mobile signal
-
కొత్త ఫీచర్.. ఇక సిగ్నల్ లేకపోయినా 4జీ సేవలు
మొబైల్ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చే దిశగా భారత ప్రభుత్వం ఒక కీలక ముందడుగు వేసింది. ఇంటర్-సర్కిల్ రోమింగ్ (ICR) ఫీచర్‌ను పరిచయం చేస్తోంది. దీంతో బీఎస్ఎన్ఎల్ (BSNL), జియో (Jio), ఎయిర్టెల్ (Airtel) ఇలా నెట్వర్క్ ఏదైనా వినియోగదారులు వారి ప్రాథమిక ప్రొవైడర్‌కు సిగ్నల్ కవరేజ్ లేనప్పటికీ, అందుబాటులో ఉన్న ఏదైనా నెట్వర్క్ని ఉపయోగించి 4జీ (4G) సేవలను పొందే ఆస్కారం ఉంటుంది.ఏమిటీ ఇంటర్ సర్కిల్ రోమింగ్?ఇంటర్-సర్కిల్ రోమింగ్ (Inter-Circle Roaming) అనేది నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పంచుకోవడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను (TSP) ఎనేబుల్ చేసే ఒక అద్భుతమైన ఫీచర్. డిజిటల్ భారత్ నిధి (DBN)-నిధులతో కూడిన మొబైల్ టవర్ల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రారంభించిన ఈ సర్వీస్, తమ నెట్వర్క్ ప్రొవైడర్‌తో సంబంధం లేకుండా ప్రభుత్వం నిధులు సమకూర్చే టవర్ల ద్వారా 4జీ సేవలను ఉపయోగించుకునే వెసులుబాటును వినియోగదారులకు కల్పిస్తుంది.ఇంతకుముందు డిజిటల్ భారత్ నిధి టవర్లు వాటి ఇన్‌స్టాలేషన్‌కు బాధ్యత వహించే టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు మాత్రమే మద్దతిచ్చేవి. అంటే ఒకే ప్రొవైడర్‌కు మాత్రమే యాక్సెస్ ఉండేది. ఇంటర్-సర్కిల్ రోమింగ్ ఫీచర్‌తో వినియోగదారులు ఇప్పుడు భాగస్వామ్య నెట్‌వర్క్‌లను వినియోగించుకుని అంతరాయం లేని మొబైల్ సేవలు పొందవచ్చు.గ్రామీణ కనెక్టివిటీ మెరుగుఇంటర్-సర్కిల్ రోమింగ్ చొరవ ప్రాథమిక లక్ష్యాలలో గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో కనెక్టివిటీ అంతరాన్ని తగ్గించడం ఒకటి. 35,400 గ్రామాలకు విశ్వసనీయమైన 4జీ సేవలు అందించడానికి ప్రభుత్వం సుమారు 27,000 మొబైల్ టవర్లకు నిధులు సమకూర్చింది. ఈ విధానం విస్తృతమైన కవరేజీని అందించడంలో భాగంగా అనవసరమైన మౌలిక సదుపాయాల కొరతను తగ్గిస్తుంది.గ్రామీణ ప్రాంతాల్లో పరిమిత నెట్వర్క్ కారణంగా తరచుగా సిగ్నల్ లభ్యతకు సంబంధించిన సవాళ్లు ఎదురవుతుంటాయి. దీంతో వినియోగదారులు అవసరమైన సేవలు అందుకోలేకపోతున్నారు. బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ మధ్య సహకారం ద్వారా ఇంటర్-సర్కిల్ రోమింగ్ చొరవ ఈ సవాళ్లను పరిష్కరిస్తుంది. మరింత ఎక్కువమంది 4G కనెక్టివిటీని పొందేలా చేస్తుంది.మెరుగైన సేవలకు సహకారంఇంటర్-సర్కిల్ రోమింగ్ చొరవ విజయవంతం కావడం అనేది బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, జియో వంటి దేశంలోని ప్రధాన టెలికాం సంస్థల మధ్య సహకారంపై ఆధారపడి ఉంటుంది. నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను భాగస్వామ్యం చేయడం ద్వారా ఈ ప్రొవైడర్లు వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడం, నిర్వహణ ఖర్చులను తగ్గించడం, తక్కువ సేవలందే ప్రాంతాల్లో స్థిరమైన సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి.ఆవిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సింధియా ఈ సహకారం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ ప్రాజెక్ట్ దాదాపు 27,836 సైట్లను కవర్ చేస్తుందని, దేశవ్యాప్తంగా వినియోగదారులకు కనెక్టివిటీ అవకాశాలను పెంచుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఉమ్మడి ప్రయత్నం దేశ డిజిటల్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంలో టెలికాం రంగ నిబద్ధతను తెలియజేస్తుంది. -
మారుమూల గ్రామాలకూ 4జీ
సాక్షి ప్రతినిధి, అనంతపురం : మొబైల్ సిగ్నల్స్ రాని మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో 4జీ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలోని 1,218 గ్రామాల్లో 4జీ మొబైల్ సర్వీస్‌లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర టెలి కమ్యూనికేషన్స్ శాఖ సన్నాహాలు పూర్తి చేసింది. ఇప్పటికే దీని టెండర్లు పూర్తయ్యాయి. దేశ వ్యాప్తంగా 7,287 గ్రామాలకు 4జీ సేవలు అందించనుండగా.. వాటిలో 1,218 గ్రామాలు ఏపీలో ఉన్నాయి. రాష్ట్రంతో పాటు ఛత్తీస్‌గడ్‌లో 699, జార్ఖండ్‌లో 827, మహారాష్ట్రలో 610, ఒడిశాలో 3,933 గ్రామాల్లో తాజాగా మొబైల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. విశాఖ జిల్లాలో జి.మాడుగుల, ముంచంగిపుట్టు, నిమ్మలపాడు వంటి మండలాల్లోని గ్రామాలకు కొత్తగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలో 3 జిల్లాల్లో 1,218 ప్రాంతాల్లో 4జీ సర్వీసులు అందిస్తారు. ఇందుకోసం 771 టవర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ ఆదేశించింది. ఒక్కో టవర్ ఎత్తు 40 మీటర్లకు తగ్గకుండా ఏర్పాటు చేస్తారు. మొబైల్ ద్వారా మాట్లాడుకోవడమే కాకుండా, ఎస్ఎంఎస్లు, ఇంటర్నెట్ డేటా కూడా వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి టవర్ కూడా 24 గంటలూ పనిచేసేలా ఉంటుంది. ఏపీలో 1,218 గ్రామాల్లో ఒక్క విశాఖలోనే 1,054 గ్రామాలకు 4జీ సేవలు అందుబాటులోకి వస్తుండగా, విజయనగరం జిల్లాలో 154, వైఎస్సార్ జిల్లాలో 10 ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఏపీలో కోటి మందికి స్మార్ట్ ఫోన్‌లున్నట్టు ట్రాయ్ తేల్చింది. కొత్తగా 1,218 గ్రామాల్లో 4జీ మొబైల్ సేవలు అందుబాటులోకొస్తే.. స్మార్ట్ ఫోన్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. -
మొబైల్ సిగ్నల్ ట్రాకింగ్‌తో.. నిండు ప్రాణాన్ని నిలబెట్టారు!
ఒంగోలు: రైలు పట్టాలపై యువకుడు పడుకుని ఉన్నాడు.. దూరంగా రైలు కూత వినిపిస్తోంది.. రైలు మరింత దగ్గరికొచ్చినట్టుగా శబ్దం వినిపిస్తోంది.. యువకుడు మాత్రం అలానే పడుకుని ఉన్నాడు. మరికొద్ది క్షణాలు ఆలస్యమైతే యువకుడి తల తెగిపడేదే. కానీ అంతలోనే అద్భుతం జరిగింది. పోలీసులు వచ్చి యువకుడిని పక్కకు లాగేశారు. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ ఘటనతో అక్కడి పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. జె.పంగులూరు మండలం తూర్పుకొప్పెరపాడుకు చెందిన కలవ కిషోర్‌కు రెండేళ్ల కిందట జరిగిన ఓ ప్రమాదంలో కాలు విరిగింది. కృత్రిమ కాలుతో జీవనం సాగిస్తున్నాడు. కాలు విరిగినప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆదివారం ఇంటి నుంచి వెళ్లిపోయి బంధువులకు ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చెప్పాడు. బంధువుల ద్వారా ఆ సమాచారం అందుకున్న జె.పంగులూరు ఎస్ఐ శ్రీనివాసరావు ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ మలికా గర్గ్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎస్పీ.. ఐటీ కోర్ విభాగాన్ని అప్రమత్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో కిషోర్ మొబైల్ లొకేషన్‌ను గుర్తించారు. వేటపాలెం మండల పరిధిలోని పందిళ్లపల్లి వద్ద రైల్వే ట్రాక్‌పై కిషోర్ ఉన్నట్టు నిర్ధారించుకున్నారు. వెంటనే వేటపాలెం ఎస్ఐ కమలాకర్‌కు ఎస్పీ ఆదేశాలిచ్చారు. ఆ మేరకు సిబ్బందితో హుటాహుటిన అక్కడకు చేరుకున్న ఎస్ఐ.. రైల్వే ట్రాక్‌పై ఉన్న కిషోర్‌ను పక్కకు లాగేశారు. ఆ తర్వాత రెండు నిమిషాల వ్యవధిలోనే ఆ ట్రాక్ మీదుగా రైలు వెళ్లింది. పోలీసులు వెళ్లడం ఆ రెండు నిమిషాలు ఆలస్యమై ఉంటే కిషోర్ ప్రాణాలు గాలిలో కలిసిపోయి ఉండేవి. నిండు ప్రాణాన్ని కాపాడిన పోలీస్ సిబ్బందిని నగదు రివార్డులతో ఎస్పీ సత్కరించారు. -
ఆన్లైన్ అవస్థలు; ఓసారూ.. సిగ్నలత్తలేదు!
