మొబైల్ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చే దిశగా భారత ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసింది. ఇంటర్-సర్కిల్ రోమింగ్ (ICR) ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్ (BSNL), జియో (Jio), ఎయిర్‌టెల్ (Airtel) ఇలా నెట్‌వర్క్ ఏదైనా వినియోగదారులు వారి ప్రాథమిక ప్రొవైడర్‌కు సిగ్నల్ కవరేజ్ లేనప్పటికీ, అందుబాటులో ఉన్న ఏదైనా నెట్‌వర్క్‌ని ఉపయోగించి 4జీ (4G) సేవలను పొందే ఆస్కారం ఉంటుంది.
ఏమిటీ ఇంటర్ సర్కిల్ రోమింగ్?
ఇంటర్-సర్కిల్ రోమింగ్ (Inter-Circle Roaming) అనేది నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను పంచుకోవడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లను (TSP) ఎనేబుల్ చేసే ఒక అద్భుతమైన ఫీచర్. డిజిటల్ భారత్ నిధి (DBN)-నిధులతో కూడిన మొబైల్ టవర్ల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఈ సర్వీస్, తమ నెట్‌వర్క్ ప్రొవైడర్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వం నిధులు సమకూర్చే టవర్ల ద్వారా 4జీ సేవలను ఉపయోగించుకునే వెసులుబాటును వినియోగదారులకు కల్పిస్తుంది.
ఇంతకుముందు డిజిటల్ భారత్ నిధి టవర్‌లు వాటి ఇన్‌స్టాలేషన్‌కు బాధ్యత వహించే టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌లకు మాత్రమే మద్దతిచ్చేవి. అంటే ఒకే ప్రొవైడర్‌కు మాత్రమే యాక్సెస్ ఉండేది. ఇంటర్-సర్కిల్ రోమింగ్ ఫీచర్‌తో వినియోగదారులు ఇప్పుడు భాగస్వామ్య నెట్‌వర్క్‌లను వినియోగించుకుని అంతరాయం లేని మొబైల్ సేవలు పొందవచ్చు.
గ్రామీణ కనెక్టివిటీ మెరుగు
ఇంటర్-సర్కిల్ రోమింగ్ చొరవ ప్రాథమిక లక్ష్యాలలో గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో కనెక్టివిటీ అంతరాన్ని తగ్గించడం ఒకటి. 35,400 గ్రామాలకు విశ్వసనీయమైన 4జీ సేవలు అందించడానికి ప్రభుత్వం సుమారు 27,000 మొబైల్ టవర్‌లకు నిధులు సమకూర్చింది. ఈ విధానం విస్తృతమైన కవరేజీని అందించడంలో భాగంగా అనవసరమైన మౌలిక సదుపాయాల కొరతను తగ్గిస్తుంది.
గ్రామీణ ప్రాంతాల్లో పరిమిత నెట్‌వర్క్ కారణంగా తరచుగా సిగ్నల్ లభ్యతకు సంబంధించిన సవాళ్లు ఎదురవుతుంటాయి. దీంతో వినియోగదారులు అవసరమైన సేవలు అందుకోలేకపోతున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్, జియో, ఎయిర్‌టెల్ మధ్య సహకారం ద్వారా ఇంటర్-సర్కిల్ రోమింగ్ చొరవ ఈ సవాళ్లను పరిష్కరిస్తుంది. మరింత ఎక్కువమంది 4G కనెక్టివిటీని పొందేలా చేస్తుంది.
మెరుగైన సేవలకు సహకారం
ఇంటర్-సర్కిల్ రోమింగ్ చొరవ విజయవంతం కావడం అనేది బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, జియో వంటి దేశంలోని ప్రధాన టెలికాం సంస్థల మధ్య సహకారంపై ఆధారపడి ఉంటుంది. నెట్‌వర్క్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను భాగస్వామ్యం చేయడం ద్వారా ఈ ప్రొవైడర్‌లు వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడం, నిర్వహణ ఖర్చులను తగ్గించడం, తక్కువ సేవలందే ప్రాంతాల్లో స్థిరమైన సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సింధియా ఈ సహకారం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ ప్రాజెక్ట్ దాదాపు 27,836 సైట్‌లను కవర్ చేస్తుందని, దేశవ్యాప్తంగా వినియోగదారులకు కనెక్టివిటీ అవకాశాలను పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఉమ్మడి ప్రయత్నం దేశ డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో టెలికాం రంగ నిబద్ధతను తెలియజేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment