Internet user growth
-
డేటా వాడేస్తున్నారు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో వైర్లెస్ డేటా వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. 2014లో కస్టమర్లు 82.8 కోట్ల గిగాబైట్స్ (జీబీ) డేటా వాడితే.. 2018 వచ్చే సరికి ఇది 4,640 కోట్ల జీబీకి చేరిందని ట్రాయ్ గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుత సంవత్సరం జనవరి–సెప్టెంబర్‌లో ఇది ఏకంగా 5,491.7 కోట్ల జీబీగా నమోదైంది. 2017లో వినియోగదార్లు 2,009 కోట్ల జీబీ డేటాను వాడారు. 2014తో పోలిస్తే వైర్లెస్ డేటా యూజర్ల సంఖ్య 28.16 కోట్ల నుంచి ఈ ఏడాది సెప్టెంబర్ చివరినాటికి 66.48 కోట్లకు చేరారు. 2017తో పోలిస్తే 2018లో యూజర్ల వృద్ధి 36.36 శాతంగా ఉంది. గత నాలుగేళ్లలో డేటా వాడకం ఊహించనంతగా అధికమవుతోందని ట్రాయ్ అంటోంది. ‘4జీ/ఎల్టీఈ రాక, ఈ టెక్నాలజీ విస్తృతితో ఇది సాధ్యమైంది. దేశంలో మొబైల్ నెట్వర్క్స్ అత్యధిక ప్రాంతం 2జీ నుంచి 4జీకి మారడం, అందుబాటు ధరలో స్మార్ట్ఫోన్లు లభించడం ఇంటర్నెట్ వాడకాన్ని పెంచింది. మొబైల్ టారిఫ్‌లు పడిపోవడం, ఇంగ్లిష్, హిందీతోపాటు ప్రాంతీయ భాషల్లో కంటెంట్ లభించడం కూడా ఇందుకు దోహదం చేసింది. ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం కోట్లాది మందిని సాధికారత వైపు నడిపింది. వీరికి రియల్ టైమ్ సమాచారం, ప్రభుత్వ సేవలు, ఈ–కామర్స్, సోషల్ మీడియా ఎప్పటికప్పుడు చేరింది. దీంతో వీరి జీవితాలపై సానుకూల ప్రభావం చూపింది’ అని ట్రాయ్ తెలిపింది. -
ఇంటర్నెట్తో ప్రజాస్వామ్యానికి విఘాతం!
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో ఇంటర్నెట్ ప్రమాదకారిగా పరిణమించిందని, ఇది ఊహించనంత విఘాతాన్ని కలిగిస్తుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. వినియోగదారులు పెరిగే కొద్దీ దేశం ముందుకు వెళుతోందని కేంద్రం తరఫున వాదలను వినిపించిన రజత్ నాయర్ తెలిపారు. ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో చేసే పోస్టుల వల్ల మేలుతో పాటు అంతకు మించిన కీడు జరుగుతోందని తెలిపారు. ద్వేష భావాలు, నిరాధార వార్తలు, వ్యక్తిత్వ హననం, దేశ వ్యతిరేక కామెంట్లు, పోస్టులు పెరుగుతున్నాయన్నారు. సామాజిక మాధ్యమాల నియంత్రణ కోసం నిబంధనలను ఖరారుచేసి నోటిఫై చేసేందుకు మరో మూడు నెలల గడువు కావాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. మూడు నెలల్లో నిబంధనలతో కూడిన సమాచార ముసాయిదాను 2020 జనవరి నాటికల్లా సిద్ధం చేస్తామని ఎలక్ట్రానిక్స్, సమాచార శాఖ అదనపు కార్యదర్శి పేర్కొన్నారు. త్వరలో మార్గదర్శకాలు తయారుచేస్తామన్నారు. -
ఇంటర్నెట్ వాడకంలో మహిళల జోరు..
న్యూఢిల్లీ: నగరాల్లో పురుషుల కంటే మహిళలే అధికంగా ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నారు. మెట్రోలు, టైర్ 1 నగరాల్లో ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్న మహిళల సంఖ్య ఈ ఏడాది 30 శాతం పెరగనున్నదని ఐఏఎంఏఐ-ఐఎంఆర్బీ నివేదిక తెలిపింది. పదిలక్షలకు మించిన జనాభా ఉన్న 35 నగరాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందిన ఈ నివేదికన ప్రకారం.. 2013లో 1.6 కోట్లుగా ఉన్న మహిళా ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య 30% వృద్ధితో ఈ ఏడాది 2.07 కోట్లకు పెరగొచ్చని అంచనా. పట్టణాల్లో పురుషుల ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 25 శాతం పెరిగింది. ఈ ఏడాది జూన్‌కల్లా భారత్‌లో 24.3 కోట్లమంది ఇంటర్నెట్ యూజర్లున్నారని అంచనా. ఇంటర్నెట్ ఉపయోగించే వారిలో అధిక వృద్ధి కళాశాల విద్యార్ధుల విభాగంలో ఉంది. గత ఏడాది 45.1 లక్షలుగా ఉన్న వీరి సంఖ్య ఈ ఏడాది 62% వృద్ధితో 72.9 లక్షలకు చేరింది. పట్టణాల్లో నెట్‌ను వాడుతున్న పాఠశాల బాలి కల సంఖ్య గతేడాది 21.5 లక్షలు కాగా.. ఈ ఏడాది 34% వృద్ధితో 28.8 లక్షలకు చేరింది. ఉద్యోగినులు కాని మహిళల సంఖ్య 49.3 లక్షల నుంచి 18% వృద్ధితో 58.3 శాతానికి పెరిగింది. ఇక ఉద్యోగినుల సంఖ్య 44.1 లక్షల నుంచి 8 శాతం వృద్ధితో 47.7 లక్షలకు పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో రోజూ ఇంటర్నెట్ను యాక్సెస్ చేస్తున్న వారిలో ఉద్యోగినుల్లో 60% మంది, ఉద్యోగినులు కాని వారు 40% మంది ఉన్నారు.