ఒకవైపు ఆన్‌క్లాస్‌ల భారం.. మరొక వైపు మొబైల్ సిగ్నల్స్ ఏమో ఊరికి దూరం.. ఇది పల్లెల్లో పరిస్థితి. కరోనా కారణంగా ఆన్‌క్లాస్‌లు నిర్వహిస్తుంటే అదేమో సగం సగం అన్నట్లే ఉంది. ఆన్లైన్ క్లాస్‌ల్లో బోధించేది ఎంతవరకూ ఒంట పడుతుందో తెలీదు కానీ, మొబైల్ సిగ్నల్స్ మాత్రం విద్యార్థుల్ని పరేషాన్ చేస్తున్నాయి. సిగ్నల్ దొరక్కపోవడంతో ‘ ఓసారూ.. నో సిగ్నల్’ అనడమే వారి నోట మాట అవుతుంది. ఆ మాట ఆ సారుకి చేరుతుందో లేదో తెలీదు కానీ ఆన్లైన్ క్లాస్‌లు మాత్రం అటకెక్కిపోతున్నాయనడానికి ఇదొక ఉదాహరణ. సాక్షి, ఆదిలాబాద్ : ఒకచేత పుస్తకాలు.. మరోచేత సెల్ఫోన్లతో కుస్తీపడుతున్న వీరంతా ఆదిలాబాద్ రూరల్ మండలం లోహర గ్రామానికి చెందిన విద్యార్థులు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి ఆన్లైన్ తరగతులు ప్రారంభమైన విషయం తెలిసిందే. లోహర గ్రామంలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ అందకపోవడంతో.. ఇదిగో ఇలా ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలోని సిగ్నల్ అందే గుట్టపైకి వెళ్లి పాఠాలు వింటూ కనిపించారీ విద్యార్థులు. ఆన్లైన్ అభ్యసనం ఎలా సాగుతుందో శుక్రవారం పరిశీలించడానికి వెళ్లినపుడు ఈ దృశ్యం ‘సాక్షి’ కంటబడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ మండలాలైన నార్నూర్, గాదిగూడ, ఇంద్రవెల్లి, ఆదిలాబాద్ రూరల్, సిరికొండ, బోథ్, బజార్హత్నూర్, తలమడుగు, కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని జైనూర్, లింగాపూర్, సిర్పూర్(యు), తిర్యాని, బెజ్జూర్, కౌటాల, పెంబీ, దస్తురాబాద్, కడెం, కోటపెల్లి, వేమన్‌పెల్లి, దండేపల్లిలోనూ ‘సిగ్నల్ దొరికేనా.. పాఠం వినేనా?’ అన్నట్టు పరిస్థితి ఉంది. -
మొబైల్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన పిల్లలు.. అంతలోనే ఒక్కసారిగా
ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం చోటుసుకుంది. మొబైల్ ఫోన్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన 15 ఏళ్ల బాలుడు పిడుగుపాటుకు మృతి చెందాడు. మరో ముగ్గురు పిల్లలకు గాయాలయ్యాయి. తహసీల్దార్ రాహుల్ సారంగ్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం దహను తాలూకాలోని మంకర్పాడ వద్ద నలుగురు బాలురు పశువులను మేపడానికి బయటకు వెళ్లారు. సోమవారం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వాతవరణ ప్రతికూల పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ సిగ్నల్ కు రాలేదు. ఈ క్రమంలో మొబైల్ ఫోన్ సిగ్నల్ కోసం నలుగురు పిల్లలు కలిసి చెట్టెక్కారు. అదే సమయంలో ఒక్క సారిగా పిడుగు పడడంతో రవీంద్ర కోర్డా (15) అనే బాలుడు మృతి చెందాడు. మరో మగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా 14 నుంచి 16 సంవత్సరాల మధ్య ఉన్న వారే. గాయపడిన పిల్లల్ని కాసా గ్రామీణ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చదవండి: మహిళకు ఒకే రోజు మూడు డోసుల వ్యాక్సిన్ -
ఆన్లైన్ క్లాసెస్.. ఫోన్ సిగ్నల్ కోసం 5 కిలో మీటర్లు!
