![BSNL Subscriber Share Has Gone Up Annually - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/23/BSNl_Subsciber_Share.jpg.webp?itok=hKNz8UBu)
ప్రభుత్వ రంగ మొబైల్ నెట్‌వర్క్ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL) ఆశ్చర్యకర ఫలితాల్ని చవిచూస్తోంది. 4జీ సర్వీసులు లేకున్నా.. ఆదాయంపై తీవ్ర ప్రతికూల ప్రభావం కొనసాగుతున్నప్పటికీ.. సబ్ స్క్రయిబర్ షేర్ మీద మాత్రం ఎలాంటి ప్రభావం పడకపోవడం విశేషం.
బీఎస్‌ఎన్‌ఎల్ స్క్రయిబర్ షేర్ గత కొన్నేళ్లుగా నిలకడగా పెరుగుతూ వస్తోంది. 2016-2017 మధ్య బీఎస్‌ఎన్‌ఎల్ స్క్రయిబర్ షేర్ 8.6 శాతంగా ఉండగా, 2017-18కి 9.4 శాతం, 2018-19కి 9.9 శాతం, 2019-2020 నాటికి 10 శాతానికి చేరింది. ఇక 2020-2021కి(మార్చి 21, 2021) స్వల్పంగా పెరిగి.. 10.3 శాతానికి చేరుకుందని కేంద్ర మంత్రిత్వ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. డాటా వినియోగం, టెలికామ్ సెక్టార్‌లో పోటీ వల్ల టారిఫ్‌లలో మార్పులు కనిపిస్తున్నప్పటికీ.. 4జీ సర్వీసులు లేకపోవడం బీఎస్‌ఎన్‌ఎల్‌కు ప్రతికూలంగా మారాయని టెలికాం నిపుణులు చెప్తున్నారు. ఇది ఒక్కో వినియోగదారుడిపై సగటు ఆదాయం(ARPU)పై మాత్రం ప్రభావం పడేలా చేస్తోంది.
4జీ ఎందుకు లేట్ అంటే..
లోకల్ ఎక్విప్‌మెంట్లు, తగిన సాంకేతికత లేకపోవడం బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ ప్రయత్నాలకు ప్రతికూలంగా మారుతూ వస్తోంది. నిజానికి 2019 నాటి కేంద్ర కేబినెట్ నిర్ణయం ప్రకారం.. 4జీ స్పెక్ట్రమ్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌కు కేటాయించారు. ఆత్మనిర్భర్ భారత్ పథకం ప్రకారం, బీఎస్‌ఎన్‌ఎల్‌కు దాన్ని భారతీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూనే ఇవ్వాలని ఫిర్యాదులు రావడం, చైనా కంపెనీలు పాల్గొనకూడదన్న నిర్ణయంవల్ల గత రెండేళ్లుగా బీఎస్ ఎన్‌ఎల్ 4జీ సేవలను అమలు చేయడం ఆలస్యం అవుతోంది.
హాట్ న్యూస్: మీ ఫోన్‌లో ఈ యాప్స్.. వెంటనే డిలీట్ చేయండి
నష్టాల్ని ఇలా తగ్గించుకుంది
పీఎస్‌యూ దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ గత ఆర్థిక సంవత్సరం(2020–21)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నష్టాలు తగ్గించుకుంది. రూ. 7,441 కోట్లకు పరిమితమయ్యాయి. అంతక్రితం ఏడాది(2019–20)లో దాదాపు రూ. 15,500 కోట్ల నికర నష్టం నమోదైంది. ప్రధానంగా ఉద్యోగుల వేతన వ్యయాలు క్షీణించడం ప్రభావం చూపినట్లు కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. 78,569 మంది ఉద్యోగులు స్వచ్చంద పదవీ విరమణ చేపట్టిన నేపథ్యంలో వేతన వ్యయాలు తగ్గినట్లు తెలియజేశారు. మరోపక్క ఆర్థిక నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న వోడాఫోన్ ఐడియా-బీఎస్‌ఎన్‌ఎల్‌ను విలీనం చేయాలనే ప్రతిపాదనను కొందరు తెర మీదకు తెస్తున్నప్పటికీ.. ప్రభుత్వ పరిధిలో మాత్రం అలాంటి ఆలోచనేం కనిపించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment