
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంలో ఇంటర్నెట్ ప్రమాదకారిగా పరిణమించిందని, ఇది ఊహించనంత విఘాతాన్ని కలిగిస్తుందని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. వినియోగదారులు పెరిగే కొద్దీ దేశం ముందుకు వెళుతోందని కేంద్రం తరఫున వాదలను వినిపించిన రజత్ నాయర్ తెలిపారు. ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలలో చేసే పోస్టుల వల్ల మేలుతో పాటు అంతకు మించిన కీడు జరుగుతోందని తెలిపారు. ద్వేష భావాలు, నిరాధార వార్తలు, వ్యక్తిత్వ హననం, దేశ వ్యతిరేక కామెంట్లు, పోస్టులు పెరుగుతున్నాయన్నారు. సామాజిక మాధ్యమాల నియంత్రణ కోసం నిబంధనలను ఖరారుచేసి నోటిఫై చేసేందుకు మరో మూడు నెలల గడువు కావాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. మూడు నెలల్లో నిబంధనలతో కూడిన సమాచార ముసాయిదాను 2020 జనవరి నాటికల్లా సిద్ధం చేస్తామని ఎలక్ట్రానిక్స్, సమాచార శాఖ అదనపు కార్యదర్శి పేర్కొన్నారు. త్వరలో మార్గదర్శకాలు తయారుచేస్తామన్నారు.