తిర్యాణి (ఆసిఫాబాద్): ఈ చిత్రంలోని చిన్నారి పేరు సరస్వతి విద్య. ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం మొర్రిగూడలోని గిరిజన కుటుంబానికి చెందిన కుడిమెత భగవంతరావు కూతురు. సరస్వతి మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. సాక్షాత్తూ చదువుల తల్లిని తన పేరులో నిలుపుకొన్న ఈ చిన్నారికి చదువంటే అమితమైన ఇష్టం. కానీ, కరోనా వల్ల తను చదివే పాఠశాలను మూసివేసి, ఆన్లైన్లో పాఠాలు బోధిస్తున్నారు. అయితే, పూర్తిగా ఏజెన్సీ ప్రాంతమైన మొర్రిగూడలో ఏ మొబైల్ నెట్వర్క్ సిగ్నల్స్ అందవు. దీంతో సరస్వతి విద్యను తండ్రి ఇదిగో ఇలా ప్రతిరోజూ ఐదు కిలోమీటర్ల దూరంలో.. సిగ్నల్ వచ్చే ప్రాంతానికి బైక్‌పై తీసుకెళ్లి తిరిగి తీసుకొస్తున్నాడు. -
చెట్టెక్కిన కేంద్ర మంత్రి.. ఎందుకో తెలుసా?
ఆయన స్వయానా కేంద్రంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి. అంతటి పెద్దమనిషి తన సొంత రాష్ట్రంలో.. తన సొంత నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి చెట్టు ఎక్కాల్సి వచ్చింది. అదేంటి, మంత్రిగారు చెట్టు ఎక్కడం ఏంటని అనుకుంటున్నారా.. అయితే చదవండి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సొంత రాష్ట్రం రాజస్థాన్. అక్కడ ఆయన నియోజకవర్గం బికనీర్. ఆ నియోజవకర్గం పరిధిలోని ఢోలియా అనే గ్రామంలో కొన్ని సమస్యలు ఉండటంతో వాటి పరిష్కారం కోసం ఆయన అక్కడకు వెళ్లారు. గ్రామంలోని ఆస్పత్రిలో నర్సులు తగినంతగా లేరని స్థానికులు ఆయనకు మొరపెట్టుకున్నారు. దాంతో సంబంధిత ఉన్నతాధికారికి వెంటనే ఫోన్ చేసి, సమస్యను పరిష్కరిద్దామని కేంద్రమంత్రి మేఘ్వాల్ అనుకున్నారు. అనుకున్నదే తడవుగా జేబులోంచి సెల్‌ఫోన్ తీశారు. కానీ తీరాచూస్తే అందులో సిగ్నల్ ఒక్క పాయింటు కూడా లేదు. ఇదేంటని అక్కడ ఉన్నవాళ్లను అడిగితే, ఈ గ్రామంలో సెల్‌ఫోన్ మాట్లాడాలంటే చెట్టు ఎక్కాల్సిందేనని చావుకబురు చల్లగా చెప్పారు. అదేంటని అడిగితే.. దగ్గరలో సెల్‌టవర్ లేదని, అందువల్ల చెట్టు ఎక్కితే దూరంగా ఉన్న టవర్ నుంచి సిగ్నల్ అందుతుందని వివరించారు. చేసేది లేక తాను కూడా చెట్టు ఎక్కడానికి మేఘ్వాల్ సిద్ధపడ్డారు. అయితే పెద్ద వయసు కావడంతో ఆయన కోసం వెంటనే అక్కడున్నవాళ్లు ఒక నిచ్చెన తెప్పించారు. దాని సాయంతో ఆయన చెట్టెక్కి, ఫోన్ మాట్లాడి అప్పుడు కిందకు వచ్చారు. అదీ కేంద్ర మంత్రి గారి చెట్టు కథ.