ప్రతీకాత్మక చిత్రం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : మొబైల్ సిగ్నల్స్ రాని మారుమూల గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో 4జీ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలోని 1,218 గ్రామాల్లో 4జీ మొబైల్ సర్వీస్‌లను ఏర్పాటు చేసేందుకు కేంద్ర టెలి కమ్యూనికేషన్స్ శాఖ సన్నాహాలు పూర్తి చేసింది. ఇప్పటికే దీని టెండర్లు పూర్తయ్యాయి. దేశ వ్యాప్తంగా 7,287 గ్రామాలకు 4జీ సేవలు అందించనుండగా.. వాటిలో 1,218 గ్రామాలు ఏపీలో ఉన్నాయి. రాష్ట్రంతో పాటు ఛత్తీస్‌గడ్‌లో 699, జార్ఖండ్‌లో 827, మహారాష్ట్రలో 610, ఒడిశాలో 3,933 గ్రామాల్లో తాజాగా మొబైల్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
విశాఖ జిల్లాలో జి.మాడుగుల, ముంచంగిపుట్టు, నిమ్మలపాడు వంటి మండలాల్లోని గ్రామాలకు కొత్తగా సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలో 3 జిల్లాల్లో 1,218 ప్రాంతాల్లో 4జీ సర్వీసులు అందిస్తారు. ఇందుకోసం 771 టవర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ ఆదేశించింది. ఒక్కో టవర్ ఎత్తు 40 మీటర్లకు తగ్గకుండా ఏర్పాటు చేస్తారు. మొబైల్ ద్వారా మాట్లాడుకోవడమే కాకుండా, ఎస్‌ఎంఎస్‌లు, ఇంటర్నెట్ డేటా కూడా వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రతి టవర్ కూడా 24 గంటలూ పనిచేసేలా ఉంటుంది. ఏపీలో 1,218 గ్రామాల్లో ఒక్క విశాఖలోనే 1,054 గ్రామాలకు 4జీ సేవలు అందుబాటులోకి వస్తుండగా, విజయనగరం జిల్లాలో 154, వైఎస్సార్ జిల్లాలో 10 ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఏపీలో కోటి మందికి స్మార్ట్ ఫోన్‌లున్నట్టు ట్రాయ్ తేల్చింది. కొత్తగా 1,218 గ్రామాల్లో 4జీ మొబైల్ సేవలు అందుబాటులోకొస్తే.. స్మార్ట్ ఫోన్‌ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment