎన్‌ఎల్ మరింత చేరువ కావాలని అన్నారు. కమిషనర్ విజయరామరాజు మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ఉచిత వైఫై అందిస్తే తాము సహకరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్ ఐటీఎస్ అ«ధికారి ఎ.శ్రీనివాసరావు, డీజీఎంలు రమేష్‌బాబు, డి.సుబ్బారావు, ఏవీ కృష్ణారావు, విజిలెన్స్ అధికారి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Advertisement