డేటా వాడేస్తున్నారు | Data usage revenue jumps to Rs 54,671 crore in 2018 | Sakshi
Sakshi News home page

డేటా వాడేస్తున్నారు

Published Fri, Dec 27 2019 5:01 AM | Last Updated on Fri, Dec 27 2019 5:12 AM

Data usage revenue jumps to Rs 54,671 crore in 2018 - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:  దేశంలో వైర్‌లెస్‌ డేటా వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. 2014లో కస్టమర్లు 82.8 కోట్ల గిగాబైట్స్‌ (జీబీ) డేటా వాడితే.. 2018 వచ్చే సరికి ఇది 4,640 కోట్ల జీబీకి చేరిందని ట్రాయ్‌ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత సంవత్సరం జనవరి–సెప్టెంబర్‌లో ఇది ఏకంగా 5,491.7 కోట్ల జీబీగా నమోదైంది. 2017లో వినియోగదార్లు 2,009 కోట్ల జీబీ డేటాను వాడారు. 2014తో పోలిస్తే వైర్‌లెస్‌ డేటా యూజర్ల సంఖ్య 28.16 కోట్ల నుంచి ఈ ఏడాది సెప్టెంబర్‌ చివరినాటికి 66.48 కోట్లకు చేరారు.

2017తో పోలిస్తే 2018లో యూజర్ల వృద్ధి 36.36 శాతంగా ఉంది. గత నాలుగేళ్లలో డేటా వాడకం ఊహించనంతగా అధికమవుతోందని ట్రాయ్‌ అంటోంది. ‘4జీ/ఎల్‌టీఈ రాక, ఈ టెక్నాలజీ విస్తృతితో ఇది సాధ్యమైంది. దేశంలో మొబైల్‌ నెట్‌వర్క్స్‌ అత్యధిక ప్రాంతం 2జీ నుంచి 4జీకి మారడం, అందుబాటు ధరలో స్మార్ట్‌ఫోన్లు లభించడం ఇంటర్నెట్‌ వాడకాన్ని పెంచింది. మొబైల్‌ టారిఫ్‌లు పడిపోవడం, ఇంగ్లిష్, హిందీతోపాటు ప్రాంతీయ భాషల్లో కంటెంట్‌ లభించడం కూడా ఇందుకు దోహదం చేసింది. ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడం కోట్లాది మందిని సాధికారత వైపు నడిపింది. వీరికి రియల్‌ టైమ్‌ సమాచారం, ప్రభుత్వ సేవలు, ఈ–కామర్స్, సోషల్‌ మీడియా ఎప్పటికప్పుడు చేరింది. దీంతో వీరి జీవితాలపై సానుకూల ప్రభావం చూపింది’ అని ట్రాయ్‌ తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement